ఇంటర్నెట్ ఉపయోగించడంలో రాగల ప్రమాదాల విషయమై అప్రమత్తులుగా ఉండండి!
1 యెహోవాసాక్షులు ఒకరితోనొకరు ఆరోగ్యకరమైన సహవాసాన్ని ఆస్వాదిస్తారు. క్షేత్రసేవలో కలిగిన అనుభవాలను పంచుకోవడంలో ఆనందిస్తారు. యెహోవాసాక్షులకు సంబంధించిన, భూగోళవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యపనికి సంబంధించిన సంఘటనలను గురించి వినడంలో మెప్పుదల చూపిస్తారు. మన సహోదరులకు ఏదైనా అసాధారణమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, అంటే ఏదైనా సంకట పరిస్థితి కలిగినా లేదా ప్రకృతి వైపరీత్యానికి గురైనా తమకు తెలియజేయాలని కోరుకుంటారు. తాము చేయగల సహాయం ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి ఆసక్తి, మన మధ్య ఉన్న సహోదర ఐక్యాన్ని చూపిస్తూ, ఒకరినొకరం నిజంగా ప్రేమిస్తున్నామని నిరూపిస్తుంది.—యోహా. 13:34, 35.
2 నేడు, మనం లోక సంఘటనల గురించి వెంటవెంటనే వింటుంటాం. రేడియో, టెలివిజన్ ప్రసారాలు భూగోళవ్యాప్తంగా ఉన్న శ్రోతలకు ప్రేక్షకులకు అప్పటికప్పుడు విశదవివరాలను అందిస్తూ ఉంటాయి. టెలిఫోన్ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న ప్రజలతోనైనా వెంటనే విషయాలను తెలియజేసుకోవడం సాధ్యమయ్యేలా చేస్తుంది. విషయాలను తెలియజేసుకోవడంలో నేడు లోకంలో మరింత జనాదరణ పొందుతున్న ఇటీవలి అద్భుతం ఇంటర్నెట్.—తేజరిల్లు! ఆగస్టు 8, 1997.
3 టెలిఫోన్‌ను కనిపెట్టడంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సమాచారాలను శీఘ్రగతిలో పరస్పరం తెలియజేసుకొనే అవకాశం తెరవబడింది. టెలిఫోన్ చాలా ఉపయోగకరమైనప్పటికీ, అది అనుచితమైన సహవాసానికి లేదా కార్యశీలతలకు ఉపకరణం కాగలదు కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించాలన్న విషయంలో జాగ్రత్తపడడం అవసరం. టెలిఫోన్‌ను అధికంగా ఉపయోగిస్తే బిల్లు కూడా అధికమౌతుంది. విద్యా రంగంలో టెలివిజనూ, రేడియో చాలా శక్తివంతంగా ఉంటాయి. అయితే, విచారకరమైన విషయమేమిటంటే, వీటిలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో చాలా మటుకు నైతికంగా చాలా దిగజారిపోయాయి, వాటి మీద అవధానాన్ని ఉంచడం అంటే సమయాన్ని వృథా చేయడమే. మనం టీవీనీ రేడియోనూ ఉపయోగించేటప్పుడు ఎంపిక చేసుకునేవారమై ఉండాలి అని వివేకం చెబుతుంది.
4 ఇంటర్నెట్ ద్వారా పెద్ద ఖర్చులేకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా సరే, విషయాలను తెలియజేసుకోవచ్చు. ఇంటర్నెట్, బోలెడంత సమాచారానికి విశాలమైన ద్వారాన్ని తెరుస్తుంది. (జనవరి 8, 1998 తేజరిల్లు! [ఆంగ్లం]) అయినప్పటికీ, ఇంటర్నెట్ను వివేచనరహితంగా ఉపయోగిస్తే, ఆధ్యాత్మికంగాను, నైతికంగాను చాలా పెద్ద ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఎలా?
5 బాంబులతో సహా ఆయుధాలను ఎలా నిర్మించాలన్నది తెలియజేసే సమాచారం కూడా ఇంటర్నెట్లో సులభంగా లభ్యమౌతుందన్న విషయాన్ని బట్టి, చాలా మంది చింతిస్తున్నారు. వర్కర్లు ఇంటర్నెట్ను ఉపయోగించడంలో సమయాన్ని వృథా చేస్తున్నారని పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా కలగగల ఆధ్యాత్మిక ప్రమాదాలను గురించి మన ప్రచురణల్లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. అనేక వెబ్ సైట్లు హింసనూ, అశ్లీల సమాచారాన్నీ సమర్పిస్తున్నాయి, అవి క్రైస్తవులకు ఏ మాత్రం తగవు. (కీర్త. 119:37) ఈ ప్రమాదాలే కాక, ముఖ్యంగా యెహోవాసాక్షులు జాగ్రత్తగా ఉండవలసిన బయటికి కనిపించని మరింత సూక్ష్మమైన ప్రమాదం కూడా ఉంది? ఏమిటా ప్రమాదం?
