ఒక యూదునికి మీరేమని చెప్తారు?
1 మొదటి శతాబ్దంలో చాలామంది ‘ఇశ్రాయేలీయులు’ యేసు ఆయన అపొస్తలుల బోధకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందించారు. (అపొ. 10:36) యథార్థపరులైన యూదులు ఇజ్రాయేల్‌లోనే కాదు, ఇండియా, రష్యా, అమెరికా, ఇతర దేశాల్లో కూడా, అప్పట్లోలానే నేడు కూడా సత్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నారు. యూదులకు మరింత విజయవంతంగా సాక్ష్యమిచ్చేందుకు మీరు ఇష్టపడతారా? మతపర యూదులకు, మతపరం కాని యూదులకు ఎలా యుక్తిగా సాక్ష్యమివ్వాలో ఈ క్రింది సలహాలు మీకు సహాయపడతాయి.
2 మతపర యూదులకు సాక్ష్యమివ్వడం: మతపర యూదులు నిర్దిష్టమైన సిద్ధాంతాల కన్నా రబ్బీల ఆచారాలను తరచూ ఆసక్తిగా పాటిస్తారు. నిజానికి, వాళ్ళు లేఖనాలకు సమానమైన అధికారం, ఆచారాలకు ఉందని దృష్టిస్తారు. అందుకే, లోతైన బైబిలు విషయాలను చర్చించడంలో వారు ఆసక్తిని చూపించకపోవచ్చు. వారు బైబిలును క్రైస్తవుల పుస్తకమని కూడా భావిస్తారు. అందువల్ల, బైబిలును గురించి మాట్లాడుతున్నప్పుడు “హెబ్రీ లేఖనాలు,” “తోరహ్,” లేక “లేఖనాలు” అని ఉపయోగించడం సరైనది. యుద్ధంలేని లోకం ఎప్పుడైనా వస్తుందా? (ఆంగ్లం) అనే చక్కని బ్రోషూర్ ప్రత్యేకించి యూదుల కోసమే తయారుచేయబడింది.
3 మతపర యూదులకు బహుశా ఏ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి? వారు మనుష్యులపై శ్రద్ధ తీసుకొనే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని నమ్ముతారు. దేవుడు మానవుల విషయాల్లో జోక్యం చేసుకుంటాడని కూడా వాళ్ళు నమ్ముతారు. సామ్యం ఏర్పరచుకొనేందుకు మీరు ఆ అంశాలను ఉపయోగించవచ్చు. అదనంగా, చాలామంది యూదులకు రెండవ ప్రపంచ యుద్ధంలో తమ ప్రజలు అనుభవించిన బాధల గురించి బాగా తెలుసు. దేవుడు అలాంటి అన్యాయాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడు? దుష్టత్వం ఎప్పుడు అంతమైపోతుంది? లాంటి ప్రశ్నలు వారు అడుగుతుంటారు. వాటికి సమాధానమిచ్చేందుకు మనం బాగా సిద్ధపడివున్నాము, ఉదాహరణకు మనం నాజీ హోలోకాస్ట్‌లో మన సహోదరుల అనుభవాలను గూర్చి చెబుతాము.
4 గృహస్థుడ్ని దూరం చేసుకోవడాన్ని నివారించేందుకు మెస్సీయా ఎవరు అన్న విషయాన్ని మీ సంభాషణలో అంత త్వరగా ప్రస్తావించకండి. దానికంటే, ఇశ్రాయేలీయుల చరిత్రలో మోషే పాత్రను గూర్చి బహుశా మీరు చర్చించి, మోషే బోధలు ఈనాటికీ వర్తిస్తాయని ఆయన నమ్ముతున్నాడా అని మీరు ప్రశ్నించవచ్చు. మెస్సీయాను గూర్చిన విషయాన్ని చర్చించవచ్చు అని మీరు అనుకుంటే “నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను” అని చెప్తున్న ద్వితీయోపదేశకాండము 18:16 మీరు చదువవచ్చు. తన లాంటి ప్రవక్త అని చెప్తున్నప్పుడు మోషే మనస్సులో ఎవరుండవచ్చని మీరు అనుకుంటున్నారని గృహస్థుని ప్రశ్నించండి. యుద్ధంలేని లోకం (ఆంగ్లం) అన్న బ్రోషూర్ 14వ పేజీ, 17, 18 పేరాలలోని కొన్ని అంశాలను చర్చించండి.
