కరపత్రాలు-సువార్తను సమర్పించే సరళమైన, ఫలవంతమైన మార్గం
1 దాదాపు 1881 నాటి నుండే యెహోవా ప్రజలు తమ పరిచర్యలో కరపత్రాలను ఉపయోగిస్తున్నారు. సహోదరుడు చాల్స్ తేజ్ రసల్ వాటి విలువను గ్రహించి, చట్టబద్ధమైన మన మొదటి కార్పొరేషన్‌కి వాచ్ టవర్ బైబిల్ ఆండ్ ట్రాక్ట్ సొసైటీ అని నామకరణం చేశారు. మరి మన విషయమేమిటి? కరపత్రాల ఉపయోగం మన పరిచర్యలో ముఖ్య భాగంగా ఉందా?
2 ముఖ్యంగా, 1987వ సంవత్సరం నుండి, కరపత్రాలను ఉపయోగించాలన్న విషయాన్ని సొసైటీ మళ్ళీ క్రొత్తగా నొక్కి చెబుతోంది. జీవితంలోని వేర్వేరు పరిస్థితుల్లో వ్యవహరించడానికి ప్రజలకు సహాయపడే వివిధ విషయాలపై అనేక కరపత్రాలను ప్రచురించింది. ఉదాహరణకు, బైబిలు, కుటుంబజీవితం, మనం జీవిస్తున్న ఈ కాలాల భావం, మరణ పునరుత్థానాలు, మానవజాతి భవిష్యత్తు వంటి ఎన్నో విషయాలపై చర్చించే కరపత్రాలు మన దగ్గర ఉన్నాయి.
3 మనలో చాలా మందికి ఈ కరపత్రాల్లో ఉన్న విషయాలతో పరిచయముంది, వాటిని బాగా ఫలవంతంగా ఉపయోగించాం కూడా. సముచితమైన ఒక కరపత్రాన్ని ఉపయోగిస్తూ, గృహస్థుడితో సంభాషణను ఆరంభించడం ఎంత సులభమో మనం గ్రహిస్తాం. ముఖ్యంగా, పరిచర్యకు క్రొత్తగా వస్తున్న వారి విషయంలో ఇది నిజం. తమ తల్లిదండ్రులు క్షేత్ర సేవా క్రియాశీలతల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళతో చేరి, కరపత్రాలను ప్రతిపాదించడంలో చిన్న పిల్లలు కూడా ఆస్వాదిస్తారు.
4 నేడు దాదాపు అన్ని భాషల్లోను కరపత్రాలు లభ్యం కావడం మనం లక్షలాది మందిని చేరుకోగల్గేలా చేస్తుంది. ఈ దేశంలో చదవగల ప్రతి ఒక్కరి చేతిలోనూ వారి వారి సొంత భాషలో మన కరపత్రాల్లో ఒకటి ఉంటే ఎంత బాగుంటుంది. కరపత్రాలను ఉచితంగా ఇస్తాం కాబట్టి, పేద ప్రజలు కూడా ప్రయోజనం పొందగల్గుతారు. వివిధ భాషల్లో ఉన్న వేర్వేరు కరపత్రాలను మనం అన్నివేళలా మనతోపాటు తీసుకువెళ్ళడం సులభం.