6 ఎవరో తెలుసుకోకుండా మీ ఇంటికి ఎవరిని పడితే వాళ్ళను మీరు ఆహ్వానిస్తారా? తెలుసుకునే అవకాశమే లేకపోతే ఏం చేస్తారు? ఇంట్లో ఎవరూ లేనప్పుడు, ముక్కు ముఖం తెలియని ఆ వ్యక్తి మీ పిల్లలతో ఉండడానికి మీరు అనుమతిస్తారా? ఇంటర్నెట్లో ఇది సాధ్యమన్నది నిర్వివాదమైన విషయం.
7 మీకు తెలియనివాళ్ళకు మీరు ఎలక్ట్రానిక్ మెయిల్‌ను పంపించవచ్చు, వాళ్ళ నుండి మీకు అందవచ్చు. మీరు ఎలక్ట్రానికల్‌గా ఫోరమ్‌లో సంభాషిస్తున్నప్పుడైనా లేక చాట్ రూమ్‌లో సంభాషిస్తున్నప్పుడైనా అది నిజం. అలా మీతో సంభాషిస్తున్నవాళ్ళు తాము యెహోవాసాక్షులమని చెప్పుకోవచ్చు, కానీ సాక్షులు కాకపోవచ్చు. ఒకరు తాను యౌవనస్థుడనని చెప్పుకోవచ్చు, కానీ కాకపోవచ్చు. ఒక వ్యక్తి తాను స్త్రీ అయ్యుండీ పురుషుడ్ననీ, పురుషుడయ్యుండి స్త్రీననీ చెప్పుకోవచ్చు.
8 మీకు అందజేయబడే సమాచారం, అనుభవాన్ని చెబుతున్న రూపంలోనో లేక మన నమ్మకాలను గురించిన వ్యాఖ్యల రూపంలోనో కావచ్చు. ఈ సమాచారం ఇతరులకు పంపించబడుతుంది, వాళ్ళు మరితరులకు పంపిస్తారు. అలాంటి సమాచారం నిజమేనా కాదా అన్నది సాధారణంగా వాకబు చేసి తెలుసుకోలేము, అది అసత్యం కూడా కావచ్చు. ఆ వ్యాఖ్యలు విశ్వాసభ్రష్టమైన వాదనను ప్రచారం చేసేందుకు ఉపయోగించుకునే ముసుగై ఉండవచ్చు.—2 థెస్స. 2:1-3.
9 మీరు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లయితే, రాగల ఈ ప్రమాదాన్ని మనస్సులో పెట్టుకుని, మిమ్మల్ని మీరు, ‘నేను ఇంటర్నెట్ను దేని కోసం ఉపయోగిస్తాను? నేను ఉపయోగించే విధానం, ఆధ్యాత్మికంగా నాకు హానికలిగించే ఆస్కారం ఉందా? ఇతరులకు ఆధ్యాత్మిక గాయం కలగడానికి నేను కారకుడ్నవుతానా?’ వంటి ప్రశ్నలను వేసుకోండి.
10 “యెహోవాసాక్షుల” వెబ్సైట్: ఉదాహరణకు, యెహోవాసాక్షులము అని చెప్పుకునే వ్యక్తులు సెట్ చేసిన కొన్ని ఇంటర్నెట్ సైట్ల విషయమే తీసుకోండి. తాము సాక్షులమని చెప్పుకునే ఇతరులు ఉంచిన అనుభవాలను చదివేందుకు తమ సైట్లను చూడమని వాళ్ళు ఆహ్వానించవచ్చు. సొసైటీ సాహిత్యాలను గురించిన మీ తలంపులను, దృక్కోణాలను తమతో పంచుకోమని మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు. క్షేత్రసేవలో ఉపయోగించగల అందింపులను గురించి కొందరు సలహాలు ఇస్తారు. ఈ సైట్లు, ఆ చాట్ రూమ్‌లను ఉపయోగించుకునేందుకు వ్యక్తులకు వీలు కల్పించి, టెలిఫోన్లో ఒకరితోనొకరు ఎలా మాట్లాడుకుంటారో అలా మనసులో మాటను అప్పటికప్పుడు తెలియజేసుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఆన్లైన్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులతో సహవసించగల ఇతర సైట్లను వాళ్ళు తరచూ సూచిస్తారు. ఆ లైన్లు విశ్వాసభ్రష్టులు ఏర్పాటు చేసినవి కావని మీరు నిశ్చయంగా చెప్పగలరా?