5 లౌకిక దృక్పథంగల యూదులు విషయాలను వేరుగా దృష్టిస్తారు: తాము యూదులమని చెప్పుకునే ప్రతి ఒక్కరూ యూదామతంలోని బోధలన్నీ అంగీకరించాలని లేదు. చాలామంది యూదులు లౌకికమైన దృక్పథం గలవారే. వారు యూదా మతాన్ని అవలంబించడం కన్నా తమ స్వంత సంస్కృతి, సాంప్రదాయం, విద్యలు ఉన్న ఒక భిన్నమైన యూదా గుర్తింపును అభివృద్ధి చేయడంలో ఆసక్తి కలిగివున్నారు. కొంతమంది లౌకికమైన యూదుల్లో అజ్ఞేయతావాదులు ఉంటారు—కొంతమంది నాస్తికులు కూడా ఉంటారు. వీరితో మాట్లాడేటప్పుడు మొదట్లోనే, విస్తృతంగా హెబ్రీ లేఖనాలను ఉపయోగించడం వల్ల ఏమీ ఒరగదు. మతం పట్ల అంత ఆసక్తి లేని వారితో మీరు సంభాషించే రీతిలోనే వీరితో సంభాషించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ కాలాల్లో బైబిలు ఎంత ఆచరణాత్మకమైనదో మీరు చెప్పవచ్చు. బైబిలు దైవ ప్రేరేపితమని గృహస్థుడు నమ్మకపోతే, యుద్ధంలేని లోకం అన్న బ్రోషూర్‌లోని కొన్ని అంశాలు సహాయపడవచ్చు, 3వ పేజీలోని “బైబిలు—దైవ ప్రేరేపితమైనదా?” అన్న శీర్షిక క్రింద కనుగొనబడే అంశాలు మరింత సహాయపడవచ్చు.
6 ఒక యూదునికి సాక్ష్యమిస్తున్నప్పుడు మీరిలా చెప్పవచ్చు:
◼ “మన ప్రియమైన వారిని మరణమందు కోల్పోవడం మనలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న సమస్యే. మనం మరణించినప్పుడు మనకేమౌతుందని మీరు భావిస్తున్నారు?” ప్రతిస్పందించనివ్వండి. యుద్ధంలేని లోకం అన్న బ్రోషూర్‌లోని 22వ పేజీలో ఉన్న “మరణము మరియు ప్రాణము—ఏమిటవి?” అన్న పేరుగల బాక్సు చూపించండి. మరణాంతర జీవితాన్ని గురించి లేఖనాలు ఏమని చెప్తున్నాయి, రబ్బీలు ఏమని బోధిస్తున్నారు అన్న రెండింటి మధ్య తేడాను ఆ బాక్సు పోల్చి చెప్తుంది. తర్వాత 23వ పేజీలోని 17వ పేరాకు త్రిప్పి లేఖనాల ప్రకారం పరదైసు భూమిపై జీవించేందుకు మృతులు పునరుత్థానం చేయబడతారు అని చూపించండి. బ్రోషూర్‌ను అందించండి. పునర్దర్శనానికి సిద్ధపర్చేందుకు, పూర్వీకుడైన యోబు పునరుత్థాన నిరీక్షణ కలిగివున్నాడని మీరు చెప్పవచ్చు. 17వ పేరా చివర్లో ఉదహరించబడిన లేఖనాలను పేర్కొనండి, తిరిగి వచ్చి చర్చిస్తానని చెప్పండి.
7 సత్యాన్ని విని అనుసరించిన యూదుల అనుభవాల గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపొస్తలుల కార్యములు పుస్తకాలు చెబుతున్నాయి. యెహోవా నిత్యజీవ మార్గాన్ని ఇంకా తెరిచేవుంచాడు. యథార్థపరులైన యూదులు ఇంకా సత్య దేవుడైన యెహోవాను గురించి నేర్చుకోవలసి ఉన్నారు, అలా వారు కూడా దేవుని క్రొత్త లోకంలో నిరంతరం జీవించగలరు.—మీకా 4:1-4.