చక్కగా వినేవారై ఉండండి
1 శ్రద్ధతో వినడానికి క్రమశిక్షణ అవసరం. వింటున్న దాన్నుంచి నేర్చుకొని ప్రయోజనం పొందాలనే కోరిక వినేవానికి ఉండడం కూడా అవసరం. కాబట్టి, “మీరేలాగు వినుచున్నారో చూచు”కోవాల్సిన అవసరతను యేసు నొక్కి చెప్పాడు. (ఇటాలిక్కులు మావి.)—లూకా 8:18.
2 మనం సంఘ కూటాలకూ, సమావేశాలకూ, జిల్లా సమావేశాలకూ హాజరైనప్పుడు విశేషంగా అది అన్వయించబడుతుంది. అవి, మనం విశేష జాగ్రత్తతో వినాల్సిన సందర్భాలై ఉన్నాయి. (హెబ్రీ. 2:1) ఈ క్రైస్తవ కూటాల్లో మీరు చక్కగా వినువారిగా ఉండడానికి మీకు సహాయపడే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
◼ కూటాల విలువను గుణగ్రహించండి. అవి, “నమ్మకమైన . . .గృహనిర్వాహకు[ని]” ద్వారా మనం “యెహోవాచేత ఉపదేశము” పొందే ఒక ప్రధానమైన మార్గం.—లూకా 12:42
◼ ముందుగా సిద్ధపడండి. చర్చించబోయే సమాచారాన్ని పునఃసమీక్షించండి, మీతోపాటు మీ బైబిల్నీ, అధ్యయనం చేయబోయే ప్రచురణ యొక్క మీ వ్యక్తిగత కాపీనీ మర్చిపోకుండా తెచ్చుకోండి.
◼ కూటాలు జరుగుతుండగా, మనస్సు లగ్నం చేయడానికి ప్రత్యేక ప్రయత్నాన్ని చేయండి. మీతో కూర్చున్న వారితో మాట్లాడడం, అలాగే ప్రేక్షకుల్లో ఇతరులు ఏం చేస్తున్నారో చూడడం వంటివి చేయకుండా జాగ్రత్తవహించండి. కూటం అయిపోయిన తర్వాత మీరు చేయబోయే దాని గురించి ఆలోచించడం ద్వారాగానీ, ఇతర వ్యక్తిగత విషయాలను గురించి ఆలోచించడం ద్వారాగానీ మీ అవధానం మరలిపోకుండా ఉండేలా ప్రయత్నించండి.
◼ కూటాల్లో చెప్పబడినదాన్ని విశ్లేషించండి. ‘ఇది నాకెలా అన్వయిస్తుంది? దీన్ని నేనెప్పుడు అన్వయించుకుంటాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
◼ ప్రధానాంశాలనూ, లేఖనాలనూ క్లుప్తంగా రాసుకోండి. అలా చేయడం, కూటాల్లో చర్చించబడుతున్న వాటిపై మీ ఆలోచనలను కేంద్రీకరించేందుకు సహాయపడుతుంది; తర్వాత ఉపయోగించుకోవడం కోసం కీలక విషయాలను మీరు జ్ఞాపకముంచుకునేందుకు దోహదపడుతుంది.
3 వినమని మీ పిల్లలకు బోధించండి: పిల్లలకు ఆధ్యాత్మిక ఉపదేశం అవసరం. (ద్వితీ. 31:12) ప్రాచీన కాలాల్లో, దేవుని ప్రజలలో “తెలివితో వినగలవా[రందరు],” ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతుండగా శ్రద్ధతో వినాల్సి ఉండేది. (నెహె. 8:1-3) తల్లిదండ్రులు కూటాల్లో నిమగ్నమైపోయి, జాగ్రత్తగా వింటున్నట్లైతే, వారి పిల్లలు కూడా అదే పని చేస్తారు. పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచేందుకు ఆట బొమ్మలనో, డ్రాయింగ్ పుస్తకాల్నో తీసుకురావడం తెలివైన పని కాదు. టాయ్‌లెట్లకు అనవసరంగా వెళ్లి రావడం కూడా వాళ్లు వినకుండా చేస్తుంది. “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును” గనుక తమ పిల్లలు కూటాల్లో బుద్ధిగా కూర్చొని వినేలా చేసేందుకు తల్లిదండ్రులు తీవ్రంగా కృషిచేయాలి.—సామె. 22:15.
4 చక్కగా వినేవారిగా ఉండడం ద్వారా, మనం నిజంగా తెలివైనవారమనీ, “మరింత ఉపదేశాన్ని పొందా”లని కోరుకుంటున్నామనీ రుజువు చేసుకుంటాం.—సామె. 1:5, NW.