ఎంతోమంది విశ్వాసులు చేరుతున్నారు
1 మొదటి శతాబ్దంలో జరిగినట్లుగానే, క్రైస్తవ సంఘంలో నేడు కనిపిస్తున్న పెరుగుదల ఎంతో అసాధారణమైనది. (అపొ. 2:41; 4:4) గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3,66,579 మంది కొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకున్నారు, అంటే ప్రతి రోజూ 1,000 కంటే ఎక్కవమంది చొప్పున బాప్తిస్మం తీసుకున్నారన్నమాట! గత మూడు సంవత్సరాల్లో 10 లక్షలకన్నా ఎక్కువమంది బాప్తిస్మం పొందారు. వాస్తవంగానే, ఎంతోమంది విశ్వాసులను యెహోవా చేరుస్తూవున్నాడు.—అపొ. 5:14.
2 క్రైస్తవ జీవితంలో అనుభవంలేని అనేకమందికి విశ్వాసంలో దృఢంగా ఉన్నవారినుండి సహాయమూ శిక్షణా అవసరం. (రోమా. 15:1) తొలి క్రైస్తవుల్లో కొందరు, తాము బాప్తిస్మం తీసుకున్న అనేక సంవత్సరాల తర్వాత కూడా ‘సంపూర్ణులవ్వడానికి సాగలేకపోయారు.’ (హెబ్రీ. 5:12; 6:1, 2) అందుచేతనే హెబ్రీయులకు తాను రాసిన ఉత్తరంలో, క్రైస్తవులు ఆత్మీయంగా ఏయే రంగాల్లో ఎదగాల్సిన అవసరం ఉందో ఆయా రంగాలను పౌలు ఉన్నతపర్చాడు. ఇవి ఏ రంగాలు, మరి అవసరమైన సహాయాన్ని ఎలా అందించవచ్చు?
3 మంచి పఠన అలవాట్లను అలవర్చుకోవడం: పౌలు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణ్యంగా మంచి విద్యార్థిగా ఉండడంలో చురుకుగా నేర్చుకోవడం, ఆ పాఠాలను తిరిగి జ్ఞాపకం చేసుకోవడం, యెహోవా సంస్థ అందించే “బలమైన ఆహారము”ను ఉపయోగించుకోవడం ఇమిడి ఉన్నాయి. (హెబ్రీ. 5:13, 14; ఆగస్టు 15, 1993, కావలికోట, 12-17 పేజీలు చూడండి.) కొత్త విశ్వాసులను ఆత్మీయ సంభాషణల్లో నిమగ్నంచేసి, వ్యక్తిగత పఠనం ద్వారా మీరు నేర్చుకున్న అమూల్యమైన సత్యపు రత్నాలను వారితో పంచుకోవడం ద్వారా వారు మంచి పఠన అలవాట్లను అలవర్చుకునేందుకు మీరు వారిని పురికొల్పవచ్చు. బహుశ అప్పుడప్పుడు మీ వ్యక్తిగత లేక కుటుంబ పఠనంలో మీతో చేరమని కొత్తవారిని అహ్వానించవచ్చు.
4 క్రమంగా కూటాలకు హాజరవ్వడం: మీరు చూపించే నమ్మకమైన మాదిరి మరియు ప్రేమతోకూడిన ప్రోత్సాహకరమైన మాటలూ పౌలు ప్రస్తావించిన మరో విషయాన్ని సంఘంలోని కొత్తవారు నివారించేందుకు సహాయపడతాయి. నివారించవలసిన విషయమేమిటంటే, కొందరికున్న, క్రైస్తవ కూటాలను మానుకోవడమనే “అలవాటు.” (హెబ్రీ. 10:24, 25, ఇండియా బైబిలు లిటరేచర్) కూటాలనేవి వారిని సంఘంతో జతచేసివుంచుతూ, మునిగేవ్యక్తిని రక్షించే ఆత్మీయ రక్షక తాడులాంటివని వారు గ్రహించేందుకు సహాయం చేయండి. మన సహోదరత్వంలో తామూ భాగమని వారు భావించేలా చేసేందుకు మీరు చొరవ తీసుకోండి.
5 యెహోవాను నమ్మకంతో సమీపించడం: శారీరక బలహీనతలనూ వ్యక్తిత్వ లోపాలను జయించేందుకుగానూ, మన హృదయాంతరాళాల్లోని తలంపులనూ ఆంతరంగిక చింతలనూ యెహోవాకు వ్యక్తపరుస్తూ ప్రార్థించాలి. పౌలు చెప్పినట్లుగా, సహాయం కొరకు యెహోవాను వేడుకున్నట్లైతే తాము తొట్రుపడనవసరం ఉండదని కొత్తవారు గ్రహించాలి. (హెబ్రీ. 4:15, 16; 10:22) ఈ విషయంలో మీ వ్యక్తిగత అనుభవాలను కొత్తవారికి చెప్పడం, యెహోవా హృదయపూర్వకమైన ప్రార్థనలను వింటాడనే వారి నమ్మకాన్ని బలపరుస్తుంది.
6 పరిచర్య కొరకు సమయాన్ని కేటాయించడం: మనం ‘దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయడం’ ఆత్మీయంగా బలపర్చేదిగా ఉంటుందని కూడా పౌలు చూపించాడు. (హెబ్రీ. 13:15) ప్రాంతీయ సేవ కొరకు ప్రతివారం చేసే ఏర్పాట్లలో మీతోకూడా పనిచేసేందుకు ఓ కొత్త ప్రచారకున్ని మీరు అహ్వానించగలరా? బహుశా, మీరిద్దరూ కలిసి, అందింపులను గానీ లేక ఆ కొత్త వ్యక్తి పరిచర్యలో ఇంతవరకూ ఉపయోగించని ఒక పద్ధతినిగానీ సిద్ధపడవచ్చు.
7 ఎంతోమంది చేరడం గొప్ప ఆనందానికి కారణమౌతుంది. సంఘంలోని కొత్త సభ్యులకు శిక్షణనివ్వడానికి, వారికి ఉద్బోధించడానికి మనల్ని మనం సమర్పించుకోవడం, ‘తమ ప్రాణములను రక్షించుకునేందుకు’ అవసరమైన దృఢమైన విశ్వాసాన్ని వారు పెంపొందించుకునేందుకు వారికి సహాయం చేస్తుంది.—హెబ్రీ. 3:12, 13; 10:39.