జీవిత కథ
‘అన్నిరకాల ప్రజలకు అన్నివిధముల’ వాళ్లమయ్యాం
“నువ్వుగానీ బాప్తిస్మం తీసుకుంటే, నేను నిన్ను వదిలేస్తాను.” 1941లో మా నాన్న అమ్మను బెదిరిస్తూ అన్న మాటలవి. అలా బెదిరించినప్పటికీ, ఆమె బాప్తిస్మం తీసుకోవాలనే నిర్ణయించుకుంది. దాంతో నాన్న అమ్మను వదిలేశాడు, అప్పటికి నా వయసు ఎనిమిదేళ్లే.
ఇదంతా జరగకముందు నుండే నాకు సత్యంపట్ల ఆసక్తి ఉండేది. మా అమ్మ దగ్గర కొన్ని బైబిలు ప్రచురణలు ఉండేవి, అవి నాకు నచ్చాయి. ముఖ్యంగా వాటిలో ఉన్న బొమ్మలంటే నాకు ఇష్టం. అమ్మ తాను నేర్చుకుంటున్న విషయాల్ని నాకు చెప్పడం నాన్నకు ఇష్టముండేది కాదు. కానీ, నేను కుతూహలం కొద్దీ అమ్మను ప్రశ్నలు అడిగేవాణ్ణి. నాన్న ఇంట్లో లేనప్పుడు అమ్మ నాకు బైబిలు స్టడీ చేసేది. దాంతో, నేను కూడా యెహోవాకు నా జీవితాన్ని సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. 1943లో ఇంగ్లండ్‌లోని బ్లాక్పూల్ పట్టణంలో బాప్తిస్మం తీసుకున్నాను, అప్పుడు నాకు పది సంవత్సరాలు.
నేను యెహోవాను సేవించడం మొదలుపెట్టాను
అప్పటినుండి నేనూ, అమ్మ కలిసి క్రమంగా ప్రీచింగ్‌కి వెళ్లేవాళ్లం. ఆ కాలంలో, ప్రీచింగ్ చేయడానికి ఫోనోగ్రఫ్లను ఉపయోగించేవాళ్లం. అవి పెద్దగా, దాదాపు నాలుగున్నర కిలోల బరువు ఉండేవి. అంత బరువును చిన్నపిల్లవాడినైన నేను మోయడాన్ని ఒకసారి ఊహించుకోండి.
నాకు 14 సంవత్సరాలు వచ్చేసరికి, పయినీరు సేవ చేయాలనే కోరిక కలిగింది. దానిగురించి ముందు బ్రదరెన్ సేవకునిగా (ఇప్పుడు ప్రాంతీయ పర్యవేక్షకుడు అని పిలుస్తున్నారు) పనిచేస్తున్న సహోదరునితో మాట్లాడాలని అమ్మ చెప్పింది. పయినీరు సేవ చేయడానికి అవసరమయ్యే ఆర్థిక సహాయం కోసం ఏదైనా పని నేర్చుకోమని ఆ సహోదరుడు సలహా ఇచ్చాడు. కాబట్టి నేను అలా నేర్చుకొని, రెండు సంవత్సరాలు పని చేశాక, పయినీరు సేవ చేయడం గురించి మరో ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి అడిగాను. అతను, “మొదలుపెట్టు” అని చెప్పాడు.
కాబట్టి 1949, ఏప్రిల్‌లో నేనూ, అమ్మ మాకున్న సామానంతా అమ్మేసి మాంఛెస్టర్‌కు దగ్గరలో ఉన్న మిడిల్టన్కు వెళ్లిపోయాం. అక్కడే మేము పయినీరు సేవ మొదలుపెట్టాం. నాలుగు నెలల తర్వాత, నాతోపాటు సేవ చేయడానికి ఒక సహోదరున్ని ఎంపిక చేసుకున్నాను. అయితే, బ్రాంచి కార్యాలయం మమ్మల్ని అర్లమ్లో కొత్తగా ఏర్పడిన సంఘానికి వెళ్లమని చెప్పింది. అమ్మ మరో సంఘంలో ఉన్న ఒక సహోదరితో కలిసి పయినీరు సేవ చేసేది.
