ప్రశ్నా భాగం
◼ నేరుగా మన సహోదరులపై ప్రభావం చూపించే విపత్తు సంభవించినప్పుడు ఏం చెయ్యాలి?
మీ ప్రాంతంలో విపత్తు సంభవించినట్లైతే: భీతిల్లిపోకండి. ప్రశాంతంగా ఉండి, నిజంగా విలువైన వాటిపై అంటే ఆస్తిపాస్తులపైగాక ప్రాణాలపై శ్రద్ధను చూపండి. మీ కుటుంబ సభ్యులకు తక్షణం కావాల్సిన భౌతికావసరాల గురించి శ్రద్ధతీసుకోండి. మీ పరిస్థితుల్ని గురించీ, ప్రస్తుతం మీరున్న స్థలాన్ని గురించి పెద్దలకు తెలియజేయండి.
పునరావాస సహాయాన్ని అందించడంలో పెద్దలూ, పరిచర్య సేవకులూ ఓ ప్రముఖమైన పాత్రను నిర్వహిస్తారు. కొన్ని పెద్ద పెద్ద తుపాన్ల విషయంలో హెచ్చరించినట్లుగానే విపత్తును గూర్చి ముందుగానే హెచ్చరిక చేయబడితే, ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రదేశంలోనే ఉండేలా ఈ సహోదరులు రూఢిపర్చుకోవాలి. తగినంత వ్యవధి ఉన్నట్టయితే, కావాల్సిన వాటిని సంపాదించి, పంపిణీ చేయవచ్చు.
ఆ తర్వాత, పుస్తకపఠన నిర్వాహకులు ప్రతీ కుటుంబం ఎక్కడెక్కడుందో కనుక్కొని, వారి యోగక్షేమాల్ని గురించిన సమాచారాన్ని సేకరించాలి. అందరూ క్షేమంగానే ఉన్నప్పటికీ, సంఘ పైవిచారణకర్తగానీ లేక మరొక పెద్దగానీ ప్రతీ కుటుంబం యొక్క పరిస్థితిని గూర్చీ తెలియజేయాలి. ఎవరైనా గాయపడినట్లైతే, పెద్దలు వైద్య చికిత్సను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆహారమూ, బట్టలూ, తల దాచుకోవడానికి స్థలమూ లేక కావాల్సిన గృహావసర వస్తువులూ వంటి అవసరమైన వాటిని వేటినైనా సరే, వాళ్లు అందిస్తారు కూడా. (యోహా. 13:35; గలతీ. 6:10) స్థానిక పెద్దలు సంఘానికి ఆధ్యాత్మిక, భావోద్రేక మద్దతును ఇస్తారు, అలాగే సంఘకూటాలు వీలైనంత త్వరగా పునఃప్రారంభించబడేలా ఏర్పాటు చేస్తారు. సమగ్రమైన మదింపు చేసిన తర్వాత, గాయపడినవారిని గురించీ, రాజ్యమందిరానికీ లేక మన సహోదరుల ఇళ్లకూ కల్గిన నష్టం గురించీ, అలాగే ప్రత్యేక అవసరతలు ఏవైనా ఉంటే వాటిని గురించీ ప్రాంతీయ పైవిచారణకర్తకు తెలియజేయడానికి పెద్దల సభ తరపున ఒక పెద్ద ఆయన్ని సంప్రదించాలి. అటు తర్వాత, ప్రాంతీయ పైవిచారణకర్త పరిస్థితిని గూర్చిన రిపోర్టును బ్రాంచి ఆఫీసుకు ఫోన్‌చేసి తెలియజేస్తాడు. పెద్ద మొత్తంలో అవసరమైన పునరావాస పనులు ఏవైనా ఉంటే, వాటిని బ్రాంచి ఆఫీసు సమన్వయ పరుస్తుంది.
విపత్తు మరొక ప్రాంతంలో సంభవిస్తే: విపత్తు సంభవించిన ప్రాంతంలో ఉన్న సహోదర సహోదరీల్ని మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. (2 కొరిం. 1:8-11) ధనరూపంలో మీరు సహాయం చేయాలని అనుకొంటే, మీ చందాల్ని మీరు సొసైటీకి పంపించవచ్చు. చందాల్ని పంపించాల్సిన అడ్రస్: Watch Tower Society, H-58 Old Khandala Road, Lonavla, MAH 410 401. (అపొ. 2:44, 45; 1 కొరిం. 16:1-3; 2 కొరిం. 9:5-7; కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 1, 1985, 20-2 పేజీలు చూడండి.) పర్యవేక్షిస్తున్న సహోదరులు నిర్దిష్టంగా విజ్ఞప్తి చేస్తేనే తప్ప, విపత్తు సంభవించిన ప్రాంతానికి వస్తుసంబంధమైన వాటిని గానీ లేక అవసరమైన వాటినిగానీ పంపించవద్దు. ఇలా చేయడం, పునరావాస సహాయాన్ని క్రమమైన రీతిలో అందించేలా, వస్తువుల పంపిణీ సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది. (1 కొరిం. 14:40) సొసైటీకి అనవసరంగా ఫోన్ చేయకండి, ఇలా చేయడంవల్ల టెలిఫోన్ లైన్లు బిజీగా అయిపోయి, విపత్తు సంభవించిన ప్రాంతం నుండి వచ్చే ఫోన్‌కాల్స్ అందుకోవడం కష్టమౌతుంది.
సరియైన మదింపు చేసిన తర్వాత, పునరావాస కమిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది సొసైటీ నిర్థారిస్తుంది. బాధ్యతగల సహోదరులకు ఆ విషయం తెలియజేయబడుతుంది. సహోదరులందరి ముఖ్యావసరాలు తగినరీతిలో తీర్చబడగలిగేలా, నడిపింపు నిస్తున్న పెద్దలతో అందరూ సహకరించాలి.—యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) 310-15 పేజీలు.