టెలిఫోన్ సాక్ష్యం—అనేకమందిని కలుసుకునేందుకు ఒక మార్గం
1 ఇప్పుడు మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామనడానికి కావల్సినంత రుజువు ఉంది. (2 తిమో. 3:1) రాజ్యాన్ని గూర్చి ప్రకటించడానికీ శిష్యులను చేయడానికీ ఉన్న సమయం తగ్గిపోయిందనడంలో సందేహంలేదు. కాబట్టి, యెహోవా దేవుడు ఆమోదించే ఆరాధకులుగా తయారయ్యేందుకు ఇతరులకు సహాయపడటానికి మనలో ప్రతి ఒక్కరం అత్యవసర భావంతో చర్య తీసుకోవాలి.
2 అపొస్తలుడైన పౌలు తన విశ్వాసాన్ని గూర్చి నోటితో ఒప్పుకోవడం తన బాధ్యతగా భావించాడు. (రోమా. 10:10) దేవుడు, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యచ్ఛయంచుచున్నాడు” అని పౌలుకు తెలుసు. (1 తిమో. 2:4) సత్యమును గూర్చి తనకున్న జ్ఞానం ఆధారంగా, పౌలు తనను తాను అందరికీ ఋణస్థునిగా పరిగణించుకున్నాడు. అది, సువార్తను ప్రకటించడంపట్ల ఆయనకున్న అత్యవసర భావాన్ని అధికం చేసింది. ఆయనిలా చెప్పాడు: “సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, . . . రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.”—రోమా. 1:14-17.
3 అలాగే మనం కూడా వ్యక్తిగతంగా ఋణస్థులమని భావిస్తూ, మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరినీ చేరడానికి అదే విధంగా సిద్ధంగా ఉన్నామా? ఇంటింటి పరిచర్యలోనూ వీధి సాక్ష్యంలోనూ ఇతరులతో మూఖాముఖిగా సువార్తను పంచుకోవడం మనకు ఇష్టమే అయినప్పటికీ మన పరిచర్యను దానికి మాత్రమే పరిమితం చేసుకోవడం ఎందుకు? మన సంఘ ప్రాంతంలో అనేకమంది వ్యక్తులు యెహోవాసాక్షులతో అసలు ఎప్పుడూ మాట్లాడి ఉండకపోవచ్చు. అదెలా సాధ్యం?
4 పనిచేయని ప్రాంతం: మీ ప్రాంతంలో కాపలాదారుడు ఉండే ఎత్తైన అపార్ట్మెంట్లు ఉన్నాయా? ఇంటింటికి వెళ్ళడానికి అనుమతించని అధిక భద్రతా ఏర్పాట్లు గల కాంప్లెక్స్‌లు ఉండి ఉండవచ్చు. మీ ప్రాంతంలో ఉన్న మిలిటరీ క్వార్టర్స్‌లో సువార్త ప్రకటించడానికి మీ సంఘానికి ప్రవేశం అనుమతించబడలేదా? అలాంటి ప్రదేశాల్లో జీవిస్తున్న కొంతమంది వ్యక్తులు దేవుని రాజ్య ఆశీర్వాదాలను గూర్చి విని ఉండకపోవచ్చు. ఇంటి దగ్గర ఎన్నడూ కలవడానికి వీలుకాని ప్రజలు ఉన్నారా?
5 వాళ్ళను కలుసుకోవడం కష్టం కనుక వాళ్ళను కలవలేకపోతున్నామని మనం నిరాశపడవలసిన అవసరం లేదు. యెహోవా పరిస్థితిని ఎలా దృష్టిస్తాడు? అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాస్తున్నాడు: “[యెహోవా] . . . యెవడును నశింపవలెనని యచ్ఛయంపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుతున్నాడు . . . అంతకన్నా ఎక్కువగా . . . మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.” (2 పేతురు 3:9, 15) జీవితాలు ఇమిడివున్నాయి, యెహోవా ప్రతి ఒక్కరిపై ఆసక్తి కలిగివున్నాడు. (మత్త. 18:14) యెహోవా ఈ వ్యక్తుల పట్ల ప్రదర్శిస్తున్నటువంటి కనికరాన్ని, దయను మనమెలా చూపించవచ్చు? మన క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సాక్ష్యాన్ని పొందేలా చూడటం ద్వారానే.—అపొ. 20:20, 21; ప్రక. 14:6, 7.