కరపత్రాలకు ఒక నెల - మే
5 ఈ నెల దేశవ్యాప్తంగా కరపత్రాలతో ప్రత్యేక ప్రచార పని చేపట్టాలని పథకం వేయబడుతోంది. ఇండియాలో, ప్రతి సంవత్సరం, మే నెలలో మనం చూసే రెండు విషయాలు: 1) బడి పిల్లలకు వార్షిక వేసవి సెలవులు ఉండేది ఈ నెలలోనే 2) చాలా మంది ప్రచారకులు సహాయ పయినీరింగ్ పరిచర్యలో పాల్గొనడాన్ని ఆస్వాదించే ఒక నెల ఇది. ఈ ప్రచార పని, మనకు వ్యక్తిగతంగా అనేక విధాలుగా సహాయపడడమే కాక, మన పొరుగువాళ్ళకు ఆధ్యాత్మిక ప్రయోజనాలను తెస్తుంది కూడా. ప్రపంచవ్యాప్తంగా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఇచ్చిన నిర్దేశాన్ని అనుసరించడంలో, మన సహోదర సహోదరీలు ప్రజలను కనుగొనగల చోటికి వెళ్ళి వారిని కలుసుకునే మార్గాల కోసం కృషిచేస్తున్నారు. (మత్త. 24:45-47) ఎటువెళ్ళినా ప్రజలు కనిపించే ఇండియాలాంటి టెరిటరీలో మనం ఉండడం ఎంత శ్రేష్ఠమైన ఆధిక్యత. కనుక, కరపత్రాన్నివ్వాలనే స్పృహగలవారమై, అన్నివేళలా వాటిని ఉపయోగించడం ద్వారా, మనం వాటిని బాగా ఉపయోగిస్తాం. ఇందుకు, వేర్వేరు అంశాలను చర్చించే వేర్వేరు భాషల్లోని కరపత్రాలను మనం ఎప్పుడూ ఉంచుకోవాలి. ప్రజలతో మాట్లాడేటప్పుడు, ఒకే విధంగా సమీపించక, వివిధ పద్ధతులను ఉపయోగించేందుకు సిద్ధపడి ఉండాలి.
6 ప్రస్తుతం, కొంత మంది సహోదర సహోదరీలు ఇంటింటి పరిచర్యలోను, వీధుల్లోను, బస్స్టాప్లలోను కరపత్రాలను చక్కగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు, తమ తోటి ప్రయాణికులకే కాక, బస్ డ్రైవర్లకూ, ఆటో డ్రైవర్లకూ, టాక్సీ డ్రైవర్లకూ అందిస్తారు. ఇటీవలే, ఇండియాలోని ఒక సహోదరి బస్సులో ప్రయాణిస్తుండగా, తోటి ప్రయాణికురాలితో స్నేహభావంతో సంభాషణ జరిపింది. ఆ మహిళ ఆ సంభాషణలో, ఆ సహోదరితో అవినీతి గురించి మాట్లాడింది. అది, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము అనే కరపత్రాన్ని చూపించి, అందులో ఉటంకించబడిన ప్రకటన 21:4 వైపుకు ఆమె అవధానాన్ని మళ్ళిస్తూ, రాజ్యాన్ని గురించి మాట్లాడేందుకు అవకాశాన్ని కలుగజేసింది. ఆ మహిళ ఆ సందేశంలో ఎంతో ఆసక్తిని చూపించి, తన పేరును, చిరునామాను ఇచ్చి, తన ఇంటికి రమ్మని సహోదరీని కోరింది. తమ ఉద్యోగ స్థలాల్లో తోటి ఉద్యోగులకు క్లుప్తమైన సాక్ష్యమివ్వడంలో ఉపయోగించేందుకు కరపత్రాలు చాలా అత్యుత్తమమని చాలా మంది ప్రచారకులు కనుగొంటారు. అవును, అవి చూడడానికి చిన్నగా కనిపించినా వాటిలో ఉండే క్లుప్తమైన సందేశం, నీతివైపుకు మ్రొగ్గుచూపే వ్యక్తులను నిత్యజీవానికి యోగ్యులయ్యే వ్యక్తులను గుర్తించడంలో చాలా ముఖ్యమైన పాత్రను వహిస్తుంది.