11 ఇంటర్నెట్ ద్వారా సహవసించడం, ఎఫెసీయులు 5:15-17 లో కనిపించే సిఫారసుకు అనుగుణ్యంగా ఉండకపోవచ్చు. “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.
12 ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ మనకు ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తున్నది క్రైస్తవ సంఘం అనే దైవపరిపాలనా మాధ్యమం ద్వారానే. (మత్త. 24:45-47) మనం లోకం నుండి వేరుగా ఉండడానికీ, ప్రభువు పనిలో రద్దీగా ఉండాలన్న దృక్పథాన్ని కాపాడుకోవడానికీ కావలసిన నిర్దేశాన్నీ, కాపుదలనూ దేవుని సంస్థలోనే మనం కనుగొంటాం. (1 కొరిం. 15:58) సమకూడిన దేవుని ప్రజల మధ్య తాను ఆనందాన్నీ, భద్రతా అనుభూతినీ అనుభవించినట్లు కీర్తన రచయిత సూచించాడు. (కీర్త. 27:4, 5; 55:14; 122:1) సంఘం, తనతో సహవసించేవారికి ఆధ్యాత్మిక ఆలంబననూ సహాయాన్నీ కూడా ఇస్తుంది. ఇతరుల గురించి చింతిస్తూ వాళ్ళపై శ్రద్ధ చూపించే, ప్రేమగల స్నేహితుల గుంపును, అంటే విపత్కర సమయాల్లో ఇతరులకు సహాయపడడానికి, సాంత్వననివ్వడానికి సిద్ధమనస్సునూ సుముఖతనూ చూపిస్తారని మీకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తులను మీరు కనుగొనేది సంఘంలోనే. (2 కొరిం. 7:5-7) పశ్చాత్తాపపడకుండా మళ్ళీ మళ్ళీ పాపం చేసేవారిని లేక విశ్వాసభ్రష్టపు తలంపులను పెంపొందింపజేసేవారిని బహిష్కరించే లేఖనాధారపు ఏర్పాటు ద్వారా సంఘ సభ్యులు సంరక్షించబడతారు. (1 కొరిం. 5:9-13; తీతు. 3:10, 11) ఇంటర్నెట్ ద్వారా ఇతరులతో చేసే సహవాసంలో, ఇంత ప్రేమపూర్వకమైన ఏర్పాట్లను మనం నిరీక్షించగలమా?
13 నిజానికి అలా నిరీక్షించలేమని స్పష్టమైంది. కొన్ని వెబ్ సైట్లు, విశ్వాసభ్రష్టపు సమాచారానికి మాధ్యమంగా ఉన్నాయన్నది స్పష్టం. అలాంటి కొన్ని వెబ్ సైట్లు తాము అలా కాదని చెప్పుకుంటాయి, ఒక సైట్‌ని స్పోన్సర్ చేసేవాళ్ళు తాము నిజంగానే యెహోవాసాక్షులము అని నొక్కిచెప్పేందుకు విశదవివరాన్ని ఇవ్వవచ్చు. మీరు యెహోవాసాక్షుల్లో ఒకరేనా అని తెలుసుకోవడానికి వాళ్ళు మీ నుండి సమాచారాన్ని కూడా కోరవచ్చు.
14 మీరు వివేచనను అభ్యసించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఎందుకని? ఎందుకంటే, అనేక అపాయాల నుండి అది కాపాడుతుంది అని ఆయనకు తెలుసు. సామెతలు 2:10-19, ఇలా మొదలౌతుంది: “జ్ఞానము [“వివేకము,” NW] నీ హృదయమున జొచ్చును. తెలివి [“జ్ఞానము,” NW] నీకు మనోహరముగా నుండును. బుద్ధి [“ఆలోచనా సామర్థ్యం,” NW] నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును.” ఏ విషయంలో కాపలా కాస్తుంది? “దుష్టుల మార్గము”లోకి, సరైన దారిని విడిచి పెట్టేవారి మార్గంలోకి వెళ్ళకుండా, సాధారణంగా అనైతికంగాను, స్థిరత్వం లేనివారిగాను ఉండేవారి మార్గంలో వెళ్ళకుండా కాపలా కాస్తుంది.
