కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 1/15 పేజీలు 28-31
  • ‘సత్పురుషునికి దేవుని కటాక్షం లభిస్తుంది’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘సత్పురుషునికి దేవుని కటాక్షం లభిస్తుంది’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రమశిక్షణ ప్రాముఖ్యం
  • “వేరును పెళ్ళగించడం జరగదు”
  • “యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము”
  • ఆలోచనల నుండి కార్యాలకు, కార్యాల నుండి పర్యవసానాలకు
  • వినయంగల వ్యక్తికి మంచి జరుగుతుంది
  • వ్యవసాయ జీవితంలో మంచితనానికి సంబంధించిన పాఠాలు
  • నీతిమంతుడు వర్ధిల్లుతాడు
  • “నీతిమంతులు పోవుమార్గము”లో నడవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “జ్ఞానుల ఉపదేశము”—జీవపు ఊట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘నీతిమంతునికి ఆశీర్వాదములు వచ్చును’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 1/15 పేజీలు 28-31

‘సత్పురుషునికి దేవుని కటాక్షం లభిస్తుంది’

జీవానికి మూలం యెహోవా దేవుడే. (కీర్తన 36:9) అవును “మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము.” (అపొస్తలుల కార్యములు 17:28) ఆయన తనతో సన్నిహిత సంబంధం ఉన్నవారికి అనుగ్రహించే ఆశీర్వాదాల గురించి ఆలోచించినప్పుడు మన హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగదా? అంతెందుకు, ‘దేవుని కృపావరము నిత్యజీవము.’ (రోమీయులు 6:23) మనం యెహోవా అంగీకారాన్ని పొందడం ఎంతో ప్రాముఖ్యం.

దేవుడు ‘కృప అనుగ్రహిస్తాడు’ అని కీర్తనకర్త మనకు హామీ ఇస్తున్నాడు. (కీర్తన 84:11) కానీ ఆయన దాన్ని ఎవరికి అనుగ్రహిస్తాడు? నేడు ప్రజలు తరచూ విద్య, సంపద, శరీర వర్ణం, జాతి నేపథ్యం, ఇలాంటి మరితర విషయాల ఆధారంగా ఇతరులపై కృప చూపిస్తుంటారు. దేవుడు ఎవరిపై కృప చూపిస్తాడు? ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా సమాధానమిస్తున్నాడు: ‘సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీరుస్తాడు.’​—సామెతలు 12:2.

యెహోవా సత్పురుషుని బట్టి​—సద్గుణాలుగల వ్యక్తిని బట్టి​—సంతోషిస్తాడన్నది స్పష్టమౌతోంది. సత్పురుషునికి ఉండే సద్గుణాలలో స్వయం-క్రమశిక్షణ, న్యాయం, వినయం, కనికరం, వివేకం వంటివి ఉంటాయి. ఆయన ఆలోచనలు నీతియుక్తమైనవి, ఆయన మాటలు ప్రోత్సాహకరమైనవి, ఆయన కార్యాలు న్యాయవంతమైనవి ప్రయోజనకరమైనవి. బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథంలోని 12వ అధ్యాయంలో మొదటి భాగం, మంచితనం మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేయాలో చూపిస్తూ, ఆ లక్షణాన్ని ప్రదర్శించడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలియజేస్తోంది. అక్కడ చెప్పబడినదాన్ని పరిశీలిస్తే మనకు ‘మేలు చేయడానికి బుద్ధి’ లభిస్తుంది. (కీర్తన 36:3) అందులోవున్న జ్ఞానయుక్తమైన సలహాను అన్వయించుకోవడం, దేవుని కటాక్షాన్ని పొందడానికి మనకు సహాయం చేస్తుంది.

క్రమశిక్షణ ప్రాముఖ్యం

‘క్రమశిక్షణను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు’ అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 12:1) వ్యక్తిగత అభివృద్ధి సాధించేందుకు ఒక సత్పురుషుడు క్రమశిక్షణ కోసం ఆత్రుతతో ఎదురుచూస్తాడు. క్రైస్తవ కూటాల్లో లేదా వ్యక్తిగతంగా ఇతరులతో మాట్లాడినప్పుడు తనకు లభించిన ఉపదేశాన్ని ఆయన వెంటనే అన్వయించుకుంటాడు. లేఖనాల్లోని విషయాలు, బైబిలు ఆధారిత ప్రచురణల్లోని విషయాలు, నీతియుక్తమైన మార్గంలో నడిచేందుకు ఆయనను పొడిచే మునికోలల వంటివి. ఆయన జ్ఞానాన్ని వెదికి, తన మార్గాన్ని సరిచేసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తాడు. అవును క్రమశిక్షణను ప్రేమించే వ్యక్తి జ్ఞానాన్ని కూడా ప్రేమిస్తాడు.