మీ అందింపులను మెరుగుపర్చుకునేందుకు కరపత్రాలను ఉపయోగించడం
7 అనేక కరపత్రాలను అలా ఉపయోగించడం, ఎక్కువ మంది ప్రజలను కలిసేందుకు సహాయపడడమే కాక, అనేక విషయాలపై క్లుప్తంగా, స్పష్టంగా, నిర్దిష్టమైన విధంగా, సంభాషణా రూపంలో సువార్తను అందించేందుకు అది మనకు తర్ఫీదునిస్తుంది. కనుక, మే నెలలో మనం కరపత్రాలను ఉపయోగిస్తూ, సువార్తతో చాలా మందిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ప్రజలతో సంభాషించడం ద్వారా అలా చేయడమెలాగో నేర్చుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేద్దాం. మనం మన హృదయాంతరం నుండి మన శ్రోతల హృదయాలతో మాట్లాడే కళను నేర్చుకోవలసిన అవసరం ఉంది. మనం వివిధ పుట్టుపూర్వోత్తరాలూ, వివిధ నమ్మకాలూ గల ప్రజలను కలుస్తాం. అందుకనే, “చక్కటి మాటలు” ఉపయోగిస్తూ, వారిని ఎలా సమీపించాలో మనం నేర్చుకోవాలి. (లూకా 4:22, పరిశుద్ధ బైబల్) మనం ప్రజలను బలవంతపెట్టం కాని, ఆసక్తి చూపించేవారు ఉత్తరాపేక్షను కలిగి ఉండేలా సహాయం చేసేందుకు చక్కటి మాటలను ఉపయోగిస్తాం. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, మనం “అందరికి అన్నివిధముల” వాళ్ళం కావాలని కోరుకుంటాం.—1 కొరిం. 9:22.
8 మనం అన్నిచోట్లా అలవాటుగా నిర్దిష్టమైన ఒక ప్రసంగాన్నే ఇస్తున్నామంటే, అది మన హృదయం నుండి రావడం లేదన్నమాట. గృహస్థులు కొంత కాలంగా తాము కలిసిన వేర్వేరు ప్రచారకులందరి దగ్గరి నుండి కూడా ఎప్పుడూ ఒకటే సందేశాన్ని వింటున్నట్లయితే, అది వాళ్ళకు చికాకు కలిగించవచ్చు, వాళ్ళు వ్యతిరేకించేలా కూడా చేయవచ్చు, దాని ఫలితంగా, వాళ్ళు మనతో అమర్యాదగా ప్రవర్తించవచ్చు. మన కుటుంబ సభ్యుల్లోని ఒకరు రోజంతా ఒకటే రాగం పాడుతున్నట్లయితే, లేదా మన పొరుగువాళ్ళు ఒకే సంగీతాన్ని మళ్ళీ మళ్ళీ ప్లే చేస్తున్నట్లయితే, మనం ఎలా భావిస్తాం? లేదా ఆ మాటకొస్తే, మన పరిచయస్థుల్లో ఒకరు చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ చెబుతున్నట్లయితే మనం ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం? మన టెరిటరీల్లో ఉన్న ప్రజలు, ప్రతిసారీ ఒకే అందింపును వింటున్నట్లయితే, యెహోవా దేవుడి గురించీ, ఆయన వాక్యమైన బైబిలును గురించీ వాళ్ళు ఏ అభిప్రాయానికి వస్తారు?
