కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w19 ఆగస్టు పేజీలు 8-13
  • మీ ప్రేమను మరింత పెంచుకోండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ ప్రేమను మరింత పెంచుకోండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రేమ పెంచుకోండి
  • “ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో” తెలుసుకోండి
  • ‘పుష్కలంగా నీతిఫలం ఫలిస్తూ’ ఉండండి
  • మీ ప్రేమను అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • మీ ప్రేమను చల్లారనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
w19 ఆగస్టు పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 32

మీ ప్రేమను మరింత పెంచుకోండి!

‘మీ ప్రేమ అంతకంతకూ పెరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను.’—ఫిలి. 1:9.

పాట 106 ప్రేమను అలవర్చుకుందాం

ఈ ఆర్టికల్‌లో. . .a

1. ఫిలిప్పీలో సంఘం ప్రారంభమవ్వడానికి ఎవరెవరు కృషి చేశారు?

అపొస్తలుడైన పౌలు, సీల, లూకా, తిమోతి రోమా ప్రాంతమైన ఫిలిప్పీకి వెళ్లినప్పుడు, రాజ్య సందేశం పట్ల ఆసక్తి ఉన్న చాలామంది వాళ్లకు కనిపించారు. ఉత్సాహవంతులైన ఆ నలుగురు సహోదరుల కృషి వల్ల ఫిలిప్పీలో ఒక సంఘం ప్రారంభమైంది, అప్పుడు శిష్యులందరూ ఒకచోట సమకూడడం మొదలుపెట్టారు. బహుశా వాళ్లు ఆతిథ్య స్ఫూర్తి ఉన్న లూదియ అనే సహోదరి ఇంట్లో సమకూడి ఉంటారు.—అపొ. 16:40.

2. కొంతకాలానికే ఆ సంఘానికి ఎలాంటి వ్యతిరేకత ఎదురైంది?

2 కొత్తగా ప్రారంభమైన ఆ సంఘానికి అంతలోనే వ్యతిరేకత ఎదురైంది. సత్యాన్ని వ్యతిరేకించేవాళ్లు పౌలు, ఆయన సహచరులు చేస్తున్న ప్రకటనా పనిని ఆటంకపర్చేలా సాతాను వాళ్లను ప్రేరేపించాడు. వాళ్లు పౌలును, సీలను బంధించి, కొట్టి, జైల్లో వేశారు. వాళ్లిద్దరు విడుదలయ్యాక కొత్తగా శిష్యులైనవాళ్లను కలిసి ప్రోత్సహించారు. ఆ తర్వాత పౌలు, సీల, తిమోతి ఫిలిప్పీ నుండి వెళ్లిపోయారు; లూకా బహుశా అక్కడే ఉండిపోయుంటాడు. మరి కొత్తగా ప్రారంభమైన ఆ సంఘం పరిస్థితి ఏంటి? వాళ్లు పవిత్రశక్తి సహాయంతో యెహోవా సేవలో ఉత్సాహంగా కొనసాగారు. (ఫిలి. 2:12) వాళ్లను చూసి పౌలు ఎంత గర్వపడి ఉంటాడో కదా!

3. ఫిలిప్పీయులు 1:9-11 ప్రకారం, పౌలు ఏమని ప్రార్థించాడు?

3 సుమారు పది సంవత్సరాల తర్వాత ఫిలిప్పీలోని సంఘానికి పౌలు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివినప్పుడు, ఆయనకు తన సహోదరుల మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమౌతుంది. అందులో ఆయనిలా రాశాడు, “మిమ్మల్ని క్రీస్తుయేసు ఎలా ప్రేమిస్తున్నాడో నేనూ అలాగే ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమతోనే నేను మీ అందర్నీ చూడాలని ఎంతో కోరుకుంటున్నాను.” (ఫిలి. 1:8) అంతేకాదు వాళ్ల ప్రేమ పెరగాలని, వాళ్లు ఎక్కువ ప్రాముఖ్యమైనవేవో పరిశీలించి తెలుసుకోవాలని, స్వచ్ఛంగా ఉండాలని, ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకూడదని, పుష్కలంగా నీతిఫలాన్ని ఫలిస్తూ ఉండాలని యెహోవాకు ప్రార్థించినట్టు ఆయన చెప్పాడు. పౌలు మనస్ఫూర్తిగా రాసిన ఆ మాటల నుండి నేడు మనం కూడా ఎంతో ప్రయోజనం పొందవచ్చు. (ఫిలిప్పీయులు 1:9-11 చదవండి.) ఈ ఆర్టికల్‌లో మనం పౌలు చెప్పిన ఆ మాటల్ని పరిశీలిస్తాం, అలాగే వాటిని ఎలా అన్వయించుకోవచ్చో చర్చిస్తాం.

