ఒక నాస్తికునికి మీరేమని చెప్తారు?
1 “నేను ఒక నాస్తికురాలిని,” అని పోలండ్ నుండి వచ్చిన ఒక ప్రొఫెసర్, ఆఫ్రికాలోని ఒక మిషనరీతో చెప్పారు. అయినప్పటికీ, ఆ సహోదరి ఆమెతో చర్చించగల్గింది, చర్చించిన తర్వాత ఆమెకు జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇచ్చింది. ఆ మిషనరీ తర్వాతి వారం తిరిగి వెళ్ళినప్పుడు ఆ ప్రొఫెసర్ “నేను ఇక మీదట నాస్తికురాలిని కాను!” అని అన్నారు. ఆమె, సృష్టి పుస్తకాన్ని పూర్తిగా చదివేసింది, ఇప్పుడామె బైబిలు పఠనం కోసం అడిగింది. దేవుని మీద నమ్మకంలేదని చెప్పే వారికి సాక్ష్యమివ్వడంలో సఫలీకృతులయ్యేందుకు మీరేమి చేయగలరు? మొదటిగా, ప్రజలు అలా చెప్పుకోవడానికి గల వివిధ కారణాలను గురించి ఆలోచించండి.
2 అవిశ్వాసానికి దోహదపడే కారకాలు: నాస్తికులందరూ నాస్తికులుగా పెరిగిన వాళ్ళేమీ కాదు. చాలామంది ఏదో ఒక మతంలో ఉండినవాళ్ళే. వాళ్ళు ఒకప్పుడు దేవుడ్ని నమ్మినవాళ్ళే. అయితే, వాళ్ళు అనుభవించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, లేదా కుటుంబ సమస్యలు లేదా కొన్ని అన్యాయాలు వారి విశ్వాసాన్ని బలహీనపర్చాయి. మరి కొందరి విషయానికి వస్తే, వాళ్ళు కళాశాలల్లో చేసిన కోర్సులు దేవుని గురించిన వాళ్ళ తలంపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. చివరికి యెహోవా దేవుని మీద బలమైన విశ్వాసాన్ని క్రమంగా పెంపొందించుకొని ఆయనకు సాక్షులుగా మారిన ఈ క్రింద ఇవ్వబడిన ఒకప్పటి నాస్తికుల ఉదాహరణలను గమనించండి.
3 పారిస్‌లోని ఒక స్త్రీ, బలహీనపరచేటువంటి ఎముకల వ్యాధితో పుట్టింది. క్యాథలిక్‌గా బాప్తిస్మం పొందినప్పటికీ, తనను తాను ఒక నాస్తికురాలిగా ప్రకటించుకొంటుంది. తను అశక్తతతో జన్మించేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు అని చర్చిలోని నన్లను ఆమె అడిగితే “ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే” అని వాళ్ళు సమాధానమిచ్చారు. ఆమె, అర్థరహితమైన ఆ తలంపును ఒప్పుకోలేకపోయింది. బాగు చేయలేనటువంటి కండరాల వ్యాధితో వీల్‌చెయిర్‌లో ఉండాల్సివచ్చిన ఫిన్ల్యాండ్లోని ఒక యౌవనస్థుని విషయమే తీసుకోండి. వాళ్ళ అమ్మ ఆయన్ని, వ్యాధిగ్రస్థులను బాగు చేస్తానని చెప్పుకుంటున్న ఒక పెంతెకొస్తు వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్ళింది. కానీ, అద్భుతంగా స్వస్థపడడం ఏమీ జరగలేదు. ఫలితంగా, ఆ యౌవనస్థుడు దేవుని మీది ఆసక్తిని కోల్పోయి, నాస్తికుడయ్యాడు.
4 హూండూరస్లో ఉన్న ఒక మనిషి క్యాథలిక్‌గా పెరిగాడు, కానీ విశ్వవిద్యాలయంలో సోషలిస్ట్ ఫిలాసఫీనీ నాస్తికవాదాన్నీ చదువుకున్నాడు. మానవజాతి పరిణామం వల్ల ఉద్భవించిందన్న విశ్వవిద్యాలయ బోధకు ఒప్పింపబడి, దేవునిపై నమ్మకాన్ని వదులుకున్నాడు. అలాగే, అమెరికాలోని ఒక స్త్రీ మెథడిస్ట్‌గా పెరిగింది. కాలేజీలో మనస్తత్త్వశాస్త్ర క్లాసులకు వెళ్ళింది. ఆమె విశ్వాసం ఎలాంటి ప్రభావానికి గురయ్యింది? “మతంపై నాకున్న కాస్తంత విశ్వాసాన్ని కూడా ఒక వేసవిలో పూర్తిగా నాశనం చేశారు” అని ఆమె అంటోంది.
