కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/00 పేజీలు 3-6
  • సంపూర్ణ నిశ్చయతతో సువార్తను ప్రకటించటం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంపూర్ణ నిశ్చయతతో సువార్తను ప్రకటించటం
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిశ్చయతతో చెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సువార్తనందించుట—వ్యక్తిగత నిశ్చయతతో
    మన రాజ్య పరిచర్య—1990
  • సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • తల్లిదండ్రులారా​​—⁠“రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించుకునేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 2/00 పేజీలు 3-6

సంపూర్ణ నిశ్చయతతో సువార్తను ప్రకటించటం

1 రాజ్య సువార్తను ప్రకటించి, “సమస్త జనులను శిష్యులనుగా చేయు”మని యేసుక్రీస్తు మొదటి శతాబ్దం తొలి భాగంలో తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 24:14; 28:19, 20) యెహోవాసాక్షులు ఆయనిచ్చిన ఉపదేశాన్ని గంభీరంగా తీసుకున్నారు, కాబట్టి 20వ శతాబ్దం ముగింపుకల్లా మన క్రైస్తవ సహోదరత్వం 234 దేశాల్లో, 59,00,000 కంటే ఎక్కువమంది శిష్యులతో ఎంతో అభివృద్ధి సాధించింది. మన పరలోక తండ్రికి ఇది ఎంత గొప్ప స్తుతి!

2 ఇప్పుడు మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించాము. రాజ్య ప్రకటన, శిష్యులను తయారు చేయడం అనే మన ప్రాముఖ్యమైన పనుల్లో జోక్యం చేసుకోవాలని మన విరోధి కుయుక్తితో ప్రయత్నిస్తాడు. అనవసరమైన అనేకానేక చింతలూ చికాకులతో మన అవధానాన్ని మళ్లించడానికీ, మన సమయాన్ని తినివేయడానికీ, మన శక్తిని హరించివేయడానికీ అతడు ఈ విధానపు ఒత్తిళ్లను ఉపయోగిస్తున్నాడు. జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదనేదాన్ని ఈ విధానం నిర్దేశించేందుకు అనుమతించే బదులు, అత్యంత ప్రాముఖ్యమైనది యెహోవా చిత్తాన్ని చేయడమేనని మనం దేవుని వాక్యం నుండి మనకు మనం నిరూపించుకుంటాము. (రోమా. 12:2) అంటే దాని భావం, ‘సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించమనీ, పరిచర్యను సంపూర్ణముగా జరిగించమనీ’ ఇవ్వబడిన లేఖనాధార ఉద్బోధకు విధేయులమవ్వడమే.—2 తిమో. 4:2, 5.

3 సంపూర్ణ నిశ్చయాన్ని పెంపొందించుకోండి: క్రైస్తవులు ‘సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలసిన’ అవసరం ఉంది. (కొలొ. 4:12) “నిశ్చయం” అనే పదం, “దృఢ విశ్వాసం లేక నమ్మకం; ఒప్పించబడిన స్థితి” అని నిర్వచించబడుతుంది. దేవుని ప్రవచనార్థక వాక్యం నిశ్చయమైనదనీ, మనమిప్పుడు అంతము అంచున ఉన్నామనీ క్రైస్తవులముగా మనం నిశ్చయతను కల్గివుండాలి. సువార్త, ‘నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియై ఉందని’ చెప్పిన అపొస్తలుడైన పౌలుకున్నంత దృఢ నమ్మకం మనకుండాలి.—రోమా. 1:16.