15 మనం రాజ్యమందిరానికి వెళ్ళినప్పుడు, మనం మన సహోదరులతో ఉన్నామన్న దానిలో ఏ మాత్రం సందేహం లేదు. మనకు వాళ్ళు తెలుసు. అక్కడ కనబరచబడే సహోదర ప్రేమ దాన్ని స్పష్టం చేస్తుంది గనుక దీనికి ధృవీకరణను ఎవరూ అడగరు. అక్కడ కలిసేవాళ్ళు, మనం నిజంగానే యెహోవాసాక్షుల్లో ఒకరమని నిరూపించే పరిచయలేఖలను ఇవ్వమని మనల్ని వ్యక్తిగతంగా అడగరు. హెబ్రీయులు 10:24, 25లో పౌలు మాట్లాడిన నిజమైన పరస్పర ప్రోత్సాహాన్ని మనం కనుగొనేది అక్కడే. పరస్పర ప్రోత్సాహం కోసం ఆన్-లైన్ సహవాసాన్ని ప్రోత్సహించే వెబ్ సైట్లపై ఆధారపడలేం. కీర్తన 26:4, 5లోని మాటలను మనస్సులో ఉంచుకుంటే, ఇంటర్నెట్లో వెబ్ సైట్లను ఉపయోగించేటప్పుడు సులభంగా సంభవించగల ప్రమాదాల విషయమై మనం అప్రమత్తం ఉండగల్గుతాం.
16 ఇంటర్నెట్ను వినియోగించే వారికి దొరికే సమాచారపు రకాలకు హద్దులు కానీ, ప్రతిబంధాలు కానీ లేవు. తరచూ, ఈ పరిస్థితుల్లో, పిల్లలూ టీనేజర్లూ, నేరానికీ దోపిడీకీ సులభంగా ఎరవుతుంటారు. పిల్లలు అందరినీ నమ్ముతారు, అన్నింటిలో జిజ్ఞాస చూపిస్తారు, ఇంటర్నెట్లోని సాపేక్షికంగా క్రొత్తదైన సైబర్‌స్పేస్ లోకంలో పర్యటన చేయడం అంటే వాళ్లు చాలా కుతూహలం చూపిస్తారు. కనుక, తల్లిదండ్రులు, సంగీతం లేదా సినిమాల విషయంలో తమ పిల్లలకు ఎలా మార్గదర్శనమిస్తారో, అలాగే, ఇంటర్నెట్ను ఉపయోగించే విషయంలో కూడా లేఖనాధారమైన సరైన మార్గదర్శనాన్ని ఇవ్వవలసిన, పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉంది.—1 కొరిం. 15:33.
17 విచారకరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు మన సహోదరులుగా సహోదరీలుగా ఉండినవాళ్ళు, లోకస్థులైన ప్రజలను ఇంటర్నెట్లోని చాట్ రూమ్‌లలో కలవడం మొదలెట్టి వాళ్ళతో సహవసించడం మూలంగా చివరికి అనైతికతకు పాల్పడినందుకు బహిష్కరించబడవలసి వచ్చింది. కొంతమంది ఇంటర్నెట్లో మొదలైన సంబంధాన్ని కొనసాగించేందుకు తమ భర్తలను భార్యలను వదిలిపెట్టారని తెలుసుకున్నప్పుడు సంఘపెద్దలు ఖంగుతిన్నారు, ఇలా జరుగుతుందన్నది నమ్మలేకపోయారు, ఆ పెద్దలు ఆ విషయాన్ని సొసైటీకి వ్రాశారు. (2 తిమో. 3:6) మరి కొందరైతే, విశ్వాసభ్రష్టులు ఇచ్చిన సమాచారాన్ని నమ్మి, సత్యాన్ని పరిత్యజించారు. (1 తిమో. 4:1, 2) ఇలాంటి ప్రమాదాలు కలగగలవు కాబట్టి, ఇంటర్నెట్లోని చాట్ సెషన్లలో మునిగిపోకుండా జాగ్రత్తపడాలన్నది సహేతుకమైనట్లు అనిపించడం లేదా? నిశ్చయంగా, సామెతలు 2:10-19లో కనుగొనబడే వివేకాన్నీ జ్ఞానాన్నీ ఆలోచనా సామర్థ్యాన్నీ వివేచననూ అభ్యసించడం, మనకు కాపలా కాస్తుంది.
