పయినీరు సేవ—మీరు చేయగలరా?
1 “నేను వేరే పని చేయడాన్ని ఊహించలేను. దీనికి సమానమైన ఆనందాన్ని తీసుకువచ్చే వేరే ఏ పనిని గురించి కూడా నేను నిశ్చయంగా ఊహించలేను.” ఎవరు ఈ మాటలన్నది? తమ జీవితంలో పూర్తికాల పరిచర్యను ఆనందమయ కెరీర్‌గా చేసుకున్న వేలాదిమంది యెహోవాసాక్షుల్లో ఒకరు. మీరు పయినీరు సేవ చేయగలరో లేదో అనే విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలోచించారా? యెహోవాకు మనలను మనం సంపూర్ణంగా సమర్పించుకున్నవారిగా, మనం రాజ్య సువార్తను వ్యాప్తి చేయడంలో పూర్తిగా భాగంవహించగలమో లేదో అనే విషయాన్ని నిశ్చయంగా పరిశీలించాల్సి ఉంది. ఆ లక్ష్యాన్ని మనస్సునందుంచుకుని, పయినీరు సేవ గురించి అనేకమంది అడిగే కొన్ని ప్రశ్నలను దయచేసి పరిశీలించండి.
ప్రశ్న 1: “పయినీర్ సేవ అందరి కోసం కాదని కొందరంటారు. ఇది నా కోసమో కాదో నేనెలా తెలుసుకోగలను?”
2 దానికి సమాధానం మీ పరిస్థితులపైనా లేఖనాధారంగా మీకున్న బాధ్యతలపైనా ఆధారపడి ఉంటుంది. అనేకమంది వ్యక్తులు ఆరోగ్య సమస్యలనుబట్టో లేదా జీవితంలోని ప్రస్తుత పరిస్థితినిబట్టో పరిచర్యలో నెలకు 90 గంటలపాటు గడపలేకపోవచ్చు. ఉదాహరణకు, క్రైస్తవ భార్యలుగా, తల్లులుగా జీవితంలో తమ పాత్రను నిర్వహిస్తున్న నమ్మకస్థులైన చాలామంది సహోదరీలను తీసుకోండి. వారు తమ పరిస్థితులు అనుమతించినంతలో వీలైనంత తరచుగా పరిచర్యలో భాగం వహిస్తారు. అవకాశం లభించినంత మేరకూ, వారు సంవత్సరంలో ఒకటి లేక ఎక్కువ నెలలు సహాయ పయినీరు సేవ చేసి, పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడం ద్వారా లభించే ఆనందాలను అనుభవిస్తారు. (గల. 6:9) ప్రస్తుతం పూర్తికాల పయినీర్లుగా సేవ చేసేందుకు వారి పరిస్థితులు అనుమతించకపోయినప్పటికీ, వారు పయినీరు స్ఫూర్తిని పెంపొందింపజేస్తారు. ఆసక్తిగల సువార్త ప్రచారకులుగా, వారు సంఘానికి ఒక దీవెనగా ఉన్నారు.
3 మరో వైపున, సాపేక్షికంగా చూస్తే అంతగా బాధ్యతలులేని అనేకమంది సహోదర సహోదరీలు తమ జీవితంలో వేటికైతే ప్రాధాన్యతనిచ్చారో వాటిని సర్దుబాటు చేసుకోవడం ద్వారా పయినీరు సేవ చేసేందుకు వీలు కలిగించుకున్నారు. మరి మీ సంగతేమిటి? మీరు పాఠశాల విద్యాభ్యాసాన్ని ముగించిన యౌవనులా? మీరు ఉద్యోగం చేయనవసరం లేని పరిస్థితుల్లో ఉన్న గృహిణియా? ఎదిగిన పిల్లలున్న లేక ఇంకా పిల్లలు కలగని దంపతులా? మీరు ఉద్యోగ విరమణ పొందారా? పయినీరు సేవ చేయాలా వద్దా అనేది ప్రతి వ్యక్తీ తనకైతాను తీసుకోవలసిన నిర్ణయం. ప్రశ్నేమిటంటే, పయినీరు సేవ చేసేందుకు మీరు వీలు కలిగించుకోగలరా?
