సాక్షులు కాని వివాహ భాగస్వాములకు చేరువవ్వండి
1 వివాహిత దంపతులు సత్యారాధనలో ఐక్యమైనప్పుడు, గొప్ప ఆనందానికి అది ఒక కారణమౌతుంది. అయితే, చాలా కుటుంబాల్లో భార్యాభర్తల్లో ఒకరు మాత్రమే సత్యపు మార్గాన్ని స్వీకరించారు. సాక్షులు కాని వివాహ జతలకు మనమెలా చేరువవ్వవచ్చు, మనతో పాటు యెహోవాను ఆరాధించేందుకు వాళ్ళను ఎలా ప్రోత్సహించవచ్చు?—1 తిమో. 2:1-4.
2 వాళ్ళెలా భావిస్తున్నారో అర్థం చేసుకోండి: కొంతమంది సాక్షులు కాని వివాహ జతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఉదాసీనత లేక అపార్థం చేసుకోవడమే తరచూ సమస్య అవుతుంది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేయబడినట్లు భావించవచ్చు లేదా తన భార్య/భర్త క్రొత్తగా కనుగొన్న ఆధ్యాత్మిక ఆసక్తి విషయంలో తనకు కోపం వచ్చి ఉండవచ్చు. “ఇంట్లో ఒంటరిగా ఉండడం వలన నేను ఏకాకినని భావించాను” అని ఒక భర్త గుర్తు చేసుకుంటున్నాడు. “నా భార్యా పిల్లలు నన్ను ఉపేక్షిస్తున్నట్లుగా నేను భావించాను” అని మరొకరు అంటున్నారు. మతం తన నుండి తన కుటుంబాన్ని వేరు చేస్తున్నట్లు కొందరు పురుషులు భావిస్తారు. (కావలికోట ఆగస్టు 15, 1990 (ఆంగ్లం) 20-3 పేజీలు చూడండి.) అందుకే సాధ్యమైతే, గృహ బైబిలు పఠన ఏర్పాటులో మొదటి నుండీ కూడా భార్యతోపాటు భర్తను కూడా చేర్చుకోవడమే శ్రేయస్కరం.
3 ఒక జట్టుగా పనిచేయండి: వివాహిత జతలు సత్యంలోకి వచ్చేందుకు సహాయపడడంలో ఒక సాక్షి దంపతులు ఫలకరంగా పని చేశారు. సహోదరి భార్యతో పఠనం ఆరంభించిన తర్వాత, సహోదరుడు భర్తను సందర్శించేవాడు. ఆయన తరచూ భర్తతో పఠనం నిర్వహించగల్గేవాడు.
4 స్నేహశీలురుగాను, ఆతిథ్యమిచ్చేవారిగాను ఉండండి: సంఘంలోని కుటుంబాలు సత్యారాధనలో ఇంత వరకూ ఐక్యం కాని కుటుంబాల ఎడల ఆసక్తిని చూపించడం ద్వారా సహాయం చేయగలరు. యెహోవాసాక్షులు ఇతరుల క్షేమాన్ని గురించి తలంచే ఆప్యాయతా, శ్రద్ధా గల క్రైస్తవులని యెహోవాసాక్షి కాని వివాహజత తెలుసుకునేందుకు స్నేహపురస్సరంగా వారిని కొన్నిసార్లు సందర్శించడం సహాయపడగలదు.
5 సాక్షులు కాని వివాహజతలకు చేరువయ్యేందుకు ఇటీవల చేసిన ప్రయత్నాలను అప్పుడప్పుడు పునఃసమీక్షించి, వారిని యెహోవావైపుకు గెలుచుకునేందుకు ఇంకా ఏమి చేయవచ్చో పెద్దలు నిర్ణయించుకోగలరు.—1 పేతు. 3:1, NW, అధస్సూచి.