క్రమమైన పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూ నడవండి
1 ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించడానికి కృషిచేసిన అపొస్తలుడైన పౌలుకు దానియెడల ప్రత్యేకమైన అనురాగముంది. వారు చూపిన దాతృత్వానికి ఆయన కృతజ్ఞుడై, వారు మంచి మాదిరిగా ఉన్నారని వారిని గూర్చి మాట్లాడాడు.—2 కొరిం. 8:1-6.
2 ప్రగాఢమైన ప్రేమనుబట్టి పౌలు ఫిలిప్పీయులకు పత్రిక రాయడానికి పురికొల్పబడ్డాడు. ఇన్సైట్ పుస్తకం వాల్యూమ్ 2, పేజీ 631, యిలా నివేదిస్తుంది: “వివేచనను వెంబడిస్తూ, జీవవాక్యాన్ని చేతపట్టుకొని, దృఢమైన విశ్వాసాన్ని, రానున్న బహుమానాన్ని గూర్చిన నిరీక్షణను కలిగి, మంచి ప్రవర్తనలో వారు కొనసాగాలని, ఫిలిప్పీ సంఘాన్ని ఆయన తన పత్రిక అంతటిలోను ప్రోత్సహిస్తున్నాడు.” వారి మధ్య, వారికి అపొస్తలునికి మధ్య గల బంధాన్ని దృఢపరుస్తూ, వాళ్ళు స్నేహపూర్వకంగా ప్రతిస్పందించారు. తన ఉద్బోధను గూర్చి జాగ్రత్తగా యోచించడానికి మంచి హేతువునిస్తూ, ఫిలిప్పీయులు 3:15-17లో పౌలు చెప్పిన మాటలు ముఖ్యంగా నేడు మనకు ప్రత్యేకమైన భావాన్ని కలిగివున్నాయి.—ఫిలిప్పీయులు 3:15-17.
3 పరిపక్వతగల మానసిక దృక్పథం అవసరం: ఫిలిప్పీయులు 3:15లో పౌలు ఎన్నో సంవత్సరాల అనుభవమున్న ఒక వ్యక్తిలాగ వ్రాశాడు. వాళ్ళ ఆత్మీయ అభివృద్ధిని ఆయన గ్రహించాడు, సరైన మానసిక దృక్పథం గల పరిపక్వత చెందిన క్రైస్తవులుగా ఉండాలని ఆయన వారిని వేడుకున్నాడు., వారి మానసిక దృక్పథం యేసు ప్రదర్శించిన వినయాన్ని, మెప్పుదలను చూపించినంత కాలం, వాళ్ళు “నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, . . . . జీవవాక్యము చేత పట్టుకొని” కొనసాగుతారు. (ఫిలిప్పీయులు 2:15, 16) ఆ మాటలను మనం చదివేటప్పుడు పౌలు మనతో మాట్లాడుతున్నట్లుగా మనం భావించాలి. ఆ విధంగా మన ఆధిక్యతలయెడల మన మెప్పును ప్రదర్శిస్తూ, యేసు కలిగివున్న అదే దృక్పథాన్ని కలిగివుండాలని మనం మనఃపూర్వకంగా కోరుకుంటాం. ఈ విషయంలోను, యితర విషయాల్లోనూ సహాయం కొరకు యెహోవాను ఎడతెగక ప్రార్థనలో వేడుకొంటాము.—ఫిలి. 4:6, 7.
4 ఫిలిప్పీయులు 3:16 సూచిస్తున్నట్లుగా, మనమందరం అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నం చేయాలి. “అభివృద్ధి” అనే మాటకు “ముందుకు సాగుట, పురోగతిని సాధించుట,” అని భావం. అభివృద్ధిని సాధిస్తున్న ప్రజలు “కొత్త తలంపుల్లోను, అన్వేషణల్లోను, అవకాశాల్లోను ఆసక్తి కలిగి ఉంటారు.” క్రైస్తవత్వమనేది ఎన్నడూ మందకొడిగా ఉండదని, క్రైస్తవులమని చెప్పుకొనేవారు ముందుకు సాగుతూనే ఉండాలనే విషయాన్ని ఫిలిప్పీయులు గ్రహించాలని పౌలు కోరాడు. తమను తాము పరిశీలించుకోడానికి, తమ బలహీనతలను గుర్తించడానికి, ఎక్కువ పని చేయడానికి గల అవకాశాలను అందుకోడానికి లేదా వారు చేస్తున్న దాని నాణ్యతను పెంచే అవకాశాలను అందుకోడానికి సంసిద్ధత చూపించడం ద్వారా అభివృద్ధిచెందుతున్న వారి స్ఫూర్తి ప్రదర్శించబడుతుంది. నేడు యెహోవా భూసంస్థ ఎల్లవేళలా తన పనిని, దేవుని వాక్యాన్ని గూర్చిన తన అవగాహనను విస్తృతపరుస్తూ ముందుకు సాగుతుంది. మనలో ప్రతి ఒక్కరు దాని ఏర్పాట్లన్నింటినుండి ప్రయోజనం పొందుతూ, దాని పనిలో పూర్తిగా భాగం వహిస్తూ, దానితోపాటు ముందుకు సాగాలి.
