అపాయకరమైన ఈ కాలాల్లో ‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండండి
“నేడు చర్చీల్లో పవిత్ర ప్రవర్తన ఓ సమస్యగా తయారైందనే విషయాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు.” ఈ మధ్య ఇటలీ దేశంలోని చర్చీల్లో జరిగిన లైంగిక నేరాల గురించి క్యాథోలిక్ పత్రికా విలేఖరి అయిన విట్టోర్వో మెస్సోరీ పైమాటలు రాశాడు. ఆయనింకా ఇలా రాశాడు: “ప్రీస్టులు అవివాహితులుగా ఉండాలనే నియమం ఎత్తివేసినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే 80 శాతం కేసులు పురుష సంయోగులకు సంబంధించినవే అంటే ప్రీస్టులు ఇతర పురుషులతో, అబ్బాయిలతో సాగించిన లైంగిక అత్యాచారాలకు సంబంధించినవే.”—లా స్టాంపా.
ఇంత విపరీతమైన దుష్టత్వం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ లోక ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామని చెప్పవచ్చు. (2 తిమో. 3:1-5) వార్తాపత్రికల నివేదికలు చూపిస్తున్నట్లుగా, నైతిక పతనం సాధారణ ప్రజానీకం మీదే కాక, భక్తిపరులమని చెప్పుకునే వారిమీద కూడా చెడు ప్రభావం చూపిస్తోంది. వారి హృదయం భ్రష్టుపట్టి చెడిపోయినందువల్ల నీచాతినీచమైన క్రియలకు పాల్పడుతున్నారు. (ఎఫె. 2:2) అందుకే యేసు, “దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును” అని హెచ్చరించాడు. (మత్త. 15:19) అయితే తన సేవకులు ‘హృదయశుద్ధిని ప్రేమించాలని’ యెహోవా దేవుడు కోరుతున్నాడు. (సామె. 22:11) కాబట్టి క్రైస్తవులు ఈ అంత్యకాలములో ఎలా హృదయశుద్ధిగలవారిగా ఉండవచ్చు?
‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండడమంటే ఏమిటి?
బైబిల్లో “హృదయము” ఎక్కువగా సూచనార్థక భావంలో ఉపయోగించబడింది. ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, బైబిల్లో ఉపయోగించబడిన ఆ పదం “ఒక వ్యక్తి అంతరంగాన్ని” సూచిస్తుంది, దానినే “దేవుడు గమనిస్తాడు, అక్కడే దేవునితో సంబంధం స్థిరపడుతుంది, దాని పరిస్థితినిబట్టే ఒక వ్యక్తి నైతిక ప్రవర్తన ఉంటుంది.” హృదయం మన అసలు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. పైన ప్రస్తావించబడిన గ్రంథం చెబుతున్నట్లుగా, ఈ హృదయాన్నే యెహోవా పరిశీలిస్తాడు, తన సేవకుల్లో దీనినే ఆయన విలువైనదిగా చూస్తాడు.—1 పేతు. 3:4.
బైబిల్లో ‘శుద్ధత,’ ‘పరిశుభ్రత’ అనేవి శారీరక పరిశుభ్రతను సూచించవచ్చు. అయితే ఆ పదాలు కలుషితంకాని వాటికి అంటే నైతిక, మతసంబంధ విషయాల్లో కళంకంలేని, మలినంలేని లేదా భ్రష్టుపట్టని వాటికి కూడా వర్తిస్తాయి. కొండమీది ప్రసంగంలో యేసు, “హృదయశుద్ధిగలవారు ధన్యులు” అని అన్నాడు. ఆయన అంతరంగంలో పరిశుభ్రంగా ఉన్నవారి గురించే మాట్లాడాడు. (మత్త. 5:8) వారు చూపించే ప్రేమానురాగాలు, వారి కోరికలు, ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటాయి. వారు కృతజ్ఞతతో ప్రేమతో ప్రేరేపించబడి వారు తమ పూర్ణ హృదయంతో, యథార్థంగా, నిష్కపటంగా, యెహోవాను ప్రేమిస్తారు. (లూకా 10:27) అంత స్వచ్ఛంగా ఉండాలని మీరు కూడా కోరుకోరా?
‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండడం అంత సులభం కాదు
యెహోవా సేవకుడు ‘నిర్దోషమైన చేతులతోనే’ కాదు, ‘శుద్ధమైన హృదయంతోనూ’ ఉండాలి. (కీర్త. 24:3, 4) కానీ మన కాలంలో ‘శుద్ధమైన హృదయంతో’ ఉండడం దేవుని సేవకులకు రోజురోజుకూ కష్టమైపోతుంది. సాతాను నుండే కాక, అతని అధీనంలోవున్న లోకం నుండి, మన అపరిపూర్ణ శరీరం నుండి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదురౌతున్నాయి. వీటివల్ల మనం దేవునికి దూరమయ్యే ప్రమాదముంది. ఈ ఒత్తిళ్లను ఎదిరించాలంటే, మనం ‘శుద్ధమైన హృదయాన్ని ప్రేమిస్తూ,’ ఆ ప్రేమను ఎల్లప్పుడూ కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. అలా చేస్తే మనం తప్పు చేయకుండా ఉంటూ దేవుని స్నేహితులుగా ఉండగలుగుతాం. అయితే, శుద్ధమైన హృదయాన్ని మనమెలా కాపాడుకోవచ్చు?
హెబ్రీయులు 3:12 మనల్ని ఇలా హెచ్చరిస్తోంది: “సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.” “విశ్వాసములేని” హృదయాన్ని పెంపొందించుకుంటే, మనం ‘శుద్ధమైన హృదయంతో’ ఉండలేం. దేవునిపై విశ్వాసాన్ని బలహీనపర్చే ఏ సిద్ధాంతాలను అపవాదియైన సాతాను వ్యాప్తిచేశాడు? పరిణామ సిద్ధాంతాన్ని వ్యాప్తిచేశాడు. నైతిక విషయాల్లో, మతసంబంధమైన విషయాల్లో తప్పొప్పులనేవేవీ లేవనే తలంపును వ్యాప్తిచేశాడు. బైబిలు దైవ ప్రేరేపితమైనదేనా అనే అనుమానం కూడా నాటాడు. అలాంటి ప్రమాదకరమైన సిద్ధాంతాల, ఆలోచనల ప్రభావం మనమీద పడకుండా చూసుకోవాలి. (కొలొ. 2:8) అలా చేయాలంటే, ముఖ్యంగా మనం ప్రతీరోజు బైబిలు చదివి, లోతుగా ధ్యానించాలి. అప్పుడు అలాంటి దాడులను సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. దేవుని వాక్యానికి సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానం మనకుంటే యెహోవాపట్ల మనకున్న ప్రేమ బలపడుతుంది, ఆయన వ్యవహరించే విధానం పట్ల మన అవగాహన పెరుగుతుంది. హృదయశుద్ధిగలవారిగా ఉండేలా అబద్ధ తర్కాల్ని తిప్పికొడుతూ, యెహోవాపై మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవాలంటే అలాంటి ప్రేమ, అవగాహన ఎంతో అవసరం.—1 తిమో. 1:3-5.
శరీర కోరికల విషయంలో మనమెలా ‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండాలి?
‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మనం శారీరక, వస్తుసంబంధమైన విషయాల్లో పరీక్షలను ఎదుర్కోవచ్చు. (1 యోహా. 2:15, 16) ధనం సంపాదించాలనే లేదా వస్తుసంపదల్ని కూడబెట్టుకోవాలనే కోరిక ఉన్నట్లయితే అది మన హృదయాన్ని పాడుచేస్తుంది. దానివల్ల మనం దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కొందరు తమ పనిస్థలంలో నిజాయితీలేని వారిగా తయారయ్యారు, ఇతరులను మోసగించారు లేదా పరుల డబ్బును లేక వస్తువుల్ని సహితం దొంగిలించారు.—1 తిమో. 6:9, 10.
అయితే, యెహోవాకు ఇష్టంలేని పనులు చేయకూడదనే భక్తిపూర్వక భయాన్ని పెంపొందించుకొని, న్యాయాన్ని ప్రేమిస్తూ మంచి మనస్సాక్షితో ఉండాలని నిర్ణయించుకోవాలి. అలా చేయడం ద్వారా మనం “హృదయశుద్ధిని” ప్రేమిస్తున్నామని చూపిస్తాం. ఆ ప్రేమ ఉంటే మనం ఎల్లప్పుడూ ‘అన్ని విషయాల్లో యోగ్యముగా’ లేదా నిజాయితీగా ప్రవర్తిస్తాం. (హెబ్రీ. 13:18) మనం నీతిగా, నిజాయితీగా ప్రవర్తించడంవల్ల ఇతరులకు చక్కని సాక్ష్యమివ్వగలుగుతాం. ఇటలీలో ఎమీల్యో అనే సాక్షి ఓ ప్రజా రవాణా కంపెనీలో డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఓ సందర్భంలో ఆయనకు ఒక పర్సు దొరికింది, అందులో 470 యూరోలు (దాదాపు 34,310 రూపాయలు) ఉన్నాయి. ఆయన ఆ పర్సును తన పైఅధికారికి ఇచ్చాడు, దీన్ని చూసి ఆయన తోటి ఉద్యోగులు చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ అధికారి దాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చాడు. ఎమీల్యో తోటి ఉద్యోగుల్లో కొందరు ఆయన ప్రవర్తనను బట్టి ఎంతగా ముగ్ధులయ్యారంటే, వాళ్లు బైబిలుపై ఆసక్తి కనబర్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టారు. ఫలితంగా, రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు సత్యంలోకి వచ్చారు. అవును, హృదయశుద్ధిని బట్టి మనం నిజాయితీగా ప్రవర్తిస్తే, దాన్ని చూసి ఇతరులు దేవుణ్ణి స్తుతించే అవకాశం ఉంది.—తీతు 2:9, 10.
మరో విషయం కూడా ఒక క్రైస్తవుని హృదయశుద్ధిని పాడుచేయగలదు. అది లైంగికత విషయంలో వక్రీకరించబడిన, చెడు అభిప్రాయాన్ని కలిగివుండడమే. పెళ్లికి ముందే లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వివాహేతర సంబంధాలు, సలింగ సంయోగం వంటివి సాధారణమే అని చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి అభిప్రాయం క్రైస్తవుల హృదయాన్ని పాడుచేస్తుంది. లైంగిక దుర్నీతికి పాల్పడే వ్యక్తి తన పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ వేషధారణతో ద్వంద జీవితం జీవించే అవకాశం ఉంది. అలాంటి జీవితం “హృదయశుద్ధికి” అద్దం పట్టదు.
గాబ్రీయేలీ 15 ఏళ్ల వయసులోనే బాప్తిస్మం తీసుకొని, వెంటనే పయినీరు సేవ మొదలుపెట్టాడు. కానీ ఆ తర్వాత ఆయన నైట్క్లబ్బుల్లో చెడు స్నేహితులతో జల్సా చేయడం మొదలుపెట్టాడు. (కీర్త. 26:4) దానితో ఆయన అనైతిక జీవితాన్ని గడుపుతూ వేషధారుడిలా జీవించడం ఆరంభించాడు. ఆ కారణంగా చివరకు క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించబడ్డాడు. యెహోవా ఇచ్చిన ఆ క్రమశిక్షణ ఆయనను తీవ్రంగా ఆలోచించేలా చేసింది. గాబ్రీయేలీ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “నేను గతంలో ప్రాముఖ్యతనివ్వని అనేక విషయాలను చేయడం మొదలుపెట్టాను. ప్రతీరోజు బైబిలు చదువుతూ, యెహోవా ఏమి చెబుతున్నాడో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, దైవపరిపాలనా ప్రచురణలన్నీ జాగ్రత్తగా అధ్యయనం చేశాను. వ్యక్తిగత అధ్యయనం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, ఎంత సంతృప్తినిస్తుందో గ్రహించాను. బైబిలును చదివి పట్టుదలతో ప్రార్థించడంవల్ల సరైనది చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని ఎంతగా పొందవచ్చో తెలుసుకున్నాను.” అలా, గాబ్రీయేలీ తన అనైతిక ప్రవర్తనను విడిచిపెట్టి యెహోవాతో తన సంబంధాన్ని బాగుచేసుకున్నాడు.
గాబ్రీయేలీ ఇప్పుడు తన భార్యతో కలిసి మళ్లీ ఒక పయినీరుగా సేవచేస్తున్నాడు. బైబిలును, “నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు” అందిస్తున్న ప్రచురణల్ని అధ్యయనం చేయడంవల్ల ఒక వ్యక్తి తన హృదయాన్ని శుద్ధి చేసుకుని, అనైతికతను విడిచిపెట్టగలుగుతాడని ఆయన అనుభవం చూపిస్తోంది.—మత్త. 24:45; కీర్త. 143:10.
కష్టాలు వచ్చినప్పుడు ‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండండి
వ్యతిరేకుల ఒత్తిళ్ల వల్ల, ఆర్థిక ఇబ్బందులవల్ల, తీవ్ర అనారోగ్యం వల్ల కొంతమంది దేవుని సేవకులు నిరుత్సాహపడ్డారు. కొన్ని సందర్భాల్లో అవి వారి హృదయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. దావీదు రాజుకు కూడా అలాంటి పరిస్థితి తప్పలేదు. “నా ఆత్మ నాలో క్రుంగియున్నది నాలో నా హృదయము విస్మయమొందెను” అని ఆయన రాశాడు. (కీర్త. 143:4) అలాంటి కష్ట పరిస్థితుల్ని ఆయనెలా అధిగమించగలిగాడు? యెహోవా తన సేవకులకు ఎలా సహాయం చేశాడో, అలాగే తననెలా రక్షించాడో గుర్తుచేసుకున్నాడు. యెహోవా తన ఘనమైన నామం కోసం ఏమి చేశాడో ధ్యానించాడు. దేవుని సృష్టి కార్యాల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. (కీర్త. 143:5) మనం కూడా అదేవిధంగా మన సృష్టికర్త గురించి, ఆయన మనకోసం ఇప్పటికే చేసిన పనుల గురించి, ప్రస్తుతం చేస్తున్న పనుల గురించి ధ్యానిస్తే, మనకు కష్టాలు వచ్చినా వాటిని సహించగలుగుతాం.
మనకెవరైనా అన్యాయం చేసినప్పుడు లేదా చేశారని మనకు అనిపించినప్పుడు మనం బాధపడవచ్చు. ఆ విషయం గురించే పదేపదే ఆలోచిస్తే మన సహోదరులపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. మనం ఇతరులకు దూరంగావుంటూ వారి గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ మనం ‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండాలని కోరుకుంటే మనమలా ప్రవర్తిస్తామా? మనకలాంటి హృదయ పరిస్థితి ఉండాలంటే, మనం మన క్రైస్తవ సహోదరులతో వ్యవహరించే విషయంలో, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు స్పందించే తీరు విషయంలో జాగ్రత్త వహించాలి.
నిజ క్రైస్తవులముగా మనం ‘హృదయశుద్ధిగలవారిగా’ ఉండేందుకు ఇష్టపడతాం కాబట్టి అంతకంతకూ భ్రష్టుపడుతున్న, నైతికంగా దిగజారుతున్న ఈ లోకంలో ప్రత్యేకంగా కనబడతాం. దేవుడు ఇష్టపడే పనులు చేయడంవల్ల మనశ్శాంతిని అనుభవిస్తాం. అది మన జీవితాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అన్నిటికన్నా మిన్నగా మనం “శుద్ధహృదయులను” ప్రేమించే మన సృష్టికర్త అయిన యెహోవా దేవునికి దగ్గరి స్నేహితులం అవుతాం. (కీర్త. 73:1) ‘శుద్ధహృదయాన్ని’ ప్రేమించేవారికి యెహోవా సహాయం చేస్తున్నప్పుడు యేసు వాగ్దానం చేసినట్లే వారు ‘దేవుణ్ణి చూస్తారు.’ ఆ కారణంగా వారు సంతోషంగా ఉంటారు. హృదయశుద్ధిగలవారిగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం.—మత్త. 5:8.