యెహోవా చేత పరిశీలించబడుట—ఎందుకు ప్రయోజనకరమైనది?
1 ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యం కావాలని ఆశిస్తారు. అది జీవితాన్ని మరింత ఆనందదాయకంగా చేస్తుంది. అయితే, మంచి ఆరోగ్యమున్న వారు కూడా అప్పుడప్పుడు వైద్యునికి చూపించుకుంటారు. ఎందుకని? ఏదైనా వ్యాధి కలుగబోతుందేమో తెలుసుకొని, దాని నివారించే చర్యలను గైకొనేందుకే. మన ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంతకన్నా ప్రాముఖ్యమైనది. యెహోవా అంగీకారం “విశ్వాసవిషయమున స్వస్థుల”ముగా ఉండడంపై ఆధారపడి ఉంటుంది.—తీతు 1:13.
2 యెహోవా చేత పరిశీలించబడడానికి ఇదియే సరైన సమయం. ఎందుకలా? ఎందుకంటే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉండి, మానవులందరి హృదయాలను పరిశీలిస్తున్నాడు. (కీర్త. 11:4, 5; సామె. 17:3) దావీదువలె, మనలను సమగ్రంగా పరిశీలించమని మనం యెహోవాను అడుగుతాము: “యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.”—కీర్త. 26:2.
3 మన అపరిపూర్ణ శరీరం వల్ల మనలో నుండే రాగల ఆత్మీయ ఆరోగ్యానికి అపాయాలకు వ్యతిరేకంగా మనల్ని మనం కాపాడుకోవలసి ఉంది. సామెతలు 4:23 ఈ విధంగా ఉపదేశిస్తుంది: “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.”
4 మన చుట్టూవున్న అవినీతికరమైన, అనైతిక ప్రపంచం వల్ల కూడా మన ఆత్మీయ ఆరోగ్యం అపాయంలో పడవచ్చు. ఈ దుష్ట విధానానికి మరింత దగ్గర కావడానికి మనల్ని మనం అనుమతిస్తున్నట్లయితే, అది ఆలోచిస్తున్నట్లే మనం కూడా ఆలోచించడం మరియు లోక దృక్పథాలను పెంపొందించడం ఆరంభించవచ్చు. లేదా మనం లోక జీవన విధానాన్ని అనుసరించి లోకాత్మకు లొంగిపోవచ్చు.—ఎఫె. 2:2, 3.
5 మనలను ఆత్మీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నంలో సాతాను హింసను, సూటైన వ్యతిరేకతను ఉపయోగించవచ్చు. అయితే, అతడు మనలను వంచించేందుకు మరి తరచుగా లోకసంబంధమైన ఆకర్షణలను మోసకరంగా ఉపయోగిస్తాడు. సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” గనుక ‘నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి’ అని పేతురు మనకు ఉద్బోధిస్తున్నాడు. ‘విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలని’ మనం ప్రేరేపించబడుతున్నాము.—1 పేతు. 5:8, 9.
6 మన విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకుంటూ, దానిని ప్రతిరోజు మరింత బలపరచుకోవడం ద్వారా మన ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరత ఉంది. మనం మన విశ్వాసాన్ని ఎడతెగక పరిశీలించవలసిన అవసరముందని అపొస్తలుడైన పౌలు ఉపదేశిస్తున్నాడు. ఒక మంచి వైద్యుడు మనకిచ్చే ఆచరణయోగ్యమైన సలహాను మనం ఎలా జ్ఞానపూర్వకంగా అంగీకరిస్తామో, అలాగే యెహోవా చేసే ఆత్మీయ పరిశీలన సరిదిద్దవలసిన ఏ లోపాన్నైనా వెల్లడిచేస్తే, మనం ఆయన చెప్పేది వింటాము. మనం “సరిదిద్దబడడాన్ని” (NW) ఇది సాధ్యపరుస్తుంది.—2 కొరిం. 13:5, 11.
7 యెహోవా నిజంగా గొప్ప పరిశీలకుడే. ఆయన చేసే నిర్ధారణ ఎల్లప్పుడూ కచ్చితంగానే ఉంటుంది. మనకు కావలసినదేమిటో ఆయనకు కచ్చితంగా తెలుసు. ఆయన తన వాక్యం ద్వారా మరియు ‘నమ్మకమైన దాసుని’ ద్వారా ఆరోగ్యకరమైన ఆత్మీయ పథ్యాన్ని సూచిస్తాడు. (మత్త. 24:45; 1 తిమో. 4:6) ఇంట్లోను సంఘ కూటాల్లోను ఈ ఆత్మీయ పోషకాహార పథ్యాన్ని క్రమంగా తీసుకోవడం వల్ల మన ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనల్ని సమర్థులనుగా చేస్తుంది. పరిచర్యలోను మరితర క్రైస్తవ కార్యక్రమాల్లోను క్రమంగా ఆత్మీయ వ్యాయామం చేయడం కూడా ప్రయోజనకరంగా ఉండగలదు. కనుక, మనం మంచి ఆత్మీయ ఆరోగ్యంగా ఉండేందుకు ఆయన మనకు సహాయపడతాడని నమ్మకంతో ఉంటూ మనం యెహోవా చేత క్రమంగా పరిశీలించబడడాన్ని ఆహ్వానిస్తాము.