4 అపవాది ఇతరులను ప్రభావితం చేయడానికీ, మోసపుచ్చడానికీ, తామే మోసపోయి ఉన్న దుర్జనులను వంచకులను ఉపయోగిస్తాడు. (2 తిమో. 3:13) దీని గురించి మనం ముందే హెచ్చరించబడ్డాము గనుక, మన వద్ద సత్యం ఉందన్న మన నిశ్చయతను బలపర్చుకోవడానికి చర్యలు తీసుకుంటాము. జీవిత చింతలు మన ఆసక్తిని అణచివేసేందుకు అనుమతించే బదులు, మనం రాజ్యాసక్తులకు మొదటి స్థానం ఇస్తాము. (మత్త. 6:33, 34) ఈ విధానాంతం ఎక్కడో దూరంలో ఉందిలే అని బహుశ మనం అనుకుంటూ మన కాలాలకున్న అత్యవసర భావాన్ని అలక్ష్యం చేయాలని అనుకోము. అది అంతకంతకూ ఆసన్నమౌతూ ఉంది. (1 పేతు. 4:7) ఇప్పటికే ఇవ్వబడిన సాక్ష్యం దృష్ట్యా, సువార్త వ్యాప్తి చేయడం కొన్ని దేశాల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపించడం లేదని మనం భావించినప్పటికీ హెచ్చరించే పని కొనసాగాలి.—యెహె. 33:7-9.

5 ‘శిష్యులను చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞను నేను గంభీరంగా తీసుకుంటున్నానా? నేను సువార్త ప్రకటించేటప్పుడు, రాజ్యం వాస్తవమైనదన్న సంపూర్ణ నిశ్చయతను కనుపరుస్తున్నానా? జీవాన్ని రక్షించే ఈ పరిచర్యలో వీలైనంత ఎక్కువ భాగాన్ని చేయడానికి నేను నిశ్చయం చేసుకున్నానా?’ అన్నవి ఈ అంతిమ గడియల్లో కీలకమైన ప్రశ్నలు. అంత్య కాలానికి ఎంత చివరన మనమున్నామన్నది గ్రహిస్తూ, మనకు మనమూ, అలాగే ప్రకటించమనీ బోధించమనీ మనకివ్వబడిన ఆజ్ఞకూ అవధానం ఇవ్వాలి. అలా చేయడం ద్వారా మనల్ని మనం రక్షించుకోగలం, మనం చెప్పేది వినేవారినీ రక్షించగలము. (1 తిమో. 4:16) పరిచారకులముగా మనమందరం మన నిశ్చయతను ఎలా దృఢపర్చుకోగలం?

6 థెస్సలొనీకయులను అనుకరించండి: థెస్సలొనీకలోని సహోదరుల కృషిని జ్ఞాపకం చేస్తూ అపొస్తలుడైన పౌలు వారితో ఇలా చెప్పాడు: “మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. మీ నిమిత్తము మేము మీ యెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.” (ఇటాలిక్కులు మావి.) (1 థెస్స. 1:4-6) అవును, పౌలు థెస్సలొనీకయుల సంఘాన్ని మెచ్చుకున్నాడు, ఎందుకంటే ఎంతో శ్రమననుభవిస్తున్నప్పటికీ వాళ్లు అత్యంతాసక్తితోనూ, సంపూర్ణ నిశ్చయతతోనూ ప్రకటించారు. అలా చేయడానికి వారికేది తోడ్పడింది? చాలా మేరకు, అపొస్తలుడైన పౌలులోనూ, ఆయన తోటి పనివారిలోనూ వారికి కనిపించిన అత్యంతాసక్తీ, సంపూర్ణ నిశ్చయతా వారిపై అనుకూలమైన ప్రభావాన్ని చూపించాయి. ఎలా?

7 పౌలు జీవితం, ఆయన ప్రయాణ సహవాసుల జీవితాలు, వారిపై దేవుని ఆత్మ ఉందనీ, వారు తాము ప్రకటిస్తున్నదాన్ని హృదయపూర్వకంగా నమ్మారనీ ధృవీకరించాయి. థెస్సలొనీకకు రాకముందు, ఫిలిప్పీలో, పౌలు సీలలతో అవమానకరమైన విధంగా వ్యవహరించడం జరిగింది. వాళ్లను విచారణ చేయకుండానే కొట్టి, చెరసాలలో వేసి, బొండవేసి బిగించారు. అయితే ఈ దుర్భరమైన అనుభవం, సువార్త పట్ల వారికున్న ఆసక్తిని నీరుగార్చలేదు. దైవిక జోక్యం మూలంగా వాళ్లు విడుదల కావడం, చెరసాల నాయకుడూ ఆయన కుటుంబమూ మారడానికి దోహదపడి, ఈ సహోదరులు తమ పరిచర్యలో కొనసాగడానికి మార్గాన్ని సుగమం చేసింది.—అపొ. 16:19-34.

