యూగరీట్ బయలు నీడనున్న ఒక ప్రాచీన నగరం
సిరియా దేశస్థుడైన ఒక రైతు నాగలి 1923వ సంవత్సరంలో, ప్రాచీన మట్టిపాత్రలున్న ఒక సమాధి మీది రాతికి తగిలింది. తాను కనుగొన్నదెంత ప్రాముఖ్యమో అతడు ఊహించి ఉండకపోవచ్చు. అనుకోకుండా లభించిన దీని గురించి విన్న ఫ్రాన్సు పురావస్తుశాస్త్ర బృందం ఒకటి క్లాడ్ షాఫేర్ నాయకత్వం క్రింద తర్వాతి సంవత్సరమే అక్కడికి వెళ్ళింది.
కొద్ది సమయంలోనే వాళ్ళు ఒక స్మారక చిహ్నాన్ని కనుగొన్నారు, అది తాపీలతో వారు వెలికి తీస్తున్న శిథిలాలను గుర్తించడానికి వాళ్ళకు సహాయం చేసింది. అది యూగరీట్, “సమీప-ప్రాచ్య ప్రాంతాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ప్రాచీన నగరాల్లో ఒకటి.” బారీ హోబర్‌మాన్ అనే రచయిత చివరికిలా అన్నాడు: “బైబిలును అర్థం చేసుకోవడంపై ఇది చూపించినంత ప్రభావాన్ని ఏ పురావస్తు ఆవిష్కరణలూ చివరికి మృత సముద్ర గ్రంథపు చుట్టలు సహితం చూపించలేక పోయాయి.”—ది అట్లాంటిక్ మంత్లీ.
రహదారి కూడలి
మధ్యధరా తీరాన, ఇప్పుడు ఉత్తర సిరియా ప్రాంతంలో, రాస్ షామ్రా అని పిలువబడుతున్న మట్టిరాళ్ళ దిబ్బగల స్థలంలో ఒకప్పుడున్న యూగరీట్ సా.శ.పూ. రెండవ సహస్రాబ్దిలో వర్ధిల్లుతున్న ఒక కాస్మోపాలిటన్ నగరం. దాని పాలిత ప్రాంతం ఉత్తరాన కేసీస్ పర్వతం నుండి దక్షిణాన టెల్ సూకస్ వరకు దాదాపు 60 కిలోమీటర్లు, పశ్చిమాన మధ్యధరా నుండి తూర్పున ఒరాన్‌టీజ్ లోయ వరకు 30 నుండి 45 కిలోమీటర్లు విస్తరించి ఉండేది.
సమశీతోష్ణ వాతావరణం గల యూగరీట్‌లో పశుసంపద వర్ధిల్లేది. ఆ ప్రాంతంలో ధాన్యం, ఆలివ్ నూనె, ద్రాక్షారసం, కలప ఉత్పత్తి చేయబడేవి, మెసపొటేమియా, ఐగుప్తులలో కలప అస్సలు లభించేదికాదు. అంతేగాక, ఆ నగరం ప్రాముఖ్యమైన వాణిజ్య మార్గాల కూడలిలో నెలకొని ఉండడంతో అది మొట్టమొదటి పెద్ద అంతర్జాతీయ ఓడరేవుల్లో ఒకటయ్యింది. ఏజియన్, అనటోలియా, బబులోను, ఐగుప్తు, మధ్య ప్రాచ్యానికి చెందిన ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వర్తకులు యూగరీట్ వద్ద లోహాలు, వ్యవసాయ ఉత్పత్తులు, స్థానికంగా ఉత్పత్తి చేయబడిన అనేక వస్తువులతో వర్తకం చేసేవారు.
