మీ పరిచర్యలో ‘ఆతురతగలవారై’ ఉండండి
1 అపొస్తలుడైన పౌలు కొరింథులో ఉన్నప్పుడు గుడారాలు తయారు చేసేవాడని మనం చదివినప్పుడు, ఆయన ప్రకటించే అవకాశాలను ఆ పని పరిమితం చేసి ఉండవచ్చన్న నిర్ధారణకు మనం వస్తుండవచ్చు. కానీ, “పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను” అని అపొస్తలుల కార్యములు 18: 5 చెబుతోంది. (ఇటాలిక్కులు మావి) పౌలు ప్రకటనా పనిలో ఎందుకంత ఆతురత కలిగి ఉన్నాడు? కొరింథులో అప్పటికే చాలామంది విశ్వాసులుగా మారినప్పటికీ, ఆ పట్టణంలో ఇంకా చాలామందిని శిష్యులనుగా చేయాల్సివుందని ప్రభువు రూఢిగా చెప్పాడు. (అపొ. 18:8-11) మనం కూడా మన పరిచర్యలో ఆతురతగలవారమై ఉండడానికి అలాంటి కారణమేమైనా ఉందా? తప్పకుండా ఉంది. ఇంకా అనేకమందిని కనుగొని, వాళ్ళకు సత్యాన్ని నేర్పించగలం.
2 ఏప్రిల్ నెలలో సేవలో ఎక్కువ సమయాన్ని వెచ్చించండి: సువార్తను ప్రకటించడంలో ప్రతినెలా మీరు బిజీగా ఉండాలనుకోవడం మీ లక్ష్యమై ఉండవచ్చు. కానీ పరిచర్యలో ‘ఆతురతగలవారై’ ఉండడానికి ప్రత్యేకించి కొన్ని నెలల్లో ఎక్కువ అవకాశముంటుంది. వాటిలో అత్యంత ప్రధానమైన జ్ఞాపకార్థ కాలమైన ఏప్రిల్ నెల కూడా ఉంది. ఈ వేసవి కాలంలో సహాయ పయినీర్ సేవ చేయడానికి లేక పరిచర్యను అధికం చేసుకోవడానికి మీ పరిస్థితులు అనుకూలిస్తున్నాయా? అలా చేస్తున్న అనేకమంది ప్రచారకులు గొప్ప ఆశీర్వాదాలను పొందుతున్నారు. (2 కొరిం. 9:6) మీరు చేయగలిగినదంతా మీరు చేస్తున్నట్లైతే, పూర్ణహృదయంతో చేసే మీ సేవకు యెహోవా సంతోషిస్తాడని గుర్తుంచుకోండి. (లూకా 21:2-4) మీ పరిస్థితులెలా ఉన్నా, ఏప్రిల్ నెలలో పరిచర్యలో మీరు ‘ఆతురతగలవారై’ ఉండాలన్నది లక్ష్యంగా పెట్టుకోండి. నెలాఖరున మీ క్షేత్రసేవా రిపోర్టును ఇవ్వడం మరిచిపోకండి. అలా చేయడం వల్ల మిగతా యెహోవా ప్రజలతోపాటు మీ ప్రయత్నాలు కూడా లెక్కించబడతాయి.
3 జ్ఞాపకార్థదిన ఆచరణకు హాజరైన క్రొత్తవారిని సందర్శించండి: ఇండియాలో గత సంవత్సరం జ్ఞాపకార్థదిన ఆచరణకు 49,120 మంది హాజరయ్యారు. ఈ సంవత్సరంలో మొత్తం ఎంతమంది హాజరయ్యారో ఇంకా తెలీదు. కానీ, క్షేత్రంలో మరింత ఎక్కువ “కోత”ను కోసే అద్భుతమైన అవకాశాలున్నట్లు రిపోర్టులు సూచిస్తున్నాయి. (మత్త. 9:37, 38) అందుకే, జ్ఞాపకార్థదిన ఆచరణకు హాజరైన ఆసక్తి గలవారిని సందర్శించి, వారికి ఆధ్యాత్మిక సహాయం చేసేందుకు కావలసిన ఏర్పాట్లను వీలైనంత త్వరగా చేసుకోండి. అటువంటి సందర్శనాలను వాయిదావేయడం వల్ల “దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును.” (మత్తయి 13:19) తక్షణ సందర్శనం మీరు నిజంగానే మీ పరిచర్యలో ‘ఆతురతగలవారై’ ఉన్నట్టు చూపిస్తుంది.
