కూటాలకు హాజరయ్యేందుకు ఇతరులకు సహాయం చేయండి
1 “ఈ ప్రాంతంలో ఉన్న స్నేహితుల్లారా, మీకెవరికైనా . . . కూటాలకు హాజరవ్వాలన్న కోరిక ఉంటే, హాజరవ్వమని ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాం.” జాయన్స్ వాచ్ టవర్ 1880 నవంబరు ఆంగ్ల సంచికలో ఈ ప్రకటన కనిపించినప్పటి నుండి, ప్రజలను బైబిలు నిర్దేశాల కోసం సమకూడమని యెహోవాసాక్షులు ఎంతో ఆతురతతో ఆహ్వానిస్తున్నారు. (ప్రక. 22:17) ఇది సత్యారాధనలో ముఖ్య భాగమై ఉంది.
2 హాజరవ్వడం చాలా ఆవశ్యకం: మనం సంఘంతో సహవసించినప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశ్చర్యకరుడైన మన దేవుడైన యెహోవాతో మనకు మంచి పరిచయం ఏర్పడుతుంది. “యెహోవాచేత ఉపదేశము నొందు”టకు మనం సంఘంలో సమకూడతాం. (యెష. 54:13) బైబిలు నిర్దేశాలనిచ్చే క్రమమైన కార్యక్రమాన్ని దేవుని సంస్థ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమం మనలను దేవునికి మరింత సన్నిహితులను చేస్తుంది, “దేవుని ఉపదేశాన్నంతటినీ” ఆచరణలో పెట్టేందుకు మనకు నిజమైన సహాయాన్నిస్తుంది. (అపొ. 20:27, NW; లూకా 12:42) కూటాలు, దేవుని వాక్యాన్ని బోధించే కళలో వ్యక్తిగతంగా కావలసిన తర్ఫీదునిస్తాయి. లేఖనాల నుండి ఇవ్వబడే జ్ఞాపికలు, ఇతరులతోను, యెహోవాతోను సత్సంబంధాలను కలిగివుండడంలో విజయవంతులమయ్యేందుకు సహాయపడతాయి. దేవుణ్ణి ప్రేమించేవారితో సహవసించడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది.—రోమా. 1:11, 12.
3 నేరుగా ఆహ్వానించండి: బైబిలు విద్యార్థులందరినీ, మొదటి అధ్యయనం నుండే కూటాలకు ఆహ్వానించండి. విద్యార్థికి ఒక హ్యాండ్ బిల్‌ని ఇవ్వండి. గత వారపు కూటంలో మిమ్మల్ని ప్రోత్సహించిన ఒక పాయింట్‌ని ఆయనతో పంచుకోవడం ద్వారా, తర్వాతి వారపు కూటంలో చర్చించబోయే దేన్ని గురించైనా క్లుప్తంగా మాట్లాడడం ద్వారా ఆయన ఆసక్తిని రేకెత్తించండి. రాజ్య మందిరం ఎలా ఉంటుందో వివరించండి. రాజ్య మందిరాన్ని కనుగొనడమెలాగో ఆయనకు స్పష్టంగా తెలియజేయండి.
4 ఒక విద్యార్థి ఆహ్వానించిన వెంటనే హాజరవ్వకపోతే, ఆయనను అలా ఆహ్వానిస్తూనే ఉండండి. మన సంస్థ ఎలా పని చేస్తుందో ఆయనకు తెలిపేందుకు ప్రతి వారం కొన్ని నిమిషాలు తీసుకోండి. ఆయనకు మనమూ మన కూటాలూ బాగా పరిచయమయ్యేందుకు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు బ్రోషూర్‌ను, యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోను ఉపయోగించండి. విద్యార్థికి ఇతర ప్రచారకులను పరిచయం చేసేందుకు వారిని మీతోపాటు తీసుకువెళ్ళండి. ప్రార్థనలో, సంస్థను బట్టి యెహోవాకు కృతజ్ఞతలు తెలపండి, విద్యార్థి సంస్థతో సహవసించవలసిన అవసరాన్ని పేర్కొనండి.
5 క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవాళ్ళు మనతోపాటు సమకూడేందుకు వారికి సహాయపడడంలో వెనుకంజవేయవద్దు. యెహోవాను గురించి వాళ్ళకు మెప్పుదల పెరుగుతుండగా, తాము నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టేందుకూ, దేవుని సంఘటితపర్చబడిన సంస్థలో భాగమయ్యేందుకూ వాళ్ళు కదిలించబడతారు.—1 కొరిం. 14:25.