నాకు 17 సంవత్సరాలే అయినప్పటికీ, ఆ కొత్త సంఘంలో అర్హులైన సహోదరులు కొంతమందే ఉండడంతో నాకు, నాతోపాటు సేవచేస్తున్న సహోదరునికి మీటింగ్స్ జరిపే బాధ్యతను అప్పగించారు. కొంతకాలానికి, బక్స్టన్ సంఘంలో ప్రచారకులు చాలా తక్కువ మంది ఉండడంతో, సహాయం చేయడానికి అక్కడికి వెళ్లిపోయాను. ఆ అనుభవాలన్నీ భవిష్యత్తులో నాకు రాబోయే నియామకాల కోసం నన్ను సిద్ధం చేశాయి.
1953 లో న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో తోటి సహోదరసహోదరీలతో కలిసి బహిరంగ ప్రసంగం గురించి ప్రచారం చేస్తూ
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్‌కి వెళ్లడానికి నేను 1951లో అప్లికేషన్ పెట్టాను. అయితే 1952 డిసెంబరులో, నాకు మిలిటరీలో పని చేయడానికి రమ్మని పిలుపు వచ్చింది. నేను పూర్తికాల సేవ చేస్తున్నాను కాబట్టి మిలిటరీలో పని చేయలేనని చెప్పాను. కానీ కోర్టు అందుకు ఒప్పుకోలేదు దాంతో నాకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జైల్లో ఉన్నప్పుడు, 22వ గిలియడ్ తరగతికి హాజరుకమ్మని నాకు ఆహ్వానం వచ్చింది. 1953 జూలైలో, నేను విడుదలైన వెంటనే న్యూయార్క్‌కు వెళ్తున్న జార్జిక్ అనే ఓడ ఎక్కాను.
నేను న్యూయార్క్ వెళ్లగానే, 1953లో జరిగిన న్యూ వరల్డ్ సొసైటీ సమావేశానికి హాజరయ్యాను. ఆ తర్వాత, న్యూయార్క్‌లోని సౌత్ లాన్సింగ్కు ట్రైన్లో వెళ్లాను, మా స్కూల్ జరిగేది కూడా అక్కడే. నేను అంతకుముందే జైలు నుండి విడుదలయ్యాను కాబట్టి, నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. ట్రైన్ దిగగానే, సౌత్ లాన్సింగ్కు వెళ్లే బస్సు ఎక్కాను. కానీ టికెట్టు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకపోవడంతో, తోటి ప్రయాణికుని దగ్గర అడిగి తీసుకోవాల్సి వచ్చింది.
వేరే దేశంలో నియామకం
‘అన్నిరకాల ప్రజలకు సహాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేయడానికి’ కావాల్సిన అద్భుతమైన శిక్షణను మేము గిలియడ్ పాఠశాలలో పొందాం. (1 కొరిం. 9:22, NW) నన్నూ, పాల్బ్రూన్ను, రేమండ్ లీచ్‌ను ఫిలిప్పీన్స్‌లో సేవ చేయడానికి వెళ్లమని చెప్పారు. కానీ మేము వీసా కోసం కొన్ని నెలలు ఆగాల్సి వచ్చింది. ఆ తర్వాత మేము నెదర్లాండ్స్‌లోని రాటర్‌డామ్‌కు ఓడలో వెళ్లాం. అక్కడనుండి మధ్యధరా సముద్రం, సూయెజ్ కాలువ, హిందూ మహాసముద్రం మీదుగా మలేసియాకు తర్వాత హాంకాంగ్‌కు చేరుకున్నాం. అలా 47 రోజులు సముద్రంలో ప్రయాణించాక 1954, నవంబరు 19న మనీలా చేరాం.
నేనూ, రేమండ్ లీచ్ ఫిలిప్పీన్స్‌లో మిషనరీలుగా సేవ చేయడానికి 47 రోజులు ఓడలో ప్రయాణించి వెళ్లాం
మేం అక్కడ కొత్త సంస్కృతికి, కొత్త దేశానికి, కొత్త భాషకు అలవాటుపడాలి. మొదట్లో మా ముగ్గురిని, క్విజొన్ నగరంలోని సంఘానికి నియమించారు, అక్కడ చాలామంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు. దాంతో ఆరు నెలలు గడిచాక కూడా, తగాలోగ్ భాషలో కేవలం కొన్ని పదాలే నేర్చుకోగలిగాం. మాకు తర్వాతి నియామకం ఇచ్చినప్పుడు ఆ సమస్య ఇక ఉండకపోవచ్చు.
1955, మే నెలలో ఒకరోజు ప్రీచింగ్ నుండి మేము ఇంటికి వచ్చేసరికి సహోదరుడు లీచ్‌కు, నాకు కొన్ని ఉత్తరాలు వచ్చాయి. మమ్మల్ని ప్రాంతీయ పర్యవేక్షకులుగా నియమిస్తున్నట్లు ఆ ఉత్తరాల్లో ఉంది. నాకప్పటికి 22 సంవత్సరాలే, కానీ ఈ నియామకంలో ‘అన్నిరకాల ప్రజలకు సహాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేయడానికి’ కొత్త మార్గాల్ని నేర్చుకోబోతున్నాను.
బికోల్ భాషా ప్రాంతీయ సమావేశంలో నేను బహిరంగ ప్రసంగం ఇస్తూ
ఉదాహరణకు, ప్రాంతీయ పర్యవేక్షకునిగా మొదటి బహిరంగ ప్రసంగాన్ని పల్లెటూరులో ఓ షాపు ముందు ఇచ్చాను. అప్పట్లో ఫిలిప్పీన్స్‌లో బహిరంగ ప్రసంగాలను బహిరంగ ప్రదేశాల్లోనే ఇచ్చేవాళ్లు. నేను వేర్వేరు సంఘాలకు వెళ్లినప్పుడు టెంట్లలో, మార్కెట్లలో, పబ్లిక్ హాళ్ల ముందు, బాస్కెట్ బాల్ కోర్టుల్లో, పార్కుల్లో, చాలాసార్లు వీధి చివర బహిరంగ ప్రసంగాలను ఇచ్చాను. ఒకసారి సాన్ పాబ్లో అనే ఊరులో బాగా వర్షం కురుస్తుండడంతో మార్కెట్లో ప్రసంగం ఇవ్వలేకపోయాను. అందుకే ప్రసంగాన్ని రాజ్యమందిరంలో ఇస్తానని బాధ్యతగల సహోదరులకు చెప్పాను. అయితే ఆ మీటింగ్ అయిపోయాక ఆ సహోదరులు నా దగ్గరికి వచ్చి, మీటింగ్ బహిరంగ ప్రదేశంలో జరగలేదు కదా మరి దాన్ని పబ్లిక్ మీటింగుగా రిపోర్ట్ చేయవచ్చానని అడిగారు.
నేను ఎప్పుడూ సహోదరుల ఇళ్లలోనే ఉండేవాణ్ణి. వాళ్ల ఇళ్లు చిన్నవే అయినా శుభ్రంగా ఉండేవి. చాలాసార్లు, చెక్క నేలపై వేసిన పల్చని చాప మీదే పడుకోవాల్సి వచ్చేది. స్నానం చేయడానికి బాత్రూమ్లు ఉండేవి కావు, దాంతో బట్టలతోనే స్నానం చేయడం నేర్చుకున్నాను. వేరే దీవులకు వెళ్లడానికి బస్సులో, కొన్నిసార్లు పడవలో ప్రయాణించేవాణ్ణి. నేను సేవ చేసిన సంవత్సరాలన్నిటిలో ఎన్నడూ కారు కొనుక్కోలేదు.
ప్రత్యేకంగా క్లాసులకు వెళ్లకపోయినా నేను తగాలోగ్ భాష నేర్చుకున్నాను. ప్రీచింగ్‌లో, మీటింగ్స్‌లో సహోదరులు మాట్లాడుతున్నప్పుడు విని ఆ భాష నేర్చుకున్నాను. ఆ భాష నేర్చుకోవడానికి సహోదరులు నాకు సహాయం చేయాలనుకున్నారు. ఆ విషయంలో వాళ్లు చూపించిన ఓర్పుకు, నిజాయితీగా నన్ను సరిచేసిన విధానానికి వాళ్లకు నేనెంతో కృతజ్ఞుడిని.
కాలం గడుస్తుండగా నాకిచ్చిన కొత్త నియామకాలనుబట్టి మరిన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చింది. 1956లో సహోదరుడు నేథన్ నార్ సందర్శించినప్పుడు, ఒక జాతీయ సమావేశం జరిగింది. అప్పుడు నాకు మీడియావాళ్లతో మాట్లాడే నియామకం ఇచ్చారు. అందులో నాకు అనుభవం లేదు, కానీ తోటి సహోదరులు నాకు సహాయం చేశారు. ఒక సంవత్సరంలోపే, ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి సహోదరుడు ఫ్రెడ్రిక్ ఫ్రాంజ్ సందర్శించారు. అప్పుడు మాకు మరో జాతీయ సమావేశం జరిగింది, దానికి నేను సమావేశ పర్యవేక్షకునిగా సేవచేశాను. సహోదరుడు ఫ్రాంజ్ బహిరంగ ప్రసంగం ఇచ్చినప్పుడు బారాంగ్ తగాలోగ్ వేసుకున్నాడు, అది ఫిలిప్పినో ప్రజల సాంప్రదాయ బట్టలు. అది చూసి స్థానిక సహోదరులు చాలా సంతోషపడ్డారు. ప్రజలకు తగ్గట్టు మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని అది చూసి నేర్చుకున్నాను.
నేను జిల్లా పర్యవేక్షకుణ్ణి అయినప్పుడు ఇంకా ఎక్కువ మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో, నూతన లోక సంస్థ యొక్క ఆనందం (ఇంగ్లీషు) ప్రదర్శన చూపించేవాళ్లం. చాలావరకు దాన్ని బహిరంగ ప్రదేశాల్లోనే చూపించేవాళ్లం కాబట్టి పురుగుల వల్ల ఇబ్బందిపడేవాళ్లం. ప్రొజెక్టర్ లైట్‌కి పురుగులు వచ్చేవి, అవి ఆ ప్రొజెక్టర్‌లో ఇరుక్కుపోయేవి. తర్వాత వాటన్నిటిని తీసి శుభ్రం చేయడం చాలా పెద్ద పని. ఈ ప్రదర్శనలను ఏర్పాటు చేయడం అంత తేలిక కాదు, కానీ యెహోవా అంతర్జాతీయ సంస్థ గురించి నేర్చుకోవడం కోసం ప్రజలు రావడం చూసి సంతృప్తిగా అనిపించేది.
సమావేశాలు పెట్టుకోవడానికి మాకు అనుమతివ్వద్దని కొన్ని ప్రాంతాల్లోని క్యాథలిక్ ప్రీస్టులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చేవాళ్లు. వాళ్ల చర్చీల దగ్గర్లో మేము ప్రసంగాలు ఇస్తున్నప్పుడు, ఆ ప్రసంగం ప్రజలకు వినిపించకూడదనే ఉద్దేశంతో చర్చీ గంటలు మోగించేవాళ్లు. వాళ్లు ఇన్ని చేసినప్పటికీ, ప్రజలు సత్యాన్ని నేర్చుకుంటూనే వచ్చారు. అంతేకాదు ఇప్పుడు ఆ ప్రాంతాల్లోని చాలామంది యెహోవాను ఆరాధిస్తున్నారు.
కొత్త నియామకాలు, మరిన్ని సర్దుబాట్లు
1959లో, నన్ను బ్రాంచి కార్యాలయంలో సేవ చేయడానికి నియమించారు. అక్కడ నాకు ఎదురైన అనుభవాలనుండి నేను చాలా నేర్చుకున్నాను. కొంతకాలం తర్వాత, వేర్వేరు దేశాల్లోని బ్రాంచి కార్యాలయాల్ని సందర్శించే పని నాకు అప్పగించారు. అలా సందర్శిస్తున్నప్పుడు థాయిలాండ్‌లో మిషనరీగా సేవ చేస్తున్న జ్యానట్ డూమాండ్ని నేను కలిశాను. కొంతకాలం పాటు మేము ఒకరికొకరం ఉత్తరాలు రాసుకున్నాం, ఆ తర్వాత పెళ్లిచేసుకున్నాం. 51 సంవత్సరాలపాటు మేము కలిసి యెహోవాకు సంతోషంగా సేవచేశాం.
ఫిలిప్పీన్స్‌లోని ఒకానొక దీవిలో నేనూ, జ్యానట్
నేను 33 దేశాల్లోని యెహోవా ప్రజలను సందర్శించి చాలా సంతోషించాను. అంతకుముందు నాకిచ్చిన నియామకాలవల్ల వేర్వేరు సంస్కృతులు, నేపథ్యాలు ఉన్న ప్రజలతో ఎలా మెలగాలో నేర్చుకున్నాను, అందుకు నేను యెహోవాకు ఎన్నో కృతజ్ఞతలు తెలపాలి. అలా సందర్శనాలు చేయడం వల్ల యెహోవా అన్నిరకాల ప్రజలను ప్రేమిస్తున్నాడని స్పష్టంగా అర్థం చేసుకోగలిగాను.—అపొ. 10:34, 35.
మేము క్రమంగా పరిచర్యకు వెళ్లేలా చూసుకుంటాం
మేము సర్దుబాట్లు చేసుకుంటూనే ఉన్నాం
ఫిలిప్పీన్స్‌లోని సహోదరులతో కలిసి సేవ చేయడం నాకూ, జ్యానట్కు సంతోషాన్నిచ్చింది. అంతేకాదు మేము ఇప్పటికీ క్విజొన్ నగరంలోని బ్రాంచి కార్యాలయంలోనే సేవచేస్తున్నాం. నేను 60 ఏళ్ల క్రితం సేవ చేయడం మొదలుపెట్టినప్పుడు ఉన్నవాళ్ల కన్నా పది రెట్లు ఎక్కువమంది ప్రచారకులు ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా, యెహోవా చెప్పేది చేసేందుకు సిద్ధంగా ఉండడానికి నేను ఇంకా సర్దుబాట్లు చేసుకోవాలి. ఉదాహరణకు, ఈ మధ్యకాలంలో సంస్థ చేసిన మార్పులవల్ల మరిన్ని సర్దుబాట్లు చేసుకున్నాం.
సాక్షుల సంఖ్య పెరుగుతూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది
యెహోవా నిర్దేశాన్ని పాటించేందుకు మేము చేయగలిగినదంతా చేశాం, అలా జీవించడంలో దొరికిన సంతృప్తి మరి దేనిలోనూ దొరకదు. మన సహోదరులకు చక్కగా సేవచేసేందుకు అవసరమైన ఎలాంటి సర్దుబాట్లనైనా చేసుకోవడానికి మేము ప్రయత్నించాం. అవును, యెహోవా కోరుకున్నంత వరకు, మేము ‘అన్నిరకాల ప్రజలకు అన్నివిధముల వాళ్లమై’ ఉండాలని నిర్ణయించుకున్నాం.
మేము ఇప్పటికీ క్విజొన్ నగరంలోని బ్రాంచి కార్యాలయంలోనే సేవచేస్తున్నాం