4 నిష్క్రియులైనవారికి చేయూతనిస్తూనే ఉండండి: నిష్క్రియులైనవారికి సహాయపడేందుకు ఫిబ్రవరి నెలలో ఒక ప్రత్యేకమైన కృషి చేయడం మొదలైంది. కాపరి సందర్శనాలు జరగని నిష్క్రియులైనవారెవరైనా ఉంటే ఏప్రిల్ నెల ముగియకముందే పెద్దలు వారిని సందర్శించే ఏర్పాట్లు చేయాలి. ఆయా వ్యక్తుల సమస్యలకు ప్రధాన కారణమేమిటి, అతను యెహోవా సేవలో తిరిగి క్రియాశీలుడిగా మారడానికి ఏ విధంగా సహాయపడవచ్చు అన్నది నిర్ణయించడానికి పెద్దలు కృషిచేస్తారు. ఈ ప్రేమపూర్వకమైన సహాయం, “దేవుని మంద”కు కాపరులుగా పెద్దలు తమ బాధ్యతలను చాలా గంభీరంగా తీసుకుంటారని చూపిస్తుంది. (1 పేతు. 5:2; అపొ. 20:28) నిష్క్రియులైనవారిని ప్రభావితంచేసే అయిదు సగటు సమస్యల్లో ఏదైనా ఒకదానితో వ్యవహరిస్తున్నప్పుడు, పెద్దలు ఉపయోగించడానికి సెప్టెంబరు 15, 1993 కావలికోట సంచికలోని 22-3 పేజీల్లో చక్కని సూచనలు ఉన్నాయి. ఈ విధంగా, ఏప్రిల్ నెలలో కొందరిని క్షేత్ర పరిచర్యలో తిరిగి క్రియాశీలులుగా చేయవచ్చు.
5 బాప్తిస్మం పొందని ప్రచారకులుగా మారడానికి ఎక్కువమందికి సహాయపడండి: మీ పిల్లలు క్రొత్త సువార్త ప్రచారకులుగా యోగ్యులయ్యారా? మీరు బైబిలు అధ్యయనం చేస్తున్న ఇతరుల విషయమేమిటి? అటువంటివారికి సంఘ పెద్దల ఆమోదముంటే, ప్రకటనా పని ప్రారంభించడానికి వారికి ఏప్రిల్ నెల మంచి సమయం కాదా? ఒక వ్యక్తి దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు, జ్ఞానము పుస్తకంల అధ్యయనం పూర్తి చేసి అభివృద్ధి సాధిస్తున్నట్లైతే, అవసరమైతే, నా బైబిలు కథల పుస్తకము నుండి అధ్యయనం కొనసాగించవచ్చు. సత్యాన్ని గురించి గొప్ప అంతర్దృష్టిని పొందేలా, బాప్తిస్మం పొందని ప్రచారకుడయ్యే యోగ్యతను పొందేలా, అటు తర్వాత యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం పొందిన యెహోవాసాక్షిగా మారేలా ఆ విద్యార్థికి సహాయం చేయాలన్నదే మీ లక్ష్యంగా చేసుకోండి.—ఎఫె. 3:17-19; 1 తిమో. 1:12; 1 పేతు. 3:21.
6 మీరు మీ బైబిలు విద్యార్థులపై ఎప్పుడూ ఒకే విధంగా చూపే యథార్థమైన ఆసక్తి, వాళ్ళు చివరికి సత్యాన్ని తమ సొంతం చేసుకోవడానికి సహాయపడవచ్చు. ఒక సాక్షి కలిసిన వృద్ధ దంపతులు బైబిలు అధ్యయనం చేయడానికి హృదయపూర్వకంగా అంగీకరించారు. కానీ ఆ దంపతులు అధ్యయనాన్ని మూడు వారాలు వరుసగా వాయిదా వేశారు. చివరికి అధ్యయనం ప్రారంభించబడింది. దాని తర్వాత, ఆ దంపతులు ఒక వారం అధ్యయనం చేస్తే, తర్వాతి వారం చేసేవారు కాదు. అయినప్పటికీ, చివరికి భార్య బాప్తిస్మం తీసుకునేంత వరకు అభివృద్ధి సాధించింది. “ఆమె బాప్తిస్మం తీసుకున్న తర్వాత, సంతోషంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. అది చూసి నాకూ, నా భార్యకూ సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి” అని ఆ సహోదరుడు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అవును, సువార్తను బోధించడంలో ‘ఆతురతగలవారై’ ఉండడం గొప్ప ఆనందాన్ని తెస్తుంది!
7 బైబిలు ప్రవచనాలూ, లోకంలో జరుగుతున్న సంఘటనలూ మనం అంత్యసమయానికి అతి సమీపంగా ఉన్నామని సూచిస్తున్నాయి. దేవుని ప్రజలందరూ, ఇతరులకు సువార్తను తెలియజేయడంలో ‘ఆతురతగలవారై’ ఉండాల్సిన అవసరమున్నది ఇప్పుడే. అలా ప్రయాసపడడం “ప్రభువునందు వ్యర్థముకాదని” అపొస్తలుడైన పౌలు హామీ ఇస్తున్నాడు.—1 కొరిం. 15:58.