ప్రేమ పెంచుకోండి

4. (ఎ) మొదటి యోహాను 4:9, 10 ప్రకారం, యెహోవా తన ప్రేమను ఎలా చూపించాడు? (బి) మనకు దేవుని మీద ఎంత ప్రేమ ఉండాలి?

4 మన పాపాల కోసం చనిపోవడానికి తన కుమారుడైన యేసును భూమ్మీదకు పంపించి యెహోవా గొప్ప ప్రేమను చూపించాడు. (1 యోహాను 4:9, 10 చదవండి.) ఆ నిస్వార్థమైన ప్రేమను బట్టి మనం తిరిగి ఆయన్ని ప్రేమించాలనే ప్రోత్సాహం పొందుతాం. (రోమా. 5:8) మనకు దేవుని మీద ఎంత ప్రేమ ఉండాలి? యేసు ఒక పరిసయ్యుడితో అన్న మాటల్లో దానికి జవాబు ఉంది. ఆయనిలా అన్నాడు, “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.” (మత్త. 22:36, 37) అవును, మన హృదయం నిండా దేవుని మీద ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ రోజురోజుకూ పెరగాలి. తమ ‘ప్రేమ అంతకంతకూ పెరగాలని’ పౌలు ఫిలిప్పీయులకు చెప్పాడు. మనం దేవుని మీదున్న ప్రేమను ఎలా పెంచుకోవచ్చు?

5. దేవుని మీదున్న ప్రేమ మరింత పెరగాలంటే ఏం చేయాలి?

5 దేవుని గురించి తెలుసుకుంటేనే మనకు ఆయన మీద ప్రేమ కలుగుతుంది. బైబిలు ఇలా చెప్తుంది, “ప్రేమ చూపించని వాళ్లకు దేవుడు తెలియదు, ఎందుకంటే దేవుడు ప్రేమ.” (1 యోహా. 4:8) ఆయన గురించిన ‘సరైన జ్ఞానాన్ని, మంచి వివేచనను’ సంపాదించుకునే కొద్దీ ఆ ప్రేమ మరింత పెరుగుతుందని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (ఫిలి. 1:9) మనం బైబిలు స్టడీ మొదలుపెట్టి యెహోవా అద్భుతమైన లక్షణాల్లో కొన్నిటిని తెలుసుకున్నప్పుడు, మనకు ఆయన మీద ప్రేమ కలిగింది. తర్వాత ఆయన గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ, ఆ ప్రేమ మరింత పెరిగింది. అందుకే మనం బైబిల్ని అధ్యయనం చేయడాన్ని, ధ్యానించడాన్ని అన్నిటికన్నా ప్రాముఖ్యమైన వాటిగా చూస్తాం.—ఫిలి. 2:16.

6. మొదటి యోహాను 4:11, 20, 21 ప్రకారం మనం ఏం చేసినప్పుడు కూడా దేవుని మీద ప్రేమ పెరుగుతుంది?

