మీ పరిచర్యను విస్తృతపర్చుకునే మార్గాలు
1 “మీ శాయశక్తులా చేస్తున్నారా?” అనే శీర్షిక, 40 సంవత్సరాల కన్నా క్రిందట, జనవరి 15, 1955, కావలికోట (ఆంగ్లం)లో వచ్చింది. యెహోవా ప్రజలు తమ రాజ్య క్రియాశీలతను అధికం చేసుకోగల్గేందుకు పరిచర్యలో తమ వ్యక్తిగత కృషిని మెరుగుపర్చుకోవడం ఎలా సాధ్యమౌతుందన్నదాన్ని అది ప్రేమపూర్వకంగా చూపించింది. మనం మెరుగుపడడానికి శాయశక్తులా కృషిచేస్తూ ఉండగా, ఆ మంచి సలహా నేటికీ వర్తిస్తుంది.
2 “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను” గొప్ప ఆజ్ఞ మన సేవనంతటినీ పురికొల్పాలి. (మార్కు 12:30) యెహోవా రాజ్యపు పనిని పురోగమింపజేసేందుకు మనకు వచ్చే అవకాశాలను పూర్తిగా ఉపయోగించడం ద్వారా మనకు ఆయన మీద ఉన్న సంపూర్ణ ప్రేమను కనబరచుతాం. మీరు మీ పరిచర్యను విస్తృతం చేసుకోగల క్రింది మార్గాలను పరిశీలించండి.
3 మీ బాధ్యతను భుజాలకు ఎత్తుకోండి: సమర్పించుకున్న సహోదరులు పరిచర్య సేవకులయ్యే యోగ్యతను చేరుకోవడానికి శ్రమించగలరు, ఆ తర్వాత పెద్దలుగా సేవ చేసే దిశగా పురోభివృద్ధి చెందాలి. మే 1, 1991 కావలికోటలోని “మీరు చేరుకొనగల్గుచున్నారా?,” “సేవచేయుటకు మీరు అర్హత కల్గియున్నారా?” అనే శీర్షికలు అనేక మంది సహోదరులు సంఘ బాధ్యతల కోసం తమను తాము లభ్యం చేసుకునేందుకు పురికొల్పాయి. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు, దానికి ఎలా యోగ్యులుకావచ్చు అనే విషయంపై నిర్దిష్ట సలహాల కోసం మీ స్థానిక పెద్దలను అడగండి.
4 ఒంటరివారైన పెద్దలూ, పరిచర్య సేవకులూ పరిచర్య శిక్షణా పాఠశాలకు దరఖాస్తు పెట్టడాన్ని గురించి గంభీరంగా తలంచమని ఆహ్వానించబడ్డారు. 1986-1995, 1996, మరియు 1997ల వాచ్ టవర్ పబ్లికేషన్స్ ఇన్డెక్స్లలో “మినిస్టీరియల్ ట్రెయినింగ్ స్కూల్” క్రింద ఉన్న రెఫరెన్స్లను చదివి, ఈ పాఠశాల గురించి మీ అంతట మీరు తెలుసుకోగలరు. మీ ముందు ‘క్రియాశీలత’కు తెరవబడుతున్న పెద్ద ‘ద్వారము’ను మీరు చూస్తున్నారా? (1 కొరిం. 16:9, NW) ఈ ద్వారంలో ప్రవేశించిన అనేక మంది సహోదరులు, ఆ తర్వాత లభించనున్న సేవాధిక్యతలను వేటిని గురించీ కలలో కూడా అనుకోలేదు. నేడు బేతేల్లోనో, క్షేత్రంలో పయినీర్లుగానో, మిషనరీలుగానో, ప్రాంతీయ పైవిచారణకర్తలుగానో సేవ చేయడాన్ని ఆస్వాదిస్తున్నారు.
5 పూర్తికాల సేవ అనే లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి: హై స్కూల్ చదువు ముగియబోతున్నవారు, గృహిణులు, ఉద్యోగ విరమణ చేసినవారు పయినీరింగ్ గురించి గంభీరంగా తలంచాలి. జూలై 1998 మన రాజ్య పరిచర్యలోని ఇన్సర్ట్ను పునఃసమీక్షించి, ఆ తర్వాత, మీ జీవితంలోని పరిస్థితులను పోలిన పరిస్థితులు గల పయినీర్లతో మాట్లాడండి. వాళ్ళు పయినీరింగ్ చేస్తున్నట్లే, మీరు కూడా పయినీరింగ్ చేయడం ద్వారా మీ పరిచర్యను విస్తృతం చేసుకోవాలని మీరు పురికొల్పబడవచ్చు. (1 కొరిం. 11:1) నెలకు 70 గంటల మేరకు మీ క్రియాశీలతను విస్తృతపర్చుకుని, తద్వారా, మీరు ఒక క్రమ పయినీర్గా సేవ చేయడం మీకు సాధ్యమౌతుందా?