యూగరీట్ వస్తుపరంగా వర్ధిల్లుతున్నా అదెప్పుడూ సామంత రాజ్యంగానే ఉంది. ఈ నగరం సా.శ.పూ. 14వ శతాబ్దంలో లౌకిక హిత్తీయుల సామ్రాజ్యంలో ఒక భాగమయ్యేంత వరకు ఐగుప్తు సామ్రాజ్యానికి ఉత్తరంవైపు చివరి రక్షణస్థావరంగా ఉంది. యూగరీట్ కప్పం చెల్లించమని, పాలనా విభాగానికి సైనికులను పంపమని బలవంతం చేయబడేది. దాడి చేస్తున్న “సముద్ర వాసులు”a అనటోలియాను (మధ్య టర్కీ), ఉత్తర సిరియాను కొల్లగొట్టడం ప్రారంభించినప్పుడు, తమకు సైనికులను, యుద్ధనౌకాదళాలను పంపమని హిత్తీయులు యూగరీట్‌ను కోరారు. దానితో యూగరీట్ రక్షణ కొరవడి దాదాపు సా.శ.పూ. 1200లో పూర్తిగా నాశనం చేయబడింది.
గతాన్ని పునరుద్ధరించడం
యూగరీట్ నాశనం కావడంతో ఆ స్థలం 60 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు 20 మీటర్ల ఎత్తైన మట్టిరాళ్ళ దిబ్బగా ఏర్పడింది. ఈ స్థలంలో కేవలం ఆరింట ఒక వంతు మాత్రమే త్రవ్వకాలు జరిగాయి. ఆ శిథిలాల్లో, ఇంచుమించు 10,000 చదరపు మీటర్ల భూభాగంలో దాదాపు వంద గదులు, ఆవరణలు ఉన్న ఒక పెద్ద రాజభవన సముదాయపు శిథిలశేషాలను పురావస్తుశాస్త్రజ్ఞులు వెలికి తీశారు. ఆ భవన సముదాయంలో నిరంతర నీటి సరఫరా, స్నానాల గదులు, మురుగునీరుపోయే ఏర్పాట్లు ఉన్నాయి. కొయ్య సామాగ్రిపై బంగారం, నీలి వర్ణపు ప్రశస్తమైన రాళ్ళు, దంతం పొదగబడ్డాయి. చిత్రమైన రీతిలో చెక్కబడిన దంతపు ఫలకాలు కనుగొనబడ్డాయి. చుట్టూ ప్రహరీ గోడవున్న ఉద్యానవనం, దానిలోవున్న కొలను రాజభవన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేశాయి.
ఆ నగరంలోనూ దాని పరిసర మైదానాల్లోనూ బయలు దాగోనుల ఆలయాలున్నాయి.b బహుశా 20 మీటర్ల ఎత్తుండే ఈ ఆలయ గోపురాల్లో దేవుని విగ్రహముండే లోపలి గదిలోకి దారితీసే కుహరిక ఉండేది. మెట్ల మీదుగా పైకప్పు మీదికి వెళ్ళడం సాధ్యమయ్యేది, అక్కడ జరిగే వివిధ వేడుకలకు రాజు అధ్యక్షత వహించేవాడు. రాత్రుల్లో లేదా తుఫానుల సమయంలో ఓడలు సురక్షితంగా రేవుకు చేరుకోవడానికి మార్గనిర్దేశాన్నిస్తూ ఆలయ శిఖరాగ్రం మీద దీపాలు వెలిగించబడి ఉండవచ్చు. తుఫాను దేవుడైన బయలు-హదాదు ఆవరణంలో 17 రాతి లంగరులు దొరికాయి, తాము సురక్షితంగా తిరిగి రావడానికి కారణం ఆ దేవుడేనని విశ్వసిస్తూ ఆయనకు తాము చేసుకున్న మొక్కు తీర్చుకోవడానికి నావికులు వాటిని నిస్సందేహంగా అర్పించివుంటారు.
స్మారక చిహ్నాల అమూల్య సంపద
యూగరీట్ శిథిలాల్లో వేలాది మట్టి పలకలు కనుగొనబడ్డాయి. ఐదు రకాల లిపిలో వ్రాయబడిన ఎనిమిది భాషల్లో ఆర్థికపరమైన, చట్టపరమైన, రాజకీయ సంబంధమైన, కార్యనిర్వహణ సంబంధిత మూలపాఠాలు దొరికాయి. షాఫేర్ బృందం ఇంతవరకు తెలియని—యూగరీట్ అని పేరు పెట్టబడిన—భాషలో ఉన్న మట్టి పలకలను కూడా కనుగొన్నది, దానిలో 30 కీల లిపి గుర్తులు ఉపయోగించబడ్డాయి, ఇంతవరకు కనుగొనబడిన అతి ప్రాచీన అక్షరమాలలో అది ఒకటి.