5 యథార్థవంతుల హృదయాలను చేరుకోవడం: దేవునిపై నమ్మకం లేదని చెప్పే అనారోగ్య పరిస్థితులు, కుటుంబంలో కలహాలు, అన్యాయం లాంటి అనేకమైన సమస్యలకు పరిష్కారం ఉందని తెలుసుకున్నప్పుడు చాలా మంది మెచ్చుకుంటారు. ‘దుష్టాత్మ ఎందుకు ఉనికిలో ఉంది?’ ‘మంచి ప్రజలకు చెడ్డ పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి?’ ‘జీవితం యొక్క అర్థమేమిటి?’ లాంటి ప్రశ్నలకు సమాధానాన్ని కనుగొనేందుకు వాళ్ళు యథార్థమైన ఆసక్తిని చూపిస్తారు.
6 స్విట్జర్లాండులో నివసించే భార్యాభర్తలు ఇరువురూ నాస్తికులుగా పెరిగినవారే. వాళ్ళు సత్యాన్ని మొదటిసారి విన్నప్పుడు వ్యతిరేకంగా ప్రతిస్పందించారు. వాళ్ళకి కుటుంబంలో తీవ్రమైన సమస్యలున్నందువల్ల విడాకులిచ్చుకోవడాన్ని గురించి ఆలోచిస్తున్నారు. ఆ సాక్షులు వారి దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు, వారి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో బైబిలు నుండి వారికి చూపించారు. లేఖనాల్లో ఉన్న ఆ ఆచరణాత్మక సలహాలకు వారిరువురూ విస్మయం చెంది, బైబిలు పఠనానికి ఒప్పుకున్నారు. వాళ్ళ వివాహ అనుబంధం బలపడింది, వాళ్ళు ఆధ్యాత్మికంగా అభివృద్ధిపొంది, చివరికి బాప్తిస్మం తీసుకున్నారు.
7 ఒక నాస్తికునికి మీరు ఏమని చెప్పవచ్చంటే: ఎవరైనా తాను నాస్తికుడినని మీకు చెప్పినప్పుడు, ఆయనలా ఎందుకు చెబుతున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తాను చదివిన చదువుల వల్ల అలా చెప్తున్నాడా, అతననుభవించిన సమస్యల వల్ల అలా చెప్తున్నాడా, లేక తాను చూసిన మతసంబంధ వేషధారణ వల్ల, అబద్ధ బోధలవల్ల అలా చెప్తున్నాడా? “మీరు ఎప్పుడూ ఇలాగే భావించేవారా?” అని గానీ “మీరు ఈ అభిప్రాయానికి రావడానికి కారణమేమిటి?” అని గానీ అతనిని మీరు అడగవచ్చు. అతని సమాధానాన్ని బట్టి మీరు ఏమి చెప్పాలో నిర్ణయించుకోవచ్చు. శక్తివంతమైన వాదాలు అవసరమైనప్పుడు, మీ పట్ల శ్రద్ధ వహించే ఒక సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) అనే పుస్తకం ఇస్తే సరిపోవచ్చు.
8 ఒక నాస్తికునితో సంభాషణను ఈ విధంగా అడగడం ద్వారా కొనసాగించవచ్చు:
◼ “‘దేవుడనేవాడు ఉంటే లోకంలో బాధలు, అన్యాయాలూ ఇంతగా ఎందుకున్నాయి?’ అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ విషయంలో బైబిలు వీక్షణం ఏమిటో మీకు చూపించనా?” యిర్మీయా 10:23 చదవండి. చదివిన తర్వాత ఆ వాక్యాన్ని గురించి ఆయన అభిప్రాయమేమిటో అడగండి. ఆ తర్వాత యుద్ధంలేని లోకం ఎప్పుడైనా ఉంటుందా? (ఆంగ్లం) అన్న బ్రోషూర్‌లో 16, 17 పేజీలు చూపించండి. లేదా సృష్టికర్త పుస్తకంలో 10వ అధ్యాయం చూపించవచ్చు. ఆ ప్రచురణను తీసుకొని అందులో ఉన్న సమాచారాన్ని చదవమని అతనిని ఆహ్వానించండి.—మరిన్ని సూచనల కోసం తర్కించుట (ఆంగ్లం) పుస్తకం 150-1 పేజీలు చూడండి.
9 నాస్తికులందరూ సత్యాన్ని స్వీకరించరన్నది ఒప్పుకోవలసిందే. కానీ మరొక దృక్కోణంలో ఆలోచించడానికి ఇష్టపడే వాళ్ళు అనేకమంది ఉన్నారు. వాళ్ళు సత్యాన్ని గ్రహించేందుకు తర్కాన్నీ, ఒప్పించగల నేర్పునూ, అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యపు శక్తినీ ఉపయోగించండి.—అపొ. 28:23, 24; హెబ్రీ. 4:12.