6 సంపూర్ణ కార్యకలాపం కోసం సంస్థీకరించబడటం: అనారోగ్యం మూలంగా లేక శారీరక దౌర్భల్యం మూలంగా తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ తమ గృహాలకే పరిమితమైపోయిన వారిని టెలిఫోన్‌ను బాగా ఉపయోగించుకోమని గతంలో సంస్థ ప్రోత్సహించింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఈ మంచి పనిని కొనసాగించాలి. అంతేగాక క్రమ, సహాయ పయినీర్లతో సహా ఎంతోమంది సహోదర సహోదరీలు, టెలిఫోన్ సాక్ష్యాన్నివ్వడాన్ని సాధారణంగా చేసే ఇంటింటి పరిచర్యకు అనుబంధంగా ఉపయోగిస్తున్నారని నివేదికలు అందాయి.
7 టెలిఫోన్ సాక్ష్యాన్నివ్వడానికి కొన్ని సంఘాలు సమష్టిగా కృషి చేశాయి. పెద్దలు, ప్రాంతాలను సంస్థీకరించడంలో నాయకత్వం వహించి, వ్యక్తిగతంగా కానీ, ఇతర ప్రచారకుల ద్వారా కానీ మద్దతునిచ్చినప్పుడు అది ఫలవంతమైనట్లు నిరూపించబడింది. ఈ కార్యకలాపాన్ని సేవా పైవిచారణకర్త పర్యవేక్షించాలి. ఈ పనిని సంస్థీకరించడంలో సేవా పైవిచారణకర్తతో పని చేయడానికి అర్హతగల పెద్దను కానీ బాధ్యాతాయుతమైన పరిచర్య సేవకుడిని కానీ పెద్దల సభ ఎంపిక చేయవచ్చు.
8 ప్రారంభంలో ఉన్న సంకోచాన్ని అధిగమించి, టెలిఫోన్ సాక్ష్యమివ్వడంలో అనుభవం గడించిన ప్రచారకులు అది చాలా ఫలవంతమైన క్షేత్రమని కనుగొన్నారు. ప్రారంభంలో కొంతమంది ప్రచారకులు, పయినీర్లు మాత్రమే ఇలా ఫోన్ చేస్తారు. ఈ విధమైన సాక్ష్యమిచ్చే పనితో వారికి బాగా పరిచయం ఏర్పడి, దాన్ని వారు సుళువుగా చేయగలుగుతున్నప్పుడు, వారి ఉత్సాహమూ ప్రోత్సాహకరమైన అనుభవాలూ ప్రకటనా పనిలోని ఈ ఆసక్తికరమైన అంశంలో ఎలా పాల్గొనాలనేది నేర్చుకునేందుకు ఇతరులను కదిలించవచ్చు.
9 ఎక్కడ ప్రారంభించాలి: అపార్ట్మెంట్ ప్రవేశమార్గం దగ్గర ఉన్న లిస్టులలో లేక సాధారణంగా ఇంటి యజమానుల పేర్లు వ్రాసి ఉండే మెయిల్ బాక్సులలో ఆ అపార్ట్మెంట్లో నివసించేవారి పేరులు కనుగొనడం సాధ్యం కావచ్చు. ఆ తర్వాత టెలిఫోన్ నెంబర్లు టెలిఫోన్ డైరెక్టరీల్లో చూడవచ్చు. ఇటీవలి టెలిఫోన్ డైరెక్టరీల్లోని పేజీల జిరాక్స్ కాపీలు టెరిటరీలుగా పనిచేస్తాయి. ఈ టెరిటరీల సైజును చిన్నదిగా ఉంచుకోవాలి.
