మన సరళీకృత సాహిత్య పంపిణీ ఏర్పాటు
1 ఛార్జిలేకుండా సాహిత్యాలను పంచిపెట్టే సరళీకృత ఏర్పాటు ఇప్పటికి ఒక సంవత్సరం నుంచి అమలులో ఉంది. ఈ ఏర్పాటు విజయవంతమైనదని రుజువైందా? అన్ని రకాలైన ప్రచురణలను పంచిపెట్టడంలోనూ పెరుగుదల ఉన్నట్లు క్షేత్రసేవ రిపోర్టులు చూపిస్తున్నాయి. వచ్చి ‘జీవజలమును ఉచితముగా పుచ్చుకొనే’ అవకాశం అక్షరార్థంగా లక్షలాది మందికి ఇవ్వబడుతోంది.—ప్రక. 22:17.
2 అయినప్పటికీ, సాహిత్యాన్ని అంగీకరించే ప్రతీ వ్యక్తికీ దాన్ని విచక్షణారహితంగా ఇవ్వవలసిన బాధ్యత మనకు లేదు లేక అలా ఇవ్వడం మన అభిలాషాకాదు. మన సొంత వస్తువుల్ని మనమెలా జ్ఞానయుక్తంగా ఉపయోగించుకుంటామో అలాగే, ఛార్జిలేకుండా సొసైటీ నుంచి స్థానిక సంఘం ద్వారా తీసుకునే సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించవలసిన బాధ్యత ప్రతీ ప్రచారకునికి ఉంది. సొసైటీ, ఛార్జిలేకుండా ప్రచారకులకు సాహిత్యాన్ని అందుబాటులో ఉంచుతుందంటే దాని భావం, వాటిని ఉత్పత్తిచేయడానికీ, పంపిణీచేయడానికీ ఏమాత్రం డబ్బు ఖర్చు కావడం లేదని కాదు. యెహోవా దేవుని గురించిన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గురించిన కచ్చితమైన జ్ఞానం కోసం యథార్థహృదయులు చేసే అన్వేషణయందు వారికి సహాయపడడంలో మన సాహిత్యాల విలువను అందరూ విశేషంగా గుణగ్రహించాలి.—యోహా. 17:3.
3 ఛార్జిలేకుండా అందరికీ సాహిత్యాన్ని సొసైటీ ఎలా అందించగల్గుతోంది? సాహిత్యాలను ఉత్పత్తి చేసి, పంపిణీచేయడంలో అయ్యే అనివార్యమైన ఖర్చులకు డబ్బు విరాళాల ద్వారా సమకూర్చబడుతోంది. ఈ మద్దతుకు ప్రధాన మూలం యెహోవా దేవుని సమర్పిత సేవకులే. ఈ అత్యంత ఆవశ్యకమైన రాజ్య ప్రకటనా పనికి మద్దతు కోసం యెహోవాసాక్షులు ప్రజలవైపు చూడలేదు. ప్రజల నుండి విరాళాలు సేకరించే కార్యక్రమాల్లో మనం ఇంతకు మునుపెన్నడూ భాగం వహించలేదు; ఇప్పుడు కూడా భాగం వహించడం లేదు. అయినా, క్షేత్రసేవలో మనం కలుసుకొనే నిజంగా ఆసక్తిగల వ్యక్తులూ మెప్పుదలగల వ్యక్తులూ ఇచ్చే చిన్న చిన్న విరాళాలు స్వీకరించబడతాయి.
మన విరాళాలు సాధిస్తున్నది
4 కాబట్టి, స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాల ద్వారా మన ప్రపంచవ్యాప్త బైబిలు విద్యా పనికి ఎలా మద్దతు ఇవ్వబడుతుందో క్లుప్తంగానూ, స్పష్టంగానూ వివరించేందుకు మనం సిద్ధంగా ఉండడం సముచితం. స్వీకరించబడిన నిధులన్నీ, ఈ ఆధునిక శకంలో రాజ్య ప్రకటనా పనిని పూర్తిచేసేందుకే ఉపయోగించబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టడం కోసం సాహిత్యాలను ముద్రించడంతోపాటు సొసైటీ, బ్రాంచి ఆఫీసులనూ, బేతేలు గృహాలనూ, మినిస్టీరియల్ ట్రైనింగ్ స్కూళ్లనూ నిర్వహిస్తుంది; ప్రత్యేక పయినీర్లను గురించీ, ప్రయాణ పై విచారణకర్తల గురించీ శ్రద్ధ తీసుకుంటుంది; అలాగే యేసు తన శిష్యులకు ఇచ్చిన నియామకాన్ని నెరవేర్చేందుకు అవసరమైన అనేక ఇతర సేవలను కొనసాగిస్తుంది.—మత్త. 24:14; 28:19, 20.
