త్వరలోనే అందమైన భూమిపై ఆనందభరితమైన జీవితం!
“పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” —మత్తయి 6:9, 10.
పరలోక ప్రార్థన లేదా ప్రభువు ప్రార్థన అని పిలువబడే ఈ సుపరిచిత ప్రార్థన మానవజాతిలో ఒక ఆశను చిగురింపజేస్తుంది. ఎలా?
ప్రభువు ప్రార్థన వెల్లడిచేస్తున్నట్లుగా, దేవుని రాజ్యం ఇప్పుడు పరలోకంలో దేవుడు కోరుకున్నరీతిగా జరుగుతున్నట్లే భూమిపై కూడా జరిగేటట్లు చేస్తుంది. మానవులు మళ్ళీ అందమైన భూమిపై ఆనందంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. (ప్రకటన 21:1-5) దేవుని రాజ్యమంటే ఏమిటి, అది మళ్ళీ అందమైన భూమిపై మానవులు ఆనందంగా జీవించేలా ఎలా చేస్తుంది?
నిజమైన ప్రభుత్వం
దేవుని రాజ్యం ఒక నిజమైన ప్రభుత్వం. ఏ ప్రభుత్వం పనిచేయాలన్నా దానికి పాలకులు, నియమ నిబంధనలు, పౌరులు ఉండాలి. దేవుని రాజ్యంలో పాలకులు, పౌరులు ఉంటారా, దానిలో నియమ నిబంధనలుంటాయా? ఈ క్రింద ఇవ్వబడిన మూడు ప్రశ్నలకు బైబిలిచ్చే సమాధానాలను గమనించండి:
దేవుని రాజ్యానికి పాలకులెవరు? (యెషయా 33:22) యెహోవా దేవుడు రాజ్యాన్ని పర్యవేక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును నియమించాడు. (మత్తయి 28:18) యెహోవా నిర్దేశం ప్రకారం యేసు, ‘ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాటలాడువారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి,’ కొంతమందిని ఎన్నుకున్నాడు, వీరు ఆయనతోపాటు ‘భూమిపై’ రాజులుగా పరిపాలిస్తారు.—ప్రకటన 5:9, 10.
దేవుని రాజ్య పౌరులు ఏ నియమ నిబంధనలను పాటించాలని అది నిర్ణయించింది? కొన్ని నియమ నిబంధనల ప్రకారం లేక ఆజ్ఞల ప్రకారం దాని పౌరులు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఆ నియమ నిబంధనల్లో అత్యంత ప్రాముఖ్యమైనదాన్ని యేసు ఇలా పేర్కొన్నాడు, ‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.’—మత్తయి 22:37-39.
ఇతర నియమ నిబంధనల ప్రకారం, దేవుని రాజ్య పౌరులు కొన్ని పనులు చేయకూడదు. ఉదాహరణకు, బైబిలు స్పష్టంగా ఇలా తెలియజేస్తోంది, “మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలకు, మగవాళ్ళతో మగవాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకునేవాళ్ళకు, దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు దేవుని రాజ్యం దొరకదు.”—1 కొరింథీయులు 6:9, 10, ఈజీ-టు-రీడ్ వర్షన్.
దేవుని రాజ్యంలో పౌరులెవరు? దేవుని రాజ్యంలో పౌరులుగా ఉండేవారిని యేసు గొర్రెలతో పోల్చాడు. ఆయనిలా చెప్పాడు, “అవి నా మాట వింటాయి. అప్పుడు అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు.” (యోహాను 10:16, ఈజీ-టు-రీడ్ వర్షన్) దేవుని రాజ్యంలో పౌరునిగా ఉండాలంటే ఒక వ్యక్తి తాను కేవలం మంచి కాపరియైన యేసును అనుసరిస్తున్నానని చెప్పుకోవడమే కాదు ఆయనిచ్చిన ఆజ్ఞలను పాటించాలి. యేసు ఇలా చెప్పాడు, “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.”—మత్తయి 7:21.
కాబట్టి, దేవుని రాజ్యంలో పౌరులుగా ఉండేవారు యేసు చేసినట్లే దేవుడైన యెహోవా పేరు ఉపయోగించి, దానిని ఘనపరుస్తారు. (యోహాను 17:26) “ఈ రాజ్య సువార్త” ఇతరులకు ప్రకటించాలని యేసు ఇచ్చిన ఆజ్ఞకు వారు విధేయత చూపిస్తారు. (మత్తయి 24:14; 28:19, 20) అంతేగాక, వారు ఒకరిపట్ల ఒకరు నిజమైన ప్రేమ కలిగివుంటారు.—యోహాను 13:35.
‘భూమిని నాశనం చేసేవారిపైకి నాశనాన్ని’ తీసుకురావడం
ఈ భూమిపై గమనార్హ మైన మార్పులను తీసుకురావడానికి దేవుని రాజ్యం త్వరలో చర్య తీసుకుంటుందని ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు సూచిస్తున్నాయి. అది మనకెలా తెలుసు? రెండువేల సంవత్సరాల క్రితం, “దేవుని రాజ్యము సమీపమాయెను” అని తెలియజేసే ఎన్నో అంశాలున్న ఒక సూచనను యేసు వర్ణించాడు. (లూకా 21:31) ముందటి ఆర్టికల్‌లో చూపించబడినట్లుగా, ఆ సూచనలోని అనేక అంశాలు నేడు ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత ఏమి జరుగుతుంది? యేసు ఇలా జవాబిచ్చాడు, “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.” (మత్తయి 24:21) ఇది మానవుల మూలంగా కలిగే నాశనం కాదు కానీ ‘భూమిని నశింపజేసేవారిని నశింపజేయడానికి’ దేవుడు చర్య తీసుకోవడం మూలంగా కలిగే నాశనం. (ప్రకటన 11:18) తమ స్వార్థపూరిత చర్యలతో భూమి నశించిపోయేలా చేస్తున్న దుష్ట మానవులు “దేశములో” అంటే భూమ్మీద ‘ఉండకుండా నిర్మూలం చేయబడతారు.’ అయితే, నిర్దోషులు అంటే దేవునికి అంగీకారమైన విధంగా ఆయన సేవచేసేవారు “దానిలో నిలిచియుందురు.”—సామెతలు 2:21, 22.