5 అభివృద్ధికి క్రమమైన పద్ధతి అవసరం: “ఇప్పటి వరకూ మనకు లభించినదానిని బట్టియే క్రమముగా నడుచుకొందము” అని ఉద్బోధిస్తూ పౌలు కొనసాగించాడు. (ఫిలి. 3:16) క్రమంగా ఉండడంలో, ఒకరితోనొకరికి గల తమ సంబంధాన్నిబట్టి, వ్యక్తులను, లేదా వస్తువులను ఆయా స్థానాల్లో ఉంచడం, లేక సరిగ్గా ప్రవర్తించడం అవసరం. ఫిలిప్పీలోని క్రైస్తవులు యెహోవా సంస్థతోను, ఒకరు మరొకరితోను సన్నిహితంగా ఉంటూ, తమను తాము సరైన స్థానంలో ఉంచుకున్నారు. ప్రేమ అనే చట్టం వారి జీవితాలను నడిపించింది. (యోహాను 15:17; ఫిలి. 2:1, 2) “సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి,” అని పౌలు వాళ్ళను కోరాడు. (ఫిలి. 1:27) క్రమము, మంచి ప్రవర్తన అనేవాటి అవసరత నేటి క్రైస్తవులకు కూడా అంతే ప్రాముఖ్యత కలిగివుంది.
6 పద్ధతి అనేది నిర్ణయించబడిన కార్యాన్ని అలవాటుగా చేయడమే. ఆవిధంగా అది వాడుకగా చేసే విషయాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఒక పద్ధతిని కలిగి ఉండడం మనకు ప్రయోజనాన్నివ్వగలదు, ఎందుకంటే, మనం తర్వాత చేసేదానినిగూర్చిన నిర్ణయాలు తీసుకోడానికి ఆగి, ఆలోచించాల్సిన పని లేదు,—యిప్పటికే మనం ఒక పద్ధతిని నిర్ణయించుకున్నాం, అలవాటు చొప్పున దానిని అనుసరిస్తాము.
7 మనల్ని మనం ఆత్మీయంగా వృద్ధిచేసుకుంటూ, యితరులకు సహాయం చేస్తూ, సాధ్యమైతే, యెహోవా సేవలో ఎక్కువగా పని చెయ్యాలనే లక్ష్యంతో హితకరమైన, ప్రయోజనకరమైన, దైవికమైన అలవాట్లు ఆచారాలు క్రమమైన దైవికపద్ధతిలో యిమిడి ఉన్నాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి వ్యక్తిగతమైన పఠనము, కూటాలకు క్రమంగా హాజరు కావడం, ప్రకటనా పనిలో భాగం వహించడంతో సహా ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకొని, దాన్ని అనుసరించడం అవసరము.
8 క్రమమైన పద్ధతిలో యిమిడివున్న ముఖ్యమైన విషయాలు: ‘తెలివి, సకలవిధమైన జ్ఞానము’ కలిగి ఉండడం ముఖ్యమైన వాటిలో ఒకటి. (ఫిలి. 1:11) వ్యక్తిగత పఠనం మన విశ్వాసాన్ని దృఢపరుస్తుంది, సత్యం యెడల మనకు గల మెప్పును బలపరుస్తుంది, మంచి పనులు చేయడానికి మనలను పురికొల్పుతుంది. అయినప్పటికీ, తమ పఠన అలవాట్లలో నిలకడగా ఉండడం కష్టమని కొందరు కనుగొన్నారు. సమయం లేదనడమే, పేర్కొనబడిన ముఖ్య కారణాల్లో ఒకటి.