10 అన్ని రకాల సాక్ష్యమిచ్చే కార్యకలాపాల్లో ఖచ్చితమైన రికార్డును ఉంచుకోవడం చాలా ప్రయోజనకరం. ఇది టెలిఫోన్ సాక్ష్యం విషయంలో కూడా వాస్తవం. చర్చించబడిన విషయం, ఇంటి యజమానికి ఆసక్తి ఉన్న విషయాలు, తర్వాత మీరు ఫోన్లో చర్చించబోయే అంశం వంటి సహాయకరమైన సమాచారాన్ని జాగ్రత్తగా ఇంటింటి పరిచర్య రికార్డులో వ్రాసిపెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫోన్ చెయ్యాలో లేక వ్యక్తిగతంగా వాళ్ళని కలవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ రికార్డ్ మీద వ్రాసుకోండి.
11 వ్యక్తిగత ప్రణాళిక అవసరం: క్రమంగా దానిలో పాల్గొనడం మీ నమ్మకాన్ని పెంచి భయాన్ని పోగొడుతుంది. ప్రజలు ఎక్కువగా ఇళ్ళ వద్ద ఉండే సమయాల్లో అంటే సాయంత్రాల్లోనూ, వారాంతాల్లోనూ వారితో మాట్లాడటం మంచిది. ప్రతి వారం ఇలా ఫోన్ చేయడానికి క్రమంగా ఒక సమయాన్ని కేటాయించుకోండి. కొంతమంది సంఘపుస్తక పఠనానికి గంట ముందు చేయడం ఫలవంతంగా ఉంటుందని కనుగొన్నారు. మీ ప్రాంతంలో ఏ సమయం ఎక్కువ ఫలవంతంగా ఉంటుందో మీరే కనుగొనండి.
12 ఎలా సిద్ధపడాలి: ఈ సేవాధిక్యతలో ఆనందించిన ఇతరులతో మాట్లాడి, వారి అభిప్రాయాలను అడగండి. ఎల్లప్పుడూ అనుకూల దృక్పథంతో ఉండండి. యెహోవాను మీ బలానికి, శక్తికి మూలంగా ఎంచి, ప్రార్థన ద్వారా ఆయన నడిపింపును కోరండి. (కీర్త. 27:14; ఫిలి. 4:13) ఇతర విధాల్లో మీరు సాక్ష్యమిస్తున్నప్పుడు చేస్తున్నట్లుగానే ఈ పనిని కూడా పూర్ణహృదయంతో చేయడానికి ప్రయత్నించండి.—పోల్చండి మార్కు 12:33.
13 డెస్క్ దగ్గర లేక టేబుల్ దగ్గర కూర్చోవడం సహాయకరంగా ఉండవచ్చని అనుభవం రుజువుచేస్తోంది. కుర్చీలో కూర్చోవడం స్పష్టమైన ఆలోచనకు, అవధానానికి సరియైన తోడ్పాటునిస్తుంది. కరపత్రాలు, ప్రస్తుతం అందజేస్తున్న సాహిత్యాలు, ఇటీవలి పత్రికలు లేదా ఆసక్తికరమైన కొన్ని పాత ప్రతులు, బైబిలు, రీజనింగ్ పుస్తకం, కూటాల నిర్దిష్ట సమయాన్నీ రాజ్యమందిర చిరునామానూ తెలియజేసే ఆహ్వానపత్రిక, ఒక పెన్ను లేదా పెన్సిల్, ఇంటింటి రికార్డులు వంటి సాక్ష్యమివ్వడానికి ఉపయోగపడే వాటన్నింటినీ దగ్గర ఉంచుకోండి. మీ సాహిత్యాన్ని సిద్ధంగా ఉంచుకోండి, ఒక నిర్దిష్టమైన శీర్షికను కూడా తెరచి ఉంచుకోవచ్చు. మీ అందింపును బాగా సిద్ధపడండి. మీరు ఫోన్ చేయడం యొక్క ఉద్దేశం సాక్ష్యమివ్వడమనీ, వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని సందర్శించడానికి ఏర్పాటు చేసుకోవడమనీ మనస్సులో ఉంచుకోండి.