18 చాలా మంది వ్యక్తులు, సువార్తను ప్రకటించేందుకు అనేక వెబ్ సైట్లను సృష్టించినట్లు గమనించవచ్చు. ఈ సైట్లలో చాలా మటుకు వివేచనలేని సహోదరులు స్పాన్సర్ చేసినవే. విశ్వాసభ్రష్టులు, అనుమానించనివాళ్ళను ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఇతర సైట్లను స్పాన్సర్ చేసి ఉండవచ్చు. (2 యోహా. 9-11) మన సహోదరులు అలాంటి వెబ్ సైట్లను తయారు చేయవలసిన అవసరముందా అన్న దాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, మన రాజ్య పరిచర్య, నవంబరు 1997, 3వ పేజీ ఇలా అంది: “యెహోవాసాక్షులను గురించీ, మన క్రియాశీలతలను గురించీ, మన నమ్మకాలను గురించీ మరొకరు ఇంటర్నెట్ పేజీలను తయారు చేయవలసిన అవసరం లేదు. మన అధికారిక సైట్ [www.watchtower.org] మన గురించి తెలుసుకోవాలని కోరుకునే ఎవరికైనా సరే కచ్చితమైన సమాచారాన్నిస్తుంది.”
19 ఇంటర్నెట్ ద్వారా పఠన సహాయకాలా? వివిధ దైవపరిపాలనా కార్యశీలతల సంబంధంగా తాము పరిశోధించి కనుగొనిన సమాచారాన్ని పంపించడం ద్వారా తాము సహోదరులకు సేవ చేస్తున్నామని కొందరు భావించారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక బహిరంగ ప్రసంగపు ఔట్-లైన్ ఆధారంగా తాను పరిశోధన చేసిన దాన్ని పంపించడం ద్వారా, అదే ఔట్లైన్ను సిద్ధపడవలసిన అవసరమున్నవారికి సహాయపడుతున్నానని అనుకుంటుండవచ్చు. మరి కొందరు రానున్న కావలికోట పఠనంలోని లేఖనాలనన్నింటినీ కాపీ చేసి పంపవచ్చు. లేదా దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కొరకు లేదా సంఘ పుస్తక పఠనం కొరకైన సమాచార మూలాన్ని వెబ్ సైట్లో ఉంచవచ్చు. కొందరు క్షేత్ర పరిచర్య కొరకైన అందింపుల విషయమై సూచనలు ఇస్తుండవచ్చు. అవి నిజానికి సహాయకరమైనవేనా?
20 యెహోవా సంస్థ లభ్యం చేస్తున్న ప్రచురణలు, నిర్మాణాత్మకమైన తలంపులతో మన మనస్సులకు పురికొల్పునిచ్చి, “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు” మనకు తర్ఫీదునిస్తాయి. (హెబ్రీ. 5:14) మన కోసం ఇతరులు పరిశోధన చేస్తే మనం అలాంటి పురికొల్పునూ తర్ఫీదునూ పొందగలమని చెప్పగలమా?
21 బెరయలోని క్రైస్తవుల గురించి, “థెస్సలోనీకలో ఉన్న వారికంటె ఘను[లు]” అని చెప్పబడింది. ఎందుకని? ఎందుకంటే, “[వారు,] చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” (అపొ. 17:11) పౌలు, సీలలు వాళ్ళకు బోధించినప్పటికీ, వాళ్ళు సత్యాన్ని తమ సొంతం చేసుకోగల్గారు అంటే, వాళ్ళు వ్యక్తిగతంగా లేఖనాలను పరిశోధించకుండా మాత్రం కాదు.
22 ఒక ప్రసంగం కోసం లేదా ఒక కూటం కొరకైన సిద్ధపాటు కోసం మరొకరు చేసిన పరిశోధనను ఉపయోగించడం, వ్యక్తిగత పఠనం యొక్క ఉద్దేశాన్ని నిజంగా నిర్వీర్యం చేస్తుంది. దేవుని వాక్యంలో మీ సొంత వ్యక్తిగత విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కాదా మీరు కోరుకునేది? అలా పెంపొందించుకున్నప్పుడు, వ్యక్తిగతంగా నమ్మిన దాని ఆధారంగా, మీరు ప్రసంగాలనిచ్చేటప్పుడు, కూటాల్లో వ్యాఖ్యానాలను చేసేటప్పుడు, క్షేత్రసేవ చేస్తున్నప్పుడు మీరు మీ విశ్వాసాన్ని బహిరంగంగా వ్యక్తం చేయగలరు. (రోమా. 10:10) ఇతరులు పరిశోధించి కనుగొనిన సమాచారాన్ని ఉపయోగించడం, సామెతలు 2:4, 5లోని, ‘దాచబడిన ధనమును వెదకినట్లు దేవునిగూర్చిన విజ్ఞానము కొరకు వెదుకుతూ ఉండు’ అన్న వివరణకు అనుగుణ్యంగా ఉండదు.