9 ప్రతిరోజు బైబిలు చదవడం వలన కలిగే ప్రయోజనాలను వక్కాణించి చెప్పనవసరం లేదు. దాని ఉపదేశం అన్ని విధాల “ప్రయోజనకరమై యున్నది.” (2 తిమో. 3:16, 17) మన దినచర్యలో బైబిలు పఠనానికి సమయాన్ని ఎలా కనుగొనగలం? కొందరు ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు ముందే లేచి, తమ మనస్సు చైతన్యవంతంగా ఉన్నప్పుడు అలా చేయగలమని కనుగొన్నారు. రాత్రి పండుకొనే ముందు కొన్ని నిమిషాలు బైబిలు చదవడం బాగుంటుందని కొందరు కనుగొన్నారు. పగలంతా యింట్లో ఉండే గృహిణులు, మిగిలిన కుటుంబ సభ్యులు బడి నుండి, పని నుండి యింటికి తిరిగి రాక ముందు, మధ్యాహ్నం కొంత సమయాన్ని కేటాయించుకోవచ్చు. కొందరు క్రమంగా బైబిలు చదవడమే కాకుండా, తమ వారపు పఠన కార్యక్రమంలో ప్రొక్లయిమర్స్ అనే పుస్తకాన్ని కూడా చదువుతున్నారు.
10 మనం కొత్త అలవాట్లను అలవర్చుకున్నప్పుడు, అవి మన పాత అలవాట్లతో నిజంగా పోటీపడే అవకాశముంది. గతంలో మనకు అందుబాటులోవున్న సమయాలను అనవసరమైన వాటికొరకు వెచ్చించి ఉండవచ్చు. అటువంటి అలవాట్ల నుండి బయటపడడం అంత సులభం కాదు. మన పఠన అలవాట్లను ఎవరూ నిర్దేశించరు; లేదా దీని విషయంలో మనమేం చేస్తున్నామని ఎవరికీ లెక్కచెప్పనవసరం లేదు. క్రమంగా పఠించే మన అలవాట్లు “శ్రేష్ఠమైన కార్యముల” యెడల మనకు గల మెప్పుపై, “సమయాన్ని పోనియ్యక” సద్వినియోగపరచుకొనే మన సంసిద్ధతపై ఆధారపడి ఉంటుంది.—ఫిలి. 1:10; ఎఫె. 5:16.
11 క్రైస్తవ కూటాలు అవసరమైన ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని యిస్తూ, మన ఆత్మీయ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి, కూటాలకు హాజరు కావడం మన క్రమమైన పద్ధతిలో మరొక ప్రముఖ భాగమైవుంది. పౌలు దీని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఇది మన యిష్టాన్ని బట్టి తీర్మానించుకోవలసింది కాదు.—హెబ్రీ. 10:24, 25.
12 మన వారపు కార్యక్రమాలకు పథకాన్ని వేసుకున్నప్పుడు మనం క్రమాన్ని ఎలా ప్రదర్శించవచ్చు? కొందరు వ్యక్తిగతమైన లక్ష్యాల కొరకు నిర్దిష్ట సమయాలను కేటాయించుకుని, వీలుంటేనే కూటాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఉండాలి. కూటాలు లేని సమయాల్లో వేరే పనులకు పథకం వేసుకొని, మన వారపు కూటాలకు ప్రాధాన్యతనివ్వాలి.
13 క్రమంగా కూటాలకు హాజరు కావడానికి, మంచి పథకం, కుటుంబ సహకారం అవసరం. మనలో చాలామందికి వారమంతా రద్దీగల పనుల పట్టిక ఉంటుంది. తరచూ అది మనకు సమయం లేకుండా చేస్తుంది. అలాంటప్పుడు సాధ్యమైతే, ముందుగానే భోజనానికి సమయాన్ని కేటాయించి, కుటుంబమంతా భోజనం చేసి, సిద్ధపడి, కూటాలు ఆరంభించకముందే త్వరగా అక్కడికి చేరుకోడానికి తగినంత సమయముండేలా ఏర్పాటు చేసుకోవాలని దాని భావం. అందుకు కుటుంబ సభ్యులు అనేక విధాలుగా సహకరించవచ్చు.