9 ఈ నెల, కరపత్రాలతో చేసే ప్రచారపనిలో పూర్తి భాగం కలిగి ఉండడం, ఈ విషయంలో ప్రతి ఒక్కరికీ అపారమైన సహాయంగా ఉంటుంది. మీరు ప్రచారకుడుగా క్రొత్తగా మొదలుపెడుతున్నట్లయితే, మీతో బైబిలు పఠిస్తున్నవారితో కలిసి ఆ కరపత్రాలను పఠించేందుకు సమయాన్ని తీసుకుని, వాటిలో ఉన్న విషయాలను మీ టెరిటరీలో ఎలా ఉపయోగించవచ్చు అనే దాని గురించి చర్చించండి. ‘పయినీర్లు ఇతరులకు సహాయపడతారు’ అనే కార్యక్రమం క్రింద మీరు ఒక పయినీర్ సహాయాన్ని తీసుకుంటున్న పయినీర్ అయితే, కరపత్రాలను ఉపయోగించడంలో కూడా సహాయాన్ని ఎందుకు తీసుకోకూడదు? మీరూ, మీకు సహాయపడుతున్న పయినీరూ, సువార్తను సమర్పించడంలో కరపత్రాలను ఫలవంతంగా ఉపయోగించడానికి అభ్యాసం చెయ్యగలరు. తల్లిదండ్రులారా, మీరూ, మీ పిల్లలూ క్షేత్ర పరిచర్యలో పాల్గొన్నప్పుడు ఈ కరపత్రాల్లో ప్రతి ఒక్క దాన్నీ ఉపయోగించగల్గాలన్నదాన్ని ఒక కుటుంబ ప్రాజెక్ట్‌గా చేసుకుని, ఆ విధంగా చేయగల్గేందుకు కృషి చేయండి. వాస్తవానికి, ప్రచారకులందరూ, కరపత్రాలను మరింత ఫలవంతంగా అందించేందుకు ప్రత్యేకంగా కృషి సల్పవచ్చు. తర్కించుట పుస్తకం మంచి ఉపకరణం. మన టెరిటరీకి తగిన అందింపులను తయారు చేసుకునేందుకు మనం ఆ పుస్తకం నుండి సహాయాన్ని తీసుకోవాలి. అలాగే కరపత్రాలను ఉపయోగించడాన్ని గురించి చర్చించే మన రాజ్య పరిచర్య గత సంచికలను మనం చూసుకోవచ్చు. ఆగస్టు 1993 పేజీలు 3-4; ఫిబ్రవరి 1991 పేజీ 4; ఫిబ్రవరి 1990 పేజీ 4 చూడండి.
10 ఈ కరపత్రాల్లో కొన్నింటిని చూపించగల కొన్ని మార్గాలు:
బైబిలును మీరెందుకు నమ్మవచ్చును?
మామూలుగా పలకరించిన తర్వాత, మీరు “ఇప్పుడు బైబిలు రెండువేల కన్నా ఎక్కువ భాషల్లో లభ్యమౌతున్నా, చాలా తక్కువ మంది మాత్రమే ఆసక్తి చూపించడానికి గల కారణమేమై ఉంటుందని మీరనుకుంటున్నారు?” అని మీరు అడగవచ్చు. [ప్రతిస్పందించనివ్వండి] ఆ తర్వాత, “బైబిలును పఠించిన తర్వాత, ఇది చరిత్ర అంతటిలోనూ తరచూ తప్పుగా చిత్రీకరించబడిన ఒక గ్రంథమని మేము గ్రహించాం. సమస్త ప్రజల కోసం అందులో ఉన్న అత్యంత సరళమైన శైలిలో తెలియజేయబడిన సందేశాన్ని మీకు చూపించనాండీ?” అని అంటూ కొనసాగించండి. తర్వాత, 5వ పేజీలో ‘భవిష్యత్తును ప్రవచించుట’ అనే ఉపశీర్షికవైపుకు గృహస్థుని అవధానాన్ని మళ్ళించగలరు. ఈ కరపత్రపు 5, 6 పేజీల్లో ఉన్న చివరి నాలుగు పేరాలను పరిశీలించండి. క్లుప్త సంభాషణ తర్వాత, ఒక పత్రికను గానీ, దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ను గానీ ప్రతిపాదించవచ్చు.
యెహోవాసాక్షులు ఏమి నమ్ముతారు?