4 మన జీవితాలను అనవసరపు కార్యకలాపాలతో నింపేందుకూ, మనం స్వార్థపూరిత జీవిత విధానంలో కూరుకుపోయేలా చేసేందుకూ సాతాను తన ప్రపంచ విధానాన్ని ఉపయోగిస్తాడు. మనం ఈ లోక సంబంధులుగా ఉండకూడదని తీర్మానించుకుంటే, రాజ్యాసక్తులకు ప్రాధాన్యతనిచ్చేందుకూ, మనకు అందుబాటులో ఉన్న దైవపరిపాలనా సేవాధిక్యతలన్నింటినీ అందుకునేందుకూ యెహోవా మనకు సహాయం చేస్తాడు. పయినీరుగా సేవ చేసేందుకు మీరు మీ పరిస్థితులలో సర్దుబాటుచేసుకోగలిగితే, అలా ఎందుకు చేయకూడదు?
ప్రశ్న 2: “పూర్తికాల పరిచర్యలో ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకొని నిలబడగలనని నేనెలా నిశ్చయతను కలిగి ఉండగలను?”
5 అనేక దేశాల్లో, జీవితావసరాలుగా దృష్టించబడే వాటిని సమకూర్చుకునేందుకు ప్రతి వారానికి అవసరమయ్యే పని గంటల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో పెరిగిందనే విషయం వాస్తవం. అయినప్పటికీ, ఎన్నో సంవత్సరాలుగా అనేకమంది పయినీరు సేవను చేస్తున్నారు, యెహోవా వారికి మద్దతునిస్తూనే ఉన్నాడు. ఫలవంతమైన పయినీర్ అవ్వాలంటే, విశ్వాసమూ స్వయంత్యాగ స్ఫూర్తీ అవసరం. (మత్త. 17:20) “యెహోవాను ఆశ్రయంచువారికి ఏ మేలు కొదువయైయుండదు” అని కీర్తన 34:10 నందు మనకు అభయం ఇవ్వబడింది. పయినీరు సేవలో ప్రవేశించే ఏ వ్యక్తైనా సరే, యెహోవా తనపట్ల శ్రద్ధ వహిస్తాడనే పూర్తి నమ్మకంతో ఆ సేవలో ప్రవేశించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకస్థులైన పయినీర్లకు ఆయన చేస్తున్నదదే! (కీర్త. 37:25) అయితే, 2 థెస్సలొనీకయులు 3:8, 10 మరియు 1 తిమోతి 5:8 నందలి సూత్రాలకు అనుగుణ్యంగా, పయినీర్లు ఇతరులు తమకు ఆర్థికంగా సహాయం చేయాలని అపేక్షించరు.
6 పయినీరు సేవ చేయాలని ఆలోచిస్తున్న వారెవరైనా సరే, యేసు చెప్పినట్టుగా చేయాలి: “కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొన”వలెను. (లూకా 14:28) అలా చేయడం ఆచరణాత్మక జ్ఞానాన్ని చూపిస్తుంది. అనేక సంవత్సరాల నుండి విజయవంతంగా పయినీరు సేవ చేసిన వారితో మాట్లాడండి. యెహోవా వారికి ఎలా మద్దతునిచ్చాడో అడిగి తెలుసుకోండి. మీ సర్క్యూట్ పైవిచారణకర్తే ఒక అనుభవజ్ఞుడైన పయినీరు, పూర్తికాల పరిచర్యలో విజయాన్నెలా సాధించాలో అనే దాని గురించి సలహాలు ఇవ్వడానికి ఆయన సంతోషిస్తాడు.