14 మనం క్రమమైన పద్ధతిలో అభివృద్ధిని సాధిస్తూవుండాలంటే, ప్రాంతీయ పరిచర్యకు క్రమంగా వెళ్ళడం తప్పనిసరి. మనమందరం రాజ్య సందేశాన్ని ప్రకటించాలనే మన గంభీరమైన బాధ్యతను స్పష్టంగా గుర్తిస్తాము. అదే మనలను యెహోవా సాక్షులుగా గుర్తిస్తుంది. (యెష. 43:10) ఇది నేడు నిర్వహించబడుతున్న అత్యవసరమైన, ప్రయోజనకరమైన పని. కాబట్టి, మనం ప్రతిదినం ఓ పద్ధతిగా చేస్తున్న పనులలో దానిని యాదృచ్ఛికమైనదిగా భావించడానికి ఏ హేతువూ లేదు. పౌలు యీ విధంగా ఉపదేశించాడు: “మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలమును అర్పించుదము.”—హెబ్రీ. 13:15.
15 ప్రతి వారం మనం చేసే పనిని గూర్చి పట్టిక వేసుకొనేటప్పుడు, ప్రాంతీయ పరిచర్యకు ప్రత్యేక సమయాలను కేటాయించాలి. బహుశా, ప్రతివారం అనేక సార్లు ప్రాంతీయ సేవకొరకు కూటాలను సంఘం ఏర్పాటు చేస్తుంది, ఏ రోజు మనం పాల్గొనగలమన్నదే నిర్ణయించవలసి ఉన్నది. ప్రతి విధమైన సేవలో మనం భాగం వహించగల్గడం, అంటే పత్రికలతో, యితర సాహిత్యాలతో యింటింటి సువార్త ప్రకటనా పనికి వెళ్ళడం, పునర్దర్శనాలు చేయడం, బైబిలు పఠనాలు నిర్వహించడం ఎంతో మంచిది. మనతో కూడా సాహిత్యాలను తీసుకొని వెళ్ళి, సంభాషణలను ఆరంభించడానికి లభించే అవకాశాలను గూర్చి మెలకువగా ఉండి, తటస్థ సాక్ష్యమివ్వడానికి మనం పథకం వేసుకోవచ్చు. మనం సాధారణంగా యితరులతో పాటు పరిచర్యకు వెళ్తాం కాబట్టి, వాళ్ళ పట్టికను గూర్చి మనం తెలుసుకోవాలి, తద్వారా యిరువురికి సౌకర్యంగా ఉండేలా మనం ఏర్పాట్లు చేసుకోగలము.
16 ప్రాంతంలో ఉదాసీన వైఖరి ఉన్నప్పటికీ, మనం క్రమంగా ప్రకటన పనిని చేపట్టవలసిందే. కొందరు మాత్రమే అనుకూలంగా స్పందిస్తారని మనకు ముందే తెలుసు. (మత్త. 13:15; 24:9) ‘సిగ్గుమాలిన వారును కఠిన హృదయులును తిరుగుబాటు చేయువారునైన’ ప్రజలకు ప్రకటించడానికి యెహెజ్కేలు నియమించబడ్డాడు. ‘వారి నుదురువలెనే యెహెజ్కేలు నుదురును కఠినమైనదిగా’ అంటే, “చెకుముకి రాతికంటె కఠినముగా” చేయడం ద్వారా ఆయనకు సహాయం చేస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. (యెహె. 2:3, 4; 3:7-9) కాబట్టి సేవకొరకైన క్రమమైన పద్ధతికి పట్టుదల అవసరమై ఉన్నది.
17 అనుకరించడానికి గల మంచి మాదిరులు: నడిపించడానికి ఒకరున్నప్పుడు మనలో దాదాపు అందరూ, ప్రాంతీయ సేవ చక్కగా చేయగలరు. పౌలు, అతని సహచరులు మంచి మాదిరునుంచారు, తనను అనుకరించమని ఆయన యితరులను ఉద్బోధించాడు. (ఫిలి. 3:17) తనను ఆత్మీయంగా బలంగా ఉంచడానికి అవసరమైనవన్నీ ఆయన పద్ధతిచొప్పున చేసినదానిలో యిమిడివున్నాయి.
