దేని కోసం మనం ముందే పథకం వేసుకోవాలి?
1 మన భవిష్యత్తు గురించిన పథకాల విషయంలో మనమందరమూ ఎంతో కొంత ఆలోచిస్తాము. భూనిరీక్షణ ఉన్నవారు దేవుని నీతియుక్తమైన నూతన లోకంలో నిరంతరం జీవించడానికి ఎదురు చూస్తున్నారు. కానీ ఆ నిరీక్షణను ఒకరి హృదయాన్నుంచి లాగివేయగల కొన్ని ప్రభావాలున్నాయి. మన జీవితాలు రాజ్యాసక్తుల చుట్టూ పరిభ్రమించేలా ఉంచుకునేందుకూ, మభ్యపెట్టే శారీరక కోరికల మూలంగా ప్రక్కదారి పట్టకుండా ఉండేందుకూ హృదయపూర్వకంగా ప్రయత్నించాల్సిన అవసరముంది.—1 యోహా. 2:15-17.
2 ఆధ్యాత్మిక వ్యక్తుల లక్ష్యాలను ఈ లోకం అంత సులభంగా గ్రహించలేదు. (1 కొరిం. 2:14) మిగతా మానవులు కీర్తిప్రతిష్ఠలు, అధికారం, లేదా సంపదల కోసం వెంపర్లాడుతుండగా మనం ఆధ్యాత్మిక ధనం కోసం శ్రమిస్తాం. (మత్త. 6:19-21) భవిష్యత్తుపట్ల ఈ లోకానికున్న దృక్కోణానుసారంగా మన ఆలోచనలను మలచుకోవడానికి ప్రయత్నిస్తే మన ఆధ్యాత్మిక లక్ష్యాలను మనమెన్నటికైనా చేరుకోగలమా? అలా మలచుకుంటే మన హృదయంలో ఐహిక విచారాలు వెంటనే చోటు చేసుకుంటాయి. మనం వాటినెలా నివారించుకోగలము?
3 ‘ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి’: మనం మన భవిష్యత్తును రాజ్యాసక్తుల చుట్టూ పరిభ్రమించేలా నిర్మించుకుంటున్నామా లేదా అని నిర్ధారించుకోవడానికి ఒక మార్గం మన సంభాషణ ఎలా ఉంటోందని పరీక్షించుకోవడమే. మనమెప్పుడూ వస్తుసంపదల గురించీ ఐహికాసక్తుల గురించీ మాట్లాడుతున్నామా? అలాగైతే, మన హృదయం ఆధ్యాత్మిక విలువలమీద నుండి దృష్టి తప్పిపోతోందా అని మనం తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. మనం ‘శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచించకుండా, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునే’ విషయంలో ఎక్కువ ప్రాధాన్యతనివ్వవలసిన అవసరం ఉండవచ్చు.—రోమా 13:14.
4 యౌవనులు పూర్తికాల పరిచర్యలో ప్రవేశించే రోజు గురించి ముందుగా పథకం వేసుకోవడం ద్వారా ‘యేసును ధరించుకో’గలుగుతారు. క్రమ పయినీరు సేవ చేయాలనుకున్న ఒక యువకుడు, యువకులు ఆర్థిక భద్రతగలవారిగా తయారు కావాలనే సాంప్రదాయం ప్రబలంగా ఉన్న ఒక సంస్కృతిలో పెరిగాడు. ఆ కారణంగా, ఆయన వ్యాపారంలో ఎంత మునిగి పోయాడంటే, ఏదో యాంత్రికంగా కూటాలకు హాజరు కావడమూ, పరిచర్యలో పాల్గొనడమూ చేసేవాడు. మత్తయి 6:33లోని యేసు మాటలను ఎప్పుడైతే ఆయన నమ్మడం ప్రారంభించాడో అప్పుడు తన శక్తి సామర్థ్యాలన్నింటిని వెచ్చించాల్సి వస్తున్న గానుగెద్దు జీవితాన్ని వదిలేసి పూర్తికాల సేవను చేపట్టాడు. ఇప్పుడాయన మంచి మనస్సాక్షితో యెహోవాను సేవిస్తున్నాడు, ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ‘శక్తివంచన లేకుండా’ సేవ చేస్తున్నాడు.
5 భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచించడం జ్ఞానవంతమైనదని బైబిలు చెబుతోంది. (సామె. 21:5) మనమందరమూ దేవుని చిత్తానికి ప్రథమ స్థానాన్నిస్తూ అలాగే చేద్దాం.—ఎఫె. 5:15-17.