“నేనేం చేయాలి?”
1 యుక్తవయస్సులోకి అడుగుపెడుతున్న ఒక యౌవనుడుగా మీరు, ‘నా జీవితంతో నేనేం చేయాలి?’ అని ప్రశ్నించవచ్చు. పరిచర్యలో యెహోవాకు చేసే తమ సేవను అధికం చేయాలని క్రైస్తవ యౌవనులు అనుకుంటారు. కానీ మీరు దాన్ని, యుక్తవయస్సులో ఉండే బాధ్యతలను చేబడుతూ కూడా ఎలా చేయవచ్చు? ఆ బాధ్యతల్లో ఒకటైన మీ సొంత వస్తు సంబంధ అవసరాలను తీర్చుకుంటూ కూడా ఎలా చేయవచ్చు? సమాధానం కనుగొనడం అంత సులభమైన విషయం కాకపోవచ్చు.
2 కొంతమంది యౌవనులు ప్రపంచ ఆర్థిక పరిస్థితినీ, భవిష్యత్తుకు సంబంధించిన ఊహాగానాలనూ పరిశీలించినప్పుడు, వాళ్లు వ్యాకులపడుతున్నారు. ‘నేను అదనపు లౌకిక విద్యను అభ్యసించాలా? నేను పూర్తికాల సేవలోకి ఇప్పుడే ప్రవేశించాలా?’ అని వాళ్లు అనుకోవచ్చు. సరియైన నిర్ణయాన్ని తీసుకునేందుకు, ‘జీవితంలో నేను అత్యంత శ్రద్ధను చూపించే విషయమేమిటి?’ అని ఒకరు తనను తాను నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అతడు తన ఉద్దేశాలను పరిశీలించుకోవాలి.
3 మీ యౌవనదశలో మీ ముఖ్య శ్రద్ధగా దేన్ని పెంపొందించుకుంటున్నారు? ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలను వెదకడంపైనే మీరు ప్రధానంగా శ్రద్ధ చూపిస్తున్నారా లేక రాజ్యాసక్తులను పెంపొందించేందుకు మీ జీవితాన్ని ఉపయోగించాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా? యూనివర్శిటీ డిగ్రీ, ఉద్యోగాల విపణిలో విజేతలమవుతామన్న గ్యారంటీ ఇవ్వదు. దానికి ప్రత్యామ్నాయంగా, అప్రంటిషిప్ కోర్సుల ద్వారా, కొన్ని వృత్తి విద్యా కోర్సుల ద్వారా లేక టెక్నికల్ విద్యా కోర్సుల ద్వారా, లేక షార్ట్‌టర్మ్ కాలేజి కోర్సుల ద్వారా అనేకమంది ఉద్యోగాలను సులభంగా సంపాదించడానికి అవసరమయ్యే నైపుణ్యాలను తక్కువ కాలంలో పెద్ద ప్రయత్నంలేకుండా పొందుతారు.
4 యెహోవా వాగ్ధానాలయందు నమ్మిక ఉంచండి: ఆలోచించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన వాస్తవం, జీవితంలో రాజ్యాసక్తులను ముందుంచే వారికి అవసరమైన వాటిని తాను దయచేస్తానని యెహోవా దేవుడు ఇచ్చిన అభయమే. (మత్త. 6:33) ఇది ఆధారంలేని వాగ్దానం కాదు. పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయిన అనేక మంది సహోదరులు, సత్యాన్ని తెలుసుకోకముందే కాలేజి డిగ్రీలను పొందారు. కానీ వాళ్లు లౌకికంగా ఎటువంటి ఉద్యోగం చేస్తుండేవారు? చాలా కొద్దిమంది మాత్రమే వారి విద్యకు తగ్గ ఉద్యోగాన్ని చేస్తుండేవారు. పయినీరు సేవచేస్తూనే అనేకమంది తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం సర్వీస్ ఓరియంటెడ్ పనులను చేస్తూవుండేవారు. పరిచర్యలో తమ కార్యక్రమాన్ని విస్తృతపర్చుకోవడం ద్వారా, వాళ్లు డబ్బు తీసుకురాలేని ఆశీర్వాదాల్ని పొందుతున్నారు.
5 హై స్కూలు చదువు పూర్తైన తర్వాత ఏమి చేయాలో నిర్ణయించు కొనేటప్పుడు, పరిస్థితులను అన్నింటినీ విచారించి, మీ ఉద్దేశాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీరు చేసుకునే ఎంపికలలో సమతూక దృక్పథాన్ని కల్గివుండడం కోసం, తేజరిల్లు! మార్చి 8, 1998, 19-21 పేజీలలో ఉన్న సమాచారాన్ని పరిశీలించండి. మీ తల్లిదండ్రులతోనూ, పెద్దలతోనూ, మీ ప్రాంతీయ పైవిచారణకర్తలతోనూ, మీ ప్రాంతంలో మంచి ఫలితాలు సాధించిన పయినీరులతోనూ మాట్లాడండి. అది, మీరు మీ జీవితంతో ఏం చేయాలి అనే విషయంలో జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయపడుతుంది.—ప్రసం. 12:1, 13.