14 ఫోన్ చేసేటప్పుడు: ప్రశాంతంగా మామూలుగా ఉండండి. ఫోన్ ద్వారా ప్రభావవంతంగా సాక్ష్యమివ్వడానికి ప్రేమపూర్వకమైన, ఆహ్లాదకరమైన స్వరం అవసరం. మీ ముఖంపైని చిరునవ్వు మీ స్వరంలో ప్రతిబింబిస్తుంది. నెమ్మదిగా, స్పష్టంగా మంద్రస్థాయిలో మాట్లాడండి. మర్యాదపూర్వకంగా, ఓర్పుతో, స్నేహపూర్వకంగా ఉండండి. నిరాకరిస్తారని భయపడవద్దు. ప్రజలు మీరిచ్చే వర్తమానంపై ఆసక్తి కలిగివుండరు అన్న వాస్తవాన్ని అంగీకరించండి. ఇంటింటి పరిచర్యలో అలాంటి నిరాకరణను ఎలా దృష్టిస్తారో అలాగే దృష్టించండి.
15 మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొనేటప్పుడు మీ పూర్తి పేరును చెప్పండి. మీరు ఆ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఫోన్ చేస్తున్నామని చెప్పకపోవడం మంచిది ఎందుకంటే అది అవరోధాలను తీసుకురావచ్చు.
16 రీజనింగ్ పుస్తకంలోని అనేక ఉపోద్ఘాతాలను సంభాషణా సరళిలో ప్రతి పదాన్ని చదివేయవచ్చు. ఉదాహరణకు మిమ్మల్ని మీరు ఈ విధంగా పరిచయం చేసుకోవచ్చు: “హలో, నా పేరు ________. నేను వచ్చి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలువలేకపోతున్నాను కనుక మీకు ఫోన్ చేస్తున్నాను.” ఆ తర్వాత ఆగకుండా ఇలా చెప్పవచ్చు: “జీవన నాణ్యత ఎప్పటికైనా పెరుగుతుందా అనే విషయంలో మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. మనలో చాలామంది తాము జీవించి ఉన్నందుకు సంతోషిస్తారు, కానీ ‘నిజమైన సంతోషంతో కూడిన జీవితం సాధ్యమేనా?’ అని అనేకులు ఆలోచిస్తారు. దాని గురించి మీరేమనుకుంటున్నారు? [ప్రతిస్పందించడానికి సమయమివ్వండి.] ఆనందానికి నేడు ఒక పెద్ద ఆటంకం ఏదని మీరు చెప్తారు?” లేక పైన చెప్పిన విధంగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న అనంతరం మీరిలా చెప్పవచ్చు: “అంతర్జాతీయ స్వచ్ఛంద పనిలో నేను భాగం వహిస్తున్నాను, జీవితార్థంపై మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సంవత్సరాలు గడుస్తుండగా, జీవితం చాలా చిన్నదని మనం గ్రహిస్తాము. జీవితమంటే ఇంతేనా? దాని గురించి మీరేమనుకుంటున్నారు?” (బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను, 6వ పేజీ, “జీవితము/సంతోషము” అనే ఉపశీర్షిక చూడండి.)