ఒకసారి సముచితంగా పలకరించుకోవడాలు జరిగిన తర్వాత, కరపత్రాన్ని ఉపయోగిస్తూ, “సమాజంలోని ప్రజలందరూ సమాధానంగా కలిసి జీవించడానికి ఏమి సహాయపడుతుందని మీరనుకుంటున్నారు?” అని ప్రశ్నించడం ద్వారా, మనం సంభాషణను ప్రారంభించవచ్చు. [ప్రతిసందించనిచ్చి] ఆ తర్వాత, “ఒకరి నమ్మకాలనూ, జీవన శైలినీ మరొకరు తెలుసుకోవడం మంచి అవగాహనకు నడిపిస్తుందని యెహోవాసాక్షులముగా మేము నమ్ముతున్నాం. ఈ విషయంలో మీరేమనుకుంటారు?” అని అనవచ్చు. [ప్రతిస్పందించనిచ్చి] ఆ తర్వాత, ఇంకా సంభాషణ కొనసాగడానికి, “సమాజంలో మేము కూడా భాగమే కనుక, మా గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కనుక, మేము ఈ కరపత్రాన్ని తయారు చేశాం. మేము ఎవరము, మా నమ్మకాలు ఏంటి అనే దాని గురించి మీరు తెలుసుకోవడానికి సహాయపడేందుకు మేము దీనిని మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం” అని మీరనవచ్చు. ఈ కరపత్రం నుండి మీరు ఒక నిర్దిష్టమైన అంశాన్ని ఉన్నతపర్చి చెప్పవచ్చు లేదా మీరు తిరిగి వెళ్ళి మరింత వివరించేందుకు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
శాంతియుతమైన నూతనలోకంలో జీవితము
మీరు మొదట పలకరించుకోవడాలు జరిగిన తర్వాత, “ఈ రోజు మేము ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరినీ కలవడానికి ప్రయత్నిస్తున్నాం. మిమ్మల్ని మీ ఇంట్లో కలిసినందుకు చాలా సంతోషిస్తున్నాం. మాకు ఒక ప్రశ్న ఉంది, మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఇండియాలో చాలా మంది వేర్వేరు దేవుళ్ళను ఆరాధిస్తారు, అయినా, సమస్త జీవజాలాల్లోనూ జీవం పోసిన ఒక సర్వోన్నతుడున్నాడన్నదే వాళ్ళలో చాలామంది అభిప్రాయం. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా?” అని అనవచ్చు. [ప్రతిస్పందించనివ్వండి] తర్వాత, “భూమినీ, దానిపైనున్న సమస్తమునూ సృష్టించడంలో ఆ సర్వోన్నతుడి ఉద్దేశమేమై ఉంటుందని మీరు అంటారు?” అని మీరనవచ్చు. ఇది, భూమి మానవునికోసమూ, మానవుడు భూమి మీద నిరంతరం జీవించే నిరీక్షణతో భూమి కోసం సృష్టించబడడం జరిగిందని చూపించడానికీ, ఈ కరపత్రంలో ఉన్న సమాచారాన్ని చర్చించడానికీ నడిపిస్తుంది. మొదటి మూడు పేరాలను చర్చించిన తర్వాత, చర్చను కొనసాగించేందుకు తిరిగివెళ్ళే ఖచ్చితమైన ఏర్పాట్లను చేసుకోండి.
మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?
మీరు సమీపించగల ఒక పద్ధతి: “మరణమనేది ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసిందేనని మనం ఒప్పుకుంటున్నా, అది సహజమైనదని మీరనుకుంటారా?” అని అడగండి. [ప్రతిస్పందించనివ్వండి] తర్వాత, “ఇది సహజమైనది కాదు కనుకనే, మనం మరణించాలని కోరుకోవడం కానీ అపేక్షించడం కానీ చేయము. ప్రజలు చనిపోయిన తమ ప్రియుల గురించి విలపించడమే కాక, వాళ్ళు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట జీవిస్తుంటారని ఆశిస్తారు. ఈ విషయంలో అనేక బోధలున్నాయి. చనిపోయిన మన ప్రియతమ వ్యక్తులను మళ్ళీ కలవడం సాధ్యమేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా?” అని కూడా మీరనవచ్చు. తర్వాత, రెండవ పేజీలోని 1-3 పేరాలను చూపించండి. పునరుత్థాన నిరీక్షణను పేర్కొంటూ ముగించండి. పునరుత్థాన నిరీక్షణను గురించి చర్చించడానికి అపాయింట్మెంట్ను తీసుకోండి.