యూగరీట్ దస్తావేజుల్లో అనుదిన విషయాలు మాత్రమే గాక, ఆ కాలానికి చెందిన మత సంబంధమైన భావనలు, ఆచారాలు తెలుసుకొనే క్రొత్త మార్గాన్ని తెరిచిన సాహిత్యపరమైన అంశాలు కూడా ఉన్నాయి. యూగరీట్‌లోని మతం, దాని పొరుగునున్న కనానీయుల మతంతో ఎంతో సారూప్యాన్ని కలిగివున్నట్లు అనిపిస్తోంది. రోలాండ్ డె వో అభిప్రాయం ప్రకారం, ఈ మూలపాఠాలు “ఇశ్రాయేలీయులు ఇక జయించడానికి ముందున్న కాలంలో కనానులో ఉన్న నాగరికతను చక్కగా ప్రతిబింబిస్తాయి.”
బయలు నగరంలో మతం
రాస్ షామ్రా మూలపాఠాల్లో 200 కంటే ఎక్కువమంది దేవతలు, దేవుళ్ళు పేర్కొనబడ్డారు. దేవతలకు, మానవునికి జనకుడని పిలువబడే ఎల్ ప్రముఖ దేవుడు. తుఫాను దేవత అయిన బయలు-హదాదు “మేఘ వాహకుడు,” “భూపతి.” ఎల్ మానవజాతికి దూరంగా ఉన్న జ్ఞానవంతుడైన, తెల్లని గెడ్డంవున్న వృద్ధునిగా వర్ణించబడ్డాడు. మరో వైపున బయలు, ఇతర దేవతలపై, మానవజాతిపై పరిపాలన చేయాలని కోరుకునే శక్తివంతమైన, అధికార కాంక్షగల దేవుడు.
కనుగొనబడిన మూలపాఠాలు బహుశా నూతన సంవత్సరం లేదా కోతకాలం వంటి మతసంబంధమైన పండుగల సమయాల్లో వల్లించబడేవై ఉండవచ్చు. అయితే, ఖచ్చితమైన భావం మాత్రం స్పష్టంగా లేదు. పరిపాలన సంబంధంగా తలెత్తిన వివాదాన్ని గురించిన ఒక పద్యంలో, ఎల్ ప్రియ కుమారుడు సముద్ర దేవుడు అయిన యామ్‌ను బయలు ఓడిస్తాడు. ఈ విజయం, యూగరీట్ నావికులకు బయలు తమను సముద్రంలో కాపాడతాడన్న నమ్మకాన్ని ఇచ్చివుండవచ్చు. మాట్‌తో జరిగిన ఒక పోరాటంలో బయలు పరాజయం పొంది పాతాళానికి దిగుతాడు. దానితో కరవు ఏర్పడి, మానవ కార్యకలాపాలు ఆగిపోతాయి. ప్రణయానికి, యుద్ధానికి దేవతైన బయలు భార్య, సహోదరియైన అనాట్ మాట్‌ను చంపి బయలును సజీవుడ్ని చేస్తుంది. బయలు ఎల్ భార్యయైన ఆతిరాత్ (అషేరా) కుమారులను వధించి, సింహాసనాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. కానీ ఏడు సంవత్సరాల తర్వాత మాట్ మళ్ళీ తిరిగి వస్తాడు.
