“మీ వెలుగును ప్రకాశింపనివ్వండి”
1 మన చుట్టూ ఉన్న లోకం నైతికంగానూ, ఆధ్యాతికంగానూ అంధకారంలో ఉంది. సత్యపు వెలుగు “నిష్ఫలమైన అంధకార క్రియల”ను బయల్పరుస్తోంది గనుక అలాంటి మరణకరమైన అడ్డంకులకు తగిలి పడిపోకుండా జాగ్రత్తవహించవచ్చు. అందుకే, అపొస్తలుడైన పౌలు “వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి” అని క్రైస్తవులను ఉద్బోధిస్తున్నాడు.—ఎఫె. 5:8, 10, 11.
2 “వెలుగు ఫలము” లోకపు అంధకారానికి ఎంతో భిన్నంగా ఉంది. (ఎఫె. 5:9) ఆ ఫలాన్ని ఫలించాలంటే, మనం క్రైస్తవ జీవితంలో ప్రకాశవంతమైన మాదిరిగల వ్యక్తులుగానూ, యేసు అంగీకరించే ప్రజలుగానూ ఉండడం అవసరం. సత్యం విషయంలో పూర్ణహృదయత, యథార్థత, ఉత్సాహం వంటి లక్షణాలను మనం చూపించాలి కూడా. ఆ ఫలం, మన అనుదిన జీవితంలోనూ మన పరిచర్యలోనూ ప్రదర్శించబడాల్సిన అవసరముంది.
3 ప్రతి అవకాశమందూ ప్రకాశించండి: మనుష్యుల “యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి” అని యేసు తన శిష్యులతో అన్నాడు. (మత్త. 5:16) యేసును అనుకరించడంలో, దేవుని రాజ్యాన్ని గురించీ, ఆయన సంకల్పాల్ని గురించీ ప్రకటించడం ద్వారా మనం యెహోవా వెలుగును ప్రతిబింబిస్తాం. ప్రజలను మనం ఇండ్లలో కలిసినప్పుడు, అలాగే పని స్థలంలో, స్కూల్లో, మన పొరుగువారి మధ్య లేదా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సత్యాన్ని వ్యాపింపచేసినప్పుడు మనం జ్యోతులవలే ప్రకాశిస్తాం.—ఫిలి. 2:16.
4 కొందరు వెలుగును ద్వేషిస్తారని యేసు చెప్పాడు. (యోహా. 3:20) కాబట్టి “క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము” తమ వరకు చేరడాన్ని అనేకమంది తిరస్కరిస్తున్నప్పుడు, మనం నిరుత్సాహపడం. (2 కొరిం. 4:4) యెహోవా మానవ హృదయాలను చదువుతాడు, తన ప్రజల మధ్య అవినీతిని అనుసరించేవారు ఉండాలని కోరుకోడు.
5 యెహోవా మార్గాలను అనుసరించి, ఆధ్యాత్మిక వెలుగును ఆనందించినప్పుడు, దాన్ని ఇతరులకు ప్రతిబింబించగలం. మనం “జీవపు వెలుగుగలిగి” ఉన్నామని వాళ్లు మన ప్రవర్తననుబట్టి గుర్తిస్తే, వెలుగు ప్రకాశకులుగా ఉండేందుకు అవసరమైన మార్పుల్ని చేసుకునేందుకు వాళ్లు కూడా కదిలించబడవచ్చు.—యోహా. 8:12.
6 మన వెలుగును ప్రకాశింపచేయడం ద్వారా, మన సృష్టికర్తకు స్తుతులను తెస్తాం; ఆయన గురించి తెలుసుకొని నిత్యజీవ నిరీక్షణను పొందేలా యథార్థవంతులకు సహాయం చేస్తాం. (1 పేతు. 2:12) మన దగ్గర వెలుగు ఉంది గనుక, ఆధ్యాత్మిక అంధకారం నుంచి బయటపడి, వెలుగు సంబంధమైన క్రియలను ఉత్పన్నంచేసేలా ఇతరులకు సహాయపడేందుకు దాన్ని మనం ఉపయోగిద్దాం.