మీరు ఉచిత గృహ బైబిలు పఠనాన్నీ నేరుగా ప్రతిపాదించాలనుకోవచ్చు. కరపత్రాల్లో దేనినైనా ఉపయోగిస్తూ బైబిలు పఠనాన్ని ప్రదర్శించవచ్చు.
ప్రాణాలను కాపాడే సంభాషణలు
11 ఈ ప్రచార పని అనేకులను జీవానికి తీసుకువెళ్ళే మార్గం వైపుకు నడుపుతుందనడానికి సందేహమే లేదు. మనం కలిసే ప్రజలతో అనేక ఆసక్తికరమైన సంభాషణలను ఆస్వాదించే అవకాశాలు మనకుంటాయి. మనకు వాళ్ళు గృహస్థులు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ, చాలా మటుకు, వాళ్ళకు బొత్తిగా పరిచయంలేని వాళ్ళం. మనం వాళ్ళను గాయపరచకుండా ఉండేందుకు మనం వాళ్ళతో ఏం మాట్లాడుతున్నామన్న విషయంలో జాగ్రత్తపడాలి. కనుక, మనం మన ఉపోద్ఘాతాలకు శ్రద్ధతో కూడిన అవధానాన్ని ఇచ్చి, స్థానిక అవసరాలకు మాత్రమే కాక, టెరిటరీలో ప్రబలి ఉన్న పరిస్థితులకు తగ్గట్లుగా మలుచుకోవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం క్రైస్తవమత సామ్రాజ్యంలోని వ్యక్తులకూ మనకూ తేడా ఏమీ లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నామా లేక, యెహోవాసాక్షులముగా మనం భిన్నంగా కనిపిస్తున్నామా? మన అందింపులు, మనం ఏదో ఒక రాజకీయ పార్టీ పక్షానికి మ్రొగ్గుచూపుతున్నామన్న అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయా? లేదా, మనం స్థిరంగా తటస్థంగా ఉంటామనీ, యెహోవా అనుమతించిన ఏ విధమైన ఉన్నతాధికారానికైనా సాపేక్షికంగా లోబడతామనీ ప్రజలు స్పష్టంగా గ్రహిస్తున్నారా?
12 బైబిలు సూత్రాలను అనుసరించేవారనీ, నిజాయితీగలవారనీ, కష్టించి పనిచేసేవారనీ, ఉన్నత నైతిక ప్రమాణాలను కాపాడుకునేవారనీ యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారు. అప్పుడప్పుడు, అపార్థాల వల్ల, ఆ సమయంలో ప్రజల మధ్య ప్రబలివున్నట్లు అనిపించిన అభిప్రాయాలను బట్టి కొందరు తప్పుగా ఆరోపించారు. అలాంటి తప్పుడు తలంపును సరిచేసేందుకు, మొదటి శతాబ్దంలో, యేసుక్రీస్తు తన పరిచర్యలో ప్రజలతో తన వ్యవహారాలన్నింటిలో ప్రదర్శించినట్లే, మనం సంభాషణ జరిపేవారముగా, దయగలవాళ్ళముగా, లౌక్యంగలవాళ్ళముగా ఉండవలసిన అవసరముంది. ఈ నెలలో, మనం కరపత్రాలను ఉపయోగిస్తూ ప్రజలతో సంభాషించడం ద్వారా వారి అపార్థాలను తొలగించడానికి మనం సహాయం చేయగలం.