‘ప్రభువునందు ప్రయాసపడుతున్న స్త్రీలు’
1 రోమా సంఘంలో కష్టపడి పనిచేసే త్రుపైనా, త్రుఫోసా అనే సహోదరీలను పౌలు ఆ పైమాటలతో వర్ణించాడు. పెర్సిసు అనే మరొకరి గురించి ఆయన ఇలా అన్నాడు: “ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను.” అలాగే ఫీబే ‘అనేకులకు సహాయురాలై’ ఉందని ఆయన ప్రశంసాత్మక వ్యాఖ్యానం చేశాడు. (రోమా. 16:2, 12) లేఖనాల్లో, దొర్కా “సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను” అని ప్రత్యేకించి చెప్పబడుతుంది. (అపొ. 9:36) ఆధ్యాత్మిక స్త్రీలు సంఘానికి ఎంతటి ఆశీర్వాదమో గదా!
2 మన సంఘంలో కష్టపడి పనిచేసే సహోదరీలను మనం ప్రశంసిస్తున్నామా? ప్రకటనాపనిలో ఎక్కువ భాగం వారే చేస్తున్నారు, బైబిలు పఠనాల్లో అనేకం వారు నిర్వహిస్తున్నారు, అనేకమంది కొత్తవారికి సహాయం చేస్తున్నారు. పిల్లలు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించటానికి సహాయం చేయడంలో కూడా తగినంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. క్రైస్తవ స్త్రీలు సంఘంలో ప్రేమ, సంతోషం, శాంతి, ఉత్సాహపు స్ఫూర్తిని పెంచటానికి తమవంతు భాగాన్ని చేస్తున్నారు. వారి భర్తలు, ఇతర కుటుంబ సభ్యులు యెహోవా సేవలో మరింత చేయగల్గేలా అనేక విధాల్లో మద్దతునిస్తున్నారు.
3 పూర్తికాల సేవలో సహోదరీలు: ప్రభువునందు ప్రయాసపడుతున్న వారిలో ప్రయాణ పైవిచారణకర్తల భార్యలు కూడా ఉన్నారు, వారిలో అనేకులు తమ నియామకంలో ఉన్న పనిని వృద్ధి చేయడంలో భాగం వహించారు. తమ భర్తలు సేవ చేస్తున్న సంఘాల్లో వారు క్షేత్ర పరిచర్యలో బిజీగా ఉంటూ, అనేకమంది సహోదరీలను ప్రోత్సహిస్తున్నారు. యెహోవా సంస్థకు మద్దతునిస్తూ తమ పవిత్రసేవను ఉత్సాహంగా నిర్వహిస్తున్న బేతేలులోని సహోదరీలను తక్కువ చేయటం లేదు. క్రమ పయినీర్లైన మన సహోదరీలు, దేవుని స్తుతించటంలో తమ నమ్మకమైన కృషి ద్వారా సత్యాన్ని తెలుసుకోవటానికి వేలమందికి సహాయం చేస్తున్నారు.
4 విశ్వాసులైన ఈ స్త్రీలు తమ స్వయంత్యాగ పూరిత జీవిత విధానంలో ఎంతో సంతృప్తిని కల్గివున్నారు. (1 తిమో. 6:6, 8) మనం వారికి ఇవ్వగల ఏ ప్రోత్సాహానికైనా, ఏ ప్రశంసకైనా, మద్దతుకైనా వారు యోగ్యులే.
5 అందరికీ ఆశీర్వాదకరమైనదైన, నమ్మకమైన సేవను చేస్తున్న క్రైస్తవ స్త్రీలు యెహోవా సంస్థకు విలువైన ఆస్తిగా ఉన్నారు. వారు “ప్రభువునందు ప్రయాసపడు”తుండగా వారికి యెహోవా ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తూ, అలాంటి స్త్రీలను మనం ప్రశంసిస్తూ ఉందుము గాక.