23 ఉదాహరణకు, మీ సొంత బైబిలులో నుండి లేఖనాలను చూసేటప్పుడు, మీరు ఒక్కో లేఖనం యొక్క సందర్భాన్ని క్లుప్తంగా సమీక్షించవచ్చు. లూకా తన సువార్తను వ్రాసేందుకు, “[అ]న్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసి”కొన్నట్లే, మీరు కూడా తరచి చూడవచ్చు. (లూకా 1:4) మీరు వెచ్చించే అదనపు ప్రయత్నం, మీరు పరిచర్యలో ఉన్నప్పుడూ, అలాగే ప్రసంగాలను ఇచ్చేటప్పుడూ లేఖనాలను తీయడంలో నిపుణులయ్యేందుకు సహాయపడుతుంది. యెహోవాసాక్షులకు బైబిలును ఉపయోగించడం తెలుసు గనుక, తాము ముగ్ధులైనట్లు చాలా మంది పేర్కొన్నారు. వాళ్ళు పేర్కొన్నది మనకు కూడా వర్తించాలంటే, మనం మన సొంత బైబిళ్ళలో లేఖనాలను వ్యక్తిగతంగా తీసి చూడడాన్ని అలవాటుగా చేసుకోవడమే ఏకైక మార్గం.
24 మన సమయాన్ని వివేకంతో ఉపయోగించడం: ఇంటర్నెట్లో సమాచారాన్ని సిద్ధం చేయడానికి, ఉన్నవాటిని చదవడానికి, వాటికి ప్రతిస్పందించడానికి ఎంత సమయం తీసుకుంటాం అన్నది పరిగణించవలసిన మరొక విషయం. “మాకు జ్ఞానహృదయము [“వివేక హృదయము,” NW] కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము” అని ప్రార్థించమని కీర్తన 90:12 మనల్ని ప్రోత్సహిస్తుంది. “కాలము సంకుచితమై యున్నది” అని పౌలు అన్నాడు. (1 కొరిం. 7:29) “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” అని కూడా ఆయన అన్నాడు.—గల. 6:10.
25 అలాంటి ఉపదేశం, మనం సమయాన్ని ఉపయోగించే విషయంలో వివేకాన్ని చూపించాలన్న విషయం వైపుకు అవధానాన్ని మళ్ళిస్తుంది. దేవుని వాక్యాన్ని చదవడానికి సమయాన్ని తీసుకోవడం ఇంకా ఎంత ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది ! (కీర్త. 1:1, 2) మనకుండగల అత్యంత శ్రేష్ఠమైన సహవాసమది. (2 తిమో. 3:16, 17) తల్లిదండ్రులారా, రాజ్యసంబంధమైన లక్ష్యాల కోసం సమయాన్ని ఉపయోగించడంలోని విలువను గురించి మీ పిల్లలకు బోధిస్తున్నారా? (ప్రసం. 12:2) ఇంటర్నెట్‌ని చూసేందుకు వెచ్చించే సమయాని కన్నా, వ్యక్తిగత పఠనానికీ, కుటుంబ బైబిలు పఠనానికీ, కూటాలకు హాజరు కావడానికీ, క్షేత్రసేవలో పాల్గొనడానికీ ఉపయోగించే సమయానికే చాలా ఎక్కువ విలువ ఉంటుంది.
26 కాబట్టి, మన అవధానాన్ని ఆధ్యాత్మిక విషయాలపైనా, క్రైస్తవులముగా మన జీవితాలకు సంబంధించిన అత్యవసరమైనటువంటి విషయాలపైనా కేంద్రీకరించడం వివేకయుక్తమైన పని. అలా కేంద్రీకరించాలంటే, మన సమయాన్ని వెచ్చించడానికి తగినదీ, మనం తలంచదగినదీ అయిన సమాచారం ఏదన్న దాన్ని గురించి బాగా ఆలోచించి ఎంపిక చేసుకోవడం అవసరం. “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని చెప్పిన యేసు, క్రైస్తవులముగా మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటన్న దాన్ని సంగ్రహంగా చెప్పాడు. (మత్త. 6:33) మీ జీవితం ఇతర కార్యకలాపాలతో కాక రాజ్య సంబంధ లక్ష్యాలతో నిండి ఉన్నప్పుడు కాదా మీరు మరింత సంతోషంగా ఉండేది?