ఈ పద్యం రుతువుల వార్షిక వలయానికి గుర్తని కొంతమంది చెబుతారు, ఆ వలయంలో జీవమిచ్చే వర్షాల తర్వాత తీవ్రమైన వేసవి ఎండ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ శరదృతువు వస్తుంది. ఏడు సంవత్సరాల వలయం కరవు అనావృష్టిల భయాన్ని సూచిస్తుందని మరి కొందరు అనుకుంటారు. ఎలాగైనప్పటికీ మానవ ప్రయత్నాల సాఫల్యానికి బయలు ఉన్నతత్వం తప్పనిసరి అన్నట్లుగా పరిగణించబడేది. పీటర్ క్రేగీ అనే పండితుడు ఇలా పేర్కొంటున్నాడు: “తన ఉన్నతత్వాన్ని కాపాడుకోవాలన్నదే బయలు మత లక్ష్యం; అతడు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే మానవ మనుగడ కొనసాగడానికి ఆవశ్యకమైన పంటలు, పశువులు వర్ధిల్లుతాయని అతడి ఆరాధకులు విశ్వసించారు.”
అన్యమతానికి వ్యతిరేకంగా కాపుదల
వెలికి తీయబడిన మూలపాఠాల్లో యూగరీట్ మత దుర్నీతి స్పష్టంగా కనిపిస్తుంది. ది ఇలస్ట్రేటెడ్ బైబిల్ డిక్షనరీ ఇలా వ్యాఖ్యానిస్తోంది: “యుద్ధానికి వారిచ్చే ప్రాధాన్యత, పావన వ్యభిచారం, సుఖప్రధానమైన ప్రేమ, తత్ఫలితంగా ఏర్పడిన సామాజిక భ్రష్టతవంటి వాటితో ఈ దేవతల ఆరాధన యొక్క నీచమైన పర్యవసానాలను ఈ మూలపాఠాలు చూపిస్తున్నాయి.” డె వో ఇలా పేర్కొంటున్నాడు: “ఈ పద్యాలను చదివితే, యావే తత్వంలో విశ్వాసముంచేవారికి, గొప్ప ప్రవక్తలకు ఈ ఆరాధన పట్ల కలిగిన ఏహ్య భావాన్ని అర్థం చేసుకోవచ్చు.” ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అలాంటి అబద్ధ మతానికి వ్యతిరేకంగా ఒక కాపుదలగా ఉండేది.
యూగరీట్‌లో సోదె చెప్పడం, జ్యోతిశ్శాస్త్రం, ఇంద్రజాలం వంటివి బాగా ఆచరించబడేవి. ఆకాశ గ్రహాల్లోనే కాక కురూపి పిండాల్లో, వధించబడిన జంతువుల అంతరేంద్రియాల్లో కూడా సూచనలు, శకునాలు చూసేవారు. “లాంఛనప్రాయంగా బలి అర్పించబడిన జంతువు ఏ దేవునికైతే అర్పించబడుతుందో ఆ దేవునిలో అది ఒక భాగమవుతుందని, ఆ దేవుని ఆత్మ ఆ జంతువు ఆత్మలో లీనమైపోతుందని విశ్వసించబడేది” అని జాక్లీన్ గాషే అనే చరిత్రకారిణి వ్యాఖ్యానిస్తోంది. “తత్ఫలితంగా, ఈ అంతరేంద్రియాల్లో కనిపించే సూచనలను చదవడం ద్వారా దేవతల చిత్తాన్ని తెలుసుకోవడం సాధ్యమయ్యేది, వారు భవిష్యత్ సంఘటనల గురించి లేదా నిర్దిష్టమైన పరిస్థితిలో తీసుకోవలసిన చర్య గురించి వేసే ప్రశ్నకు అనుకూలంగానైనా ప్రతికూలంగానైనా సమాధానం ఇవ్వగలిగేవారు.” (క్రీ.పూ. 1200 ఆ మధ్య ప్రాంతంలో యూగరీట్ నగరం [ఫ్రెంచ్].) దీనికి భిన్నంగా, ఇశ్రాయేలీయులు ఇలాంటి ఆచారాలను విసర్జించవలసి ఉంది.—ద్వితీయోపదేశకాండము 18:9-14.
