మీరు నిర్వికారం ఎడల ఎలా ప్రతిస్పందిస్తారు?
1 నిర్వికారం అంటే అనుభూతికానీ ఉద్వేగం కానీ లోపించడం, ఆసక్తి కానీ శ్రద్ధ కానీ లేకపోవడం. పరిచర్యలో మనకు అతి సాధారణంగా ఎదురయ్యే అతి కఠినమైన దృక్పథాల్లో ఇదొకటి. మీరు దానికి ఎలా ప్రతిస్పందిస్తారు? అది మీరు పరిచర్యలో చైతన్యం లేనివారయ్యేందుకు కారణమయ్యిందా? ప్రజలకు రాజ్య సందేశాన్ని అందించేందుకు మీరు దానిని ఎలా అధిగమించగలరు?
2 మొదట, మీ ప్రాంతంలోని ప్రజలు ఎందుకు నిర్వికారంగా ఉన్నారో నిర్ధారించుకోండి. తమ రాజకీయ నాయకులు లేదా మత నాయకుల కారణంగా ఆశాభంగం కలిగినందువల్లేనా? తమకు ఎదురౌతున్న సమస్యలకు ఏ పరిష్కారమూ లేదని వాళ్ళు భావిస్తున్నారా? పరిస్థితులు చక్కబడతాయనే వాగ్దానాలను వారు సంశయిస్తున్నారా? తమకు వాస్తవమైన ప్రయోజనాలు వెంటనే కనిపించకపోతే ఆధ్యాత్మిక విషయాలను గూర్చి తలంచడానికి వాళ్ళు విముఖత చూపిస్తున్నారా?
3 రాజ్య నిరీక్షణను ఉన్నతపర్చండి: రాజ్యం పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ లేదు. కనుక సాధ్యమైనప్పుడెల్లా, లేఖనాధార ప్రస్తావనలను చేస్తూ—బైబిలు పాఠ్యభాగాన్ని చూపించడం సాధ్యం కాకపోయినా, ఆచరణాత్మకం కాకపోయినా—మనం రాజ్య వాగ్దానాలను గురించి మాట్లాడాలి. (హెబ్రీ. 4:12) అయితే, మన సంభాషణను రాజ్య వాగ్దానాల వైపుకు ఎలా మళ్ళించవచ్చు?
4 మన సందర్శనం యొక్క ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకోవలసిన అవసరముంది. మనకు పొరుగువారి ఎడల ప్రేమ ఉన్నందువల్లే, సమాజం విషయంలో చింత ఉన్నందువల్లే వాళ్ళ దగ్గరకు వెళ్తున్నామని వాళ్ళు గుర్తించవలసిన అవసరముంది. మనం బాగా ఆలోచించి, “[సమాజాన్ని బాధిస్తున్న సమస్యకు] పరిష్కారమేమిటని మీరు అనుకుంటున్నారు?” వంటి ప్రశ్నలను వేయవచ్చు. ఒక విధానం సరికాకపోతే మరొక విధానాన్ని ప్రయత్నించవచ్చు.
5 ధనికులు నివసిస్తున్న ఒక ప్రాంతంలో, గృహస్థులు రాజ్య సందేశం ఎడల ఉదాసీనతను చూపించే చోట ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతాన్ని కనుగొనేందుకు ప్రచారకులు చాలా కృషి చేశారు. జ్ఞానం పుస్తకంలోని విశేషమైన అంశాలను చూపిస్తూ ఒక దంపతులు ప్రయత్నించిన ఉపోద్ఘాతమిది: “నేటి ప్రపంచంలో విజయాన్ని సాధించాలంటే మంచి విద్యాభ్యాసం ప్రాముఖ్యమని మీరు భావిస్తున్నారా? సంగ్రహ విద్యాభ్యాసంలో బైబిలు జ్ఞానం కూడా ఇమిడి ఉంటుందన్న విషయంలో మీరు ఏకీభవిస్తారా?” ఆ మధ్యాహ్నం పూటనే వాళ్ళు మూడు పుస్తకాలను అందించారు. పుస్తకాలను తీసుకున్న వారిలో ఒక స్త్రీ తాను జ్ఞానము పుస్తకాన్ని పూర్తిగా చదివేసిందనీ బైబిలు పఠనం చేసేందుకు తనకు సమ్మతమేననీ తెలిపింది.
6 నిర్వికారం మీకు ఎదురైనప్పుడు, మీరు విభిన్నమైన రీతుల్లో ప్రయత్నించండి. ఆలోచనను రేకెత్తించే ప్రశ్నలను అడగండి. దేవుని వాక్యపు శక్తిని ఉపయోగించండి. మన అద్భుతమైన రాజ్య నిరీక్షణను అంటిపెట్టుకుని ఉండేందుకు ఇతరులకు మీరలా సహాయపడగలుగుతారు.