5 యెహోవా ప్రజల మధ్య జరుగుతున్న విస్తృతమైన పురోభివృద్ధి, సహాయపడేందుకు తామేమి చేయగలమని అడిగేలా అనేకమందిని కదిలించింది. వారిలో అనేకులు క్రొత్త బ్రాంచీలనూ, రాజ్యమందిరాలనూ నిర్మించడంలో వ్యక్తిగతంగా సహాయపడలేకపోవొచ్చు, లేదా సుదూర దేశాల్లో సువార్త కార్యక్రమాల్లో సహాయపడేందుకు అక్కడకు వెళ్లలేకపోవొచ్చు. అయితే, తమకు సాధ్యమైనంత మేరకు ఈ ఉత్తేజిత పురోభివృద్ధుల్లో కొద్దిపాటి భాగాన్ని కల్గివుండడానికి అనేకమంది ప్రచారకులూ వారి కుటుంబాలూ, ప్రపంచవ్యాప్త పని నిమిత్తం విరాళమిచ్చేందుకు క్రమంగా కొంత మొత్తాన్ని ప్రక్కన ఉంచుతారు. (పోల్చండి 1 కొరింథీయులు 16:1, 2.) ఆ విధంగా, సాహిత్య పంపిణీతోపాటు సొసైటీ కార్యకలాపాలన్నింటికీ మద్దతు ఇవ్వబడుతోంది. ప్రపంచవ్యాప్త పనికి ఇచ్చే స్వచ్ఛంద విరాళాలను ఏ ఒక్కరూ, సాహిత్య ముద్రణకు అయ్యే ఖర్చుకు చెల్లింపుగా దృష్టించకూడదు.
6 సాక్ష్యమిచ్చే ఉద్దేశంతో గృహస్థుల దగ్గరకు గానీ, ఇతరుల దగ్గరకు గానీ వెళ్లేటప్పుడు, వారితో ఒక బైబిలు అంశాన్ని చర్చించేందుకు సిద్ధపడివుండాలి. బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను అనే చిన్న పుస్తకంలో సముచితమైన అనేక బైబిలు అంశాలతోపాటు ఆసక్తిని కల్గించే వివిధ రకాలైన ఉపోద్ఘాతాలు సూచించబడ్డాయి. లేదా మన రాజ్య పరిచర్యలోని సూచిత అందింపులను ఉపయోగించవచ్చు. రాజ్య సందేశానికి ఆ వ్యక్తి చూపించే ప్రతిస్పందన ఆధారంగా, సాహిత్యాన్ని అందించడం విషయంలో ఎలా కొనసాగాలనేది ప్రచారకుడు నిశ్చయించుకోవాలి. పుస్తకాన్నిగానీ, మరితర సాహిత్యాన్నిగానీ అందించడానికి తగినంత ఆసక్తి ఉన్నట్టు కన్పించకపోయినట్లైతే, మీరు యుక్తిగా సంభాషణను నిలిపివేసి, మరో ఇంటిని సందర్శించడానికి వెళ్లాలని నిశ్చయించుకోవచ్చు, లేదా ఆ వ్యక్తి చదువుతానని మాటిస్తే మీరు హ్యాండ్ బిల్లునో కరపత్రాన్నో ఇవ్వవచ్చు. పునర్దర్శనం చేయగలిగేలా, అతను చూపించిన ఆసక్తిని గురించి తప్పక వ్రాసుకోండి. గృహస్థుడు బిజీగా ఉన్నందునో, మనం తగిన సమయంలో అతడ్ని కలవనందునో అతనితో అర్థవంతమైన సంభాషణ నెరపడానికి తగినంత సమయం లభించని సందర్భాల్లో కూడా మనం పై విధంగానే చేయవచ్చు.
7 సరళీకృత సాహిత్య పంపిణీ ఏర్పాటు, మన బైబిలు విద్యాపని ఏ విధంగా చూసినా సరే వాణిజ్యపరమైన పనికాదని ప్రతిఒక్కరూ గ్రహించేలా సహాయపడుతుంది. రాజ్య సువార్తను ప్రకటించి యేసుక్రీస్తుకు శిష్యులను చేసే మన గమ్యానికి ప్రథమ
8 మనం మన పరిచర్యను ఆసక్తిదాయకంగా విస్తృతపరుస్తూ, విలువైన సొసైటీ ప్రచురణలను జ్ఞానయుక్తంగా ఉపయోగించినప్పుడు, యెహోవా అభివృద్ధిపరుస్తూనే ఉంటాడు. అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న సహృదయులైన ప్రజలు మన పరిచర్య స్వభావాన్ని గూర్చి మనమిచ్చే ఆలోచనాపూరిత వివరణలను గుణగ్రహిస్తారు, స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి తమ మద్దతును వ్యక్తపర్చేందుకు ఇష్టపడతారు.