8 దేవుని ఆత్మ శక్తితో, పౌలు థెస్సలొనీకకు వచ్చాడు. అక్కడాయన తన స్వంత అవసరాల నిమిత్తం పని చేశాడు, థెస్సలొనీకయులకు సత్యాన్ని బోధించడంలో తనను తాను పూర్తిగా వెచ్చించుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ సువార్త ప్రకటించడానికి ఆయన వెనుక తీయలేదు. (1 థెస్స. 2:9) సంపూర్ణ నిశ్చయతతో పౌలు చేసిన ప్రకటనాపని స్థానిక ప్రజలపై ఎంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపిందంటే, వాళ్లు తాము గతంలో చేసిన విగ్రహారాధనను విడిచిపెట్టి సత్య దేవుడైన యెహోవా సేవకులయ్యారు.—1 థెస్స. 1:8-10.

9 హింస, క్రొత్తగా విశ్వసిస్తున్నవారు సువార్తను ప్రకటించకుండా ఆపలేకపోయింది. థెస్సలొనీకయులు తాము క్రొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని బట్టి ప్రేరేపించబడి, తమకు నిత్య ఆశీర్వాదాలు లభిస్తాయని సంపూర్ణ నిశ్చయత కల్గి, తాము ఉత్సాహంగా హత్తుకున్న సత్యాన్ని ప్రకటించడానికి పురికొల్పబడ్డారు. ఆ సంఘం ఎంత చురుగ్గా తయారైందంటే, వారి విశ్వాస ఆసక్తులను గురించిన వార్త మాసిదోనియలోని ఇతర భాగాలకూ, చివరికి అకయలోకి వ్యాపించింది. కాబట్టి, పౌలు థెస్సలొనీకయులకు తన మొదటి పత్రికను వ్రాసే సమయానికి, వారి మంచి కార్యాలు అప్పటికే బాగా పేరుపొందాయి. (1 థెస్స. 1:7) ఎంత చక్కని మాదిరి!

10 దేవునిపట్ల, ప్రజలపట్ల ప్రేమచే పురికొల్పబడ్డారు: థెస్సలొనీకయుల వలే మనం నేడు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సంపూర్ణ వ్యక్తిగత నిశ్చయతను ఎలా కాపాడుకోగలము? వారి గురించి పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును . . . మానక జ్ఞాపకము చేసికొనుచు[న్నాము].” (ఇటాలిక్కులు మావి.) (1 థెస్స. 1:2-3) వారికి యెహోవా దేవుని పట్ల, తాము ఎవరికైతే ప్రకటిస్తున్నారో వారి పట్ల ప్రగాఢమైన, హృదయపూర్వకమైన ప్రేమ ఉందన్నది స్పష్టమౌతుంది. అదే ప్రేమ పౌలు, ఆయన సహవాసులు థెస్సలొనీకయుల కోసం “దేవుని సువార్తను మాత్రము గాక [తమ] ప్రాణములనుకూడ” ఇవ్వడానికి వారిని పురికొల్పింది.—1 థెస్స. 2:8.

11 అదే విధంగా, యెహోవాపట్ల మన తోటివారిపట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమ, దేవుడు మనకు చేయమని ఇచ్చిన పనియైన ప్రకటనా పనిలో సంపూర్ణంగా పాల్గొనేలా పురికొల్పుతుంది. అలాంటి ప్రేమతో, సువార్తను వ్యాప్తి చేయడం మన వ్యక్తిగతమైన, దేవుడిచ్చిన బాధ్యత అని మనం గుర్తిస్తాము. “వాస్తవమైన జీవము” వైపు మనల్ని నడిపించడానికి యెహోవా చేసిన దానంతటి గురించి అనుకూల దృక్పథంతోనూ, మెప్పుదలతోనూ ధ్యానించడం ద్వారా, మనం హృదయపూర్వకంగా నమ్మే అద్భుతమైన అవే సత్యాలను ఇతరులకు చెప్పడానికి మనం పురికొల్పబడతాము.—1 తిమో. 6:18-19.

