సువార్తనందించుట—సాయంకాల వేళలలో
1 యేసుక్రీస్తు తొలి శిష్యులలో కొందరితో యూదా ప్రధానయాజకుడు ఇలా అన్నాడు: “యెరూషలేమును మీ బోధతో నింపివేసారు.” (అపొ. కార్య. 5:28) నిశ్చయముగా సహోదరులు ఆ పట్టణములో గొప్ప సాక్ష్యమిచ్చారు. తమ ప్రాంతమందలి ప్రతివారిని కలిసికొనుటకు నిస్సందేహముగా వారు శ్రమించి పనిచేసారు. అచ్చట, మరియితర ప్రాంతమందు సంపూర్ణ సాక్ష్యమిచ్చుటలో వారు కొనసాగారు.—అపొ. కార్య. 8:25.
2 నేడు అనేక ప్రదేశములలో మనము మన ప్రాంతములను సత్యముయొక్క బోధతో నింపివేసాము. ప్రచారకుల వృద్ధిలోను, తత్ఫలితంగా సంఘముల సంఖ్యలోను గణనీయమైన వృద్ధి సాధించబడినది. ప్రాంతములు చిన్నివియై బహు తరచుగా చేయబడుచున్నవి. సువార్తతో అనేకమందిని సమీపించులాగున మన ప్రాంతమును విస్తృతపరచవలసిన అగత్యమేర్పడెను.
సాయంకాల సాక్ష్యముయొక్క ప్రయోజనములు
3 సాయంకాల వేళలలో ఇండ్లను దర్శించగలమని, తత్ఫలితముగా తమ ప్రాంతమును విస్తృత పరచుకొనగలమని అనేకమంది ప్రచారకులు కనుగొన్నారు. సాధారణముగా పగటివేళలలో తాము దర్శించినప్పుడు, ఇండ్లలో కనుగొనని ఎందరినో ఈ సమయములో వారు కనుగొనిరి. సాయంకాల వేళలో తమ ప్రాంతమందలి ప్రతి ఇంటిలోను ఎవరో ఒకరిని తాము కనుగొంటిమని ఆ ప్రచారకులు తెల్పారు. ఇండ్లవద్ద ఎక్కువమంది ఉండడం మాత్రమేకాదు. ఉన్నవారు సర్వసాధారణంగా విశ్రాంతి స్థితిలో ఉండి మన వర్తమానమును వినుటకు ఇష్టపడుచున్నారు. సాయంకాల సాక్ష్యపు ఏర్పాటును సంస్థీకరించులాగున ప్రాంతీయకాపరులు అనేక సంఘములకు సహాయము చేయగలిగిరి. ప్రాంతయకాపరి సందర్శనములో బుధవారం సాయంకాలమున క్రమంగా ఏర్పాటు చేయబడు ఈ పనికి ప్రచారకులంతా మద్దుతునివ్వాలని ప్రోత్సహించబడుచున్నారు.
4 మీ ప్రాంతములో సాయంకాల వేళలందు సాక్ష్యమిచ్చుటకు నీవు ప్రయత్నించితివా? వేసవిలో సూర్యుడు ఆలస్యంగా అస్తమించును గనుక, ఇతర సమయముల కంటే ఎక్కువసేపు మనము బయట ఉండే అవకాశమున్నది. సాయంత్రవేళలలో కొంతభాగము ఇంటింటి సాక్ష్యమునకు గాని, మునుపు ఇంటివద్ద లేనివారిని సందర్శించుటకుగాని, ఉపయోగించవచ్చును. అటు పిమ్మట పునర్దర్శనములనుగాని, బైబిలు పఠనములనుగాని చేయవచ్చును. సంవత్సరములో ఆ తర్వాతి కాలమందు పగటివేళలు పరిమితంగా ఉన్నను, సాయంత్రపు తొలిగంటలను ఇంటింటి సాక్ష్యము కొరకు వాడవచ్చును. అయితే ముఖ్యముగా చీకటిపడిన తర్వాత భద్రత ఉండని ప్రాంతములందు సాక్ష్యమిచ్చునప్పుడు వివేకమును, తెలివిని ఉపయోగించవలసియున్నాము.
వివేకవంతముగా ఉండుము
5 సాయంకాల సాక్ష్యమందు విజయమొందుటకు కొన్ని ప్రాథమిక అంశాలను మనస్సునందుంచుకొనవలెను. ఉదాహరణకు, సాయంకాలమందు ఎదురుచూడని సందర్శకుల విషయములో కొన్ని ప్రాంతములందలి ప్రజలు అనుమానపడవచ్చును. గనుక మనము ఆప్యాయతతో స్నేహపూర్వకముగా పరిచయము చేసికొని మన సందర్శనకుగల కారణమును స్పష్టపరచుటకు త్వరపడవలెను. గృహస్థుల సంక్షేమము విషయములో నిజమైన లక్ష్యమును మనము కనపరిచితే, వారు మరింత చనువుగా ఉండి తమ అభిప్రాయాలను బాహాటంగా తెలియజెప్పుదురు.
6 కొన్ని ప్రాంతములలో తమకు భద్రత కల్పించుకొను నిమిత్తము గృహస్థులు కొన్ని చర్యలు గైకొనియున్నారు. అందువలన మనము ఇంటర్‌కమ్ (ఇంటికి మాత్రమే పరిమితమై యుండు టెలిఫోను) ఉపయోగించవలసివచ్చును. లేదా గృహస్థుడు మూసివున్న తలుపువెనుకనుండి లేక తలుపు రంధ్రముద్వారా మాట్లాడవచ్చును. గృహస్థుడు కలిగియున్న ఏర్పాట్లను మనము గౌరవించినయెడల, అతనితో మనము పంచుకొనదలచిన సత్యములను అతడు మరింత అంగీకృతముగా వినుటకు అవకాశము కలదు.
7 అనేక సంఘములు వారంలో ఒకటి, రెండురోజులు సాయంకాలమందు సామూహిక సాక్ష్యమును ఏర్పాటు చేసినవి. పూర్తికాల ఉద్యోగము చేసుకొను ప్రచారకులకు ఇది పరిచర్యలో పాల్గొనుటకు గొప్ప అవకాశమునిచ్చినది. అంతేకాదు. పనివేళల తేడా మూలముగా తాము ఇంతకుముందేన్నడు కలిసిపనిచేయని ప్రచారకులతో పనిచేయగలిగే అవకాశమును పొందగలిగిరి. సాయంకాల సాక్ష్యముద్వారా అనేకమంది ప్రచారకులు పరిచర్యలో తాము వ్యయపరచు సమయమును వృద్ధి చేసికొనగలిగిరి. దాని మూలముగా ఇతరులతోను సువార్తను పంచుకొనుటయందు వారు మరింత నిపుణులగుటకు నడిపినది. అంతేకాకుండ, యెహోవాసాక్షులు చెప్పేదానిని మునుపెన్నడు వినలేని అనేకులను కలిసికొనుటవలన అనేక బైబిలు పఠనములు ప్రారంభమైనవి.
8 సాయంకాల సాక్ష్యమందు పాల్గొని “సువార్తికుని పనిచేయుటకు”గల ఈ అదనపు అవకాశమునందు ఆనందించుటకు మీకు వీలగునా? (2 తిమో. 4:5) మనలో అనేకులము ఈ ప్రశ్నకు అనుకూల ప్రత్యుత్తరమీయగల్గితే, మనమును మన ప్రాంతమును సత్యముతో నింపివేసే మంచిపని చేయగలుగుదుము.