6 ప్రపంచవ్యాప్తంగా, బ్రాంచ్ ఆఫీసులలోనూ, బెతేల్ గృహాలలోను ఇప్పుడు 17,000 కన్నా ఎక్కువ మంది సహోదర సహోదరీలు సేవ చేస్తున్నారు. అలాంటి సేవకు దరఖాస్తు పెట్టేందుకు ఏమి అవసరమనే దానిని గురించి నవంబరు 1995 మన రాజ్య పరిచర్య చర్చిస్తోంది. ఆ ఇన్సర్ట్ను చదివి, బెతేల్ సేవ అనే అనుపమాన ఆధిక్యతకు మీరు యోగ్యులేనా అన్నది ఎందుకు పరిశీలించుకోకూడదు?
7 అవసరత ఎక్కువ ఉన్నచోట సేవించండి: మీరు నివసిస్తున్నది, మళ్ళీ మళ్ళీ పరిచర్య చేసి పూర్తి చేస్తున్న టెరిటరీ ఉన్న ప్రాంతమా, ప్రకటనా బాధ్యతను పంచుకునేందుకు ఎక్కువ మంది సహోదరులు ఉన్న ప్రాంతమా? అవసరం ఎక్కువున్న చోటికి తరలివెళ్ళి మీ పరిచర్యను విస్తృతం చేసుకోవడాన్ని గురించి మీరు ఎప్పుడైనా తలంచారా? తరలివెళ్ళగల్గేది, బహుశా, ఎక్కువ మంది పనివాళ్ళు అవసరమున్న దగ్గర్లోని పల్లె ప్రాంతానికే కావచ్చు. (మత్త. 9:37, 38) అయితే ఆ పనిని అనాలోచితంగా చేయవద్దు. ప్రార్థనాపూర్వకంగా ఆలోచించడం అవసరం. (లూకా 14:28-30) మీ పరిస్థితిని గురించి పెద్దలతోను, ప్రాంతీయ పైవిచారణకర్తతోను చర్చించండి. అలా తరలివెళ్ళడం ఇప్పుడు జ్ఞానయుక్తమా లేక భవిష్యత్తులో అలా చేయడానికి సిద్ధపడడం జ్ఞానయుక్తమా అన్న విషయాన్ని వాళ్ళు మీతో తర్కిస్తారు. మీరు ఎక్కడికి తరలివెళ్ళగలరు అనే విషయమై సూచనల కోసం మీరు సొసైటీకి వ్రాయాలనుకుంటే, మీ ఉత్తరంతో పాటు మీ సంఘ సేవా కమిటీ సంతకం చేసిన ఒక ఉత్తరం కూడా ఉండాలి.
8 మీ సేవా నాణ్యతను మెరుగుపర్చుకోండి: మన క్షేత్ర సేవ యొక్క నాణ్యతను మెరుగుపర్చుకోవడం ద్వారా మనమందరం పరిచర్యలో పూర్తి భాగాన్ని వహించవచ్చు. ఇంటింటి సేవ, అనియత సాక్ష్యం అలాగే, పునర్దర్శనాలూ, బైబిలు పఠనపు పని వంటి వాటితో సహా పరిచర్య యొక్క అన్ని రంగాల్లోను మీరు పాల్గొంటున్నారా? మీరు ఒక పఠనాన్ని నిర్వహిస్తున్నట్లయితే, మీరు మీ బోధనా కళను మెరుగుపర్చుకోగలరా? మీ విద్యార్థులను సమర్పణ, బాప్తిస్మాలకు పురికొల్పేందుకు ఉపయోగించగల సూచనల కోసం, జూన్ 1996 మన రాజ్య పరిచర్యలోని ఇన్సర్ట్ను పునఃసమీక్షించడం మంచిది.
9 మన పరిచర్యను విస్తృతం చేసుకుని, మెరుగుపరచుకునే మార్గాలను గురించిన మరింత విస్తృతమైన చర్చ మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరించబడియున్నాము అనే పుస్తకంలోని 9వ అధ్యాయంలో ఉంది. మనమందరం కూడా దేవుడి సేవలో మన శాయశక్తులా చేయాలని కోరుకోవాలి. మీ ఆధ్యాత్మిక లక్ష్యాల విషయమై ఎందుకు గంభీరంగా తలంచకూడదు? “నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము” అని 1 తిమోతి 4:15 సిఫారసు చేస్తున్నట్లు చేయండి.