ప్రకటించేలా ప్రేమ మనల్ని పురికొల్పుతుంది
1 యెహోవాసాక్షులముగా మనం, రాజ్య సందేశాన్ని ఆసక్తిగా ప్రకటించేవారమని పేరు గాంచాము. (మత్త. 24:14) ప్రపంచవ్యాప్తంగా అరవై లక్షల కన్నా ఎక్కువమంది సాక్షులు ప్రకటనా పనిలో చురుగ్గా పాల్గొంటున్నారు; వారితో క్రొత్తవాళ్ళు కూడా చేరి, ప్రకటనా పనిని చేస్తున్నారు. ఈ పనిలో భాగం వహించే దాని ఆధారంగా సాక్షుల సంఖ్య లెక్కించబడుతుంది.
2 ఇలాంటి సవాలుదాయకమైన నియామకాన్ని స్వచ్ఛందంగా చేపట్టేలా ఏది మనల్ని పురికొల్పుతుంది? ప్రకటనా పని చేసేందుకు ఎవరూ మనల్ని బలవంతం చేయలేదు, వస్తుపరమైన లేదా ఆర్థికపరమైన లాభాలతో మనలను ఆకర్షించాలని చూడలేదు, మనలను ప్రత్యేకంగా సన్మానిస్తారని వాగ్దానమూ చేయలేదు. మొదట్లో, మనలో చాలామంది ఈ పనికి యోగ్యత లేనివారమని భావించడం వల్ల భయపడ్డాము, ప్రజల ప్రతిస్పందన కూడా తరచూ ప్రతికూలంగా ఉండేది. (మత్త. 24:9) మనల్ని గమనించేవారు, మనల్ని పురికొల్పుతున్నదేమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఇలా పట్టుదలగా ప్రకటించేందుకు బలమైన కారణం ఉండాలి.
3 ప్రేమకున్న శక్తి: మనం ‘మన పూర్ణహృదయముతోను, మన పూర్ణాత్మతోను, మన పూర్ణవివేకముతోను, మన పూర్ణబలముతోను, మన దేవుడైన [యెహోవాను] ప్రేమించాలని’ చెబుతూ అన్నింటికన్నా ప్రధానమైన ఆజ్ఞను యేసు తెలిపాడు. (మార్కు 12:30) యెహోవా మీద మనకున్న ప్రేమ, యెహోవా ఎవరు ఏమై ఉన్నాడు అన్న విషయమై మనకున్న గాఢమైన మెప్పుతో కూడిన భావాల్లో వేళ్ళూని ఉంది. యెహోవా “మహిమ ఘనత ప్రభావములు పొందనర్హు”డైన సర్వాధిపతియైన పరిపాలకుడు, సమస్తానికి సృష్టికర్త. (ప్రక. 4:10, 11) అద్భుతమైన ఆయన గుణాలు సాటిలేనివి.—నిర్గ. 34:6, 7.
4 యెహోవాను గురించి తెలుసుకుని, ఆయనను ప్రేమించడం, మన వెలుగును ఇతరుల ఎదుట ప్రకాశింపజేసేందుకు మనలను కదిలిస్తుంది. (మత్త. 5:16) మనం ఆయనను బహిరంగంగా స్తుతించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి మాట్లాడి, ఆయన రాజ్యాన్ని గురించిన సందేశాన్ని వ్యాపింపజేసినప్పుడు మన వెలుగు ప్రకాశిస్తుంది. ఆకాశమధ్యమున ఎగురుతున్న దూత దగ్గర ఉన్నట్లే మన దగ్గర కూడా, “ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త” ఉంది. (ప్రక. 14:6) ప్రపంచవ్యాప్త ప్రకటనా పని వెనుక ఉన్న శక్తి మన ప్రేమే.
5 ఈ లోకం మన ప్రకటనా పనిని “వెఱ్ఱితనము”గా పట్టించుకోనవసరంలేనిదిగా దృష్టిస్తుంది. (1 కొరిం. 1:18) మన పనిని అణచివేసేందుకు అంతటా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. “మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలే[ము] . . . మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అని అపొస్తలులు ప్రకటించినట్లు మనం కూడా ప్రకటించేందుకు నమ్మకమైన మన ప్రేమ మనలను బలపరిచింది. (అపొ. 4:20; 5:29) వ్యతిరేకత ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాల్లోను ప్రకటనా పని విస్తరిస్తూనే ఉంది.
6 యెహోవా మీద మనకున్న ప్రేమ మండుతున్న అగ్నిలాంటిది, అది ఆయనకున్న ఉత్కృష్టమైన గుణాలను గురించి విస్తృతంగా ప్రకటించేందుకు మనలను బలవంతపెడుతుంది. (యిర్మీ. 20:9; 1 పేతు. 2:9) ‘జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడంలోను . . . ఆయన మహాత్మ్యమును వెల్లడిపరచడంలోను’ మనం కొనసాగుతాం!—యెష. 12:4, 5.