ప్రతి రోజు యెహోవా గురించి మాట్లాడండి
1 తమ హృదయాలను ప్రీతిపర్చేవాటిని గురించి మాట్లాడడంలో ప్రజలు ఆనందిస్తారు. ఎందుకంటే హృదయము నిండివుండే దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. (లూకా 6:45బి) మీ హృదయానికి అతి ప్రియమైనది ఏమిటి? కీర్తనల రచయిత ఇలా వ్రాశాడు: “నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.” (కీర్త. 35:28) ఆయన యెహోవా ఎడల ప్రగాఢమైన ప్రశంసను కలిగివున్నాడు. దేవుని గురించి మాట్లాడడమూ, ప్రతి సందర్భంలోను ఆయనకు స్తుతులు చెల్లించడమూ ఒక అమూల్యమైన ఆధిక్యతగా ఆయన ఎంచాడు. యెహోవాతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగివున్నందువల్ల కీర్తన గ్రంథకర్తకు సంతోషించడానికి ఎన్నో మంచి కారణాలు ఉన్నాయి. (కీర్త. 35:9) ఆయన చూపిన చక్కని మాదిరిని మనం ఎలా అనుకరించగలము?
2 మీ గృహంలో యెహోవా గురించి మాట్లాడండి: కుటుంబ వలయంలో యెహోవా గురించి అనుదినము మాట్లాడాలి. యెహోవా ఎడల ప్రగాఢమైన ప్రేమను కల్గివున్న తలిదండ్రులు, తమ కార్యకలాపాలన్నింట్లోనూ సహజంగానే ఆయన గురించి మాట్లాడుతారు. (ద్వితీ. 6:5-7) వారు ఆ విధంగా చేస్తుండగా, తమ తల్లిదండ్రులు వారి విశ్వాసానికి అనుగుణంగా జీవిస్తున్నారనీ, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందిస్తున్నారనీ పిల్లలు గమనిస్తారు. అప్పుడు పిల్లలు కుటుంబ బైబిలు పఠనాన్ని తమ తలిదండ్రుల దైవభక్తికొక యథార్థమైన నిదర్శనంగా దృష్టిస్తారు.—2 పేతు. 3:11.
3 మీ సహోదరులతో యెహోవా గురించి మాట్లాడండి: ప్రతివారం జరిగే దైవపరిపాలనా నిత్యక్రమంలో మన మనస్సులనూ, హృదయాలనూ ఆధ్యాత్మిక ఆహారంతో నింపుకునే అవకాశాలు మనకు ఎన్నో ఉన్నాయి. మనం మాట్లాడుకోవడానికి మంచి విషయాలకు కొదువ ఎన్నడూ ఏర్పడలేదు. (లూకా 6:45ఎ) మీరు విశేషంగా ఆనందించిన మీ వ్యక్తిగత పఠనంలో నుండో లేక ప్రతివారం చదవవలసిన బైబిలు భాగంలో నుండో మీరు సేకరించిన విషయం ఏమన్నా ఉందా? దానిని మీ సహోదరులతో పంచుకోండి, తద్వారా యెహోవా ఎడల తమ ప్రేమను వారు పెంచుకోవడానికి సహాయపడుతూ ఉండండి.—కీర్త. 35:18; హెబ్రీ. 10:24.
4 ఇతరులతో యెహోవా గురించి మాట్లాడండి: యెహోవాను గురించి సాక్ష్యం ఇవ్వడమే మన జీవితాల్లో అతి ప్రధానమైనదన్న విషయం ప్రజలతో, అంటే ఉద్యోగస్థలంలోనూ, స్కూల్లోనూ, అవిశ్వాసులైన కుటుంబ సభ్యులతోనూ మనకున్న దైనందిన వ్యవహారాల్లో ప్రస్ఫుటం కావాలి. మన సంభాషణ ఈ లోకానికి చెందిన సంస్కారహీనమైన అసభ్యమైన పదజాలంతో మన నోరు కల్మషమై ఉండడానికి బదులుగా, దేవుడ్ని ఘనపర్చేదై ఉండాలి. ప్రతి దినమూ, ప్రతి సందర్భంలోనూ ప్రకటించమని ఆయన మనకిచ్చిన సువార్త గురించి మనం ఇతరులతో మాట్లాడాలి.—అపొ. 5:42; కొలొ. 4:6.
5 యెహోవా దేవుని సత్యారాధకులుగా మనం ప్రతి దినమూ మన నిరుపమాన దేవుడైన యెహోవాను గురించి మాట్లాడే అవకాశాలను ఉపయోగించుకొందాము.—కీర్త. 106:47.