12 మనం ప్రకటనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, యెహోవాపట్ల ప్రజలపట్ల మనకున్న ప్రేమ అధికమౌతూ ఉండాలి. అలా అయితే, ఇంటింటి పరిచర్యలో మన వంతును తీవ్రతరం చేసి, సాక్ష్యమిచ్చేందుకు మనకు అందుబాటులో ఉన్న ఇతర మార్గాలన్నింటినీ చేపట్టేందుకు మనం ప్రేరణ పొందుతాము. బంధువులకు, పొరుగువారికి, పరిచయస్తులకు అనియతంగా సాక్ష్యమివ్వడానికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటాము. మనం అందజేసే సువార్తను చాలామంది ప్రజలు నిరాకరించినప్పటికీ, రాజ్య ప్రకటనాపనికి అంతరాయం కల్గించడానికి కొందరు ప్రయత్నించినప్పటికీ, మనం అంతరంగ ఆనందాన్ని అనుభవిస్తాము. ఎందుకు? ఎందుకంటే రాజ్యం గురించి సాక్ష్యమివ్వడానికీ, ప్రజలు రక్షణ పొందేలా సహాయం చేయడానికీ మనం చేయగల్గినదంతా చేశామని మనకు తెలుసు గనుక. యథార్థహృదయులను కనుగొనడానికి మనం చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడు. జీవిత ఒత్తిళ్లు మనల్ని ఆవరించి, సాతాను మన ఆనందాన్ని పీల్చివేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా, మన సంపూర్ణ నిశ్చయతనూ ఇతరులకు సాక్ష్యమివ్వడంలో మనకున్న ఆసక్తినీ మనం కాపాడుకోగల్గుతున్నాము. మనమందరం మన వంతు మనం చేసినప్పుడు, థెస్సలొనీకలోని సంఘంలాంటి దృఢమైన, అత్యాసక్తితో నిండివున్న సంఘాలు రూపొందుతాయి.

13 శ్రమల సమయంలో ఎన్నడూ విడిచిపెట్టకండి: మనం వివిధ శ్రమలను ఎదుర్కున్నప్పుడు కూడా నిశ్చయత అవసరం. (1 పేతు. 1:6, 7) తనను అనుసరిస్తే, “సకల జనములచేత ద్వేషింప” బడతారని యేసు తన శిష్యులకు స్పష్టం చేశాడు. (మత్త. 24:9) ఫిలిప్పీలో ఉన్నప్పుడు పౌలు సీల దాన్ని అనుభవించారు. పౌలు సీలలను లోపలి చెరసాలలో వేసి, బొండవేసి బిగించారని అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలోని వృత్తాంతం తెలియజేస్తుంది. సాధారణంగా, ప్రధాన చెరసాల ఒక విధమైన వసారాలా లేక నడవాలా ఉండేది, దాని చుట్టూ గదులు ఉండేవి, వాటిలోకి గాలి వెలుతురు ప్రవేశించగలిగేవి. అయితే లోపలి చెరసాలలోకి వెలుతురు ప్రసరించదు, గాలి ప్రసరణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పౌలు సీల ఆ దుర్భరమైన నిర్బంధ స్థలంలోని అంధకారాన్నీ, వేడిని, దుర్వాసనను భరించాలి. కొరడా దెబ్బల మూలంగా గాయాలై రక్తం స్రవిస్తున్న తమ వీపులతో గంటల తరబడి అలా బొండవేసి బంధించబడి ఉండగా వాళ్లనుభవించిన వేదనను మీరు ఊహించగలరా?