మోషే ధర్మశాస్త్రం పశుసంపర్కాన్ని స్పష్టంగా నిషేధించింది. (లేవీయకాండము 18:23) యూగరీట్‌లో ఈ ఆచారం ఎలా దృష్టించబడేది? కనుగొనబడిన మూలపాఠాల్లో, బయలు ఆవుదూడతో సంపర్కం చేస్తాడు. పురావస్తు శాస్త్రజ్ఞుడైన సైరస్ గోర్డాన్ ఇలా వ్యాఖ్యానించాడు: “ఆ చర్య కోసం బయలు, ఎద్దు రూపాన్ని సంతరించుకుంటాడని వాదించాల్సివస్తే, బయలుకు సంబంధించిన పురాణగాథలను పునర్నటించే అతని యాజకులు కూడా అలాగే అవుతారని చెప్పలేము కదా.”
ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు.” (లేవీయకాండము 19:28) బయలు మరణానికి ప్రతిస్పందిస్తూ ఎల్ “తన చర్మాన్ని కత్తితో కోసుకున్నాడు, అతడు మంగలికత్తితో గాట్లు పెట్టుకున్నాడు; ఆయన తన చెంపలను, గెడ్డాన్ని కోసుకున్నాడు.” లాంఛనప్రాయంగా దేహాన్ని కోసుకోవడం బయలు ఆరాధకులకు ఒక ఆచారంగా ఉండేదని స్పష్టమవుతోంది.—1 రాజులు 18:28.
మేకపిల్లను దాని తల్లి పాలలో ఉడికించడం కనానీయుల ప్రాంతంలో ఫలప్రదతకు సంబంధించిన ఆచారంలో భాగంగా ఉండేదని ఒక యూగరీట్ పద్యం సూచిస్తున్నట్లుగా ఉంది. అయితే మోషే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.”—నిర్గమకాండము 23:19.
బైబిలు లేఖనాలతో పోల్చడం
యూగరీట్ మూలపాఠాలు మొదటగా బైబిలు సంబంధిత హీబ్రూ భాషనుపయోగించి అనుదించబడ్డాయి. పీటర్ క్రేగీ ఇలా పేర్కొంటున్నాడు: “హీబ్రూ లేఖనాల్లో ప్రవేశపెట్టబడిన అనేక పదాల భావాలు స్పష్టంగా లేవు, కొన్నిసార్లు భావమే తెలియదు; 20వ శతాబ్దానికి ముందున్న అనువాదకులు అనేక మార్గాల ద్వారా సాధ్యమైనంత మేరకు వాటి భావాన్ని ఊహించడానికి ప్రయత్నించారు. కానీ అదే పదం యూగరీట్ మూలపాఠంలో కనిపించినప్పుడు, దాని భావాన్ని అర్థం చేసుకోవడం సాధ్యమవుతోంది.”
ఉదాహరణకు, యెషయా 3:18లో ఉపయోగించబడిన ఒక హీబ్రూ పదం సాధారణంగా “సూర్యబింబ భూషణముల”ని అనువదించబడుతుంది. అలాంటి ఒక యూగరీట్ మూల పదం సూర్యుడ్ని, సూర్యదేవతను సూచిస్తుంది. కాబట్టి యెషయా ప్రవచనంలో ప్రస్తావించబడిన యెరూషలేము స్త్రీలు కనాను దేవతల గౌరవార్థం చిన్న చిన్న సూర్య పతకాలతో, అలాగే “చంద్రవంకలను భూషణముల”తో తమను తాము అలంకరించుకుని ఉండవచ్చు.
మసొరెటిక్ మూలపాఠంలో, సామెతలు 26:23వ వచనంలో, ‘చెడు హృదయము, ప్రేమగల మాటలు పలికే పెదవులు వెండి మష్టుతో’ కప్పబడిన మంటి కుండతో పోల్చబడ్డాయి. యూగరీట్ మూలం ఆ పోలికను “కుండ పెంకుమీది మెరుపు వలె” అని అనువదించడాన్ని అనుమతిస్తుంది. సముచితంగానే పరిశుద్ధ గ్రంథము ఈ సామెతను “చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము” అని అనువదిస్తోంది.
బైబిలుకు పునాదా?
