“దేవుని వాక్యాన్ని బోధించేవారు” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం 2001
1 ప్రవక్తయైన యెషయా యెహోవా గొప్ప బోధకుడు అని వర్ణించాడు. ప్రేమగల ఒక తండ్రిలా “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని యెహోవా ఉద్బోధిస్తున్నాడు. (యెష. 30:20, 21 NW) కానీ మన ప్రయోజనార్థం యెహోవా చెప్పే మాటలను మనమెలా వినగలం? బైబిలు ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డు]” ప్రచురించే బైబిలు ఆధారిత సాహిత్యాలూ, ఏర్పాటుచేసే కూటాలూ, ప్రయాణ పైవిచారణకర్తల సందర్శనాలూ, సర్క్యూట్ సమావేశాలూ, జిల్లా సమావేశాల ద్వారా యెహోవా తన ప్రజలతో మాట్లాడతాడు. (మత్త. 24:45) మనల్ని విడిచిపెట్టకుండా మనం నడవాల్సిన త్రోవలో నడిపిస్తున్నందుకు యెహోవాకు మనం కృతజ్ఞులమై ఉందాము.
2 ప్రతి సంవత్సరం, మనతోటి విశ్వాసులతోపాటు సమకూడడానికీ యెహోవా నిర్దేశాలను శ్రద్ధగా వినడానికీ జిల్లా సమావేశం మనకు సదవకాశాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక ఉత్తేజాన్నిచ్చిన “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” అనే జిల్లా సమావేశాలకు గత సంవత్సరం 32,349 మంది హాజరయ్యారు. 2001లో “దేవుని వాక్యాన్ని బోధించేవారు” అనే మూడు రోజుల జిల్లా సమావేశాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడతాయి. దానికి హాజరు కావడానికి కావలసిన ఏర్పాట్లను చేసుకోవడానికి మీరు ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు, అందుకే మీకు సహాయకరంగా ఉండడానికి ఇక్కడ కొన్ని నిర్దేశాలనిస్తున్నాము.
3 మీ వసతి ఏర్పాట్ల కోసం: సమావేశం జరుగుతున్న నగరంలో మీరు వసతిని ఏర్పాటు చేసుకొనేందుకు కావలసిన సమాచారాన్నీ సహాయాన్నీ అందించడానికి ప్రతి సమావేశానికీ రూమింగ్ డిపార్ట్మెంటు ఉంటుంది. మీ వసతి కోసం ఏర్పాట్లు చేసుకోవడంలో ముందుగానే మంచి పథకం వేసుకోండి. మీ సంఘ కార్యదర్శి మీకు రూమ్ రిక్వెస్ట్ ఫారమ్ ఇవ్వగలడు. దాంట్లో అవసరమైన సమాచారాన్ని నింపిన తర్వాత మీరు ఆ ఫారమ్‌ను మీ సంఘ కార్యదర్శికి అందజేయవచ్చు, మీరు ఎక్కడైతే హాజరు కాబోతున్నారో ఆ సమావేశ హెడ్‌క్వార్టర్స్‌కు ఆయన దాన్ని పంపిస్తాడు. మీ చిరునామా వ్రాసి, స్టాంపులు అంటించిన ఒక కవర్‌ను దానికి తప్పకుండా జతచేయండి. మీరు ఎక్కడైతే హాజరవుతున్నారో ఆ నగరంలో ఒకటి కంటే ఎక్కువ సమావేశాలు జరుగుతున్నట్లయితే మీరు హాజరవ్వబోయే సమావేశపు తేదీలను తప్పక సూచించండి.
4 హోటల్ యజమాన్యం యెహోవాసాక్షుల గురించి ఎలా భావిస్తుంది? మిడ్‌వెస్ట్‌లోని ఒక హోటల్ జనరల్ మేనేజరు యెహోవా ప్రజల మంచి ప్రవర్తన గురించి మాట్లాడుతూ, “యెహోవాసాక్షులు గురువారంరోజు హోటల్లోకి రావడం చూడగానే, నేను నిశ్చింతగా సోమవారం ఉదయం వరకు సెలవుమీద వెళ్ళేవాడిని. ఈలోగా ఏవైనా సమస్యలు వచ్చినా అవి చాలా స్వల్పమైనవిగా ఉంటాయని నాకు తెలుసు. మీ ప్రజలు ఇక్కడ ఉండడం ఎప్పుడూ చాలా సంతోషకరమైన విషయం” అని వ్యాఖ్యానించాడు. ఒక హోటల్ సేల్స్‌పర్సన్ కూడా ఉత్తేజంతో, “వాళ్ళదొక అద్భుతమైన గుంపు! ప్రతి ఒక్కరు ‘చాలా థాంక్సండీ’ అని చెబుతూనే ఉంటారు” అని అంది. అలా మన సహోదరుల గురించి వినడం మీకు గర్వంగా అనిపించదా? తన నామాన్ని శ్లాఘింపజేసేలా మనం ప్రవర్తించడం చూసి యెహోవా దేవుడెంత సంతోషిస్తాడో ఊహించండి!
