దేవుని ప్రవచన వాక్యము అంతా నెరవేరుతుంది!
1 యెహోవాసాక్షులు ఎల్లప్పుడూ బైబిలు ప్రవచనాలపై ఆసక్తి కలిగివుంటారు. అందుకే గత సంవత్సరం, జిల్లా సమావేశపు అంశం “దేవుని ప్రవచన వాక్యము” అని తెలుసుకుని ఎంతో సంతోషించాము. యెహోవా మనకోసం “తగినవేళ అన్నము”గా ఏమి దాచి ఉంచాడో తెలుసుకోవడానికి మనం చాలా ఆసక్తిగా ఎదురుచూశాము. (మత్త. 24:45) ఆయన మనల్ని నిరుత్సాహపరచలేదు.
2 సమావేశ ముఖ్యాంశాలు: శుక్రవారంనాటి ముఖ్యాంశ ప్రసంగం “దేవుని ప్రవచన వాక్యానికి అవధానమివ్వండి,” రూపాంతర వృత్తాంతాన్ని గూర్చిన విశదమైన చర్చ అందులో ఇమిడివుంది. (మత్త. 17:1-9) ఇప్పుడు మనం మంచికాలాలకు చాలా సమీపంలో ఉన్నామనీ, అంతానికి అతి చేరువలో ఉన్నామనీ అది నొక్కితెలియజేసింది, అంటే నూతన విధానం మన ముందే ఉంది! మనం దేవుని వాక్యానికి అవధానం ఇవ్వడానికి ప్రాముఖ్యమైన మార్గం దాన్ని క్రమంగా చదవడమే. “దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందించండి” అనే గోష్ఠి మనం బైబిలు పఠనాన్ని మరింత ప్రయోజనకరమైనదిగానూ, ఆనందకరమైనదిగానూ చేసుకునేందుకు కొన్ని ఆచరణాత్మక సలహాలను ఇచ్చింది.
3 శనివారం మధ్యాహ్నం, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని ఎందుకు ఒప్పింపబడాలనేదానికి తగిన కారణాలను పునఃపరిశీలించాము. వీటన్నింటినీ మీరు గుర్తు చేసుకోగలరా? ఆదివారం ఉదయం, మన దినాలు హబక్కూకు దినాలకు సాదృశ్యంగా ఉన్నాయనీ, యెహోవా దుష్టులను నాశనం చేసి నీతిమంతులను రక్షించే ఆ విశేషమైన సంఘటనలు త్వరలో జరుగబోతున్నాయనీ మనం తెలుసుకున్నప్పుడు, హబక్కూకు ప్రవచనాన్ని చక్కగా అర్థం చేసుకున్నాము. యాకోబు, ఏశావులను గూర్చిన బైబిలు నాటకంలోని విషయాన్ని మీరు గ్రహించారా? ఉదాసీన వైఖరిని ఎదిరించి, యెహోవా నుండి ఆశీర్వాదాలు పొందేందుకు మనం చురుగ్గా కృషిచేయాలి.
4 ఆసక్తి రేకెత్తించే క్రొత్త పుస్తకం: దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే క్రొత్త పుస్తకాన్ని అందుకోగల్గినందుకు మనం ఎంతగా సంతోషించామో కదా. ఉత్కంఠ కలిగించే ఈ పుస్తకాన్ని మీరు చదువుతూ ఉన్నారనడంలో సందేహమే లేదు. ఆ పుస్తకాన్ని విడుదల చేసిన ప్రసంగీకుడు, “కొన్ని వివరణలు మినహా, దానియేలు గ్రంథంలోని ప్రవచనాలన్నీ నెరవేరాయి” అని చెప్పాడు. మన దినాల్లోని అత్యవసర భావాన్ని అది నొక్కి చెప్పదా?
5 ఇంకా నెరవేరని దేవుని వాగ్దానాలన్నీ నెరవేరుతాయనే మన దృఢవిశ్వాసాన్ని సమావేశ కార్యక్రమం ఎంతగానో బలపరచింది. దేవుని ప్రవచన వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తూనే ఉండేందుకు మనం ప్రేరేపించబడ్డాము!