యెహోవా నిష్పక్షపాతాన్ని అనుకరించండి
1 యెహోవా ప్రజలను పట్టించుకుంటాడు. తన చిత్తం చేసేవారెవరినైనా నిష్పక్షపాతంగా అంగీకరిస్తాడు. (అపొ. 10:34, 35) యేసు కూడా ప్రజలకు ప్రకటించినప్పుడు అలాగే నిష్పక్షపాతంగా ఉన్నాడు. (లూకా 20:21) పౌలులాగే మనం కూడా వారి మాదిరిని అనుకరించాలి, ఆయనిలా వ్రాశాడు: “ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థన చేయువారందరియెడల . . . ఐశ్వర్యవంతుడై యున్నాడు.”—రోమా. 10:12.
2 మనం కలిసే వారందరికీ దేవుని రాజ్యసువార్తను ప్రకటించటం దేవునికి మహిమను తీసుకువస్తుంది. వారి జాతి, సాంఘిక స్థాయి, విద్య, లేక ఆర్థికస్థితులతో నిమిత్తం లేకుండా మనం ఈ మహత్తరమైన సందేశాన్ని ఇతరులకు తెలియజేయడంలో కొనసాగాలి. (రోమా. 10:11-13) వినటానికి ఇష్టపడే వారికి అంటే పురుషులకు, స్త్రీలకు, యౌవనస్థులకు, వృద్ధులకు ప్రకటించాలని దీని భావం. సత్యాన్ని వినటానికి ప్రతి ఇంటివారికి అవకాశం అందేలా ప్రతి ఒక్క ఇంటికీ వెళ్లాల్సిన అవసరం ఉంది.
3 ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ తీసుకోండి: కలువగలిగిన ప్రతి ఒక్కరినీ కలవాలన్నదే మన లక్ష్యం. దీన్ని మనస్సులో ఉంచుకుని కొంతమంది ప్రచారకులు డాక్టర్ల ఆఫీసుల్లో, ఆసుపత్రుల్లో, నర్శింగ్ హోమ్స్‌లో, సంక్షేమ ఆఫీసుల్లో, పునరావాస కేంద్రాలలో ప్రజలను కలుసుకుని వారికి సాక్ష్యమివ్వగలిగారు. అంతేగాక, పోలీసు డిపార్టుమెంటులోని అధికారులకీ, స్కూళ్ల సూపర్వైజర్లకీ, కౌన్సిలర్లకీ, జడ్జీలకీ కూడా ప్రచారకులు సాక్ష్యం ఇచ్చారు. అధికారులను కలుసుకునేటప్పుడు సమాజంలో వారు అందించే సేవలను మనం అభినందించటం సర్వదా హర్షణీయం. గౌరవప్రదంగా వ్యవహరిస్తూ, వారి వృత్తులకు సంబంధించిన విషయాలతోనూ సమస్యలతోనూ వ్యవహరించే సమయానుకూలమైన తగిన శీర్షికలను ఎంపిక చేసుకోవాలి.
4 ఒకసారి ఒక సహోదరికి ఒక జడ్జితో ఆయన ఆఫీసులో మాట్లాడే అవకాశం లభించింది. చక్కటి సంభాషణ తర్వాత ఆయనిలా వ్యాఖ్యానించాడు: “యెహోవాసాక్షులలో నాకు నచ్చిన విషయమేంటో తెలుసా? సుస్థాపితమైన సూత్రాలు వారికున్నాయి, వారెన్నడూ వాటి నుండి తొలగిపోరు.” పలుకుబడివున్న ఆ వ్యక్తికి చక్కని సాక్ష్యం ఇవ్వబడింది.
5 ప్రజల హృదయాలను మనం చదువలేము. అయితే, మనం కలిసే ప్రతి వ్యక్తితో మాట్లాడటం ద్వారా మన పనిని నడిపించేందుకు దేవునికున్న సామర్థ్యమందు మన విశ్వాసాన్ని చూపిస్తాము. అంతేగాక, నిరీక్షణా సందేశాన్ని విని, ప్రతిస్పందించే ఆధిక్యతను ఇది ప్రజలకు ఇస్తుంది. (1 తిమో. 2:3, 4) మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తూ, సువార్తను సాధ్యమైనంత ఎక్కువమందికి తెలియజేస్తూ యెహోవా నిష్పక్షపాతాన్ని అనుకరించటానికి కృషి చేద్దాము.—రోమా. 2:11; ఎఫె. 5:1, 2.