సంఘ పుస్తక పఠనం విద్యాభ్యాస కార్యక్రమాలకు తోడ్పడుతుంది
1 యెహోవా సంస్థ యొక్క విద్యాభ్యాస కార్యక్రమంలో సంఘ పుస్తక పఠనం ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. పుస్తక పఠన గుంపులు అందరూ హాజరయ్యే విధంగా సంఘంలో వివిధ గుంపులుగా పఠనాలు జరుగుతాయి. తమ దగ్గరి ప్రాంతంలోనే పుస్తక పఠనం ఉంటే ఆసక్తి గలవారు హాజరు అవ్వండి అన్న ఆహ్వానాన్ని వెంటనే అంగీకరించవచ్చు.
2 ప్రతి గుంపును చిన్నదిగా ఉంచేందుకు, చాలా ప్రయత్నం చేయబడింది. నిర్వాహకుడు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన సహాయం యిచ్చేందుకు యిది తోడ్పడుతుంది. అందరూ ఒకే వేగంలో నేర్చుకోలేరు. పాఠాన్ని ముందుగానే పఠించినప్పటికీ, ఒక అంశాన్ని గూర్చి ఎవరికైనా అర్థం చేసుకోడానికి కష్టంగా ఉన్నట్లయితే, పఠనం తర్వాత, నిర్వాహకుడు దాన్ని మరి కొంత విపులంగా చర్చించవచ్చు. అంతేకాక, గుంపు చిన్నదైతే వ్యాఖ్యానించడానికి, లేఖనాలను చదవడంలో మరి ఎక్కువగా పాలుపంచుకోడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రమంగా వ్యాఖ్యానిస్తూ, చర్చకు మీరు తోడ్పడుతున్నారా? మీ స్వంత మాటల్లో జవాబివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా? వ్యాఖ్యానించే మీ సంసిద్ధత మీకును, యితరులకును ప్రయోజనకరంగా ఉండగలదు. మీరు సిద్ధపడుతుండగా, పాఠంలోని కొన్ని అంశాలను వ్యక్తిగతంగా ఎలా అన్వయించవచ్చోనని వివేచించేందుకు మీ గ్రహణశక్తిని ఉపయోగించండి.—హెబ్రీ. 5:14.
3 పుస్తక పఠన నిర్వాహకుడు ఉపయోగించే బోధనా పద్ధతులను పరిశీలించడం ద్వారా మరింత ఆసక్తికరంగాను, జ్ఞానాన్ని కలుగజేసే విధంగాను బైబిలు పఠనాన్ని ఎలా నిర్వహించవచ్చో మీరు నేర్చుకోగలరు. అర్హత గల ఒక సహోదరుడు పేరాలను చదివిన తర్వాత, ఆ ప్రశ్నలు చర్చించబడతాయి. బిగ్గరగా చెప్పాలని పఠన నిర్వాహకుడు అందరినీ ప్రోత్సహిస్తాడు. సమయం అనుమతించేదాన్నిబట్టి, ఉదాహరించబడ్డ లేఖనాలు ఎలా అన్వయిస్తాయో గ్రహించడానికి తోడ్పడే వ్యాఖ్యానాలను రాబట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. (నెహెమ్యా 8:8 పోల్చండి.) కొన్నిసార్లు ముఖ్యమైన అంశాన్ని వెలికి తెచ్చేందుకు సహాయపడే ప్రశ్నలను ఉపయోగిస్తాడు లేదా ఆయనే వాటిని స్పష్టపరచే చిన్న వ్యాఖ్యానాన్నిస్తాడు. ఒక ఉదాహరణ లేదా ఒక ఉపమానం, ఆ సమాచారం మన జీవితాలతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకోడానికి సహాయపడుతుంది.
4 కొన్ని సంఘ పుస్తక పఠనాల్లో హాజరు చాలా తక్కువగా ఉంటుంది. మీరు క్రమంగా హాజరౌతారా? అలా కానట్లయితే, మీరొక ముఖ్యమైన ఏర్పాటును చేజార్చుకుంటున్నారు. యెహోవా మన యెడల శ్రద్ధ చూపిస్తున్నాడని చూపించే మార్గాల్లో పుస్తక పఠన ఏర్పాటు ఒకటి. (1 పేతు. 5:7) మనం ఆత్మీయంగా బలంగా ఉండేలా జ్ఞానవివేకాల్లో అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. మరొకవైపు, యెహోవాకు, ఆయన సంస్థకు మనం నిష్ప్రయోజకులమయ్యేలా మనల్ని బలహీనులను చెయ్యాలని మన ఆత్మీయ పెరుగుదలను తగ్గించాలని సాతాను కోరుకుంటాడు. ఇది జరగడానికి అనుమతించవద్దు! సన్నిహితమైన యీ గుంపులోని ప్రేమ, ఆప్యాయతలు గల వాతావరణం మీ హృదయాలను స్పర్శించి, యెహోవాను స్తుతించడంలో కొనసాగేందుకు మిమ్మల్ని పురికొల్పనివ్వండి.—కీర్తన 111:1 పోల్చండి.
5 ప్రచారకుల సౌకర్యార్థం సేవ కొరకైన కూటాలు తరచూ పుస్తక పఠన స్థలాల్లోనే ఏర్పాటు చేయబడతాయి. ఈ ఏర్పాట్లు వారం మధ్యలో, వారాంతాల్లో, లేదా సాయంకాల సాక్ష్యం కొరకో కావచ్చు. కావలసినంత ప్రాంతముందని, పరిచర్యలో నాయకత్వం వహించడానికి ఒకరున్నారని పుస్తక పఠన నిర్వాహకుడు నిర్థారణ చేసుకోవాలి. ప్రాంతీయ సేవ కొరకైన కూటాలు 10-15 నిమిషాలకన్నా ఎక్కువగా ఉండకూడదు. దిన వచనం మన ప్రకటన పనిని గూర్చి చెబుతున్నట్లయితే, నిర్వాహకుడు దాన్ని క్లుప్తంగా చర్చించి, ప్రాంతీయ పరిచర్యకు సంబంధించిన ఒకటి రెండు ప్రత్యేక సలహాలను యివ్వవచ్చు, లేదా యిటీవలి అందింపులను క్లుప్తంగా ప్రదర్శించవచ్చు.
6 పరిచర్య చేసే సమయంలో సముచితమైన ప్రోత్సాహాన్ని, తర్ఫీదును యిస్తూ, గుంపులోని ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా కలిసి పని చేయడానికి నిర్వాహకుడు ప్రయత్నిస్తాడు.—మార్కు 3:14; లూకా 8:1 పోల్చండి.