27 ఇంటర్నెట్ ఇ-మెయిల్: వ్యక్తిగత అనుభవాలను లేదా తలంపులను దూరాన ఉన్న కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవడం సముచితమైనదే అయినప్పటికీ, మీ కుటుంబం గానీ మీ స్నేహితులు గానీ తెలియని వ్యక్తులకు ఆ వివరాలను పంపడం ప్రేమపూర్వకమైన పనేనా? ఎవరైనా చదవగల్గేలా వెబ్‌పేజ్‌లో వాటిని అలా పెట్టాలా? మీకు తెలిసినవాళ్లకా, తెలియనివాళ్ళకా అన్నది వివేచించకుండా ఈ వ్యక్తిగత సందేశాలను కాపీ చేసి అందరికీ పంపించాలా? అలాగే, మీకు అందిన మిమ్మల్ని ఉద్దేశించినవి కావని స్పష్టమౌతున్న సందేశాలను మరితరులకు పంపడం ప్రేమపూర్వకమైన పనేనా?
28 మీరు పంపిన అనుభవం సరైనది కాకపోతే అప్పుడు ఏమిటి? అసత్యాన్ని పునరుక్తం చేయడంలో మీరు కూడా పాలివారైనట్లు కాదా? (సామె. 12:19; 21:28; 30:8; కొలొ. 3:9) ‘అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూసుకోవడం’ ద్వారా మనం ఈ విషయాన్ని గురించి ఆలోచించేందుకు పురికొల్పబడతాం. (ఎఫె. 5:15) వార్షికపుస్తకం, కావలికోట, తేజరిల్లు!లు మనం “త్రోవ”లో నడుస్తూ ఉండేందుకు ప్రోత్సహించే పురికొల్పేటువంటి, వాకబు చేస్తే అవి వాస్తవమైనవేనని నిరూపించగల్గేటువంటి అనుభవాలతో నిండి ఉన్నందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం.—యెష. 30:20, 21.
29 మరొక ప్రమాదం కూడా ఉంది. కొందరి గురించి, అపొస్తలుడైన పౌలు, “వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాండ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందురు” అని అన్నాడు. (1 తిమో. 5:13) ఏమంత ప్రాముఖ్యం కాని సమాచారాన్ని మన సహోదరులకు పంపించేందుకు సమయాన్ని వెచ్చించడమూ ప్రయత్నించడమూ అనవసరమని ఇది వాదిస్తుంది.
30 ఒక పెద్ద ఇ-మెయిల్‌ను ఎప్పటికప్పుడు చదివి జవాబులు పంపేందుకు ఎంత సమయం పడుతుందో కూడా ఆలోచించండి. ఆసక్తికరంగా, డాటా స్మాగ్ అనే పుస్తకం, “ఒక వ్యక్తి ఆన్-లైన్లో ఎక్కువ సమయాన్ని గడుపుతున్న కొలది, ఇ-మెయిల్కున్న జిజ్ఞాస కలిగించేంతటి క్రొత్తదనం పోయి, ప్రతిరోజూ సహోద్యోగుల నుండి స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి వచ్చే డజన్ల కొలది మెస్సేజ్‌లను చదివి వాటికి బదులివ్వడం మూలంగా, . . . కోరకుండా వచ్చే వ్యాపార ప్రకటనల మూలంగా, అది సమయాన్ని మ్రింగేసే పెద్ద భారంగా మారుతుంది” అని పేర్కొంది. అంతేకాక, “ఎలక్ట్రానిక్ సమాచారంలోని ప్రతి ముక్కను ఇతరులకు పంపే చాలా మందికి, తమకు అందే వినోదకరమైన సమాచారాన్ని—తమాషాలను, నగరాల్లోని కల్పిత కథలను, ఎలక్ట్రానిక్ చెయిన్ లెటర్లను మరనేకములను—తమ ఎలక్ట్రానిక్ అడ్రస్‌బుక్‌లో ఉన్న అందరికీ పంపే చెడ్డ అలవాటు ఉంది” అని కూడా ఆ పుస్తకం చెబుతుంది.