6 దేవుడు మనపై చూపించిన గొప్ప ప్రేమ, తోటి సహోదరుల్ని ప్రేమించేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 యోహాను 4:11, 20, 21 చదవండి.) తోటి సహోదరసహోదరీల్ని ప్రేమించడం తేలికని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే మనం యెహోవాను ఆరాధిస్తూ ఆయనలాంటి చక్కని లక్షణాల్ని చూపించడానికి ప్రయత్నిస్తాం. అంతేకాదు, మనకోసం ప్రాణాన్ని అర్పించి గొప్ప ప్రేమ చూపించిన యేసును అనుకరిస్తాం. అయినాసరే, ఒకరినొకరు ప్రేమించుకోవాలనే ఆజ్ఞను పాటించడం మనకు కొన్నిసార్లు కష్టంగా ఉండవచ్చు. ఉదాహరణకు ఫిలిప్పీ సంఘంలో తలెత్తిన ఒక పరిస్థితిని పరిశీలించండి.

7. యువొదియ, సుంటుకేలకు పౌలు ఇచ్చిన సలహా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

7 యువొదియ, సుంటుకే అనే ఉత్సాహవంతులైన సహోదరీలు అపొస్తలుడైన పౌలుతో సన్నిహితంగా పనిచేశారు. బహుశా ఒక అభిప్రాయభేదం వల్ల ఆ సహోదరీల స్నేహం పాడైంది. అపొస్తలుడైన పౌలు వాళ్ల సంఘానికి ఉత్తరం రాసినప్పుడు యువొదియ, సుంటుకే పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించి, వాళ్లను “ఒకే ఆలోచనతో ఉండమని” సూటిగా చెప్పాడు. (ఫిలి. 4:2, 3) అంతేకాదు సంఘంలోని వాళ్లందరికీ “మీరు ఏమి చేసినా సణగకుండా, వాదించుకోకుండా చేయండి” అని చెప్పాడు. వాళ్లకు ఆ సలహా అవసరమని ఆయన భావించాడు. (ఫిలి. 2:14) పౌలు సూటిగా ఇచ్చిన సలహా వల్ల ఆ ఇద్దరు నమ్మకమైన సహోదరీలతో పాటు, సంఘంలోని వాళ్లందరూ ఒకరిపట్ల ఒకరు మరింత ప్రేమ చూపించుకోగలిగారు.

రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు, ఒక సహోదరుడు పనిని మధ్యలో ఆపి వేరే సహోదరునితో, వాళ్ల అబ్బాయితో మాట్లాడుతున్నాడు. అది చూసి పక్కనున్న సహోదరునికి చిరాకు వస్తుంది. కానీ ఆ తర్వాత ఆయన, ఆ సహోదరుడు పెద్దవయసు సహోదరికి సహాయం చేయడం గమనిస్తాడు

మన సహోదరుల్లో ఉన్న మంచి లక్షణాలపైనే ఎందుకు మనసుపెట్టాలి? (8వ పేరా చూడండి)b

8. సహోదరుల్ని ప్రేమించడం ఎందుకు కష్టంగా అనిపించవచ్చు? అప్పుడు మనం దేనిగురించి ఆలోచించాలి?

8 కొన్నిసార్లు మనం యువొదియ, సుంటుకేల్లాగే మన సహోదరుల పొరపాట్ల మీద మనసుపెడతాం. దానివల్ల వాళ్లను ప్రేమించడం కష్టంగా అనిపించవచ్చు. నిజానికి మనందరం రోజూ పొరపాట్లు చేస్తాం. ఒకవేళ ఇతరుల పొరపాట్ల మీదే మనసుపెడితే, మనకు వాళ్ల మీదున్న ప్రేమ తగ్గిపోతుంది. ఉదాహరణకు, ఒక సహోదరుడు మనకు రాజ్యమందిరాన్ని శుభ్రం చేసే పనిలో సహాయం చేయడం మర్చిపోతే మనకు చిరాకు రావచ్చు. అప్పుడు మనం ఆ సహోదరుడు చేసిన ఇతర పొరపాట్లను కూడా గుర్తుచేసుకుంటే మన చిరాకు ఇంకా పెరుగుతుంది, అతని మీదున్న ప్రేమ తగ్గిపోతుంది. ఒకవేళ మీకు సంఘంలో ఎవరితోనైనా అలాంటి సమస్య ఎదురైతే, దీనిగురించి ఆలోచించండి: యెహోవా మన అపరిపూర్ణతల్ని, మన సహోదరుని అపరిపూర్ణతల్ని చూస్తున్నాడు. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన సహోదరుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం యెహోవాలా మన సహోదరులపట్ల ప్రేమ చూపిస్తూ, వాళ్లలో ఉన్న మంచి లక్షణాలపై మనసుపెట్టాలి. మన సహోదరుల్ని ప్రేమించడానికి తీవ్రంగా కృషి చేసినప్పుడు వాళ్లతో మరింత ఐక్యంగా ఉంటాం.—ఫిలి. 2:1, 2.

“ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో” తెలుసుకోండి

9. పౌలు చెప్పిన “ఎక్కువ ప్రాముఖ్యమైన” వాటిలో ఏమేమి ఉన్నాయి?

9 అపొస్తలుడైన పౌలు పవిత్రశక్తి ప్రేరణతో ఫిలిప్పీయుల్ని అలాగే క్రైస్తవులందర్నీ ఇలా ప్రోత్సహించాడు, ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’ (ఫిలి. 1:10) ఆ ప్రాముఖ్యమైన వాటిలో యెహోవా పేరు పవిత్రపర్చబడడం, ఆయన వాగ్దానాలు నిజమవ్వడం, సంఘంలో శాంతి-ఐక్యత ఉండడం వంటివి ఉన్నాయి. (మత్త. 6:9, 10; యోహా. 13:35) వాటికి మన జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చినప్పుడు యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం.

10. మనం స్వచ్ఛంగా ఉన్నట్లు యెహోవా భావించాలంటే ఏం చేయాలి?

10 మనం ‘స్వచ్ఛంగా ఉండాలని’ కూడా పౌలు ప్రోత్సహించాడు. అందుకోసం మనం పరిపూర్ణులమై ఉండాల్సిన అవసరం లేదు. మనం యెహోవా దేవుడు ఉన్నంత స్వచ్ఛంగా ఉండలేం. కానీ ప్రేమను పెంచుకోవడానికి, ఎక్కువ ప్రాముఖ్యమైనవేవో పరిశీలించి తెలుసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తే మనం స్వచ్ఛంగా ఉన్నట్లు యెహోవా భావిస్తాడు. మనం ప్రేమ చూపించగల ఒక విధానం ఏంటంటే, ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నించడం.

11. ఇతరులు మనవల్ల విశ్వాసం కోల్పోకుండా మనమెందుకు జాగ్రత్తపడాలి?

11 ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా ఉండాలని పౌలు ఇచ్చిన సలహాను ఒక హెచ్చరికగా ఎంచాలి. మనం చేసే ఏ పనుల వల్ల ఇతరులు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది? ఉదాహరణకు వినోదం, బట్టలు, ఉద్యోగం లాంటి విషయాల్లో మనం చేసుకునే ఎంపికల గురించి ఆలోచించండి. బహుశా మనం యెహోవా నియమాలకు విరుద్ధంగా ఏమీ చేస్తుండకపోవచ్చు. కానీ మన ఎంపికలు ఇతరుల మనస్సాక్షిని బాధపెట్టి, వాళ్లు విశ్వాసం కోల్పోవడానికి కారణం కావచ్చు. అప్పుడది చిన్న విషయం కాదు! మన ప్రియ సహోదరుడు విశ్వాసం కోల్పోవడానికి మనం కారణమైతే, మన ‘మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టి లోతైన సముద్రంలో పడేయడమే మంచిదని’ యేసు హెచ్చరించాడు.—మత్త. 18:6.

