విమోచన క్రయధనముయెడల మెప్పును చూపుట
1 అన్ని సంస్కృతులలోను మరణించిన తమ స్నేహితునియెడల లేక బంధువుయెడల ప్రశంస కనపరచడం పరిపాటి. ముఖ్యంగా ఒక ప్రియమైన వ్యక్తి ఇతరుల ప్రాణాన్ని రక్షించడంలో మరణిస్తే అట్టి మెప్పు మరింత దృఢంగా ఉంటుంది. అయితే నిత్యజీవ నిరీక్షణలో పాలుగలవారందరు ఏప్రిల్ 6వ తేదీన క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినమునకు హాజరగుటద్వారా విమోచన క్రయధనముయెడల తమ మెప్పును కనపరచుటకు గొప్పకారణములున్నవి.—2 కొరిం. 5:14; 1 యోహా. 2:2.
2 యెహోవా ప్రేమను మెచ్చుకొనుము: విమోచన బలిని అనుగ్రహించిన, మహాగొప్ప ఉపకారియగు యెహోవా దేవునియెడల మన ప్రగాఢ మెప్పును ప్రదర్శించుట ఎంత యుక్తమైనది! (1 యోహా. 4:9, 10) మనకు విమోచన క్రయధనముగా కోట్లాది మంది నీతియుక్తమైన దేవదూతలలో ఒకరినిగాక, సాటిలేని వరమైన తన అద్వితీయ, అతి ప్రియమైన కుమారుని అర్పించుటలోనే యెహోవా ప్రేమ ఎంత ప్రగాఢమైనదో ప్రస్ఫుటమవుతుంది. (సామె. 8:22, 30) యెహోవాను చాలా బాగా ఎరిగిన ఈ కుమారుడైన యేసుక్రీస్తు మనకు ఇలా జ్ఞాపకం చేశాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”—యోహా. 3:16.
3 యేసుక్రీస్తు ప్రేమను మెచ్చుకొనుము: అలాగే అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచన క్రయధనముగా అర్పించిన యేసుక్రీస్తు యెడలను మనం మిక్కిలి గాఢమైన మెప్పును ప్రదర్శించుట యుక్తమైయుంది. (మత్త. 20:28) విమోచన క్రయధనము విషయంలో తనయెడల యెహోవా కలిగియున్న చిత్తానికి యిష్టపూర్వకంగా లోబడుటలోను ఆయన ప్రేమ ప్రదర్శితమవుతుంది. మనకొరకు విమోచన క్రయధనంగా బలియగుటకై, తన తండ్రి మరియు కోట్లాదిమంది నీతియుక్తమైన దేవదూతల సహవాసములోని మధురమైన పరిస్థితులను విడిచివచ్చుటను తలంచండి. పాపముతోనిండిన మానవులకు లోబడి వారి మధ్య నివసించే సవాలేగాని, లేక విమోచన క్రయధనమంటే తన ప్రాణాన్ని అర్పించవలసి వస్తుందేమోననే సంగతేగాని ఆయన వెనుకంజవేయుటకు కారణం కాలేదు. బదులుగా, “మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, . . . మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.”—ఫిలి. 2:5-8.
4 విమోచన క్రయధనముయెడల మన మెట్లు మెప్పుచూపుదుము? విమోచన క్రయధనము యెడల మనము చూపే మెప్పు కేవలం కృతజ్ఞతలని చెప్పేదానికన్నా మిన్నగా ఉండాలి. యేసుక్రీస్తుద్వారా దేవుడు చేసిన రక్షణ ఏర్పాటునుగూర్చి మనము నేర్చుకోవాలి. (యోహా. 17:3) తదుపరి విమోచన క్రయధనమందు విశ్వాసమును కనపరుస్తూ ఉండాలి. (అపొ. కా. 3:19) అందుకనుగుణ్యంగా, యెహోవా దేవునికి మనలను మనము సమర్పణా మరియు బాప్తిస్మము ద్వారా అర్పించుకొనుటకు కదిలించబడాలి. (మత్త. 16:24) మన సమర్పణకు తగినట్లుగా, రక్షణకొరకైన ఈ అద్భుత విమోచన క్రయధన ఏర్పాటునుగూర్చి ఇతరులకు చెప్పడానికి అనుకూలమైన ప్రతి సమయాన్ని సద్వినియోగపరచాలి.—రోమా. 10:10.
5 ఈ నియమాలు మనలో ఎవరము గైకొనలేనంత దుస్సాధ్యమైనవేమీ కాదు. మీకా 6:8 మనకిలా అభయమిస్తుంది: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” అలాగే దావీదుకూడా యెహోవాతో ఇలా అన్నాడు: “సమస్తము నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము.”—1 దిన. 29:14.
6 యెహోవా అద్భుత ఏర్పాటుయెడల మన మెప్పును అధికం చేసుకోవాలంటే, జ్ఞాపకార్థ దిన తారీఖుకు ముందుగా గ్రేటెస్ట్ మ్యాన్ పుస్తకములోని 112 నుండి 126 అధ్యాయములను కుటుంబ సమేతంగా ఎందుకు చదివి, చర్చించ కూడదు? ఈవిధంగా, మనమందరము జ్ఞాపకార్థదిన ఆచరణలో విమోచన క్రయధనముయెడల మెప్పునుచూపుటకు మానసికంగా మనకైమనము సిద్ధపడి ఉంటాము. ఆ ఆచరణ 1993, ఏప్రిల్ 6వ తారీఖున జరుగును.