5 వృద్ధుల గురించి, ప్రత్యేక అవసరాలున్న వారి గురించి శ్రద్ధ వహించడం: వృద్ధులూ, అనారోగ్యంగా ఉన్నవారూ లేక ఇతర ప్రత్యేక అవసరాలున్నవారూ సమావేశానికి హాజరయ్యేలా వారికి సహాయం చేయడం ద్వారా వారి ప్రత్యేక పరిస్థితులను గురించి తెలిసిన బంధువులు, సంఘపెద్దలు, సంఘంలోని ఇతరులు వారిపట్ల తమకున్న ప్రేమ పూర్వకమైన శ్రద్ధాసక్తులను చూపించవచ్చు. (1 తిమో. 5:4 పోల్చండి.) వారు కార్యక్రమం నుండి పూర్తిగా ప్రయోజనం పొందగలిగేలా అనువైన స్థలంలో సౌకర్యంగా కూర్చొనేలా చూడాలి. అలాంటి వారికి సహాయం చేయడానికి సహోదర సహోదరీలు ఇష్టపూర్వకంగా ముందుకు వస్తే ఎంత బావుంటుంది. భోజనం చేసేటప్పుడు సహాయం చేయడం, తాగడానికి నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడం, టాయ్‌లెట్‌కు వెళ్ళేటప్పుడు వారికి తోడు వెళ్ళడం వంటివి అందులో ఇమిడివుండవచ్చు. పెద్ద వయస్సువారి గురించి లేక ప్రత్యేక అవసరాలున్న వారి గురించి శ్రద్ధ వహించే ఆధిక్యతలో ఎక్కువమంది పాల్గొనడం ద్వారా, మామూలుగా వారికి అన్నివేళల్లో పరిచర్యలు చేస్తున్నటువంటి వారి బంధువులు, సంఘ ప్రచారకులతో సహా అందరూ కార్యక్రమం నుంచి పూర్తి ప్రయోజనం పొందవచ్చు. ప్రేమపూర్వకమైన ఈ నిర్దేశాన్ని పాటించడం, క్రైస్తవ సహోదరులపట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరిచేందుకూ, ఈ లోకంలోని నేనే ముందు అనే దృక్ఫథాన్ని తిరస్కరించేందుకూ అవకాశాన్నిస్తుంది.—1 కొరిం. 10:24.
6 ముగింపు: మీరు జిల్లా సమావేశానికి హాజరయ్యే సమయం దగ్గర పడుతుండగా, మూడు రోజుల్లోని అన్ని కార్యక్రమాలకు హాజరై దాన్నుండి పూర్తి ప్రయోజనం పొందాలని ఆ విషయాన్ని యెహోవాకు చేసే ప్రార్థనా విషయంగా చేసుకోండి. సాధారణంగా చివరి నిమిషంలో సెలవు పెడితే సెలవులు దొరకవు, కాబట్టి జిల్లా సమావేశాల తేదీలు ప్రకటించగానే వీలైనంత త్వరగా సెలవులు పెట్టుకోండి. మనకు ఆధ్యాత్మిక నిర్దేశాలనివ్వడానికీ, మన విశ్వాసాన్ని బలపరచడానికీ నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఈ సంవత్సరం “దేవుని వాక్యాన్ని బోధించేవారు” జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి “సమాజములలో దేవుని స్తుతించుడి” అని కీర్తనకర్త ఇచ్చిన ప్రోత్సాహానికి అనుగుణంగా, ఆ సమావేశానికి హాజరయ్యేందుకు కావల్సిన ఏర్పాట్లను చేసుకోవడం ప్రారంభించండి.—కీర్త. 68:26.
[6వ పేజీలోని బాక్సు]
కార్యక్రమ సమయాలు
శుక్రవారం, శనివారం
ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:00 వరకు
ఆదివారం
ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:00 వరకు