18 నేడు కూడా, మనం మంచి మాదిరులతో ఆశీర్వదించబడ్డాం. హెబ్రీయులు 13:7లో పౌలు యిలా ఉద్బోధించాడు: “మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకముంచుకొని, . . . వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” నిజమే, క్రీస్తే మన మాదిరికర్త, అయినా, మనల్ని నడిపించేవారి విశ్వాసాన్ని మనం అనుసరించగలం. పౌలువలె, యితరులకు మంచి మాదిరిలుగా ఉండవలసిన అవసరతను పెద్దలు గుర్తుంచుకోవాలి. వారి వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, రాజ్యాసక్తులను ముందుంచడంలో తాము క్రమమైన దినచర్యను వెంబడిస్తున్నట్లు, వాళ్ళు చూపించగల్గాలి. ఉద్యోగ సంబంధమైన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత పఠనం, కూటాలకు హాజరు కావడం, ప్రాంతీయ పరిచర్యలో నడిపింపునివ్వడం వంటి మంచి అలవాట్లను పెద్దలు కలిగి ఉండాలి. పెద్ద ‘తన యింటివారిని బాగా ఏలేవాడేనని’ నిరూపించడం ద్వారా, సంఘంలోని అందరూ క్రమమైన పద్ధతిలో పని చేస్తూ ఉండడానికి ప్రోత్సహించబడతారు.—1 తిమో. 3:4, 5.
19 కొత్త సేవా సంవత్సరంలోని లక్ష్యాలు: మన వ్యక్తిగత పద్ధతినిగూర్చి ఆలోచించడానికి సేవా సంవత్సరం ఆరంభం మంచి సమయం. గత సంవత్సరం మనం చేసిన పనిని గూర్చిన సమీక్ష ఏం చూపెడుతుంది? మనం ఏ స్థాయిలో పనిచేస్తామో, ఆ స్థాయిని నిలబెట్టుకోగల్గామా, లేదా అభివృద్ధి చేసుకోగల్గామా? మనం చాలాచక్కగా వ్యక్తిగత పఠనం చేసి ఉండవచ్చు. మనం ఎంతో క్రమంగా కూటాలకు హాజరై ఉండవచ్చు, లేదా సహాయ పయినీరింగ్ చేసి, ప్రాంతీయ సేవలో ఎక్కువగా పాల్గొని ఉండవచ్చు. బహుశా, మన సంఘంలో లేదా కుటుంబంలో యితరుల యెడల క్రైస్తవ ఉదారతను చూపించే కొన్ని పనులను మనం చేసి ఉండవచ్చు. అలాగైతే, మనం దేవుణ్ణి ప్రీతిపర్చే మార్గంలో నడిచామని సంతోషించడానికి మంచి కారణముంది. “దాన్ని సంపూర్ణంగా చేస్తూ ఉండడానికి” మనకు మంచి కారణముంది.—1 థెస్స. 4:1.
20 పద్ధతిగా చేసే మన పని క్రమరహితంగా, లేదా అప్పుడప్పుడు నిర్వహించబడినదిగా ఉంటే ఏమిటి? మనం ఆత్మీయంగా ఎలా ప్రభావితులమయ్యాం? మనం అభివృద్ధి ఏదో కారణం వల్ల కుంటుపడిందా? యెహోవా సహాయం కొరకు అర్థించడంతో అభివృద్ధి ఆరంభమవుతుంది. (ఫిలి. 4:6, 13) కుటుంబంలో యితరులతో మీ పద్ధతిలో అవసరమైన సర్దుబాట్లు చేసుకోడానికి సహాయాన్ని కోరుతూ మీ అవసరాలను గూర్చి చర్చించండి. మీకు సమస్యలున్నట్లయితే పెద్దలను సహాయమడగండి. మనం గట్టి ప్రయత్నం చేస్తూ, యెహోవా నడిపింపుకు ప్రతిస్పందిస్తున్నట్లయితే, మనం “నిష్క్రియులుగానో, నిష్ఫలులుగానో” ఉండమనే నమ్మకాన్ని కలిగి ఉండగలము.—2 పేతు. 1:5-8.
21 క్రమమైన పద్ధతిలో కొనసాగడం మీ ప్రయత్నాలను ఫలవంతం చేసే ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. మీరు క్రమమైన పద్ధతిలో అభివృద్ధిని సాధించడానికి తీర్మానించుకొని ఉండగా, “ఆసక్తి విషయంలో మాంద్యులు గాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.” (రోమా. 12:11)—యీ విషయాన్ని గూర్చి మరింత వివరంగా తెలుసుకోడానికి వాచ్‌టవర్ మే 1, 1985, పేజీలు 13-17 చూడండి.