‘దేవునికి సమస్తమును సాధ్యమే’
1 ప్రపంచవ్యాప్తంగా రాజ్య సందేశాన్ని ప్రకటించడమే క్రైస్తవ సంఘం యొక్క ప్రధానమైన పని. (మత్త. 24:14) ఎంతో బాధ్యతాయుతంగా చేయాల్సిన భారీ కార్యమది. ఆ పనిచేయడానికి మన దగ్గరున్న వనరులకన్నా ఇంకా చాలా ఎక్కువ అవసరమని దానిని గమనించే చాలామందికి అనిపిస్తుంది. మనం ఎగతాళికీ, వ్యతిరేకతకూ, హింసలకూ గురవుతాము కాబట్టి ఈ నియామకాన్ని నిర్వర్తించడమన్నది మరి కొందరి దృష్టిలో, అసలు ఊహలో కూడా చేయలేని పని. (మత్త. 24:9; 2 తిమో. 3:12) సంశయవాదుల దృష్టిలో, ఈ పనిని నిర్వర్తించడం అసాధ్యము. కానీ, ‘దేవునికి సమస్తమును సాధ్యమే’ అని యేసు అన్నాడు.—మత్త. 19:26.
2 అనుకరించడానికి మంచి మాదిరులు: లోకమంతటికి భిన్నమైన ఒకే వ్యక్తిగా యేసు తన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన తన పరిచర్యలో సఫలుడు కాకుండా ఆయన వ్యతిరేకులు, మనం ఊహించగలిగినన్ని విధాలుగా ఆయనను అవమానపరిచారు, చివరికాయనను ఎంతో బాధాకరమైన మరణానికి గురి చేశారు. అయినా చివరగా, “నేను లోకమును జయించి యున్నా[ను]” అని ఆయన దృఢంగా ప్రకటించాడు. (యోహా. 16:33) నిజంగా అది నమ్మశక్యంకాని విజయమే!
3 యేసు శిష్యులు కూడా క్రైస్తవ పరిచర్యలో ధైర్యసమేతమైన అదే స్ఫూర్తినీ, అదే ఆసక్తినీ చూపించారు. అనేకమంది కొరడా దెబ్బలు తిన్నారు, కొట్టబడ్డారు, జైలు పాలయ్యారు, చివరికి మరణానికి కూడా గురయ్యారు. అయినప్పటికీ, “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషిం[చారు].” (అపొ. 5:41) “భూదిగంతముల వరకు” సువార్తను ప్రకటించడం అసాధ్యమైన కార్యం అని అనిపించేలా ఎన్నో వ్యతిరేకతల్ని ఎదుర్కొన్నప్పటికీ వారు విజయాన్ని సాధించారు.—అపొ. 1:8; కొలొ. 1:23.
4 మన కాలంలో విజయాన్నెలా సాధించవచ్చు?: అసాధ్యమనిపించే వ్యతిరేకతలనెదుర్కుంటూ మనం కూడా రాజ్య ప్రకటనా పనిని ఆసక్తిగా చేపట్టాము. ప్రకటనా పనిని నిషేధించినా, మనలను హింసించినా, చెరసాలల్లో వేసినా, మనల్ని ఆపడానికి ఇతర దౌర్జన్యపూర్వక ప్రయత్నాలు చేసినా కూడా మనం విజయాన్ని సాధిస్తున్నాం. ఇదెలా సాధ్యమౌతోంది? “శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” (జెక. 4:6) మనకు యెహోవా మద్దతు ఉండగా, మన పనిని ఏదీ ఆపలేదు!—రోమా. 8:31.
5 మనం ప్రకటిస్తున్నప్పుడు, బిడియపడడానికి లేదా భయపడడానికి లేదా ప్రకటించే సామర్థ్యము లేదని అనుకోవడానికి మనకు ఏ కారణమూ లేదు. (2 కొరిం. 2:16, 17) రాజ్య సువార్తను వ్యాపింపజేయడంలో ముందుకు సాగడానికి మనకు బలమైన కారణాలున్నాయి. ఆ ‘అసాధ్యమైన’ కార్యాన్ని యెహోవా సహాయంతో నెరవేరుస్తాం!—లూకా 18:27.