మీరు సమృద్ధిగా విత్తుతున్నారా?
1 “మీరు ఎంత ఎక్కువ ప్రయాసపడితే అంత ఎక్కువగా ఫలితం పొందగలరు,” అనే సామెత ఉంది. ప్రాముఖ్యంగా మన ఆరాధన విషయంలో యిది నిజం. కూటాలకు సిద్ధపడడంలో, రాజ్య సువార్తను ప్రకటించడంలో, మన సహోదరుల యెడల ప్రేమ చూపించడంలో మనం ఎంత ఎక్కువ సమయాన్ని, ప్రయత్నాన్ని వెచ్చిస్తామో, మనం అంత అధికంగా ఆత్మీయ అభివృద్ధిని సాధించగలం. దానికి భిన్నమైనది కూడా నిజమే. మనం కష్టపడడానికి యిష్టపడకుండా ప్రయత్నం చేయనట్లైతే, మనం అర్థహృదయంతో చేస్తున్నట్లైతే, సంతృప్తికరమైన ఫలితాలను మనం నిజంగా అపేక్షించగలమా?
2 అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 9:6లో ఆ సూత్రాన్ని గూర్చి “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును” అని సరిగ్గా తెలిపాడు. మీరు సమృద్ధిగా విత్తుతున్నారా?
3 వ్యక్తిగత బైబిలు పఠనం: ఫలవంతమైన పరిచారకులుగా ఉండడానికి, మనం మొదటిగా మన వ్యక్తిగత పఠనంలో సమృద్ధిగా విత్తాలి. మనకు తీవ్రమైన ఆత్మీయ ఆకలి ఉండాలి. (కీర్త. 119:97, 105; మత్త. 5:3) మన దైనందిన జీవిత అవసరతలు మనపై వత్తిడి కలిగిస్తుండగా, మన ఆత్మీయ అవసరతను యథార్థంగా గుర్తించే స్వభావాన్ని పెంపొందించుకోడానికి నిజమైన ప్రయత్నం అవసరం. “సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు” ఉండవలసిన అవసరం మనలో అనేకులకుంది. (ఎఫె. 5:16) వ్యక్తిగత పఠనం చేయడానికి కొందరు తాము కొన్ని రోజుల్లో పెందలకడనే నిద్ర లేవడానికి ఏర్పాటు చేసుకుంటారు. కొందరు ఆ లక్ష్యం కొరకు కొన్ని సాయంకాలాలను ఏర్పాటు చేసుకున్నారు. మనం ఏ విధంగా పంటను సమృద్ధిగా కోయగలం? మనం బలమైన విశ్వాసాన్ని, గొప్ప నిరీక్షణను, సంతోషకరమైన, అనుకూల దృక్పథంగల మనస్సును ఆర్జిస్తాము.—రోమా. 10:17; 15:14; 1 పేతు. 1:13.
4 సంఘ కూటాలు: కీర్తన 122:1లో “‘యెహోవా మందిరమునకు వెళ్లుదమని’ జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని” అని దావీదు అన్నాడు. మీరు కూడా అలాగే భావిస్తారా? సమృద్ధిగా విత్తడం అంటే, వారానికి ఐదు కూటాలకు క్రమంగా హాజరు కావడమే. అసంతోషకరమైన పరిస్థితులు మీకు ఆటంకం కలిగించకుండా ఉండేలా మీ మనస్సును సంసిద్ధం చేసుకోండి. సాధారణంగా మనం ఎన్ని ఆటంకాలను అధిగమిస్తే మనం అన్ని ఎక్కువ దీవెనలు పొందుతాము.
5 మీ సహోదరులతో నిర్మాణాత్మకమైన సంభాషణలో పాలుపంచుకునేలా, ముందుగానే చేరుకుని, ఆ తర్వాత కూడా అక్కడ ఉండండి. మీకు సాధ్యమైనంత మట్టుకు ఎక్కువ మందితో కలివిడిగా ఉండేందుకు మీ సహవాసాన్ని విస్తృతపర్చండి. మీకు అవకాశం ఉన్నంతమట్టుకు, వ్యాఖ్యానించడం ద్వారా మీరు సమృద్ధిగా విత్తగలిగేందుకు. కావలికోట పఠనానికి యితర కూటాలకు బాగా సిద్ధపడండి. కూటాల్లో యితరులకు ‘ఉదారంగా నీళ్లు పోయడం’ ద్వారా మీకు కూడా ‘ఉదారంగా నీళ్లు పోయబడతాయి.’—సామె. 11:25.
6 ప్రాంతీయ పరిచర్య: బహుశ, ప్రాంతీయ పరిచర్యలో కాకుండా మరెక్కడా, సమృద్ధిగా విత్తే సూత్రం అంత ఎక్కువ వాస్తవం కాదు. దానికి మనమెంత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తామో, అంత ఎక్కువగా, ఆసక్తికరమైన అనుభవాలను, ఫలవంతమైన పునర్దర్శనాలను, ఫలవంతమైన బైబిలు పఠనాలను కోస్తాము.
7 ప్రాంతీయ పరిచర్యలో సమృద్ధిగా విత్తడంలో నాణ్యత, పరిమాణం కూడా మిళితమై ఉన్నాయి. మన పరిచర్యలో నాణ్యతను అభివృద్ధి చేసుకోడానికి, రీజనింగ్ పుస్తకం మంచి సహాయకం. ఇండ్ల వద్ద ఆసక్తిని రేకెత్తించడానికి సహాయపడే, 40 ఉపోద్ఘాతాలు ఉన్న 18 అంశాలు 9-15 వరకున్న పేజీల్లో ఉన్నాయి. మీరు పునర్దర్శనం చేసి మీరు విత్తిన దాని ఫలితాన్ని కోయగలిగేలా మీరు కనుగొన్న ఆసక్తిని గూర్చి తప్పకుండా రాసుకోండి. మీ ప్రయత్నాలు బైబిలు పఠనానికి నడుపుతాయని, సమృద్ధిగా ఎలా విత్తాలో మరొకరికి మీరు బోధించగలరని ఆశిస్తున్నాము.
8 మనం సమృద్ధిగా విత్తినట్లయితే, యెహోవా నుండి గొప్ప ఆశీర్వాదాలను మనం అపేక్షించవచ్చు.—మలా. 3:10.