కుటుంబ బైబిలు పఠనం—క్రైస్తవులకు ప్రాముఖ్యమైనది
1 ఒక కుటుంబమనేది మానవ సంస్థలన్నింటిలోకెల్లా అతి ప్రాచీనమైనది. “పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము” యెహోవాను బట్టి ‘కుటుంబమని పిలువబడుచున్నది’ కనుక, ఆయనకు అది ఎంతో ప్రశస్తమైనది. (ఎఫె. 3:15) ఒక పురుషుడు, స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు ఒక కుటుంబం ఉనికిలోనికి వస్తుంది. పిల్లలు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. (ఆది. 2:24; కీర్త. 127:3) కనుక, కుటుంబ ఆత్మీయత అనేది అతి ప్రాముఖ్యమైనది. ఎంతో తరచూ విశ్వాసులైన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా యౌవనారంభంలో ఉన్నవారితో సమస్యలున్నప్పుడు ఇంట్లో కుటుంబ బైబిలు పఠనం నిర్వహించబడలేదని కనుగొనబడింది. విచారకరమైనదేమంటే, పాఠశాలకు వెళ్ళే తమ పిల్లలు లోక ప్రభావాలకు లొంగిపోతున్నారని పెద్దల మరియు పరిచారకుల కుటుంబాలతో సహా అనేక కుటుంబాలు కనుగొంటున్నాయి. చాలావరకు సమస్యల మూల కారణం ఇంట్లో బైబిలు ఉపదేశాలకు శ్రద్ధనివ్వకపోవడమే.
2 దేవుని వాక్యంలో ఇవ్వబడిన మార్గనిర్దేశక సూత్రాలను కుటుంబాలు అనుసరించాలంటే, వారు క్రమమైన కుటుంబ బైబిలు పఠనానికి తప్పక సమయాన్ని కేటాయించాలి. క్రమంగా కుటుంబ బైబిలు పఠనాన్ని నిర్వహించడంలో కుటుంబ శిరస్సులు శ్రద్ధాపూర్వకంగా పట్టుదల కలిగి ఉండవలసిన అవసరత ఉంది, అలాగే కుటుంబమంతటి ప్రయోజనం కొరకు ఈ విధంగా కుటుంబమంతా కలిసి ఆరాధించడంలో సఫలులయ్యేందుకు కుటుంబంలోని మిగిలిన సభ్యులు కూడా సహాయం చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఆత్మీయ అవసరతలకు సరైన శ్రద్ధనివ్వకపోతే, భవిష్యత్తులో తీవ్రమైన మరియు వేదనాకరమైన సమస్యలతో వ్యవహరించవలసి ఉంటుందని అందరూ గుణగ్రహించవలసిన అవసరం ఉంది.
3 ఒక పఠనం ఎలా నిర్వహించబడాలి? ఏది పఠించబడాలి? అది ఎప్పుడు, ఎంత సేపు నిర్వహించబడాలి? పిల్లవాని హృదయాన్ని మీరు చేరుకోవడాన్ని గూర్చి మీరెలా నిశ్చయతను కలిగి ఉండగలరు? ఈ ప్రశ్నల జవాబుల కొరకు దయచేసి కావలికోట అక్టోబరు 1, 1994, పేజీ 26 చూడండి.
4 కుటుంబ పఠనం క్రమంగాను కుటుంబ అవసరాలకు అనుగుణంగాను నిర్వహించబడాలి. దిన వచనాన్ని పరిశీలించడంలోను ఇది నిజమై ఉండాలి. దేవుని వాక్యాన్ని చర్చించడంతో దిన చర్యను ఆరంభించడం ఎంత శ్రేష్ఠమైన విషయం! పగలంతా దానిని ధ్యానించడం ‘ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిని గూర్చి ఆలోచించడానికి’ మనకు సహాయపడుతుంది. (ఫిలి. 4:8) మీరు దిన వచనాన్ని పరిశీలించడం, మీ కుటుంబ పఠనం అనేవి క్రమంగా జరుగుతున్నాయా? ఈ విషయంలో మీరు అభివృద్ధిని సాధించవలసిన అవసరం ఉందా?
5 తలిదండ్రులు కనబరచే సంతోషం, ఉత్సాహం అనేవి విజయవంతమైన కుటుంబ పఠనానికి ముఖ్యాంశాలు. (కీర్తన 40:8 పోల్చండి) అలాగే, తలిదండ్రులు పిల్లలు చేసే ప్రయత్నాలను ప్రశంసించి, యెహోవా సూత్రాలను అన్వయించాలని వారిని ప్రోత్సహించవలసిన అవసరముంది.
6 కుటుంబ ఐక్యతకు వ్యతిరేకంగా, యెహోవా ఎడల వ్యక్తికున్న యథార్థతకు వ్యతిరేకంగా పనిచేసే అనేక కారణాలున్నాయి గనుక, పఠనాన్ని నిర్వహించడంలో కుటుంబ శిరస్సు నాయకత్వం వహించడం ప్రాముఖ్యమై ఉంది. భోజన వేళ వంటి అనియత సందర్భాల్లో ఆత్మీయ విషయాలను చర్చించగలిగినప్పటికీ, ముందుగా ఏర్పాటు చేసిన కుటుంబ బైబిలు చర్చలు కుటుంబ విజయానికి, ఆత్మీయ ఎదుగుదలకు అత్యవసరం.—ద్వితీ. 6:6-9.
7 తలిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ అవసరతలకు ఎల్లప్పుడూ శ్రద్ధనిస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడూ, అలాగే భవిష్యత్తులోను అనేక ఆశీర్వాదాలను అనుభవించవచ్చు. పిల్లలు దేవుని నియమాల విలువను గ్రహించి, అవి నిజంగా మంచివని, ప్రయోజనకరమైనవని ఒప్పించబడుతుండగా వారు కూటాలకు హాజరుకావడం మరియు మీతో పరిచర్యలో పాల్గొనడం అనేవి యాంత్రికంగా చేయకుండా, సత్యాన్ని తమ స్వంతం చేసుకుంటారు. వారు సత్యాన్ని తమ స్వంతం చేసుకోకపోతే, సాతాను మోసకరమైన క్రియలకు వారు ఎర అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. కనుక, తలిదండ్రులారా, కుటుంబ పఠనానికి అర్హమైన ప్రాముఖ్యతను ఆనందంగా ఇవ్వండి.