సత్యంలో లేని బంధువుల హృదయాల్ని చేరుకోండి
తనను అనుసరించాలనుకున్న ఓ వ్యక్తితో యేసు, “నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుము” అని అన్నాడు. ఆ సమయంలో బహుశా ఆయన గలిలయ సముద్రానికి ఆగ్నేయ దిశలోవున్న గదర ప్రాంతంలో ఉండివుంటాడు. ఆసక్తికరమైన, ప్రాముఖ్యమైన విషయాలు తెలిసినప్పుడు వాటిని బంధువులకు చెప్పాలనుకోవడం, మనుషులకు సహజమని యేసు అర్థంచేసుకున్నట్లు ఆ మాటల్ని బట్టి తెలుస్తుంది.—మార్కు 5:19.
ఈ రోజుల్లో కూడా ప్రజలు అలా చేయడం చూస్తుంటాం, కొన్ని సంస్కృతుల్లో అది కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఓ వ్యక్తి సత్యదేవుడైన యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు, తాను కొత్తగా తెలుసుకున్న విషయాలను బంధువులకు చెప్పాలని ఆశపడతాడు. అయితే ఆ పని ఎలా చేయాలి? వేరే మత నమ్మకాలున్న లేదా అసలు ఎలాంటి నమ్మకం లేని బంధువుల హృదయాల్ని చేరుకోవాలంటే ఆయన ఏమి చేయవచ్చు? ఈ విషయంలో ఉపయోగపడే చక్కని సూచనలను బైబిలు ఇస్తుంది.
“మేము మెస్సీయను కనుగొంటిమి”
యేసు భూమ్మీదున్నప్పుడు ఆయనను మెస్సీయగా గుర్తుపట్టిన మొదటివాళ్లలో అంద్రెయ ఒకడు. తాను తెలుసుకున్న ఆ విషయాన్ని ఆయన వెంటనే ఎవరికి చెప్పాడు? “ఇతడు [అంద్రెయ] మొదట తన సహోదరుడైన సీమోనును చూచి—మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము.” అంద్రెయ, సీమోను పేతురును యేసు దగ్గరకు తీసుకువెళ్లాడు, అలా యేసు శిష్యుడయ్యే అవకాశాన్ని పేతురుకు కల్పించాడు.—యోహా. 1:35-42.
అది జరిగిన దాదాపు ఆరేళ్ల తర్వాత, కైసరయలో నివసిస్తున్న కొర్నేలి అనే సైనికాధికారి ఇంటిని సందర్శించమనే ఆహ్వానం యొప్పేలో ఉన్న పేతురుకు అందింది. పేతురు అక్కడికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఎవరెవరున్నారు? “కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, వారికొరకు [పేతురు, ఆయనతోపాటు ఉన్నవాళ్ల కొరకు] కనిపెట్టుకొని యుండెను.” కొర్నేలి అలా చేయడంవల్ల పేతురు మాటలు విని, విన్నవాటి ప్రకారం నిర్ణయం తీసుకునే అవకాశం ఆయన బంధువులకు దొరికింది.—అపొ. 10:22-33.
అంద్రెయ, కొర్నేలి తమ బంధువుల విషయంలో చేసిన దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
తమ బంధువులకు సత్యం తెలుసుకునే అవకాశం ఎలాగోలా దొరుకుతుందని వాళ్లు అనుకోలేదు. అంద్రెయ, దగ్గరుండి పేతురును యేసుకు పరిచయం చేశాడు; ఇక కొర్నేలి విషయానికొస్తే, తన బంధువులు పేతురు చెప్పేది వినే ఏర్పాటు చేశాడు. అయితే అంద్రెయగానీ కొర్నేలిగానీ, క్రీస్తు అనుచరులయ్యేలా తమ బంధువులను ఒత్తిడి చేయలేదు, మభ్యపెట్టలేదు. దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం కూడా అదే పద్ధతి పాటించడం మంచిది. మనం అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన బంధువులకు చెప్పవచ్చు లేదా వాళ్లు బైబిలు సత్యాలను తెలుసుకునేలా, ఇతర సాక్షుల్ని కలుసుకునేలా ఏర్పాట్లు చేయవచ్చు. అయితే, వాళ్లకు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని గుర్తిస్తాం కాబట్టి, అనవసరంగా ఒత్తిడి చేస్తూ వాళ్లను ఇబ్బందిపెట్టం. బంధువులకు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకోవడానికి జర్మనీలో ఉంటున్న యూయర్గన్-పెట్రా దంపతుల అనుభవాన్ని పరిశీలించండి.
పెట్రా యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసి, కొంతకాలానికి బాప్తిస్మం తీసుకుంది. ఆమె భర్త యూయర్గన్, ఓ సైనికాధికారి. యూయర్గన్‌కు మొదట్లో తన భార్య తీసుకున్న నిర్ణయం నచ్చలేదు. కానీ, యెహోవాసాక్షులు బైబిల్లోని సత్యాన్నే ప్రకటిస్తారని క్రమేణా అర్థం చేసుకున్నాడు. దాంతో ఆయన కూడా యెహోవాకు సమర్పించుకున్నాడు, ప్రస్తుతం ఆయన సంఘ పెద్దగా సేవ చేస్తున్నాడు. వేరే మత నమ్మకాలున్న కుటుంబ సభ్యుల హృదయాల్ని చేరుకునే విషయంలో ఆయన ఏమని సలహా ఇస్తున్నాడు?
యూయర్గన్ ఇలా అంటున్నాడు, “మన బంధువులను ఒత్తిడి చేస్తూ, అదేపనిగా వాళ్లను బైబిలు విషయాలతో ముంచెత్తడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల వాళ్ల అయిష్టత మరింత పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు. ఆసక్తికరమైన విషయాలను అప్పుడప్పుడు వాళ్లకు అందించడం మంచిది. బంధువుల వయసుకు, ఇష్టాయిష్టాలకు దగ్గరగా ఉన్న మన సహోదరులను పరిచయం చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల వాళ్లకు సహాయం చేయడం మరింత సుళువౌతుంది.”
“మన బంధువులను ఒత్తిడి చేస్తూ, అదేపనిగా వాళ్లను బైబిలు విషయాలతో ముంచెత్తడానికి ప్రయత్నించకూడదు.”—యూయర్గన్
అపొస్తలుడైన పేతురు, కొర్నేలి బంధువులు బైబిలు సందేశాన్ని వెంటనే స్వీకరించారు. అయితే, సత్యాన్ని తెలుసుకునే అవకాశం పొందిన మొదటి శతాబ్దంలోని మరికొంతమంది మాత్రం కాస్త సమయం తీసుకున్నారు.
యేసు తోబుట్టువుల సంగతేమిటి?
యేసు బహిరంగ పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన బంధువుల్లో చాలామంది ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఉదాహరణకు, అపొస్తలుడైన యాకోబు యోహానులు యేసు సమీప బంధువులై ఉంటారు, వాళ్ల తల్లి సలోమే, యేసు తల్లికి సహోదరి అయ్యుంటుంది. “తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు” వచ్చిన చాలామంది స్త్రీలలో ఆమెకూడా ఉండివుంటుంది.—లూకా 8:1-3.
అయితే, యేసు ఇతర కుటుంబ సభ్యులు వెంటనే విశ్వాసం చూపించలేదు. ఉదాహరణకు, యేసు బాప్తిస్మం తీసుకున్న సుమారు సంవత్సరం తర్వాత, ఆయన బోధ వినడానికి చాలామంది ఓ ఇంట్లో సమకూడారు. కానీ “ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.” కొంతకాలం తర్వాత, తన ప్రయాణం గురించి వాకబు చేసిన తమ్ముళ్లకు యేసు స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. కారణం? “ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు.”—మార్కు 3:21; యోహా. 7:5.
యేసు తన బంధువులతో వ్యవహరించిన తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? తనకు మతి చలించిందంటూ వాళ్లలో కొందరు నిందించినా యేసు కోపగించుకోలేదు. యేసు చనిపోయి, పునరుత్థానమైన తర్వాత తన తమ్ముడైన యాకోబుకు కనిపించాడు. ఆ విధంగా ఆయన, తన బంధువులకు అదనపు ప్రోత్సాహాన్ని అందించాడు. అలా కనిపించడం, యేసే మెస్సీయ అని యాకోబుతోపాటు, ఇతర తమ్ముళ్లను కూడా ఒప్పించివుండవచ్చు. దానివల్ల వాళ్లు, యెరూషలేములోని మేడగదిలో అపొస్తలులు, మరితరులతో పాటు సమకూడి, పరిశుద్ధాత్మ కూడా పొందారు. కాలక్రమంలో యాకోబు, యూదా, యేసుకున్న మరో తమ్ముడు ప్రత్యేకమైన స్థానాల్లో సేవ చేసే అవకాశాల్ని పొందారు.—అపొ. 1:12-14; 2:1-4; 1 కొరిం. 15:7.
కొంతమందికి ఎక్కువ సమయం పడుతుంది
“ఎక్కువ మేలు జరగాలంటే అవసరమైనది సహనం, సహనం, మరింత సహనం.”—రోస్‌వీటా
మొదటి శతాబ్దంలోలాగే, ఇప్పుడు కూడా జీవమార్గంలోకి రావడానికి కొంతమంది బంధువులకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. రోస్‌వీటా అనే సహోదరి ఉదాహరణనే తీసుకోండి, 1978లో ఆమె భర్త యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకునే సమయానికి ఆమె రోమన్ క్యాతలిక్ మతాన్ని నిష్ఠగా అనుసరిస్తూ ఉండేది. తన మత నమ్మకాలకు నమ్మకంగా కట్టుబడిన రోస్‌వీటా మొదట్లో తన భర్తను వ్యతిరేకించింది. కానీ సంవత్సరాలు గడుస్తుండగా ఆమెలోని వ్యతిరేకత తగ్గి, యెహోవాసాక్షులు సత్యాన్ని బోధిస్తారని గ్రహించడం మొదలుపెట్టింది. చివరకు 2003లో ఆమె కూడా బాప్తిస్మం తీసుకుంది. ఈ మార్పుకు దోహదపడింది ఏమిటి? రోస్‌వీటా మొదట్లో వ్యతిరేకించినప్పుడు ఆమె భర్త నొచ్చుకునే బదులు, తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాల్ని ఆమెకు కల్పించాడు. ఆమె ఇచ్చే సలహా ఏమిటి? “ఎక్కువ మేలు జరగాలంటే అవసరమైనది సహనం, సహనం, మరింత సహనం.”
మోనీకా 1974లో బాప్తిస్మం తీసుకుంది, దాదాపు పదేళ్ల తర్వాత ఆమె ఇద్దరు కొడుకులు కూడా యెహోవాసాక్షులయ్యారు. ఆమె భర్త హాన్స్ ఆమె మతనమ్మకాలను ఎన్నడూ వ్యతిరేకించకపోయినా, 2006 వరకు ఆయన బాప్తిస్మం తీసుకోలేదు. తమ అనుభవంతో ఆ కుటుంబం ఏమని సలహా ఇస్తుంది? “యెహోవాకు నమ్మకంగా అంటిపెట్టుకుని ఉండండి, విశ్వాసం విషయంలో ఎదురయ్యే సవాళ్లతో రాజీపడకండి.” అయితే, తమకు హాన్స్ మీదున్న ప్రేమ చెక్కుచెదర్లేదని ఆయనకు ఎప్పటికప్పుడు చూపించడానికి, తామంతా కృషి చేస్తూనే ఉన్నామని వాళ్లు అంటున్నారు. ఆయన ఎప్పటికైనా సత్యాన్ని స్వీకరిస్తాడనే ఆశను వాళ్లు ఏమాత్రం వదులుకోలేదు.
సత్యపు నీటితో సేదదీర్చండి
సత్య సందేశం నిత్యజీవాన్నిచ్చే నీళ్లలాంటిదని యేసు అన్నాడు. (యోహా. 4:13, 14) చల్లని, స్వచ్ఛమైన సత్యపు నీటితో మన బంధువులకు సేదదీర్పు ఇవ్వాలని మనం కోరుకుంటాం. సత్యపు నీటితో వాళ్లను ముంచెత్తుతూ, వాళ్లకు ఉపిరాడకుండా చేయాలని మనమెవ్వరం అనుకోం. సత్యపు నీటివల్ల వాళ్లు సేదదీరుతారా, ఊపిరాడక ఇబ్బందిపడతారా అనేది మనం మన నమ్మకాలను వాళ్లకు వివరించే విధానం మీద ఆధారపడివుంటుంది. బైబిలు చెబుతున్నట్లు, “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును,” “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.” ఈ సలహాను మనం ఎలా పాటించవచ్చు?—సామె. 15:28; 16:23.
భార్య తన నమ్మకాల గురించి భర్తకు చెప్పాలనుకోవడం సహజమే. ‘యుక్తమైన ప్రత్యుత్తరమివ్వడానికి’ ముందుగా ఆలోచించుకునే భార్య, తొందరపడకుండా ఆచితూచి మాట్లాడుతుంది. తానేదో నీతిమంతురాల్ని అన్నట్లు లేదా ఆయనకంటే గొప్పదాన్ని అన్నట్లు మాట్లాడకూడదు. బాగా ఆలోచించి మాట్లాడితే ఆమె మాటలు సేదదీర్చేలా, శాంతికి దోహదపడేలా ఉంటాయి. ఏ సమయంలో ఆయన ప్రశాంతంగా ఉండి, తను చెప్పేది వినడానికి ఇష్టపడతాడు? ఎలాంటి విషయాలు మాట్లాడడానికి, చదవడానికి ఆయన ఇష్టపడతాడు? సైన్సు, రాజకీయాలు, క్రీడలు వంటి విషయాలపై ఆయనకు ఆసక్తి ఉందా? ఆయన ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను గౌరవిస్తూనే బైబిలు మీద ఆయన ఆసక్తిని ఎలా రేకెత్తించవచ్చు? ఇలా ఆలోచించడం వల్ల ఆమె యుక్తిగా మాట్లాడవచ్చు, ప్రవర్తించవచ్చు.
సత్యంలో లేని కుటుంబ సభ్యుల హృదయాల్ని చేరుకోవాలంటే, అడపాదడపా మన నమ్మకాల గురించి మాట్లాడడం మాత్రమే సరిపోదు. మనం చెప్పేవాటికి, మన చక్కని ప్రవర్తన కూడా తోడవ్వాలి.
చక్కని ప్రవర్తన
“అనుదిన జీవితంలోని అన్ని విషయాల్లో బైబిలు సూత్రాలను పాటిస్తూ ఉండండి. అలా చేయడం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే పైకి చెప్పకపోయినా మన బంధువులు అలాంటి చక్కని ప్రవర్తనను ఆసక్తిగా గమనిస్తారు” అని పైన చూసిన యూయర్గన్ అంటున్నాడు. తన భార్య సత్యంలోకి వచ్చిన 30 సంవత్సరాలకు బాప్తిస్మం తీసుకున్న హాన్స్ కూడా, “సత్యం మన జీవితాల్ని ఎంతగా మెరుగుపర్చిందో మన బంధువులు గమనించాలంటే, చక్కని క్రైస్తవ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం” అని ఒప్పుకుంటున్నాడు. సత్యం తెలుసుకోవడం వల్ల మనం ఇతరులతో పోల్చితే ఎలా మెరుగయ్యామో మన బంధువులు స్పష్టంగా చూడగలగాలి. అంతేగానీ, సత్యంవల్ల మనం చెడిపోయామని లేదా పతనమయ్యామని వాళ్లకు అనిపించకూడదు.
“సత్యం మన జీవితాల్ని ఎంతగా మెరుగుపర్చిందో మన బంధువులు గమనించాలంటే, చక్కని క్రైస్తవ ప్రవర్తన చాలా ప్రాముఖ్యం.”—హాన్స్
అవిశ్వాసులైన భర్తలున్న క్రైస్తవ సహోదరీలకు, అపొస్తలుడైన పేతురు ఓ చక్కని సలహా ఇచ్చాడు. “మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”—1 పేతు. 3:1-4.
భర్తలు తమ భార్యల చక్కని ప్రవర్తన వల్ల సత్యాన్ని స్వీకరించే అవకాశముందని పేతురు రాశాడు. ఆ లేఖన సూత్రం మనసులో ఉంచుకున్న క్రిస్టా అనే సహోదరి, 1972లో బాప్తిస్మం పొందినప్పటి నుండి తన ప్రవర్తన ద్వారా భర్త హృదయాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆమె భర్త ఒకప్పుడు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసినా, సత్యాన్ని సొంతం చేసుకోలేదు. ఆయన కొన్ని క్రైస్తవ కూటాలకు వచ్చాడు, సంఘంలోని సభ్యులతో బాగానే కలిసిపోతాడు. వాళ్లు కూడా మతం విషయంలో ఆయనకున్న హక్కును గౌరవిస్తారు. ఆయన హృదయాన్ని చేరుకోవడానికి క్రిస్టా ఏమి చేస్తుంది?
“ఏదేమైనా యెహోవా చూపే మార్గంలోనే నడవాలని తీర్మానించుకున్నాను. అదే సమయంలో చక్కని ప్రవర్తనతో, ‘వాక్యం లేకుండానే’ నా భర్తను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. బైబిలు సూత్రాలకు వ్యతిరేకం కానంతవరకు, నా భర్తకు నచ్చినట్లు ఉండడానికి శాయశక్తులా కృషిచేస్తాను. ఆయనకున్న స్వేచ్ఛను ఎలాగూ గౌరవిస్తాను. ఆపై, విషయాన్ని యెహోవాకే వదిలేస్తాను.”
పట్టువిడుపులు చూపించడం ఎంత ప్రాముఖ్యమో క్రిస్టా అనుభవం చూపిస్తుంది. ఆమె క్రమంగా కూటాలకు హాజరౌతూ, క్రైస్తవ పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొంటూ దైవిక విషయాల్లో చక్కని క్రమాన్ని పాటించడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ, తన ప్రేమను, సమయాన్ని, అవధానాన్ని పొందే హక్కు తన భర్తకు ఉందని ఆమె అర్థంచేసుకుంటూ, దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తుంది. సత్యంలో లేని బంధువులకు సహాయం చేయాలనుకునే వాళ్లు ఇలా పట్టువిడుపులు చూపించడం, అర్థంచేసుకోవడం చాలా ప్రాముఖ్యం. “ప్రతిదానికి సమయము కలదు” అని బైబిలు చెబుతుంది. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సత్యంలో లేని జీవిత భాగస్వాములతో వెచ్చించే సమయానికి కూడా ఆ మాట వర్తిస్తుంది. సమయం గడపడం మంచి సంభాషణలకు దారితీస్తుంది. అలా చక్కగా మాట్లాడడం వల్ల తాము ఒంటరి వాళ్లమనే బాధ, తమను పట్టించుకోవడంలేదనే అసూయ వాళ్లలో కలగకుండా చూసుకోవచ్చు.—ప్రసం. 3:1.
ఎన్నడూ ఆశ వదులుకోకండి
“మన కుటుంబ సభ్యుణ్ణి మనం ప్రేమిస్తున్నట్లు, ఆయన కోసం మనం ప్రార్థిస్తున్నట్లు చూపించడం ప్రాముఖ్యం” అని హోల్గర్ అంటున్నాడు. హోల్గర్ వాళ్ల నాన్న, ఆ కుటుంబమంతా సత్యంలోకి వచ్చిన 20 ఏళ్లకు బాప్తిస్మం తీసుకున్నాడు. క్రిస్టా కూడా, ‘నా భర్త యెహోవా పక్షాన నిలబడి, సత్యాన్ని అంగీకరిస్తాడనే ఆశను ఎన్నడూ వదులుకోను’ అని చెబుతోంది. అవిశ్వాసులైన బంధువులు సత్యాన్ని స్వీకరిస్తారనే ఆశను మనం కూడా ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుకోవాలి.
బాంధవ్యాలను కాపాడుకుంటూ, సత్యాన్ని గుర్తించే అవకాశం మన బంధువులకు కల్పిస్తూ, బైబిలు సందేశంతో వాళ్ల హృదయాల్ని చేరుకోవాలన్నదే మన లక్ష్యం. మనం అన్ని విషయాల్లో “సాత్వికముతోను భయముతోను” ప్రవర్తించాలి.—1 పేతు. 3:15, 16.