7 ఒకరు తనను తాను యెహోవా చేతుల్లో పూర్తిగా పెట్టుకునేంత వరకూ మత్తయి 6:33 నందలి యేసు మాటల యొక్క సత్యత్వాన్ని పూర్తిగా అనుభవించలేక పోవచ్చు. ఒక నమ్మకస్థురాలైన పయినీరు ఇలా చెప్పింది: “నేనూ, నా సహ పయినీరూ, పయినీర్లుగా మా క్రొత్త నియామకానికి వచ్చినప్పుడు, మా దగ్గర కేవలం కొన్ని కూరగాయలు, ఒక ప్యాకెట్టు మార్గరైన్ మాత్రం ఉన్నాయి, డబ్బు అస్సలు లేదు. వాటిని ఆ సాయంత్రం తినేశాక, ‘రేపటికి తినడానికి మనకింకేమీ లేదని’ అనుకున్నాము. మేమా విషయమై ప్రార్థించి, పడుకున్నాము. ఉదయాన్నే స్థానికంగా ఉన్న ఒక సాక్షి వచ్చి తనను తాను పరిచయం చేసుకొని, “యెహోవా పయినీర్లను పంపించాలని నేను ప్రార్థించాను. దాదాపుగా ఈ రోజంతా మీతో సేవలో గడుపుతాను, కానీ నేను ఇక్కడకి దూరంగా ఉన్న గ్రామంలో ఉంటున్నాను గనుక మీతో పాటే భోజనం చేస్తాను. మన కోసం ఈ ఆహారాన్ని తెచ్చాను’ అని చెప్పింది. అది చాలా పెద్ద మొత్తంలో ఉన్న మాంసము, కూరగాయలు.” మనల్ని ‘చింతించవద్దు’ అని యేసు చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు! తర్వాత ఆయనిలా జత చేశాడు: “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?”—మత్త. 6:25, 27.
8 మన చుట్టూ ఉన్న లోకం అంతకంతకూ వస్తుసంబంధమైనదిగా అవుతోంది. మనం కూడా అలాగే అయ్యేలా మనపై విపరీతమైన ఒత్తిడిని తీసుకురావడం జరుగుతోంది. అయితే, పూర్తికాల పరిచర్య పట్ల మరింత మెప్పుదలను కలిగి ఉండటం, జీవించడానికి అవసరమైన వాటితో సంతృప్తిపడేలా చేస్తుంది. (1 తిమో. 6:8) తమ జీవితాల్ని సామాన్యంగానూ, క్రమబద్ధంగానూ ఉంచుకునే పయినీర్లకు సేవలో గడపడానికి ఎక్కువ సమయం ఉంటుంది, ఇతరులకు సత్యాన్ని బోధించడం ద్వారా మరింత ఆనందాన్నీ ఆధ్యాత్మిక బలాన్నీ పొందుతారు. వాళ్లు సన్యాసిలాంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించకపోయినప్పటికీ, వారి ఆర్థిక పరిస్థితి పట్ల వారికుండే సమతూకమైన అవగాహన, పయినీరు సేవలో లభించే దీవెనలను ఆనందించేందుకు వారికి వీలు కలిగిస్తుంది.
9 మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామనీ, ఈ దుష్ట వ్యవస్థకున్న సమయం గతించిపోబోతోందనీ మీరు గ్రహించినట్లైతే, ప్రతి అవకాశంలోనూ సువార్తను ప్రకటించేందుకు అవసరమైన త్యాగాలను చేయడానికి మీరు ఆధ్యాత్మికంగా పురికొల్పబడతారు. మీ ఆర్థిక పరిస్థితిని మళ్లీ పరిశీలించడం ద్వారా, ఆ విషయాన్ని యెహోవా చేతుల్లో ఉంచడం ద్వారా, మీరు ఆయనను పూర్తికాలం సేవించగలరని మీరు గుర్తించవచ్చు. పయినీరు సేవ చేయడానికి మీరు కొన్ని వస్తుపరమైన అవసరతలను వదులుకోవలసి వచ్చినప్పటికీ, మీరు యెహోవా ఇచ్చే పుష్కలమైన దీవెనలను ఆనందించగలరు.—కీర్త. 145:16.
ప్రశ్న 3: “ఒక యౌవనస్థుడిగా, నేను పయినీరు సేవను ఒక కెరీర్‌గా ఎందుకు దృష్టించాలి?”
