ఈనాటి మన పరిచర్యలో కరపత్రములు ఎందుకంత విలువైనవి
1 జనవరి 1, 1991 ది వాచ్‌టవర్ సంచికలో 30వ పేజీ నందు “హి ఫౌండ్ ది ట్రాక్ట్ ఆన్ ది ట్రాక్” అనే శీర్షికాంశంలో ఒక అనుభవం యివ్వబడింది. రైలు క్రింద యిరుక్కొన్న కరపత్రాన్ని కనుగొన్న రైలురోడ్డు నిర్వహణా పర్యవేక్షకుని గూర్చి అది చెప్పింది. వెంటనే ఆ కరపత్రాన్ని చదివి తన అల్లుడితో యిలా అన్నాడు: “ఈ రోజు నేను సత్యాన్ని కనుగొన్నాను!” ఆ యిద్దరు వ్యక్తులు యింకా ఎక్కువ పుస్తకాలకై ఆర్డరు చేసి, వాటిని చదివారు. ఈనాడు, నూరు కంటే ఎక్కువమంది వారి వంశస్థులు సత్యంలో చురుకుగావున్నారు. ఒక్క కరపత్రం చదవడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో యిది చూపిస్తుంది.
2 అవకాశాలను ఉపయోగించుట: అన్ని ప్రాంతాల్లోని సహోదరులు కరపత్రాలను అందించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అత్త మరణాన్ని గూర్చి తన స్కూలు టీచర్ బాధపడుతున్నట్లుగా ఒక యౌవన సాక్షి గ్రహించింది. ఆ యౌవన సహోదరి తన టీచర్‌కు ఒక ఓదార్పు లేఖను వ్రాసి, అందులో వాట్ హోప్ ఫర్ డెడ్ లవ్డ్వన్స్? అనే కరపత్రమును వుంచింది. టీచర్ ఒక కృతజ్ఞతా పత్రం వ్రాసి, ఆ తర్వాత మన యౌవన సహోదరితో మాట్లాడింది. ఇప్పుడు ఈ టీచర్ క్రమంగా ఆమె దగ్గర్నుండి పత్రములను అంగీకరిస్తోంది.
3 సమాధి స్థలానికి నడిపే వీధిలో సాక్ష్యమిచ్చే కొందరు ప్రచారకులు, సమాధులకు సున్నం వేసే కొందర్ని చూశారు. ప్రచారకులు ఆ అవకాశాన్ని వారికి కరపత్రాలు అందించేందుకు ఉపయోగించారు. మరుసటి రోజు సెలవు దినం అవ్వడంతో అనేకులు సమాధి స్థలానికి వస్తారు గనుక, సమాధి స్థలం ద్వారం దగ్గిర నిలుచుని కరపత్రాలను అందించాలని పరిచారకులు నిర్ణయించుకున్నారు. ఐదువందల కంటే ఎక్కువ కరపత్రాలను అందించారు, ముగ్గురు మాత్రమే వాటిని అంగీకరించలేదు. తరవాతి సంవత్సరం వారు మరలా వచ్చి, కేవలం ఆరు వ్యతిరేకతలతో వేయి కరపత్రాలకంటే ఎక్కువ అందించారు. ఎంతో మంది వ్యక్తులు తమ గాఢమైన మెప్పును కనపర్చారు. వెళ్తూ వెళ్తూ ఒక వ్యక్తి కరపత్రాన్ని చదివి, తనకు కరపత్రం యిచ్చిన సహోదరితో మాట్లాడటానికి వెంటనే తిరిగి వచ్చాడు. “నాకు తెలిసిన వారు ఒకరు ఈ సమాచారాన్ని చదవాలని నేననుకుంటున్నాను. నాకు యింకొకటి యివ్వగలరా?” అని అతను అన్నాడు.
4 కరపత్రాలు చిన్నగా వుండి, మనము ఎక్కడికైనా ఎప్పుడైనా వాటిని మనతో తీసుకువెళ్లేంత అనువుగా వుంటాయి. పరిచితులతోగానీ లేక అపరిచితులతోగాని తటస్థంగా సంభాషించినప్పుడు, క్లుప్తమైన వ్యాఖ్యానం చేయడానికి గట్టి ప్రయత్నం చేసి, ఆ సంభాషణను మన వద్ద యిప్పుడు అందుబాటులో వున్న ఎనిమిది కరపత్రాల్లో ఒకదానికి మళ్లించేలా చేయాలి. పొరుగువారితో మాట్లాడేప్పుడు, సరుకులు కొనుక్కునేప్పుడు లేక నియామకం గూర్చి వేచి వున్నప్పుడు, చుట్టాలను సందర్శించేటప్పుడు, లేక అనేక యితర సందర్భాల్లో దీనిని చేయవచ్చును.
5 అది ఎందుకంత ప్రభావితమైనది: కరపత్రాలు కనుల విందుగొలిపేంత చక్కటి రంగులుగలవి. అవి క్లుప్తంగా వుంటాయి. యింటివారు లేక తటస్థ సాక్ష్యంలో మనం కలిసిన వారు, ఎక్కువగా చదవాలనే భారాన్ని భావించి ఆందోళన చెందరు. అయినప్పటికి, దీనిలోని సమాచారం ఆకట్టుకుంటుంది, అర్ధవంతమైంది. కరపత్రంలో చర్చించబడిన విషయంపై చదువరులకు ఒక దృఢమైన లేఖనాధార దృష్టి కలుగుతుంది. లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వరల్డ్ అనే కరపత్రాన్ని పొందిన తదుపరి ఒక యువకుడు తన భావాతిశయాన్ని యిలా వ్యక్తపర్చాడు: “ప్రపంచ పరిస్థితిని గూర్చి యింత ప్రోత్సాహకరమైన సమాచారాన్ని నేనింతవరకూ చదవలేదు!”
6 ఈ కరపత్రాలను ప్రతి అనువైన సందర్భంలోనూ మనం ఉపయోగించాలి. ఇంటింటి సేవలో సంభాషణను ఆరంభించడానికి అవి ఎంతో దోహదపడ్డాయని అనేక ప్రచారకులు కనుగొన్నారు. ఇప్పుడు జరిగే అనేక పఠనాలు కరపత్రాలతోనే ప్రారంభమయ్యాయి. ఈ సంచికలోని మన రాజ్య పరిచర్య 4వ పేజీలో, కరపత్రాలను ప్రభావవంతంగా అందించేందుకు కొన్ని ఉపయుక్తమైన సలహాలు యివ్వబడ్డాయి. అవును, కరపత్రాలు చిన్నవే అయితే, మన పరిచర్యలో అవి విలువైన పనిముట్లు.