31 ఈ అలవాటు, చాలా మంది సహోదరుల మధ్య పంపబడే ఇ-మెయిల్లో—పరిచర్యను గురించిన తమాషాలూ, హాస్యభరితమైన కథలూ; మన నమ్మకాల ఆధారంగా చేసినవని నమ్మబడుతున్న కవిత్వాలూ; సమావేశాల్లో లేదా రాజ్యమందిరంలో విన్న ప్రసంగాల్లోని దృష్టాంతాలూ; క్షేత్రసేవలోని అనుభవాలూ వంటి హానిరహితంగా అనిపించే ఇ-మెయిల్లలో స్పష్టమైంది. చాలా మంది, ఆ ఇ-మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అన్నది కూడా చూడకుండా అందులోని సమాచారాన్ని ఇతరులకు పంపిస్తారు, దాంతో ఆ సమాచారం అసలు ఎవరి దగ్గరి నుండి మొదలైంది అన్నది తెలుసుకోవడం కష్టమౌతుంది. అందువల్ల, ఆ సమాచారం నమ్మదగినదేనా అని ఒకరు అనుమానించితీరవలసి వస్తుంది.—సామె. 22:20, 21.
32 “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్యప్రమాణమును [“ఆరోగ్యకరమైన మాటల నమూనాను,” NW] గైకొనుము” అని పౌలు వ్రాసినప్పుడు, ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన మాటల నమూనాలో అలాంటి వ్యర్థమైన సందేశాలు లేవు. (ఇటాలిక్కులు మావి.) (2 తిమో. 1:13) లేఖనాధార సత్యం యొక్క “స్వచ్ఛమైన భాష”కు “ఆరోగ్యకరమైన మాటల నమూనా” ఉంది. ముఖ్యంగా, రాజ్యం ద్వారా యెహోవా సర్వాధిపత్య నిరూపణ జరుగుతుందనే బైబిలు సందేశంపై ఆ నమూనా ఆధారపడి ఉంది. (జెఫ. 3:9, NW) యెహోవా సర్వాధిపత్య నిరూపణకు మద్దతునిచ్చేందుకు మనకు లభ్యమయ్యే సమయాన్నంతటినీ, మన శక్తినంతటినీ ఉపయోగించేందుకు మనం ప్రతి ప్రయత్నమూ చేయాలి.
33 మనం లోక వ్యవస్థ యొక్క అంతంలో ఉన్నాము కనుక, ఇది అశ్రద్ధ చేయవలసిన సమయం కాదు. “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని బైబిలు మనకు హెచ్చరికనిస్తుంది. (1 పేతు. 5:8) “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి” అని కూడా బైబిలు మనకు చెబుతుంది.—ఎఫె. 6:11.
34 ఇంటర్నెట్ను అనుచితంగా ఉపయోగిస్తూ, దాని ప్రభావానికి లోనయ్యేవారిని లోబరచుకునేందుకు సాతాను ఇంటర్నెట్నే ఒక మాధ్యమంగా ఉపయోగిస్తాడు. ఇంటర్నెట్ మూలంగా పరిమితమైన ఉపయోగం ఉన్నప్పటికీ, దాన్ని జాగ్రత్తగా వీక్షించకపోతే ప్రమాదం ఉంది. తమ పిల్లలు ఇంటర్నెట్ను ఎలా ఉపయోగిస్తున్నారన్న విషయంలో తల్లిదండ్రులు మరెక్కువ శ్రద్ధ చూపవలసి ఉంది.
35 ఇంటర్నెట్ విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కలిగి ఉండడం మనకు ఒక కాపుదలగా ఉంటుంది. “ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది” అని పౌలు సమయోచితంగా ఇచ్చిన జ్ఞాపికను మనం మెచ్చుకుంటాం. (1 కొరిం. 7:29-31) ఇంటర్నెట్లో లభ్యమయ్యేదానితో సహా, లోకం ప్రతిపాదించేవాటన్నింటి మూలంగా మన అవధానం మళ్ళకుండా ఉంచుకునేందుకు ఈ విషయాలను మనసులో పెట్టుకోవడం, మనకూ, మన కుటుంబాలకూ సహాయపడుతుంది.
36 మనం సంఘంలోని మన సహోదరులతో సన్నిహితంగా ఉంటూ, మిగిలివున్న సమయాన్ని వివేకంతో ఉపయోగిస్తూ, తద్వారా రాజ్యాసక్తుల పురోగమనానికి మనల్ని మనం అందుబాటులో ఉంచుకోవడం ఆవశ్యకం. ఈ వ్యవస్థ ముగియబోతుండగా, ‘తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్న అన్యజనులవలె’ మనం ‘ఇక మీదట నడుచుకొనక,’ ‘ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుదాం.’—ఎఫె. 4:17, 18; 5:17.