14 ఈ శ్రమలు ఉన్నప్పటికీ, పౌలు సీల నమ్మకంగా ఉన్నారు. వాళ్లు హృదయపూర్వకమైన నిశ్చయతను ప్రదర్శించారు, అది శ్రమలున్నప్పటికీ యెహోవా సేవ చేయడానికి వారిని బలపర్చింది. వాళ్ల నిశ్చయత 16వ అధ్యాయం, 25వ వచనంలో ఉన్నతపర్చబడింది, పౌలు సీల “దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి” అని ఆ వచనం చెప్తుంది. వాస్తవానికి, వాళ్లు లోపలి చెరసాలలో ఉన్నప్పటికీ, తమపై దేవుని ఆమోదం ఉందని ఎంత నిశ్చయతతో ఉన్నారంటే, వీరు ఇతర ఖైదీలకు వినిపించేంత బిగ్గరగా కీర్తనలు పాడారు! మన విశ్వాస విషయంలో అలాంటి పరీక్షలనే ఎదుర్కుంటున్నప్పుడు నేడు మనకూ అలాంటి నిశ్చయతే ఉండాలి.

15 అపవాది మనపైకి తెచ్చే శ్రమలు ఎన్నో. కొందరి విషయంలో అది కుటుంబం నుండి వచ్చే హింస కావచ్చు. మన సహోదరుల్లో చాలామంది చట్టసంబంధమైన సవాళ్లను ఎదుర్కుంటుంటారు. మతభ్రష్టుల నుండి వ్యతిరేకత రావచ్చు. ఆర్థిక సమస్యలు, జీవనాధారాన్ని గురించిన చింతలు ఉన్నాయి. యౌవనస్థులు పాఠశాలలో తోటివారి ఒత్తిడిని ఎదుర్కుంటారు. మనం ఈ శ్రమలను విజయవంతంగా ఎలా ఎదుర్కోగలం? నిశ్చయతను చూపించడానికి ఏమి అవసరం?

16 మొదటిగా, అతి ప్రాముఖ్యంగా, మనం యెహోవాతో సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది. పౌలు సీల లోపలి చెరసాలలో ఉన్నప్పుడు, వాళ్లు ఆ సమయాన్ని, జీవితంలో తమ స్థితిని గురించి ఫిర్యాదు చేయడానికో లేక తమ గురించి తాము బాధపడుతూ ఉండడానికో ఉపయోగించలేదు. వాళ్లు వెంటనే దేవునికి ప్రార్థన చేసి, కీర్తనలతో ఆయనను స్తుతించారు. ఎందుకు? ఎందుకంటే వాళ్లకు తమ పరలోక తండ్రితో సన్నిహితమైన వ్యక్తిగత సంబంధం ఉంది. తాము నీతి కోసం హింసించబడుతున్నామనీ, తమ రక్షణ యెహోవా హస్తాల్లో ఉందనీ వాళ్లు గుర్తించారు.—కీర్త. 3:8.

17 నేడు మనం శ్రమలనెదుర్కున్నప్పుడు, మనం కూడా యెహోవా వైపు చూడాలి. క్రైస్తవులముగా మనం ‘మన విన్నపములు దేవునికి తెలియజేయాలని’ పౌలు ప్రోత్సహిస్తున్నాడు, ‘అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది.’ (ఫిలి. 4:6, 7) శ్రమల సమయంలో యెహోవా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడని తెలుసుకోవడం ఎంత ఓదార్పునిస్తుంది! (యెష. 41:9-10) మనం నిజమైన నిశ్చయతతో ఆయన సేవ చేసినంత వరకూ ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు.—కీర్త. 46:7.

18 నిశ్చయతను ప్రదర్శించడంలో మరో ప్రాముఖ్యమైన సహాయకం యెహోవా సేవలో నిమగ్నమై ఉండటం. (1 కొరిం. 15:58) పౌలు సీల సువార్త ప్రకటించడంలో నిమగ్నమై ఉన్నందుకు చెరసాలలో వేయబడ్డారు. వాళ్లు తమకు కల్గిన శ్రమల మూలంగా ప్రకటించడం మానేశారా? లేదు, చెరసాలలో ఉన్నప్పుడు కూడా వాళ్లు ప్రకటించడం కొనసాగించారు, వాళ్లు విడుదల చేయబడిన తర్వాత, థెస్సలొనీకకు ప్రయాణించి, యూదుల సమాజమందిరానికి వెళ్లి ‘లేఖనములలో నుండి వారితో తర్కించుచుండిరి.’ (అపొ. 17:1-3) మనకు యెహోవాపై దృఢ విశ్వాసం లేక నమ్మకం ఉన్నప్పుడు, సత్యం మన వద్ద ఉందని మనం ఒప్పించబడినప్పుడు, ఏదీ కూడా “ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేర[దు].”—రోమా. 8:35-39.

