మీరు క్రీస్తు ప్రేమకు ప్రతిస్పందిస్తున్నారా?
1 తన యజమానుని జీవిత గమనాన్ని గురించి ఆలోచిస్తూ అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “యేసు . . . లోకములోనున్న తనవారిని ప్రేమించి, వారిని అంతమువరకు ప్రేమించెను.” (యోహా. 13:1) ఈ జ్ఞాపకార్థదిన కాలంలో మన ఆలోచనలు క్రీస్తు ప్రేమ యొక్క అతి గొప్ప వ్యక్తీకరణ వైపుకి మరలుతాయి. విమోచన క్రయధనం పట్ల విశ్వాసముంచడం ద్వారా, అత్యంతాసక్తితో ప్రకటనాపనిలో భాగం వహించడం ద్వారా, యేసు వలే ‘అంతము వరకు సహించడం’ ద్వారా మనం ఆ ప్రేమకు ప్రతిస్పందించవచ్చు.—మత్త. 24:13; 28:19, 20; యోహా. 3:16.
2 క్రీస్తు ప్రేమకు ప్రతిస్పందించడం: తన భూ జీవిత చివరి వారంలో యేసు ఎంతో క్రియాశీలంగా ఉన్నాడు. (మత్త. 21:23; 23:1; 24:3) క్రీస్తు అనుచరులముగా మనం కూడా యెహోవా సేవలో ‘తీవ్ర ప్రయత్నం చేయడానికి’ ప్రేమ మనలను కదిలిస్తుంది. (లూకా 13:24, NW) మీరు పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా, ఏప్రిల్ నెలలో అదనంగా సాక్ష్యమిచ్చేందుకు చేయబడిన ఏర్పాట్ల నుండి మీరు ప్రయోజనం పొందగలరా?
3 ఈ సంవత్సరం ప్రభురాత్రి భోజనం ఏప్రిల్ 19 బుధవారం సాయంత్రం వచ్చింది. ఈ ప్రాముఖ్యమైన సంఘటనకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? చాలా మేరకు అది మనపైనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎవరెవరిని ఆహ్వానించాలనుకుంటున్నారో వారి, అంటే మీ బైబిలు విద్యార్థుల, ఇతర ఆసక్తిగల వారి, బంధువుల, పరిచయస్థులైన వ్యాపారుల, తోటి విద్యార్థుల పేర్లున్న లిస్ట్‌ను తయారుచేశారా? మీరు వారిని కలిసి, వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని అందజేశారా? జ్ఞాపకార్థ దినానికి కాస్త ముందు మళ్ళీ వారికి గుర్తు చేస్తారా? అక్కడికి రావడానికి వాళ్ళకు మీ సహాయం అవసరమా? పరిచర్యలో నిష్క్రియులుగా తయారైన వారిని కూడా పెద్దలు ఆహ్వానిస్తారు. జ్ఞాపకార్థ దినం వారాంతాల్లో కాక పనిచేసే దినాల్లో వస్తుందన్న వాస్తవం, అందరూ హాజరవ్వవలసిన ప్రాముఖ్యతనేమీ తగ్గించదు.
4 సిద్ధపడి రండి: మనం జ్ఞాపకార్థ దినానికి హాజరయ్యేటప్పుడు సిద్ధపడి ఉండి, సరైన మానసిక దృక్పథం కలిగి ఉండటం ప్రాముఖ్యం. ఆ సందర్భపు ఔన్నత్యాన్ని మనస్సులో ఉంచుకోవాలని పౌలు తన తోటి విశ్వాసులను పురికొల్పాడు. (1 కొరిం. 11:20-26) మీ కుటుంబ బైబిలు పఠన సమయంలో యోహాను సువార్త 13-17 అధ్యాయాలను చదివి ప్రతి కుటుంబ సభ్యుడు, యేసు అర్పించిన బలి తనకు ఎలాంటి అర్థాన్ని కలిగివుందో చెప్పాలి. అలాగే జ్ఞాపకార్థదిన వారంలో చదవడానికి కేటాయించబడిన బైబిలు లేఖనాలను ప్రతిరోజు చదవడం మర్చిపోవద్దు!
5 మనకు క్రీస్తుపై ఉన్న ప్రగాఢమైన ప్రేమ ఏప్రిల్ 19 తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఆయన పట్ల మనకున్న ప్రేమను నిరంతరం ప్రదర్శించడానికి మనం నిశ్చయించుకున్నాము! ఈ సంవత్సరపు జ్ఞాపకార్థదిన ఆచరణ ఆ నిశ్చయాన్ని బలపరచుకునేందుకు సహాయం చేస్తుంది.