అలాంటి తీవ్రమైన చర్య తీసుకునేందుకు యెహోవా దేవునికి సరైన కారణాలే ఉన్నాయి. ఎందుకు? ఈ ఉపమానాన్ని పరిశీలించండి: మీకొక చిన్న అపార్టుమెంటు భవనం ఉందనుకోండి. దానిలో అద్దెకుంటున్నవారిలో కొంతమంది మంచి ప్రవర్తనగలవారు, ఇతరులపట్ల శ్రద్ధగలవారు; వారు అద్దె కడుతూ తమ ఇంటిని మంచి స్థితిలో ఉంచుకుంటున్నారు. కానీ మరికొంతమంది గొడవలు పడేవారు, స్వార్థపరులు; అద్దె కట్టకుండా ఇంటిని పాడుచేస్తున్నారు. పదేపదే హెచ్చరించినా పట్టించుకోకుండా తమ ప్రవర్తనను మార్చుకోవడంలేదు. ఇంటి యజమానిగా మీరేం చేస్తారు? ఆ చెడ్డవారిని ఖాళీ చేయిస్తారు.
అలాగే భూమిని, దానిలోవున్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా యెహోవా దేవునికి, ఈ భూగ్రహంపై ఎవరిని జీవించడానికి అనుమతించాలో నిర్ణయించే హక్కు ఉంది. (ప్రకటన 4:10, 11) తాను కోరేవిధంగా జీవించని, ఇతరుల హక్కులను కాలరాసే దుష్ట ప్రజలను ఈ భూమిపై నుండి నిర్మూలించాలన్నది తన ఉద్దేశమని యెహోవా చెప్పాడు.—కీర్తన 37:9-11.
మళ్ళీ అందమైన భూమిపై ఆనందభరితమైన జీవితం
త్వరలో దేవుని రాజ్యం భూమిని పరిపాలిస్తుంది, దానికి యేసుక్రీస్తు రాజు. యేసు ఈ క్రొత్త ఆరంభాన్ని “క్రొత్త ప్రపంచం” అని పిలిచాడు. (మత్తయి 19:28, ఈజీ-టు-రీడ్ వర్షన్) అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? బైబిల్లోని ఈ వాగ్దానాలను పరిశీలించండి:
కీర్తన 46:9. “ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”
యెషయా 35:1. “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును.”
యెషయా 65:21-23. “నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు, ఆకస్మిముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు.”
యోహాను 5:28, 29. ‘ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు యేసు శబ్దము విని బయటికి వచ్చెదరు.’
ప్రకటన 21:4. ‘దేవుడు వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.’
నమ్మడానికి కారణాలు
బైబిలు చేసే వాగ్దానాలను మీరు నమ్ముతున్నారా? చాలామంది నమ్మరని బైబిలు ముందే తెలియజేసింది. అదిలా చెబుతోంది, ‘అంత్యదినములలో అపహాసకులు వచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,—ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురు.’ (2 పేతురు 3:3, 4) కానీ అలాంటి అపహాసకులు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. బైబిలు చెబుతున్నదానిని మీరు ఎందుకు నమ్మవచ్చో చూపించే కేవలం నాలుగు కారణాలను పరిశీలించండి:
(1) గతంలో దేవుడు భూ సంబంధ విషయాల్లో చర్య తీసుకున్నాడు. నోవహు కాలంలో సంభవించిన జలప్రళయం దానికొక విశేషమైన ఉదాహరణ.—2 పేతురు 3:5-7.
(2) ప్రస్తుత భూవ్యాప్త పరిస్థితుల గురించి దేవుని వాక్యం నిర్దిష్టంగా ముందే తెలియజేసింది.
(3) సమస్తము “సృష్టి ఆరంభముననున్నట్టే” కొనసాగడం లేదు. చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇప్పుడు ఈ భూగ్రహం సామాజికంగా, నైతికంగా, పర్యావరణపరంగా క్షీణించిపోతోంది.
(4) త్వరలోనే “అంతము వచ్చును” అని సూచిస్తూ “ఈ రాజ్య సువార్త” భూవ్యాప్తంగా ప్రకటించబడుతోంది.—మత్తయి 24:14.
దేవుని రాజ్య పాలనలో శాశ్వతంగా జీవించడం గురించి మరింత ఎక్కువగా తెలుసుకునేందుకు దేవుని వాక్యమైన బైబిలును అధ్యయనం చేయమని యెహోవాసాక్షులు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. (యోహాను 17:3) నిజంగానే, మానవజాతి కోసం అద్భుతమైన భవిష్యత్తు వేచివుంది. త్వరలోనే ఎంతో మంచి కాలాలు రాబోతున్నాయి! మీరు అలాంటి కాలాల్లో జీవిస్తారా? (w08 8/1)
[7వ పేజీలోని బ్లర్బ్]
రిస్థితులు ఇంతవరకు ఎలా ఉన్నాయో అలాగే కొనసాగుతాయని చెప్పేవారు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు
[8వ పేజీలోని చిత్రం]
మీరు ఇలాంటి కాలాల్లో జీవిస్తారా?