12. ఒక పయినీరు జంట నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

12 యేసు ఇచ్చిన హెచ్చరికను ప్రాముఖ్యంగా ఎంచుతున్నామని ఒక పయినీరు జంట ఎలా చూపించిందో పరిశీలించండి. వాళ్ల సంఘంలో కొత్తగా బాప్తిస్మం తీసుకున్న మరో జంట ఉంది. వాళ్లు పెరిగిన నేపథ్యం వల్ల క్రైస్తవులు అస్సలు సినిమాలు చూడకూడదని, మంచి సినిమాలు సైతం చూడకూడదని అనుకునేవాళ్లు. అయితే ఒకసారి పయినీరు జంట సినిమాకు వెళ్లారని తెలిసి వాళ్లు అభ్యంతరపడ్డారు. కాబట్టి కొత్తగా బాప్తిస్మం తీసుకున్న ఆ భార్యాభర్తలు తమ మనస్సాక్షికి శిక్షణ ఇచ్చుకొని, తప్పొప్పులను మెరుగ్గా గుర్తించే వరకు ఆ పయినీరు జంట సినిమాలకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. (హెబ్రీ. 5:14) అలా వాళ్లు కొత్తగా బాప్తిస్మం తీసుకున్న జంట మీదున్న ప్రేమను కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించారు.—రోమా. 14:19-21; 1 యోహా. 3:18.

13. ఇతరులు పాపం చేయడానికి మనం ఎలా కారణమయ్యే ప్రమాదం ఉంది?

13 ఇతరుల్ని పాపం చేసేలా ప్రేరేపించినా, వాళ్లు విశ్వాసం కోల్పోవడానికి మనం కారణమయ్యే ప్రమాదం ఉంది. అదెలా జరగవచ్చు? ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒక బైబిలు విద్యార్థి ఎంతోకాలం కష్టపడి, అతిగా మద్యం తాగే అలవాటు నుండి బయటపడ్డాడు. ఇక ఎన్నడూ దాని జోలికే వెళ్లకూడదని అర్థంచేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఇంకా ఎన్నో మార్పులు చేసుకుని బాప్తిస్మం తీసుకున్నాడు. ఒకరోజు ఓ సహోదరుడు అతన్ని పార్టీకి పిలిచి మద్యాన్ని ఇస్తూ, “నువ్వు ఇప్పుడు ఒక క్రైస్తవుడివి, నీకు పవిత్రశక్తి సహాయం ఉంటుంది. పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్లో ఆత్మనిగ్రహం ఒకటి. కాబట్టి నువ్వు అతిగా తాగకుండా ఆ లక్షణం నీకు సహాయం చేస్తుంది” అని అన్నాడు. ఒకవేళ ఆ సహోదరుడు ఇచ్చిన తప్పుడు సలహా విని అతను మళ్లీ మద్యానికి బానిసగా మారితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించగలరా!

14. ఫిలిప్పీయులు 1:10 లో ఉన్న ఉపదేశాల్ని పాటించడానికి మీటింగ్స్‌ ఎలా సహాయం చేస్తాయి?

14 ఫిలిప్పీయులు 1:10 లో ఉన్న ఉపదేశాల్ని ఎన్నో విధాలుగా పాటించడానికి మన మీటింగ్స్‌ సహాయం చేస్తాయి. మొదటిగా, మీటింగ్స్‌లో చర్చించే విషయాలు యెహోవా వేటిని ఎక్కువ ప్రాముఖ్యమైనవిగా ఎంచుతున్నాడో అర్థంచేసుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. రెండవదిగా, మనం స్వచ్ఛంగా ఉండేలా అక్కడ నేర్చుకునే వాటిని ఎలా పాటించాలో తెలియజేస్తాయి. మూడవదిగా, మనం ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా అవి ప్రోత్సహిస్తాయి. (హెబ్రీ. 10:24, 25) తోటి సహోదరుల నుండి పొందే ప్రోత్సాహం వల్ల మనకు దేవుని మీద, తోటి సహోదరసహోదరీల మీద ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది. మన హృదయం నిండా దేవుని మీద, సహోదరుల మీద ప్రేమ ఉంటే, ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా ఉండడానికి శాయశక్తులా కృషిచేస్తాం.

‘పుష్కలంగా నీతిఫలం ఫలిస్తూ’ ఉండండి

15. “పుష్కలంగా నీతిఫలం” ఫలించడం అంటే ఏంటి?

