పిల్లలారా—మా ఆనందం మీరే!
1 బాలబాలికలారా, సంఘకార్యకలాపాల్లో మీరు కూడా చేర్చబడివున్నారనే యెహోవా ఆజ్ఞ మీకు పరిచయమేనా? (ద్వితీ. 31:12; కీర్త. 127:3) మనమంతా కలిసికట్టుగా యెహోవాను ఆరాధిస్తుండగా మీరు మా ప్రక్కనుండడం ఎంత ఆనందదాయకమో కదా! మీరు కూటాల్లో అల్లరిచేయకుండా కూర్చొని, జాగ్రత్తగా వింటుంటే మా హృదయాలు ఉప్పొంగిపోతాయి. మీ సొంత మాటల్లో వ్యాఖ్యానించడానికి మీరు ప్రయత్నించినప్పుడు అది మరి విశేషంగా మమ్మల్ని సంతోషపరుస్తుంది. దైవపరిపాలనా పాఠశాలలో మీకు నియమించబడిన భాగాల్ని మీరు నిర్వహించినప్పుడూ, ప్రాంతీయ సేవలో మీరు మాతోపాటూ ఉత్సాహంగా పాల్గొన్నప్పుడూ, మీరు ధైర్యంగా మీ తోటి విద్యార్థులకూ, టీచర్లకూ సాక్ష్యమిచ్చారని మేం విన్నప్పుడూ సంఘమంతా సంతోషిస్తుంది.—కీర్త. 148:12, 13.
2 మీ మంచి నడవడికనూ, మీరు శుభ్రంగా కనిపించే తీరునూ, మీ నిర్మలమైన ప్రవర్తననూ, పెద్దల్ని మీరు గౌరవించడాన్నీ మేం చూసినప్పుడు మిమ్మునుబట్టి మేం గర్విస్తున్నామని మీరు తెలుసుకోవాలని మేం కోరుకుంటున్నాము. మీకై మీరు దైవపరిపాలనా గమ్యాల్ని పెట్టుకోవడం ద్వారా మీరు ‘సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొంటున్నారని’ మీరు చూపించినప్పుడు మా ఆనందం మరి విశేషంగా అధికమౌతుంది.—ప్రసం. 12:2; కీర్త. 110:3.
3 మీ గమ్యాలేవో మాకు చెప్పండి: ఎనిమిది సంవత్సరాల ఒక అబ్బాయి జిల్లా కాపరితో ఇలా చెప్పాడు: ‘మొదటిగా నేను బాప్తిస్మం పొందాలనుకుంటున్నాను, తర్వాత సౌండ్ విభాగంలో సహాయపడడం ద్వారా, మైక్రోఫోన్‌లను హేండిల్ చేయడం ద్వారా, అటెండెంట్‌గా ఉండడం ద్వారా, లిటరేచర్ విభాగంలో సహాయపడడం ద్వారా, పుస్తకపఠనాల్లోనూ, కావలికోట పఠనాల్లోనూ చదవడం ద్వారా సంఘంలో నేను సహాయపడాలని అనుకుంటున్నాను. అటు తర్వాత, పరిచర్య సేవకుడనవ్వాలనీ, ఆపై పెద్దనవ్వాలనీ కోరుకుంటున్నాను. పయినీరునై, పయినీరు పాఠశాలకు వెళ్లాలని కూడా ఉంది. ఆ తర్వాత, బేతేలుకు వెళ్లాలనీ, ప్రాంతీయ కాపరినో లేక జిల్లా కాపరినో కావాలనీ ఉంది.’ ఈ చిన్నబ్బాయి దేవుడ్ని సేవించే ఆధిక్యత ఎడల ఎంత శ్రేష్ఠమైన ప్రశంసను చూపించాడో కదా!
4 శారీరకంగానూ, ఆధ్యాత్మికంగానూ మీరు పురోభివృద్ధి చెందుతుండగా, మీ గమ్యాల్ని మీరు చేరుకోవడాన్ని చూసి మేమానందిస్తాం. (పోల్చండి లూకా 2:52.) ప్రపంచవ్యాప్తంగా, ప్రతీ సంవత్సరం వేలాదిమంది పిన్న వయస్కులు బాప్తిస్మం పొందని ప్రచారకులౌతున్నారు, అటు తర్వాత యెహోవా సమర్పిత సేవకులుగా బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులౌతున్నారు. మీరు సహాయ పయినీరు సేవ చేసే లక్ష్యాన్ని చేరుకోవడాన్నీ, పూర్తికాల సేవలో ప్రవేశించడాన్నీ మేం చూసినప్పుడు మా ఆనందం మరింత అధికమౌతుంది. నిజంగా, పిల్లలారా, మా ఆనందం మీరే, మన పరలోక తండ్రికి స్తుతుల్ని చెల్లించేందుకొక అద్భుతమైన మూలం మీరే. యెహోవా మిమ్మును మెండుగా ఆశీర్వదించుగాక!—సామె. 23:24, 25.