మనం సువార్తను ప్రకటిస్తాము
1 “ఉత్తమమైనవాటిని గూర్చిన సువార్త”ను ప్రకటించే వారిగా మనకెంత అద్భుతమైన ఆధిక్యత ఉందో గదా! (రోమా. 10:15) నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు చెప్పటానికి మన దగ్గర సేదదీర్పునిచ్చే సమాచారం ఉంది. మనం ప్రకటిస్తున్నది “సువర్తమానము” అని ఇతరులు గుర్తించేలా మనం వారికెలా సహాయపడగలము?—యెష. 52:7.
2 అనుకూల సందేశాన్ని సిద్ధంచేసుకోండి: పరిచర్యలో మన సంభాషణలు మంచి ప్రభావాన్ని చూపాలంటే మనం ఉత్తమమైనవాటిపై దృష్టి నిలపాలి. కాబట్టి, మన అందింపులను సిద్ధం చేసుకునేటప్పుడు, మనం అందించబోయే ప్రచురణలను పునఃపరిశీలించుకునేటప్పుడు, మనం సందేశంలోని అనుకూల కోణాల్ని ఉన్నతపర్చాల్సిన అవసరం ఉంది. మన బైబిలు ఆధారిత నిరీక్షణను నమ్మకంతోను, ఉత్సాహంతోను అందించినప్పుడు, ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తాయని మనం ఎదురు చూడవచ్చు.—సామె. 25:11.
3 దిగజారిపోతున్న లోక పరిస్థితులవల్ల తాము పడే బాధలను వాళ్లు వ్యక్తం చేసినప్పుడు మనం సానుభూతి చూపినప్పటికీ, మానవుల సమస్యలకు నిజమైన పరిష్కారం దేవుని రాజ్యమేనని వారికి చూపించాలి. రానున్న యెహోవా “ప్రతిదండన దినమును” చర్చిస్తున్నప్పుడు కూడా ఇది ఎలా నిజంగా “దీనులకు సువర్తమానము” అయ్యుందో మనం వారికి చూపించాలనుకుంటాము. (యెష. 61:1, 2) యెహోవా చేసే ప్రతీదీ తుదకు మనకు గొప్ప ఆనందాన్ని, మంచి ఫలితాన్ని తెస్తుందని మనం మన శ్రోతలకు హామీ ఇవ్వవచ్చు.
4 నిజమైన ఆనందంతో సత్యాన్ని అందించండి: మన ముఖంలో ఆనందాన్ని మన స్వరంలో నమ్మకాన్ని గమనించినప్పుడు ప్రజలు వినటానికి ఎక్కువ సుముఖత చూపిస్తారు. మనం ఆశావాద దృక్పథాన్ని చూపిస్తే, మనం ‘నిరీక్షణను బట్టి సంతోషిస్తున్నామని’ మన శ్రోతలు గ్రహిస్తారు. (రోమా. 12:12) ఆ విధంగా, వారు సువార్తకు స్పందించటానికి మరింత ఇష్టపడవచ్చు. నిశ్చయంగా, మన పరిచర్యలోని ప్రతి అంశంలోను మనం అనుకూలమైన, ఆనందభరితమైన దృక్పథాన్ని ఎల్లప్పుడూ ప్రదర్శించటానికి మనకు మంచి కారణం ఉంది.
5 సువార్త పరిచారకులముగా మనం కేవలం సందేశాన్ని అందించటంకంటే ఎక్కువే చేస్తాము. మన ప్రకటనాపని ఇప్పుడూ అలాగే భవిష్యత్తులోనూ శ్రేష్ఠమైన జీవితాన్ని గూర్చిన నిశ్చయమైన నిరీక్షణను మనకు ఇస్తుంది. (1 తిమో. 4:8) మనం ప్రతి ఒక్కరిని కలుస్తుండగా, మన అనుకూల మనోదృక్పథం, మనం చెప్పేదానిపై ప్రతిఫలించి, సువార్తను అంగీకరించేలా ప్రజలకు సహాయం చేస్తుంది. మనం చెప్పే విషయంపై, చెప్పే విధానంపై లక్ష్యం ఉంచుతూ, మనం ప్రకటించే ఉత్తేజకరమైన సువార్తను హత్తుకునేలా యథార్థహృదయులైన వారిని మనం ప్రేరేపించుదాము!