15 ఫిలిప్పీయులు “పుష్కలంగా నీతిఫలం ఫలించాలని” పౌలు మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. (ఫిలి. 1:11) ఆ ‘నీతిఫలంలో’ యెహోవా మీద, ఆయన ప్రజల మీద వాళ్లకున్న ప్రేమ కూడా ఒక భాగమని చెప్పవచ్చు. అంతేకాదు, వాళ్లకు యేసు మీదున్న విశ్వాసం గురించి, వాళ్లకున్న అద్భుతమైన నిరీక్షణ గురించి ఇతరులకు చెప్పడం కూడా అందులో ఉంది. అయితే పౌలు వాళ్లు ‘లోకంలో జ్యోతుల్లా ప్రకాశిస్తున్నారు’ అని కూడా చెప్పాడని ఫిలిప్పీయులు 2:15 లో గమనిస్తాం. ఆ మాటలు విన్నప్పుడు, యేసు తన శిష్యుల్ని “మీరు లోకానికి వెలుగులాంటి వాళ్లు” అని పిలిచిన సందర్భం మనకు గుర్తొస్తుంది. (మత్త. 5:14-16) యేసు తన అనుచరులకు “శిష్యుల్ని చేయండి” అనే ఆజ్ఞ కూడా ఇచ్చాడు. అంతేకాదు వాళ్లు తనకు ‘భూమంతటా సాక్షులుగా ఉంటారని’ చెప్పాడు. (మత్త. 28:18-20; అపొ. 1:8) కాబట్టి మనం అత్యంత ప్రాముఖ్యమైన ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొన్నప్పుడు “నీతిఫలం” ఫలిస్తాం.

పౌలు రోములో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు ఒక సైనికుడికి, తనను చూడడానికి వచ్చినవాళ్లకు ప్రకటిస్తున్నాడు

పౌలు రోములో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు, ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాశాడు. అంతేకాదు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయనకు కాపలా ఉన్నవాళ్లకు, ఆయన్ని చూడడానికి వచ్చినవాళ్లకు ప్రకటించాడు (16వ పేరా చూడండి)

16. ఫిలిప్పీయులు 1:12-14 వచనాల ప్రకారం, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జ్యోతుల్లా ప్రకాశించగలమని ఎలా చెప్పవచ్చు? (ముఖచిత్రం చూడండి.)

16 మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జ్యోతుల్లా ప్రకాశించగలం. కొన్నిసార్లు మనకు ఆటంకంగా ఉండే విషయాలే, మంచివార్త ప్రకటించే అవకాశాల్ని ఇవ్వవచ్చు. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు ఉత్తరం రాసే సమయానికి అపొస్తలుడైన పౌలు రోములో గృహనిర్బంధంలో ఉన్నాడు. కానీ అక్కడున్న సైనికులకు, తనను చూడడానికి వచ్చినవాళ్లకు ప్రకటించకుండా సంకెళ్లు ఆయన్ని ఆపలేకపోయాయి. ఆ పరిస్థితిలో కూడా పౌలు ఉత్సాహంగా ప్రకటించాడు. అది చూసిన సహోదరులు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని పొంది “భయపడకుండా దేవుని వాక్యాన్ని” ప్రకటించారు.—ఫిలిప్పీయులు 1:12-14 చదవండి; ఫిలి. 4:22.

ప్రకటనా పనిపై ఆంక్షలు ఉన్న దేశంలో ఒక సహోదరుడు ఇతరుల దృష్టి తమ మీద పడకుండా తన స్నేహితునికి ప్రకటిస్తున్నాడు. తర్వాత, ఆ సహోదరుడు విరామ సమయంలో తోటి ఉద్యోగికి ప్రకటిస్తున్నాడు

పరిచర్యలో పూర్తిగా భాగం వహించే అవకాశాల కోసం వెదుకుతూ ఉండండి (17వ పేరా చూడండి)c

17. ప్రకటనా పనిపై ఆంక్షలు ఉన్న దేశంలోని సహోదరసహోదరీలు ఎలా ప్రకటిస్తున్నారు?