10 మీరు మీ పాఠశాల విద్య ముగియబోతున్న చివరి సంవత్సరాలలో, భవిష్యత్తును గురించి మీరు సహజంగానే ఆలోచిస్తారు. మీ భవిష్యత్తు సురక్షితంగానూ, ఆనందమయంగానూ, సంతుష్టిదాయకంగానూ ఉండాలని కోరుకుంటారు. పాఠశాల నిర్దేశిక సలహాదార్లు ఆకర్షణీయమైన కెరీర్ వైపుకు మిమ్మల్ని మళ్లించడానికి ప్రయత్నించవచ్చు, దానికి అనేక సంవత్సరాలపాటు కాలేజీ చదువు అవసరమౌతుంది. వీలైనంత ఎక్కువగా యెహోవా సేవ చేయడానికి మీరు సిద్ధపడాలని చక్కగా తర్ఫీదు పొందిన మీ క్రైస్తవ మనస్సాక్షి మీకు చెబుతుంది. (ప్రసం. 12:1) పెళ్లి చేసుకుని, మీదంటూ ఓ కుటుంబాన్ని కల్గివుండాలని కూడా మీరు ఆలోచించవచ్చు. మీరేం చేస్తారు?
11 జీవితంలోని ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ పూర్తి భవిష్యత్తును మలచగలవు. మీరు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షి అయివుంటే, మిమ్మల్ని మీరు యెహోవాకు సంపూర్ణంగా అర్పించుకున్నారు. (హెబ్రీ. 10:7) మీకున్న మొదటి అవకాశం ఏమిటంటే, ఒకటి లేక అనేక నెలలు సహాయ పయినీరుగా సేవచేయడానికి ప్రయత్నించడమే. క్రమ పయినీరు సేవ చేయడం ద్వారా రాబోయే ఆనందాలనూ, బాధ్యతలనూ రుచిచూసే అవకాశాన్ని ఇది ఇస్తుంది. జీవితంలో సాధించబోయే దాని విషయమై మీకున్న దృక్కోణం తప్పకుండా స్పష్టం అవుతుంది. పాఠశాల విద్యను ముగించిన తర్వాతి సమయాన్ని పూర్తికాల లౌకిక ఉద్యోగంలో వెచ్చించే బదులు, క్రమ పయినీరు సేవను ఎందుకు ప్రారంభించకూడదు? పయినీరు సేవను తమ జీవితంలో ముందుగా ప్రారంభించని వ్యక్తులు, తాము ముందే ప్రారంభించకపోయినందుకు బాధపడ్డారు.
12 అవివాహితుడిగా ఉండడానికీ, పూర్తికాల ప్రకటనా కార్యకలాపంలో దాని మూలంగా లభించే ప్రయోజనాల్ని ఆనందించడానికీ మీకున్న అవకాశాలనుండి ఒక యౌవనస్థుడిగా ప్రయోజనం పొందండి. మీరు ఎప్పటికైనా వివాహం చేసుకోవాలన్నది మీ కోరికైతే, క్రమ పయినీరు పనిలో మొదట సేవ చేయడం కన్నా వివాహానికి మరొక శ్రేష్ఠమైన పునాది మరొకటి ఉండదు. మీరు పరిపక్వతలోనూ, ఆధ్యాత్మికతలోనూ ఎదుగుతుండగా, మీ వంటి తలంపులనే కలిగివున్న వివాహ భాగస్వామితో మీరు పయినీరు సేవను మీ జీవితాంత కెరీర్‌గా చేసుకోవాలని ఎంపిక చేసుకోవచ్చు. దంపతులుగా పయినీరు సేవ చేసిన కొంతమంది, సర్క్యూట్ పనిలో లేక ప్రత్యేక పయినీర్లుగా సేవ చేయడాన్ని ప్రారంభించారు. నిజంగానే ఎంతో సంతృప్తిదాయకమైన జీవితం!
13 మీరు ఎంతకాలం పయినీరు సేవలో కొనసాగినప్పటికీ, మీరు ఒక సమగ్రమైన విద్యాభ్యాసాన్ని పొందుతారు. ఈ భూమిపై మరే ఇతర పనీ అందించలేని అత్యంత విలువైన తర్ఫీదును కూడా పొందుతారు. పయినీరు సేవ చేయడం క్రమ శిక్షణనూ, వ్యక్తిగత సంస్థీకరణనూ, ప్రజలతో ఎలా వ్యవహరించాలనే విషయాన్నీ, యెహోవాపై ఆధారపడటాన్నీ మరియు సహనాన్నీ దయాగుణాన్నీ ఎలా వృద్ధి చేసుకోవాలనే విషయాన్నీ నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఎక్కువ బాధ్యతలను చేపట్టేందుకు మిమ్మల్ని సన్నద్ధులను చేసే లక్షణాలే.
14 మానవ జాతికి జీవితం మునుపెన్నటికన్నా మరింత అస్థిరంగా ఉంది. యెహోవా వాగ్దానం చేసిన వాటిని మినహాయిస్తే, కేవలం కొన్ని మాత్రమే నిజంగా శాశ్వతమైనవిగా ఉన్నాయి. మీ భవిష్యత్తు మీ ముందర తెరిచి ఉంది గనుక, రాబోయే సంవత్సరాల్లో మీరు మీ జీవితాన్ని ఎలా గడపబోతున్నారనే దాన్ని గంభీరంగా ఆలోచించేందుకు ఇంతకంటే శ్రేష్ఠమైన సమయం మరొకటి ఏముంది? పయినీరు సేవచేసే ఆధిక్యతను జాగ్రత్తగా మదింపు చేయండి. పయినీరు సేవను మీ కెరీర్‌గా ఎంచుకున్నందుకు ఎన్నడూ బాధపడరు.
ప్రశ్న 4: “తగినన్ని గంటలు వెచ్చించాలనేది ఒక ఎడతెగని ఒత్తిడిగా ఉండదంటారా? నేను తగినంత సమయాన్ని వెచ్చించడంలో వెనకబడిపోతే ఎలా?”
15 మీరు క్రమ పయినీరు దరఖాస్తును నింపినప్పుడు, “సంవత్సరానికి 1,000 గంటలు గడపాలనే అవసరతను మీరు సహేతుకంగా చేరుకోగలిగే విధంగా మీరు మీ వ్యక్తిగత పనులను అన్నింటినీ సంస్థీకరించుకున్నారా?” అనే ప్రశ్నకు మీరు సమాధానాన్ని వ్రాయాలి. ఆ గంటలను చేరుకునేందుకు, మీరు రోజుకి సగటున దాదాపు మూడు గంటలు పరిచర్యలో గడపాల్సి ఉంటుంది. ఇందుకు చక్కని షెడ్యూలూ, క్రమశిక్షణా అవసరమౌతాయనడంలో సందేహం లేదు. చాలామంది పయినీర్లు కేవలం కొన్ని నెలల్లోనే ఆచరణాత్మకమైన, సహేతుకమైన క్రమాన్ని వృద్ధి చేసుకుంటారు.
16 అయితే, “చెడు కాలము దాపురించినప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి” అని ప్రసంగి 9:11 [పరిశుద్ధ బైబల్] సత్యవంతంగా చెబుతోంది. గంభీరమైన అనారోగ్యం, లేక ఇతర అనుకోని పరిస్థితులవల్ల ఒక పయినీరు తాను వెచ్చించాల్సినన్ని గంటలు వెచ్చించలేకపోవచ్చు. అది దీర్ఘకాల సమస్య కాక, ఆ సమస్య సేవా సంవత్సరంలోని మొదటి నెలల్లోనే సంభవిస్తే, దాని మూలంగా వెనుకబడిన గంటలను భర్తీచేయడానికి షెడ్యూల్లో కాస్త ఎక్కువ గంటలు చేర్చడం సరిపోవచ్చు. అయితే సేవా సంవత్సరం ముగియడానికి ఇక కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉండి, పయినీరు తాను తన పరిచర్యలో గడపాల్సినన్ని గంటల్ని వెచ్చించలేకపోయేలా గంభీరమైన సమస్య ఏదైనా తలెత్తితే అప్పుడెలా?
17 మీరు కొన్ని నెలలపాటు అనారోగ్యానికి గురైతే లేదా మీ వశంలోలేని మరే ఇతర అత్యవసర కారణం చేత మీరు గడపాల్సినన్ని గంటలను గడపలేకపోతే, సంఘ సేవా కమిటీ సభ్యుల్లో ఒకరి దగ్గరకు వెళ్లి మీ సమస్యను వివరించవచ్చు. మీరు చేరుకోలేకపోయిన సమయాన్ని గురించి ఆందోళనచెందకుండా మీరు పయినీరు సేవలో కొనసాగేందుకు మిమ్మల్ని అనుమతించడం ఉచితమని ఈ పెద్దలు గనుక భావిస్తే, వాళ్లా నిర్ణయాన్ని తీసుకోవచ్చు. మీరు వెచ్చించలేకపోయిన సమయాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదని సంఘ ప్రచారకుల రికార్డు కార్డులో సెక్రటరీ మార్కు చేస్తాడు. ఇది మీకు ఇవ్వబడిన సెలవులు కావు కానీ, మీ పరిస్థితులను ప్రత్యేకంగా పరిగణనలోనికి తీసుకోవడమే.—అక్టోబరు 1986 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్, 18వ పేరాను చూడండి.
18 అనుభవంగల పయినీర్లు సేవా సంవత్సరం మొదట్లోనే వీలైనన్ని ఎక్కువ గంటలను సమకూర్చుకుంటారు. వారి పయినీరు సేవే వారికి ప్రాముఖ్యమైనది, కాబట్టి వారు అనవసరమైన కార్యకలాపాలను తగ్గించడం అవసరమని కొన్నిసార్లు కనుగొంటారు. సరైన షెడ్యూల్ లేకపోవడం లేక ఆ షెడ్యూల్‌ను అనుసరించడంలో క్రమశిక్షణ లేకపోవడం మూలంగా ఒక పయినీరు తాను వెచ్చించాల్సినన్ని గంటల్ని వెచ్చించలేకపోతే, ఆ సమయాన్ని భర్తీచేయడం అతని బాధ్యతయని గుర్తించాలి, దాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణించాలని అపేక్షించకూడదు.
19 ఒక పయినీరు తన పరిస్థితుల్లో నివారించలేని మార్పులను అనుభవించే సమయాలు రావచ్చు. ఒకదాని వెంబడి మరొకటిగా వచ్చిపడే అనారోగ్య సమస్యల మూలంగా, కుటుంబ బాధ్యతలు పెరిగిపోవడం మూలంగా, చాలా కాలం నుండి పరిచర్యలో తాను వెచ్చించాల్సినన్ని గంటల్ని చేరుకోలేకపోతున్నానని ఆయన కనుగొనవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, తాను పయినీరు సేవ మానుకుని పబ్లిషర్‌గా ఉండి, తనకు వీలైనప్పుడల్లా సహాయ పయినీరు సేవలో భాగం వహించడమే జ్ఞానయుక్తమైన పని. చేరుకోవలసిన గంటలను ఇక ఎంతమాత్రం వెచ్చించలేని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉంటే, పయినీర్ల లిస్టులో ఉండేందుకు అనుమతించే క్రమ ఏర్పాటు ఏమీ లేదు.
20 యోగ్యతగల వారికి ప్రత్యేక పరిగణనిచ్చే ఏర్పాటు, అనవసరంగా ఆందోళనచెందకుండా అనేకమంది పయినీరు సేవలో భాగం వహించేలా పురికొల్పుతుందని మేము నిరీక్షిస్తున్నాము. ఇప్పటికే పూర్తికాల పరిచర్యలో ఉన్న వాళ్లను ఇది పయినీరు సేవలో కొనసాగేలా ప్రోత్సహించాలి. పయినీర్లు తమ పూర్తికాల పరిచర్యలో కొనసాగాలని మేము కోరుకుంటున్నాము.
ప్రశ్న 5: “నేను ఏదైనా సాధించాలనీ, దాన్ని చేయడంలో ఆనందంగా ఉండాలనీ కోరుకుంటున్నాను. పయినీరు సేవ నాకు సంతృప్తినిస్తుందా?”
21 నిజమైన ఆనందం యెహోవాతో సన్నిహిత, వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడంపైనా, మనం ఆయనను యథార్థంగా సేవిస్తున్నామనే నమ్మకంపైనా ఆధారపడి ఉంది. యేసు “తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై” హింసా కొయ్యను సహించాడు. (హెబ్రీ. 12:1) దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా ఆయనకు ఆనందం లభించింది. (కీర్త. 40:8) ఈ ప్రస్తుత వ్యవస్థలో, మన జీవితంలోని అత్యధిక కార్యకలాపాలు యెహోవాను మనం ఆరాధించడానికి సంబంధించినవైతే మనం నిజమైన ఆనందాన్ని కనుగొనగలం. ఆధ్యాత్మిక సంగతులను వెంబడించడం మనం ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నామనే భావనను మనకు ఇస్తుంది, ఎందుకంటే మనం సరైనది చేస్తున్నామని మన హృదయంలో మనం ఒప్పించబడి ఉంటాము. సంతోషమనేది ఇవ్వడం నుండి వస్తుంది, మరి దేవుని నూతన లోకంలో నిత్య జీవితాన్ని ఎలా పొందాలో ఇతరులకు బోధించడంలో మనలను మనం అంకితంచేసుకోవడం కన్నా చక్కని మార్గము మరింకోటి లేదని మనకు తెలుసు.—అపొ. 20:35.
22 మొదటి పేరాలో ప్రస్తావించబడిన పయినీరు ఆ విషయాన్నిలా వివరించాడు: “మీతో పఠనం చేస్తున్నవారెవరైనా యెహోవాకు క్రియాశీలక సేవకునిగా తయారవ్వడం చూడడంకన్నా మీకు ఎక్కువ ఆనందకరమైన విషయం ఏమైనా ఉంటుందా? యెహోవాను ప్రీతిపర్చే విధంగా ప్రజలు తమ జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి ప్రేరేపించడంలో దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో చూడడం ఉత్తేజకరంగానూ, విశ్వాసాన్ని బలపర్చేదిగాను ఉంటుంది.” (కావలికోట అక్టోబరు 15, 1997 18-23 పేజీలను చూడండి.) కాబట్టి, మీకేది ఆనందాన్ని ఇస్తుంది? లోకం అందించే తాత్కాలిక ఆనందానికి బదులు, మీరు శాశ్వతమైన యోగ్యమైన ప్రయత్నాలను విలువైనవిగా భావిస్తే, మీకు నిజమైన ఆనందాన్ని కలిగించే అద్భుతమైన సంతృప్తిని పయినీరు సేవ మీకిస్తుంది.
పశ్న 6: “నిత్యజీవాన్ని పొందడానికి పయినీరు సేవ అవసరం కానప్పుడు, నేను పయినీరు సేవ చేస్తానా లేదా అనేది నా స్వంత విషయం కాదా?”
23 నిజమే, పయినీరు చేయాలన్నది మీ నిర్ణయమే అయి ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలోని పరిస్థితులను కేవలం యెహోవానే తీర్పుతీర్చగలడు. (రోమీ. 14:4) మీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ మీరు ఆయన సేవ చేయాలని ఆయన మీ నుండి సమంజసంగానే అపేక్షిస్తున్నాడు. (మార్కు 12:30; గల. 6:4, 5) ఆయన సంతోషంగా ఇచ్చే వాళ్లనే ప్రేమిస్తాడు, అంటే ఆయనను ఆనందంతోనే గానీ సణుగుతూ లేక బలవంతంగా సేవ చేసే వాళ్లను కాదు. (2 కొరిం. 9:7; కొలొ. 3:23) పూర్తికాల సేవ చేయడానికి గల కారణం మీరు యెహోవానూ, మీ టెరిటరీలో ఉన్న ప్రజలనూ ప్రేమిస్తున్నారన్నదే అయి ఉండాలి. (మత్త. 9:36-38; మార్కు 12:30, 31) మీరు ఆ విధంగానే భావిస్తే, పయినీరు సేవను గురించి మీరు గంభీరంగా తలంచవచ్చు.
24 ఇక్కడ చెప్పబడిన సంగతులు పయినీరు సేవ చేయడానికి మీకున్న సాధ్యతల్ని మదింపుచేసుకోవడానికి మీకు సహాయపడతాయనేదే మా ఆశ. క్రమ పయినీరు సేవ చేయడానికి మీ పరిస్థితులను సవరించుకోగలరా? ఇక్కడ క్రింద “నా వారపు పయినీరు సేవా షెడ్యూల్” అనే పేరుగల క్యాలెండర్ ప్రచురించబడింది. పరిచర్యలో ప్రతి వారం సగటున 23 గంటలు గడిపేలా మీరు ఒక ఆచరణాత్మకమైన పట్టికను వేసుకోగలరేమో చూడండి. తర్వాత, మీ పూర్ణ విశ్వాసాన్నీ నమ్మకాన్నీ యెహోవాపై ఉంచండి. ఆయన సహాయంతో మీరు సఫలీకృతులు కాగలరు! ఆయనిలా వాగ్దానం చేశాడు: “పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెద”ను.—మలా. 3:10.
25 కాబట్టి మేమిలా అడుగుతున్నాము, “పయినీరు సేవ—మీరు చేయగలరా?” “అవును” అని మీరు చెప్పగలిగితే, క్రమ పయినీరు సేవ ప్రారంభించేందుకు ఒక తేదీని నిర్ణయించుకోండి, మరి యెహోవా మీకు ఆనందమయ జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడనే నిశ్చయతను కలిగి ఉండండి!
[6వ పేజీలోని చార్టు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
నా వారపు పయినీరు సేవా షెడ్యూల్
సోమవారం ఉదయం క్షేత్ర సేవ
మంగళవారం ఉదయం క్షేత్ర సేవ
బుధవారం ఉదయం క్షేత్ర సేవ
గురువారం ఉదయం క్షేత్ర సేవ
శుక్రవారం ఉదయం క్షేత్ర సేవ
శనివారం ఉదయం క్షేత్ర సేవ
ఆదివారం ఉదయం క్షేత్ర సేవ
సోమవారం మధ్యాహ్నం క్షేత్ర సేవ
మంగళవారం మధ్యాహ్నం క్షేత్ర సేవ
బుధవారం మధ్యాహ్నం క్షేత్ర సేవ
గురువారం మధ్యాహ్నం క్షేత్ర సేవ
శుక్రవారం మధ్యాహ్నం క్షేత్ర సేవ
శనివారం మధ్యాహ్నం క్షేత్ర సేవ
ఆదివారం మధ్యాహ్నం క్షేత్ర సేవ
సోమవారం సాయంత్రం క్షేత్ర సేవ
మంగళవారం సాయంత్రం క్షేత్ర సేవ
బుధవారం సాయంత్రం క్షేత్ర సేవ
గురువారం సాయంత్రం క్షేత్ర సేవ
శుక్రవారం సాయంత్రం క్షేత్ర సేవ
శనివారం సాయంత్రం క్షేత్ర సేవ
ఆదివారం సాయంత్రం క్షేత్ర సేవ
వారంలోని ప్రతి దినం కొరకైన మీ షెడ్యూల్‌ను వ్రాసుకునేందుకు పెన్సిలు ఉపయోగించండి.
క్షేత్ర సేవలో ప్రతి వారం 23 గంటలు గడిపేలా షెడ్యూల్ వేసుకోండి.
షెడ్యూల్ వేసుకున్న మొత్తం వారపు గంటలు ____________________