17 చర్చ ప్రారంభంలోనే బైబిలును ఉపయోగించండి. సంభాషణలో ఎప్పుడో ఒకసారి, తగిన సమయమని మీకు అనిపించినప్పుడు, మీరు యెహోవాసాక్షుల్లో ఒకరని తెలియజేయండి. అవతలి వ్యక్తి కూడా సంభాషణలో భాగం వహించేలా చేయండి. అవతలి వ్యక్తి తానేమి తలస్తున్నాడో చెప్పాలనుకున్నప్పుడు వినడానికి భయపడవద్దు. ఆయన వ్యక్తపర్చిన దానికీ ఆయన వ్యాఖ్యానించిన దానికీ కృతజ్ఞతలు తెలియజేయండి. మెచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. సంభాషణలో అవతలి వ్యక్తి మిమ్మల్ని అధిగమిస్తున్నా లేక వాదిస్తున్నా, యుక్తిగా సంభాషణను ముగింపుకు తీసుకురండి. దేవుని ఆత్మ మీ కృషిలో మిమ్మల్ని నడిపించనివ్వండి, ఆయనపట్ల సరియైన హృదయంగల వారిని వెదకడంలో మీకు సహాయం చేయనివ్వండి.
18 సంభాషణను అతడు ముగించేంతవరకూ ఆగే బదులు మీరే సంభాషణను ముగించండి. రాజ్యమందిరంలో జరిగే బహిరంగ ప్రసంగానికి రమ్మని దాని చిరునామాను, కూటాలు జరిగే సమయాన్ని తెలియజేసి మీరు ఆ వ్యక్తిని ఆహ్వానిస్తూ సంభాషణను ముగించవచ్చు. చర్చించిన అంశాన్ని గురించి మరింత మాట్లాడటానికి వాళ్ళ ఇంటికి రావచ్చేమో కూడా అడగండి. టెలిఫోన్లో సాహిత్యాల్ని ప్రభావవంతంగా ప్రతిపాదించడం కూడా సాధ్యమే. పత్రికా మార్గాన్ని ప్రారంభించే లక్ష్యంతో పత్రికలను ప్రతిపాదించవచ్చు.
19 టెలిఫోన్ సాక్ష్యమివ్వడంలోని ఆనందంలో భాగంవహించండి: ఎవరెవరికి ఫోన్ చేస్తామో వాళ్ళందరూ బైబిలు పఠనానికి అంగీకరిస్తారా? అందరూ కాదు, కొంతమంది అంగీకరించవచ్చు. ఉదాహరణకు, ఒక సహోదరి ఒక నెలలో 300 కంటే ఎక్కువ మందికి ఫోన్ చేసింది. తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత ఆమె, ప్రతి ఇంటికి వెళ్ళే బదులు తను ఎందుకు ఫోన్ చేస్తుందో వివరించి చెప్తుంది. అప్పుడు ఆమె క్లుప్తంగా సందేశాన్ని తెలియజేస్తుంది. 12 మంది అనుకూలంగా ప్రతిస్పందించారు. ఆసక్తిగల ముగ్గురిని ఆమె ఇప్పటికీ ఫోన్ ద్వారా సంప్రదిస్తుంది, నలుగురు ఆమెను తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు.
20 సాక్ష్యపు పనిని “భూదిగంతముల వరకు” విస్తరింపజేయమని యేసుక్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (అపొ. 1:8) కొన్ని ప్రాంతాల్లో ఈ ఆజ్ఞను పాటించడం అంటే ఫోన్ ద్వారా సాక్ష్యమివ్వడమే. పై విషయాన్ని పరిశీలించిన తర్వాత మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నా సంఘ ప్రాంతంలో ఉన్న, మునుపెన్నడూ చేరుకోలేని ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో సహా “మనుష్యులందరికీ” సువార్త ప్రకటించడానికి నేను ఇంకా ఎక్కువగా చేయగలనా?’ ఈ సలహాలను పాటించిన సహోదరులు ఫలితాలను బట్టి ఎంతో ప్రోత్సహించబడ్డారు. వారు తమ ‘పరిచర్యను ఘనపరచేందుకు’ టెలిఫోన్ సాక్ష్యం చాలా అసాధారణమైన మార్గమని కనుగొన్నారు. (రోమా. 11:14) టెలిఫోన్ సాక్ష్యం ద్వారా మీరు కూడా అలాంటి ఆనందాన్నే పొందాలి.