17 మన సహోదరసహోదరీల్లో చాలామంది పౌలు చూపించినలాంటి ధైర్యాన్నే చూపిస్తున్నారు. వాళ్ల దేశంలో ప్రకటనా పనిపై ఆంక్షలు ఉండడంవల్ల, మంచివార్తను వేరే మార్గాల్లో ప్రకటిస్తున్నారు. (మత్త. 10:16-20) అలాంటి దేశంలో సేవ చేస్తున్న ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు అక్కడి ప్రచారకుల్ని ప్రోత్సహిస్తూ, వాళ్లు తమ బంధువులకు, పొరుగువాళ్లకు, తోటి విద్యార్థులకు, తోటి ఉద్యోగులకు, స్నేహితులకు ప్రకటించాలని చెప్పాడు. దాంతో రెండు సంవత్సరాల్లోనే, ఆ సర్క్యూట్‌లో సంఘాల సంఖ్య బాగా పెరిగింది. మన దేశంలో ప్రకటనా పనిపై ఎలాంటి ఆంక్షలు లేకపోవచ్చు. కానీ తెలివిగా నడుచుకున్న ఆ సహోదరసహోదరీల నుండి మనం ఎంతో విలువైన పాఠం నేర్చుకోవచ్చు. అదేంటంటే, మనం పరిచర్యలో పూర్తిగా భాగం వహించే అవకాశాల కోసం వెదుకుతూ ఉండాలి, ఎలాంటి ఆటంకాన్నైనా అధిగమించే శక్తిని యెహోవా ఇస్తాడనే నమ్మకంతో ఉండాలి.—ఫిలి. 2:13.

18. మనం ఏమని నిర్ణయించుకోవాలి?

18 మనం ప్రాముఖ్యమైన కాలంలో జీవిస్తున్నాం కాబట్టి, పౌలు ఫిలిప్పీయులకు ఇచ్చిన సలహాను పాటించాలని నిర్ణయించుకుందాం. ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకుందాం, స్వచ్ఛంగా ఉందాం, ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా ఉందాం, నీతిఫలం ఫలిద్దాం. అలాచేస్తే మన ప్రేమ పెరుగుతుంది, మన ప్రేమగల తండ్రైన యెహోవాకు ఘనత వస్తుంది.

మీరెలా జవాబిస్తారు?

  • “ఎక్కువ ప్రాముఖ్యమైన” వాటిలో కొన్ని ఏంటి?

  • మనం “స్వచ్ఛంగా” ఎలా ఉండవచ్చు?

  • మనం “పుష్కలంగా నీతిఫలం” ఎలా ఫలించవచ్చు?

పాట 17 “నాకు ఇష్టమే”

a మన సహోదరుల మీదున్న ప్రేమను ముందెన్నటికన్నా ఇప్పుడు మరింత పెంచుకోవాలి. మనం ప్రేమను ఎలా పెంచుకోవచ్చో, కష్టమైన సందర్భాల్లో కూడా దాన్ని ఎలా చూపించవచ్చో పౌలు ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరంలో నేర్చుకుంటాం.

b చిత్రాల వివరణ: రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు, జో అనే సహోదరుడు పనిని మధ్యలో ఆపి వేరే సహోదరునితో, వాళ్ల అబ్బాయితో మాట్లాడుతున్నాడు. అది చూసినప్పుడు పనిచేస్తున్న మైక్‌ అనే సహోదరునికి చిరాకు వస్తుంది, ‘జో పనిచేయకుండా మాట్లాడుతున్నాడేంటి?’ అనిపిస్తుంది. కాసేపటి తర్వాత, జో పెద్దవయసు సహోదరికి సహాయం చేయడాన్ని మైక్‌ గమనిస్తాడు. అది మైక్‌ హృదయాన్ని తాకుతుంది, తన సహోదరునిలో ఉన్న మంచి లక్షణాల్నే చూడాలని గుర్తుకొస్తుంది.

c చిత్రాల వివరణ: ప్రకటనా పనిపై ఆంక్షలు ఉన్న దేశంలో ఒక సహోదరుడు ఇతరుల దృష్టి తన మీద పడకుండా స్నేహితునికి ప్రకటిస్తున్నాడు. తర్వాత, ఆ సహోదరుడు విరామ సమయంలో తోటి ఉద్యోగికి ప్రకటిస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి