పాఠకుల ప్రశ్నలు
‘తండ్రి దోష శిక్షను కుమారుడు మోయడు’ అని యెహెజ్కేలు 18:20 చెబుతుంటే, యెహోవా ‘తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించును’ అని నిర్గమకాండము 20:5 చెబుతోంది. మరి ఈ రెండు లేఖనాలు పరస్పర విరుద్ధంగా లేవా?
లేవు. ఓ వ్యక్తి తాను చేసిన వాటికి వ్యక్తిగతంగా లెక్క అప్పజెప్పడం గురించి ఒక లేఖనం చెబుతుంటే మరో లేఖనం, ఓ వ్యక్తి చేసే తప్పిదం వల్ల వారి వంశస్థులు చెడు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి రావచ్చనే వాస్తవాన్ని నొక్కిచెబుతోంది.
యెహెజ్కేలు 18వ అధ్యాయంలోని సందర్భాన్నిబట్టి చూస్తే అది ఓ వ్యక్తి వ్యక్తిగతంగా లెక్క అప్పజెప్పడాన్ని నొక్కిచెబుతోందని తెలుస్తోంది. “పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును” అని 4వ వచనం చెబుతోంది. “ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను” అనుసరిస్తున్నట్లయితే ఏమి జరుగుతుంది? “వాడు బ్రదుకును.” (యెహె. 18:5, 9) ఒక వ్యక్తి తాను చేసినవాటికి లెక్క అప్పజెప్పే వయసు వచ్చినప్పుడు తన “ప్రవర్తననుబట్టి వానికి” శిక్ష విధించబడుతుంది.—యెహె. 18:30.
లేవీయుడైన కోరహు ఉదాహరణను చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణిస్తున్న సమయంలో, తనకున్న సేవాధిక్యతల విషయంలో కోరహు అసంతృప్తి చెందాడు. కోరహుతోపాటు మరికొందరు, యాజకత్వాన్ని ఆశించి యెహోవా ప్రతినిధులైన మోషే, అహరోనులకు ఎదురుతిరిగారు. తమకు అర్హత లేకపోయినా గర్వంతో యాజకత్వాన్ని ఆశించినందుకు యెహోవా కోరహుకు, అతనితో చేయికలిపిన తిరుగుబాటుదారులకు మరణశిక్ష విధించాడు. (సంఖ్యా. 16:8-11, 31-33) అయితే కోరహు కుమారులు మాత్రం తమ తండ్రితో చేతులు కలపలేదు. వాళ్ల తండ్రి చేసిన పాపానికి దేవుడు వారిని బాధ్యులనుగా చేయలేదు. యెహోవాకు నమ్మకంగా ఉన్నందువల్ల వారు తమ ప్రాణాల్ని దక్కించుకున్నారు.—సంఖ్యా. 26:10, 11.
మరి, పది ఆజ్ఞల్లో భాగంగావున్న, నిర్గమకాండము 20:5 లోని హెచ్చరిక మాటేమిటి? ఇక్కడ కూడా మనం సందర్భాన్ని చూద్దాం. యెహోవా ఇశ్రాయేలు జనాంగంతో ధర్మశాస్త్ర నిబంధన గురించి చెప్పాడు. ఆ నిబంధనలో ఉన్న షరతులన్నీ విన్న తర్వాత ఇశ్రాయేలీయులు, “యెహోవా చెప్పినదంతయు చేసెదము” అని బహిరంగంగా ఒప్పుకున్నారు. (నిర్గ. 19:5-8) అలా ఇశ్రాయేలు జనాంగమంతా యెహోవాతో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి, నిర్గమకాండము 20:5 లోని మాటలు ముఖ్యంగా ఆ జనాంగమంతటినీ ఉద్దేశించి చెప్పబడ్డాయి.
యెహోవాకు నమ్మకంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఎన్నో ప్రయోజనాలు, ఆశీర్వాదాలు పొందారు. (లేవీ. 26:3-8) కానీ, వారు యెహోవాను విడిచిపెట్టి అన్యదేవతలను పూజించినప్పుడు యెహోవా తన ఆశీర్వాదాన్ని, సంరక్షణను వారినుండి తీసివేశాడు. దాంతో ఆ జనాంగం కష్టాలపాలైంది. (న్యాయా. 2:11-18) ఆ జనాంగం విగ్రహారాధన చేస్తున్నప్పటికీ, వారిలో కొందరు యథార్థంగా ఉంటూ దేవుని ఆజ్ఞలను పాటించిన మాట వాస్తవమే. (1 రాజు. 19:14, 18) జనాంగం చేసిన పాపాల వల్ల బహుశా దేవుని నమ్మకమైన సేవకులు కొన్ని కష్టాలను ఎదుర్కొనివుంటారు. కానీ, యెహోవా వారిపై తన ప్రేమను, దయను చూపించాడు.
ఇశ్రాయేలీయులు యెహోవా సూత్రాలను ఘోరంగా ఉల్లంఘించి అన్యజనాంగాల మధ్య ఆయన నామానికి అపకీర్తిని తెచ్చినప్పుడు, వారు బబులోనుకు చెరగా కొనిపోబడేందుకు అనుమతించడం ద్వారా యెహోవా వారిని శిక్షించాలనుకున్నాడు. ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులను, అలాగే ఓ జనాంగంగా తన ప్రజల్ని శిక్షించాలనుకున్నాడు. (యిర్మీ. 52:3-11, 27) ఇశ్రాయేలీయులు ఎంతగా పాపం చేశారంటే, నిర్గమకాండము 20:5 చెబుతున్నట్లుగా వారి పాపాలవల్ల మూడు, నాలుగు లేక బహుశా అంతకన్నా ఎక్కువ తరాలే చెడు పర్యవసానాలను అనుభవించారు.
తల్లిదండ్రుల చెడు ప్రవర్తన వల్ల కుటుంబంలోని సభ్యులు చెడు పర్యవసానాలను ఎదుర్కొన్న సందర్భాల గురించి కూడా బైబిలు చెబుతోంది. అనైతిక జీవితాన్ని గడుపుతున్న ‘మిక్కిలి దుర్మార్గులైన’ తన కుమారులను ఏలీ యాజకులుగా కొనసాగనిచ్చి యెహోవాకు చాలా కోపం తెప్పించాడు. (1 సమూ. 2:12-16, 22-25) ఏలీ యెహోవాకన్నా తన కుమారులనే గొప్పగా ఎంచాడు కాబట్టి ఆయన వంశస్థులు ఇక ప్రధాన యాజకులుగా ఉండరని యెహోవా చెప్పాడు. యెహోవా చెప్పినట్లే, ఏలీ మునిమనుమడైన అబ్యాతారు నుండి ఆయన వంశస్థుల్లో ఎవ్వరూ ప్రధాన యాజకులుగా పనిచేయలేదు. (1 సమూ. 2:29-36; 1 రాజు. 2:27) నిర్గమకాండము 20:5 లోని సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి గేహజీ ఉదాహరణ కూడా సహాయం చేస్తుంది. సిరియా సైన్యాధిపతియైన నయమానును ఎలీషా బాగుచేసినప్పుడు, దాని నుండి వస్తుపరమైన లాభాన్ని పొందేందుకు గేహజీ ఎలీషా సేవకుడిగా తనకున్న స్థానాన్ని దుర్వినియోగం చేశాడు. ఎలీషా ద్వారా యెహోవా ఆయనకు ఇలా తీర్పు తీర్చాడు: “నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును.” (2 రాజు. 5:20-27) కాబట్టి, గేహజీ చేసిన తప్పువల్ల ఆయన వంశస్థులు కూడా బాధలను అనుభవించారు.
సృష్టికర్తగా, జీవదాతగా ఏ శిక్ష న్యాయమైనదో, సరైనదో నిర్ణయించే సంపూర్ణాధికారం యెహోవాకు ఉంది. పిల్లలు లేక వంశస్థులు తమ పూర్వీకుల పాపాల వల్ల చెడు పర్యవసానాలు అనుభవించాల్సి రావచ్చని పై ఉదాహరణలు చూపిస్తున్నాయి. అయితే, యెహోవా “దీనుల మొఱ్ఱను” ఆలకిస్తాడు. సహాయం కోసం పట్టుదలతో తనకు ప్రార్థించేవారు ఆయన అనుగ్రహాన్ని, కొంత ఉపశమనాన్ని పొందవచ్చు.—యోబు 34:28.
[29వ పేజీలోని చిత్రం]
కోరహు, అతనితో చేతులు కలిపిన తిరుగుబాటుదారులు తమ పాపానికి లెక్క అప్పజెప్పాల్సి వచ్చింది