రాస్ షామ్రా మూలపాఠాలను పరిశీలించడం, బైబిలులోని కొన్ని భాగాలు యూగరీట్ పద్య సాహిత్యం నుండి తీసుకోబడ్డాయని కొందరు పండితులు వాదించడానికి కారణమయ్యింది. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ సభ్యుడైన ఆండ్రే కకో, “ఇశ్రాయేలీయుల మతానికి ఆధారంగా ఉన్న కనానీయుల సాంస్కృతిక పునాది” గురించి మాట్లాడుతున్నాడు.
29వ కీర్తన గురించి, రోములో ఉన్న పాంటిఫ్ సంబంధమైన బైబిలు సంస్థకు చెందిన మిట్చెల్ దేహుద్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ఈ కీర్తన యావే ఆరాధకులు తుఫాను దేవుడైన బయలుకు సంబంధించిన కనానీయుల భజన నుండి తీసుకున్నది . . . ఈ కీర్తనలోని దాదాపు ప్రతి పదాన్ని ఇప్పుడు మరింత పురాతనమైన కనానీయుల మూలపాఠాలలో కనుగొనవచ్చు.” అలాంటి నిర్ధారణకు రావడం సబబేనా? ఎంతమాత్రం కాదు!
మరింత మిత స్వభావంగల పండితులు, ఆ పోలికలు గోరంతను కొండంతలుగా చేసి చెప్పబడుతున్నాయని గుర్తిస్తారు. ఇతరులు, సర్వం యూగరీట్ మయం అని వారు పిలిచేదాన్ని విమర్శించారు. “ఏ ఒక్క యూగరీట్ మూలపాఠం 29వ కీర్తనకు సంపూర్ణ సమాంతరంగా లేదు. 29వ కీర్తన (లేదా మరేదైనా బైబిలు లేఖనం) అన్యమత పురాణగాథల నుండి తీసుకోబడిందని సూచించడానికి తగిన సాక్ష్యాధారం లేదు” అని వేద పండితుడైన గారీ బ్రాంట్లీ పేర్కొంటున్నాడు.
అలంకారిక భాషలో, పద్య సమాంతరాల్లో, శైలి సంబంధిత అంశాల్లో సారూప్యాలు ఉన్నాయన్న వాస్తవం, అవి వేరేవాటి నుండి తీసుకోబడ్డాయనడానికి నిదర్శనమా? అందుకు భిన్నంగా, అలాంటి సమాంతరాలు ఉంటాయని ఎదురుచూడాల్సిందే. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రెలీజియన్ ఇలా పేర్కొంటోంది: “రూపంలోనూ విషయంలోనూ ఉన్న ఈ సారూప్యతకు కారణం సంస్కృతి; యూగరీట్‌కు ఇశ్రాయేలుకు మధ్య విశేషమైన భౌగోళిక, లౌకిక తేడాలు ఉన్నప్పటికీ, అవి రెండూ పద్యసంబంధంగా మతసంబంధంగా ఒకే విధమైన పదజాలం గల ఒక పెద్ద సంస్కృతిలోని భాగాలే.” కాబట్టి గారీ బ్రాంట్లీ ఈ నిర్ధారణకు వస్తున్నాడు: “భాషాపరమైన సారూప్యతలు ఉన్నంతమాత్రాన అన్యమత నమ్మకాలు బైబిలు మూలపాఠానికి ఆధారమని అనడం అసమంజసమైన వ్యాఖ్యానం.”
చివరగా, రాస్ శామ్రా మూలపాఠాలకు, బైబిలుకు ఏమైనా సారూప్యతలు ఉంటే అవి పూర్తిగా సాహిత్యపరమైనవేగానీ ఆధ్యాత్మికమైనవి కావని గమనించాలి. “బైబిలులో ఉన్న నీతిసంబంధిత, నైతిక స్థాయిలను యూగరీట్‌లో కనుగొన[లేము]” అని పురావస్తుశాస్త్రజ్ఞుడు సైరస్ గార్డోన్ వ్యాఖ్యానిస్తున్నాడు. వాస్తవానికి, సారూప్యతల కన్నా తేడాలే ఎక్కువగా ఉన్నాయి.