19 సంపూర్ణ నిశ్చయత విషయంలో ఆధునిక మాదిరులు: పౌలు సీల వలే తమ సంపూర్ణ నిశ్చయతను ప్రదర్శించిన విశేషమైన మాదిరులు మన దినాల్లో అనేకం ఉన్నాయి. ఆష్విట్స్‌ కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపు నుండి చివరికి సజీవంగా బయటికి వచ్చిన ఒక సహోదరి, అక్కడి సహోదర సహోదరీలకున్న అచంచలమైన విశ్వాస నిశ్చయతల గురించి చెప్తుంది. ఆమె ఇలా తెలియజేస్తుంది: “ఒకసారి ఒక విచారణ సమయంలో, ఒక అధికారి తన పిడికిళ్లు బిగించి నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ‘మేమేం చెయ్యాలి మిమ్మల్ని? అరెస్టు చేస్తే లెక్కచేయరు. జైలుకు పంపిస్తే అసలే లెక్కచేయరు. కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపుకి పంపిస్తే, ఇంతకూడా చింతించరు. మరణశిక్ష విధిస్తే లెక్కలేదన్నట్లు నిలుచుంటారు. మేమేం చెయ్యాలి మిమ్మల్ని?’” అలాంటి కఠినమైన పరిస్థితులలో మన సహోదరులు కనపర్చిన విశ్వాసాన్ని చూడటం మన విశ్వాసాన్ని ఎంతగా బలపరుస్తుందో కదా! సహించడానికి సహాయం కోసం వాళ్లు సదా యెహోవా వైపు చూసేవారు.

20 ఇటీవలి సంవత్సరాల్లో తలెత్తిన జాతి విద్వేషాల సమయంలో మన సహోదరుల్లో అనేకులు కనబర్చిన నిశ్చయత కచ్చితంగా మనకందరికీ జ్ఞాపకం ఉంది. వాళ్లు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, బాధ్యతగల సహోదరులు తమ తోటి సహోదర సహోదరీలు ఆధ్యాత్మికంగా పోషించబడేలా చూడాలన్న అభిప్రాయం కల్గివున్నారు. ‘తమకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదన్న’ సంపూర్ణ నిశ్చయతతో అందరూ నమ్మకంగా కొనసాగుతున్నారు.—యెష. 54:17.

21 అవిశ్వాసులైన భర్తలూ భార్యలూ ఉన్న మన సహోదర సహోదరీలు అనేకమంది కూడా దృఢ విశ్వాసాన్ని, సహనాన్ని కనబరుస్తున్నారు. గ్వాడలోప్‌లో ఒక సహోదరుడు అవిశ్వాసియైన తన భార్య నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కున్నాడు. ఆయనను నిరుత్సాహపర్చాలనీ, ఆయన క్రైస్తవ కూటాలకు వెళ్లకుండా ఆటంకపర్చాలనీ ఆమె ఆయన కోసం వంట చేసేది కాదు, ఆయన బట్టలు ఉతికి పెట్టేదీ కాదు కుట్టేదీ కాదు. చాలా రోజులపాటు ఆయనతో మాట్లాడేది కాదు. కానీ యెహోవా సేవ చేయడంలో హృదయపూర్వక నిశ్చయతను ప్రదర్శించడం ద్వారా, సహాయం కోసం ఆయనకు ప్రార్థించడం ద్వారా, ఈ సహోదరుడు అదంతా సహించగలిగాడు. ఎంత కాలంపాటు? దాదాపు 20 సంవత్సరాలపాటు—ఆ తర్వాత ఆయన భార్యలో నెమ్మదిగా మార్పు వచ్చింది. చివరికి, ఆయన నిజంగా ఆనందించగలిగాడు ఎందుకంటే ఆమె దేవుని రాజ్య నిరీక్షణను స్వీకరించింది.

22 చివరిగా, ప్రతిరోజు స్కూళ్ళలో తోటివారి ఒత్తిడిని, ఇతర సవాళ్లను ఎదుర్కునే యౌవనులైన సహోదర సహోదరీల సంపూర్ణ నిశ్చయతను కూడా మనం మరిచిపోకూడదు. తమకు అనుగుణంగా మారమని పాఠశాలలో వచ్చే ఒత్తిడి గురించి యౌవనస్థురాలైన ఒక సాక్షి ఇలా చెప్తుంది: “స్కూల్లో ఉన్నప్పుడు, కాస్తంత తిరుగుబాటు చేయమని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తారు. తిరుగుబాటు అని చెప్పగల దేన్నైనా చేసినప్పుడు మిగతా పిల్లలు ఎక్కువ గౌరవిస్తారు.” మన యౌవనస్థులు ఎంత ఒత్తిడిని ఎదుర్కుంటారో కదా! శోధనను ఎదిరించాలని వారు తమ మనస్సులోనూ, హృదయంలోనూ దృఢంగా నిశ్చయించుకోవాలి.

23 శ్రమలున్నప్పటికీ మన యౌవనస్థులు అనేకమంది తమ యథార్థతను చక్కగా కాపాడుకుంటున్నారు. ఫ్రాన్స్‌లో నివసించే ఒక సహోదరి మాదిరి అటువంటిదే. ఒకరోజు, మధ్యాహ్నం భోజనమైన తర్వాత, కొంతమంది అబ్బాయిలు తమకు ముద్దుపెట్టమని ఆమెను బలవంతం చేశారు, కానీ ఆమె ప్రార్థన చేసుకుని స్థిరంగా నిరాకరించింది, దానితో ఆ అబ్బాయిలు ఆమెను విడిచి వెళ్లిపోయారు. తర్వాత, వారిలో ఒకరు వెనక్కి వచ్చి, ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానని చెప్పాడు. ఆమె అతనికి రాజ్యం గురించి చక్కని సాక్ష్యం ఇవ్వగలిగింది, రాజ్య ఆశీర్వాదాల్లో భాగం వహించాలని కోరుకునే వారందరికీ యెహోవా ఉన్నతమైన ప్రమాణాలను ఉంచుతాడని వివరించింది. ఆ విద్యా సంవత్సరంలో, ఆమె తన నమ్మకాలను మొత్తం తరగతి అంతటికీ వివరించింది.

24 తన చిత్తాన్ని గురించి సంపూర్ణ నిశ్చయతతో మాట్లాడేందుకు యెహోవా ఉపయోగించుకుంటున్న వారిలో ఒకరిగా లెక్కించబడే ఎంతటి అమూల్యమైన ఆధిక్యత మనకుంది! (కొలొ. 4:12) అంతేగాక, మన విరోధియైన అపవాదియగు సాతాను సింహంలా మనపై దాడి చేసినప్పుడు మన యథార్థతను నిరూపించుకునే గొప్ప అవకాశం మనకుంది. (1 పేతు. 5:8, 9) యెహోవా రాజ్య సువార్తను, దాన్ని ప్రకటించే మనకూ అలాగే దాన్ని వినే వారికీ రక్షణ తీసుకురావడానికి దాన్ని ఉపయోగిస్తున్నాడని ఎన్నడూ మరచిపోకండి. మనం తీసుకునే నిర్ణయాలు, మన అనుదిన జీవన విధానం మనం రాజ్యానికి మొదటి స్థానం ఇస్తున్నామని నిరూపించుగాక. కాబట్టి, సంపూర్ణ నిశ్చయతతో మనం సువార్తను ప్రకటిస్తూ ఉందాము!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి