యెహోవా సేవను కేంద్రంగా చేసుకొని మీ జీవితాన్ని నిర్మించుకోండి
1 యేసు తాను చెప్పేవాటిని వినే వ్యక్తుల్ని రెండు రకాల నిర్మాణకులతో పోల్చాడు. అందులో ఒక నిర్మాణకుడు తన జీవన మార్గాన్ని, క్రీస్తు పట్ల విధేయత అనే బండపై నిర్మించుకున్నాడు. తుఫాను వంటి వ్యతిరేకతల్నీ, శ్రమల్నీ తట్టుకొని నిలవగలిగాడు. రెండో నిర్మాణకుడు తన జీవన మార్గాన్ని స్వార్థపూరితమైన అవిధేయత అనే ఇసుక మీద నిర్మించుకున్నాడు. ఒత్తిడి వచ్చినప్పుడు, దానికి తాళుకొని నిలబడలేకపోయాడు. (మత్త. 7:24-27) ఈ విధానాంతపు ముగింపులో జీవిస్తుండగా, మనం తుఫాను వంటి అనేక ప్రతికూల పరిస్థితులను అనుభవిస్తాం. మహాశ్రమ అనే కారుమబ్బులు అతివేగంగా కమ్ముకుంటున్నాయి. అంతం వరకు సడలని విశ్వాసంతో మనం సహిస్తామా? (మత్త. 24:3, 13, 21) అది, మనం మన జీవితాల్ని ఇప్పుడు ఎలా నిర్మించుకుంటున్నామనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కాబట్టి, ‘దేవునికి విధేయతతో చేసే సేవను కేంద్రంగా చేసుకొని, నేను నా క్రైస్తవజీవితాన్ని పటిష్టంగా నిర్మించుకుంటున్నానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం అత్యంతావశ్యకం.
2 యెహోవా సేవను కేంద్రంగా చేసుకొని, మన జీవితాల్ని నిర్మించుకోవడమంటే అర్థమేమిటి? దానర్థం ఏమిటంటే, మన జీవితాల్లో యెహోవాను ముఖ్య కేంద్రంగా చేసుకోవడమే. ఇందులో, మన ప్రధానమైన శ్రద్ధగా దేవునిరాజ్యంపై దృష్టిని కేంద్రీకరించడం కూడా చేరివుంది. మన దైనందిన జీవిత కార్యకలాపాలన్నింటిలో దేవునికి విధేయత చూపించడం కూడా ఇమిడి ఉంది. దానికి మన వ్యక్తిగత, కుటుంబ బైబిలు పఠనంలోనూ, సంఘ బైబిలు పఠనంలోనూ అలాగే మన క్షేత్ర పరిచర్యలోనూ మన హృదయాన్ని కుమ్మరించడం అవసరం, వాటికి ప్రాధాన్యతను ఇవ్వాలి. (ప్రసం. 12:13; మత్త. 6:33) విధేయతతో కూడిన అలాంటి జీవన విధానం, బండలా స్థిరంగా ఉండే విశ్వాసం మూలంగానే కల్గుతుంది. అది, బహుశా తుఫానుల వంటి ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు తలెత్తినా వాటిని ఎదుర్కోలేక కుప్పకూలిపోదు.
3 యేసు చేసినట్లుగానే, లక్షలాది మంది ప్రజలు దేవుని సేవను కేంద్రంగా చేసుకొని భవిష్యత్ కొరకైన తమ జీవితాలనూ, తమ నిరీక్షణలనూ నమ్మకంగా నిర్మించుకోవడాన్ని చూడడం ఎంత ఆహ్లాదకరం. (యోహా. 4:34) వాళ్లు, దైవపరిపాలనా కార్యకలాపాల కోసం వేసుకున్న క్రమమైన షెడ్యూల్ తప్పిపోకుండా అనుసరిస్తారు. తత్ఫలితంగా, గొప్ప ఆశీర్వాదాలను పొందుతారు. తమ ఇద్దరు కొడుకులూ యెహోవా సేవచేసేలా వారిని, తానూ తన భర్తా కలిసి ఎలా విజయవంతంగా పెంచామో అన్న విషయాన్ని ఒక తల్లి ఇలా వివరించింది: “సమావేశాలన్నింటికీ వెళ్ళడం, కూటాలకు తయారై, హాజరు కావడం, అలాగే క్షేత్రసేవను మా జీవితాల్లో ఒక క్రమమైన భాగంగా చేసుకోవడం ద్వారా మా జీవితాలను సత్యంతో నింపుకున్నాం.” ఆమె భర్త ఇంకా ఇలా అన్నాడు: “సత్యం మా జీవితంలో ఒక భాగం కాదు, సత్యమే మా జీవితం. జీవితంలోని ప్రతీదీ దానిచుట్టూ పరిభ్రమిస్తుంది.” మీరూ మీ కుటుంబంలో యెహోవా సేవకు అదేవిధంగా ప్రముఖ స్థానాన్ని ఇస్తున్నారా?
4 ఆచరణాత్మకమైన వారపు షెడ్యూల్‌ను వేసుకోండి: యెహోవా సంస్థ, వారంలో ఐదు కూటాలను ఏర్పాటు చేయడం ద్వారా, చక్కని ఆధ్యాత్మిక క్రమాన్ని అనుసరించేలా మనకు సహాయం చేస్తోంది. యెహోవా ఆరాధనను కేంద్రంగా చేసుకొని తమ జీవితాల్ని నిర్మించుకునే క్రైస్తవులు, ప్రాముఖ్యమైన ఈ కూటాలన్నింటికీ హాజరయ్యేలా ఉద్యోగ సంబంధమైన, కుటుంబ సంబంధమైన తమ వ్యవహారాలను ఏర్పాటు చేసుకోవాలి. కూటాలకు క్రమంగా హాజరవ్వకుండా అడ్డగించేలా జోక్యం చేసుకునేందుకు తక్కువ ప్రాముఖ్యతగల విషయాల్ని వాళ్లు అనుమతించకూడదు.—ఫిలి. 1:10; హెబ్రీ. 10:25.
5 ప్రతీరోజు వేళకు క్రమంగా ఆహారాన్ని తీసుకోవడం ప్రాముఖ్యమని గుర్తించినట్టుగానే వ్యక్తిగత, కుటుంబ పఠనాల కోసం, వాటితోపాటు కూటాలకు సిద్ధపడడం కోసం నిర్దిష్టమైన షెడ్యూల్‌ని వేసుకోవడం కూడా ప్రాముఖ్యమని పరిణితి చెందిన క్రైస్తవులు గుర్తిస్తారు. (మత్త. 4:4) వ్యక్తిగత పఠనం కోసం ప్రతీరోజూ కనీసం 15 నిమిషాల్ని లేదా 20 నిమిషాల్ని కేటాయించగలరా? దానికి కీలకమేమిటంటే, వ్యక్తిగత పఠనం కోసం కేటాయించిన సమయాన్ని హరించివేసేలా ఇతర విషయాల్ని అనుమతించకపోవడమే. దాన్నొక ప్రయోజనకరమైన అలవాటుగా చేసుకోండి. దానికి, మీరిప్పుడు ఉదయాన్నే లేచే సమయానికన్నా మరి కాస్త పెందలకడనే లేవడం అవసరం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 17,000 మంది బేతేలు కుటుంబ సభ్యులు, దినవచనాన్ని చర్చించడానికై ప్రతి ఉదయం పెందలకడనే లేస్తారు. పెందలకడనే లేవడానికి, రాత్రిపూట వేళకు నిద్రపోవడం అవసరమౌతుంది, అది మరుసటిరోజును ఉల్లాసంగా ప్రారంభించేలా చేస్తుంది.
6 మీరు కుటుంబ శిరస్సైతే, కుటుంబ దైవపరిపాలనా కార్యక్రమ షెడ్యూల్‌ని పథకం వేసుకొని, దాన్ని సంస్థీకరించేందుకు చొరవ తీసుకోండి. కొన్ని కుటుంబాలు, సాయంత్రం వేళ భోజనానంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో బైబిల్నీ, వార్షిక పుస్తకమునూ (ఆంగ్లం), లేదా మరో ప్రచురణను కుటుంబ సమేతంగా పఠిస్తాయి. తమ పిల్లలు ఆధ్యాత్మికంగా బలమైన క్రైస్తవులుగా ఎదగడాన్ని చూసిన అనేకమంది తల్లిదండ్రులు, తమ విజయానికి దోహదపడిన ఒక కారణం, సరదాగా గడిపేందుకు ప్రతీవారం ఓ సాయంత్రం పూటను కేటాయించే కుటుంబ ఆచారమేననీ, ఆ సమయంలో తాము క్షేమాభివృద్ధికరమైన ఆధ్యాత్మిక విషయాలను చర్చించడంలో ఆనందించామనీ తెలియజేసారు. అలాంటి ఒక తండ్రి “దాదాపు 30 ఏళ్ల క్రిందట ఆరంభమైన బుధవారం రాత్రిపూట క్రమంగా జరుపుకునే కుటుంబ పఠనమే మా పిల్లల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఎక్కువగా తోడ్పడిందని నేను భావిస్తున్నాను” అని చెప్పాడు. ఆయన పిల్లలు ముగ్గురూ పిన్న వయస్సులోనే బాప్తిస్మం తీసుకున్నారు, ఆ తర్వాత వాళ్లు ముగ్గురూ పూర్తికాల పరిచర్యలో ప్రవేశించారు. కుటుంబ పఠనంతోపాటుగా, క్షేత్ర పరిచర్య అందింపులనూ, కూటాల భాగాల్నీ రిహార్సల్ వేసుకోవచ్చు, మరితర క్షేమాభివృద్ధికరమైన కార్యకలాపాలను చేయడం ద్వారా కుటుంబ సమేతంగా ఆనందించవచ్చు.
7 మీ వారపు షెడ్యూల్లో, రాజ్య ప్రకటనా పని కోసం ‘సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం’ చేసుకున్నారా? (కొలొ. 4:5) శ్రద్ధ చూపించాల్సిన కుటుంబ, సంఘ బాధ్యతలను కల్గివుంటూ మనలో అనేకులం బిజీగా జీవితాల్ని గడుపుతున్నాం. ప్రకటించే, బోధించే పనుల్లో వారం వారం భాగంవహించేలా మనం నిర్దిష్టమైన ఏర్పాట్లను చేసుకోకపోతే, ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడానికి కేటాయించే సమయాన్ని ఇతర విషయాలు సులభంగా ఆక్రమించుకుంటాయి. ఒక పశుపాలనా క్షేత్రపు యజమాని ఇలా చెప్పాడు: “నేను సేవలో భాగంవహించడానికి ఉన్న ఏకైక మార్గం, అలా భాగంవహించడం కోసం ఒకానొక రోజును షెడ్యూలు వేసుకోవడమేనని 1944 ప్రాంతంలో గ్రహించాను. ఈ రోజు వరకూ కూడా సేవలో భాగంవహించడం కోసం వారంలో ఒక రోజు సెలవు తీసుకుంటాను.” సాక్ష్యమిచ్చే పనిలో భాగంవహించేందుకు ఖచ్చితమైన షెడ్యుల్‌ను వేసుకోవడం, తాను సగటున నెలకు 15 గంటలు చొప్పున ప్రకటనా పనిలో గడపేలా సహాయపడినట్టు క్రైస్తవ పెద్దొకరు గ్రహించారు. శనివారంనాడు ఆయనకు వ్యాపార సంబంధమైన పనులేవైనా ఉన్నట్లయితే, షెడ్యూల్లో వాటికి కావాల్సిన సమయాన్ని ఉదయంపూట క్షేత్ర పరిచర్యానంతరమే కేటాయిస్తాడు. మీరూ, మీకుటుంబ సభ్యులూ ప్రతీ వారం కనీసం ఒక్క రోజైనా క్షేత్రసేవలో గడపడాన్ని మీ ఆధ్యాత్మిక జీవన మార్గంలో ఒక భాగంగా చేసుకొంటూ, దాన్ని షెడ్యూల్ వేసుకోగలరా?—ఫిలి. 3:16.
8 మీ దైనందిన జీవిత క్రమాన్ని పరిశీలించుకోండి: యెహోవా సేవను కేంద్రంగా చేసుకొని మన జీవితాలను నిర్మించుకోవడానికి విరుద్ధంగా పనిచేసేవి అనేకం ఉన్నాయి. పఠనం కోసం, కూటాల కోసం, సేవ కోసం జాగ్రత్తగా వేసుకున్న మన ప్రణాళికాబద్ధమైన షెడ్యూల్‌ని ఎదురు చూడని పరిస్థితులు ఆటంకపర్చవచ్చు. మన శత్రువైన సాతాను మనల్ని ‘అడ్డగించడానికీ,’ మన ప్రణాళికలకు విఘాతం కల్గించడానికీ తాను చేయగల్గినంతా చేస్తాడు. (1 థెస్స. 2:18, పరిశుద్ధ బైబల్; ఎఫె. 6:12, 13) మీరు విడిచిపెట్టేలా మిమ్మల్ని నిరుత్సాహపరిచేందుకు ఆ ఆటంకాలను అనుమతించకండి. మీరు షెడ్యూలు వేసుకున్న దైవపరిపాలనా కార్యకలాపాల్ని నెరవేర్చేందుకు ఎలాంటి సర్దుబాట్లు అవసరమౌతాయో వాటినన్నింటినీ చేసుకోండి. నిజంగా యోగ్యమైన దాన్ని నెరవేర్చేందుకు కృతనిశ్చయం, పట్టుదలా అవసరం.
9 మన సమయాన్నీ, అవధానాన్నీ అంతకంతకూ హరించివేయనారంభించే ఆధ్యాత్మికంకాని కార్యకలాపాల్ని పరిచయంచేసేందుకు లోక సంబంధమైన ప్రభావాల్నీ, మన అపరిపూర్ణ శరీరపు హానికర ప్రభావాల్నీ మనం అనుమతించకూడదు. ‘నా జీవితవిధానం క్రమేణా సమతుల్యం కోల్పోయిందిగా లేదా అవధానాన్ని కోల్పోయేదిగా తయారయ్యిందా? గతించనున్న ఈ లోక విషయాలను కేంద్రంగా చేసుకొని నా జీవితాన్ని నిర్మించుకోవడం ఆరంభించానా? (1 యోహా. 2:15-17) ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం వెచ్చించే సమయంతో పోల్చిచూస్తే వ్యక్తిగత లక్ష్యాలపై, వినోద విహారాలపై, క్రీడ కార్యక్రమాలపై, లేదా టీ.వీ. చూడ్డమో, ఇంటర్నెట్ను సర్ఫింగ్ చేయడమో వంటి ఇతర వినోద కార్యక్రమాల కోసం నేనెంత సమయాన్ని వెచ్చిస్తున్నాను?’ లాంటి ప్రశ్నల్ని వేసుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరం.
10 అంతకంతకూ అనవసర కార్యక్రమాలతో మీ జీవితం చిందరవందరగా తయారైనట్టు మీరు గ్రహిస్తే, అప్పుడేమి చేయాలి? తన సహోదరులు ‘సరిదిద్దబడాలనీ,’ లేదా ‘సరైన దారిలోనికి తీసుకురాబడాలనీ’ పౌలు ప్రార్థించినట్లుగానే, యెహోవా సేవను మరోసారి కేంద్రంగా చేసుకున్నవారిగా తయారయ్యేలా సహాయాన్ని పొందడం కోసం యెహోవాకు ఎందుకు ప్రార్థించకూడదు? (2 కొరిం. 13:9, 11, NW అథఃస్సూచి) ఆ పై మీ తీర్మానానికి అనుగుణంగా జీవించాలని నిశ్చయించుకొని, అవసరమైన సర్దుబాట్లను చేసుకోండి. (1 కొరిం. 9:26, 27) యెహోవాకు విధేయతతో చేసే సేవ నుండి కుడికైనను, ఎడమకైనను తిరగకుండా జాగ్రత్తవహించేలా ఆయన మీకు సహాయపడతాడు.—యెషయా 30:20, 21 పోల్చండి.
11 దేవుని ఆనందమయమైన సేవలో బిజీగా ఉండండి: కోట్లాదిమంది సంతోషం వెంట ఎంతో ఆత్రంగా పడతారు, అయితే వాళ్లు తమ జీవితాంతం దగ్గర పడుతుండగా, తాము ఏ వస్తుసంపదనైతే సంపాదించడానికి తాపత్రయ పడ్డామో ఆ వస్తుసంపద శాశ్వతమైన సంతోషాన్ని తీసుకురాలేదని గ్రహిస్తారు. అది “గాలికి ప్రయాసపడినట్టుగా” ఉంది. (ప్రసం. 2:11) మరో వైపున, మన జీవితాలకు యెహోవా ను కేంద్రంగా చేసుకొని, ‘సదాకాలము ఆయనయందు మన గురిని నిలిపి’నప్పుడు, మనం ప్రగాఢమైన సంతృప్తిని పొందుతాం. (కీర్త. 16:8, 11) మన ఉనికికి మూలం యెహోవాయే గనుక అలాంటి తృప్తిని పొందుతాం. (ప్రక. 4:11) గొప్ప సంకల్పకర్తయైన ఆయనే లేకుంటే, జీవితం అర్థరహితం. యెహోవా సేవచేయడం, శాశ్వతమైన రీతిలో, అవును చిరకాలం నిలిచిపోయే రీతిలో మనకూ, అలాగే ఇతరులకూ ప్రయోజనాన్ని చేకూర్చే యోగ్యమైన, సంకల్పవంతమైన కార్యక్రమంతో మన జీవితాల్ని నింపుతుంది.
12 అతి వేగంగా సమీపిస్తున్న సాతాను లోకాంతాన్ని గూర్చిన మన అత్యవసర భావాన్ని కోల్పోయేవారిగా, దాన్ని పట్టించుకోనివారిగా ఉండకపోవడం ప్రాముఖ్యం. భవిష్యత్తును గూర్చిన మన దృక్కోణాన్ని బట్టి మన అనుదిన జీవితం ప్రభావితమవుతుంది. భూవ్యాప్తంగా జలప్రళయం వస్తుందని నమ్మని నోవహు కాలంలోని ప్రజలు, తినడం, త్రాగడం, పెండ్లిచేసుకోవడం వంటి వ్యక్తిగత ఆసక్తులను తమ అనుదిన జీవితాలకు కేంద్రంగా చేసుకొని, జలప్రళయం వచ్చి, “అందరిని కొట్టుకొని పోవువరకు ఎరుగక పోయిరి.” (మత్త. 24:37-39) నేడు, లోకాన్ని తమ జీవితాలకు కేంద్రంగా చేసుకొన్న వాళ్లు, మానవుడు ఇంతకు ముందెన్నడూ చవిచూడని గొప్ప వినాశనంలో అంటే, ‘దేవుని దినము’న జరుగబోయే గొప్ప వినాశనంలో భవిష్యత్తు కొరకైన తమ ఉత్తరాపేక్షలన్నీ తమ కళ్లెదుటే విచ్ఛిన్నం కావడాన్ని చూస్తారు.—2 పేతు. 3:10-12.
13 అయితే, జీవముగల దేవుడైన యెహోవానూ, ఆయన చిత్తం చేయడాన్నీ కేంద్రంగా చేసుకొని మీ జీవితాన్ని నిర్మించుకొంటూ ఉండండి. ఈ జీవితంలో మీరు పెట్టే ఎటువంటి పెట్టుబడికైనా యెహోవా అంతటి నమ్మకమైన మద్దతుదారు ఉండరు. ఆయన అబద్ధమాడనేరడు—తన వాగ్దానముల విషయమై ఆయన సత్యవంతుడు. (తీతు 1:1) ఆయన మరణించడు—కనుక యెహోవాకు అప్పగించిన దేన్నీ మనం కోల్పోము. (హబ. 1:12; 2 తిమో. 1:12) మనం ఇప్పుడు నిర్మించుకునే విధేయతా విశ్వాసాలతో కూడిన జీవితం, సంతోషవంతుడైన మన దేవుని ఆనందమయ సేవలో నిరంతరం నిలిచివుండే జీవితానికి ఆరంభం మాత్రమే!—1 తిమో. 1:11, NW; 6:19.
[3వ పేజీలోని బ్లర్బ్]
“సత్యం మాజీవితంలో ఒక భాగం కాదు, సత్యమే మా జీవితం. జీవితంలోని ప్రతీదీ దానిచుట్టూ పరిభ్రమిస్తుంది.”