యూగరీట్ అధ్యయనాలు బైబిలు రచయితల, హీబ్రూ జనాంగపు సాంస్కృతిక, చారిత్రక, మత సంబంధ పర్యావరణాన్ని అర్థం చేసుకోవడానికి బైబిలు విద్యార్థులకు సహాయం చేయడంలో బహుశా కొనసాగవచ్చు. రాస్ షామ్రా మూలపాఠాలను మరింతగా పరీక్షించడం ప్రాచీన హీబ్రూను అవగాహన చేసుకోవడంపై కూడా క్రొత్త వెలుగును ప్రసరింపజేయవచ్చు. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా యూగరీట్ వద్ద కనుగొనబడిన పురావస్తు శిధిలాలు నీచమైన బయలు ఆరాధనకు, స్వచ్ఛమైన యెహోవా ఆరాధనకు మధ్య తేడాను స్పష్టంగా ఉన్నతపరుస్తాయి.
[అధస్సూచీలు]
a “సముద్ర వాసులు” సాధారణంగా మధ్యధరా ద్వీపాల నుండి, తీరప్రాంతాల నుండి వచ్చిన నావికులుగా గుర్తించబడుతున్నారు. వారిలో ఫిలిష్తీయులు కూడా ఉండవచ్చు.—ఆమోసు 9:7.
b విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, కొంతమంది పండితులు దాగాను ఆలయాన్ని ఎల్ ఆలయమనే గుర్తిస్తారు. దాగోనుకు—న్యాయాధిపతులు 16:23 మరియు 1 సమూయేలు 5:1-5 వచనాల్లోని దాగోను—ఎల్ సరైన నామమని జెరూసలేమ్ స్కూల్ ఆఫ్ బిబ్లికల్ స్టడీస్‌లో ఫ్రెంచ్ పండితుడు, ప్రొఫెసరు అయిన రోలాండ్ డె వో సూచిస్తున్నాడు. “[ఎల్]కు దాగోనుకు ఏదో రీతిలో సంబంధం ఉండవచ్చు లేదా పోలిక ఉండవచ్చు” అని ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రెలీజియన్ వ్యాఖ్యానిస్తోంది. రాస్ షామ్రా మూలపాఠాల్లో, బయలు దాగోను కుమారుడిగా పిలువబడ్డాడు, కానీ ఇక్కడ “కుమారుడు” అనే దాని భావం అనిశ్చయంగా ఉంది.
[25వ పేజీలోని బ్లర్బ్]
యూగరీట్ వద్ద కనుగొనబడిన పురాతత్వ శిధిలాలు లేఖనాలను గురించిన మన అవగాహనను అధికం చేశాయి
[24, 25వ పేజీలోని మ్యాపు/చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
సా.శ.పూ. 14వ శతాబ్దంలో హిత్తీయుల సామ్రాజ్యం
మధ్యధరా సముద్రం
యూఫ్రటీసు
కేసీస్ పర్వతం (జెబెల్ ఎల్-ఆగ్రా)
యూగరీట్ (రాస్ షామ్రా)
టెల్ సూకస్
ఒరాన్‌టీజ్
సిరియా
ఐగుప్తు
[చిత్రసౌజన్యం]
జంతువు తల ఆకారంలో ఉన్న బయలు, రైటోన్‌ల విగ్రహం: Musée du Louvre, Paris; రాజ భవన చిత్రం: © D. Héron-Hugé pour “Le Monde de la Bible”
[25వ పేజీలోని చిత్రం]
రాజభవన ముఖ ద్వారపు శిధిలాలు
[26వ పేజీలోని చిత్రం]
పురాణగాథలకు సంబంధించిన ఒక యూగరీట్ పద్యం నిర్గమకాండము 23:19 పూర్వరంగాన్ని ఇవ్వగలదు
[చిత్రసౌజన్యం]
Musée du Louvre, Paris
[27వ పేజీలోని చిత్రాలు]
బయలు స్థూపాకార ప్రతిమ
వేట దృశ్యాన్ని సూచిస్తున్న బంగారు పాత్ర
ఫలప్రదత దేవతను సూచిస్తున్న దంతపు అలంకరణ డబ్బా మూత
[చిత్రసౌజన్యం]
అన్ని చిత్రాలు: Musée du Louvre, Paris