సత్యారాధకులకు క్రమశిక్షణ, ప్రత్యేకించి స్వయం-క్రమశిక్షణ ఎంత అవసరమో కదా! మనకు దేవుని వాక్యం గురించి మరింత లోతైన జ్ఞానం ఉండాలని మనం కోరుకోవచ్చు. క్రైస్తవ పరిచర్యలో మరింత సమర్థవంతులుగా ఉండాలనీ దేవుని వాక్యాన్ని చక్కగా బోధించాలనీ మనం కోరుకోవచ్చు. (మత్తయి 24:14; 28:19, 20) కానీ అలాంటి కోరికలను నిజం చేసుకోవడానికి స్వయం-క్రమశిక్షణ అవసరం. జీవితంలోని ఇతర విషయాల్లో కూడా స్వయం-క్రమశిక్షణ అవసరం. ఉదాహరణకు, అశుద్ధమైన వాంఛలను ప్రేరేపించేందుకు రూపొందించబడిన సమాచారం నేడు సమృద్ధిగా లభిస్తోంది. అనుచితమైన దృశ్యాలపై దృష్టి నిలపకుండా ఉండేందుకు కంటిని అదుపులో ఉంచుకోవడానికి స్వయం-క్రమశిక్షణ అవసరం కాదంటారా? అంతేకాకుండా, “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” కాబట్టి మన మనస్సులోని అంతర్గత భాగాల్లో ఒక అనైతిక తలంపు నిజంగానే ఉత్పన్నం కావచ్చు. (ఆదికాండము 8:21) అలాంటి తలంపు గురించి ఆలోచించకుండా ఉండేందుకు స్వయం-క్రమశిక్షణ అవసరం.

మరోవైపు గద్దింపును అసహ్యించుకునే వ్యక్తి, క్రమశిక్షణను గానీ జ్ఞానాన్ని గానీ ప్రేమించడు. గద్దింపును ఇష్టపడకపోవడమనే మానవ నైజానికి లొంగిపోవడం ద్వారా ఆయన తనను తాను ఒక నిర్హేతుకమైన జంతువు అంటే నైతిక విలువలు లేని ఒక పశువు స్థాయికి దిగజార్చుకుంటాడు. ఇలాంటి మనోవైఖరిని మనం స్థిరంగా నిరోధించాలి.

“వేరును పెళ్ళగించడం జరగదు”

ఒక సత్పురుషుడు అనీతిమంతుడిగా లేదా అన్యాయం చేసేవాడిగా ఉండలేడు. కాబట్టి యెహోవా కటాక్షము పొందడానికి నీతియుక్తంగా ఉండడం కూడా అవసరమే. రాజైన దావీదు ఇలా పాడాడు: “యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు.” (కీర్తన 5:12) నీతిమంతుల పరిస్థితిని భక్తిహీనుల పరిస్థితితో పోలుస్తూ సొలొమోను ఇలా అంటున్నాడు: “భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు.”​—సామెతలు 12:3.

దుష్టులు వర్ధిల్లుతున్నట్లు కనిపించవచ్చు. కీర్తనకర్త అయిన ఆసాపు అనుభవాన్ని పరిశీలించండి. “నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయెను” అని ఆయన అంటున్నాడు. ఎందుకు? ఆసాపు ఇలా సమాధానమిస్తున్నాడు: “భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.” (కీర్తన 73:2, 3) కానీ ఆయన దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు, యెహోవా భక్తిహీనులను కాలుజారే ప్రదేశంలో ఉంచాడని ఆయన గ్రహించాడు. (కీర్తన 73:17, 18) దుష్టులు సాధించినట్లు అనిపించే ఏ విజయమైనా తాత్కాలికమైనది మాత్రమే. మనం వారిని చూసి అసూయపడవలసిన అవసరం ఏముంది?

దానికి భిన్నంగా, యెహోవా అంగీకారం ఉన్న వ్యక్తి స్థిరంగా ఉంటాడు. ఒక చెట్టుకుండే బలమైన వేళ్ళ గురించిన రూపకాలంకారాన్ని ఉపయోగిస్తూ సొలొమోను ఇలా అంటున్నాడు: “న్యాయవంతుల వేరును పెళ్ళగించడం జరగదు.” (సామెతలు 12:3; పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) బయటకు కనిపించని ఒక మహావృక్షం వేళ్ళు​—కాలిఫోర్నియాకు చెందిన సికోయా వృక్షం వేళ్ళు​—అనేక ఎకరాల వరకు వ్యాపించవచ్చు, వరదలు వచ్చినప్పుడు లేదా బలమైన గాలులు వీచినప్పుడు ఆ వేళ్ళు వృక్షానికి స్థిరమైన పట్టును ఇవ్వగలవు. ఒక పెద్ద సికోయా చెట్టు శక్తివంతమైన భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడగలదు.

భూమి యొక్క బలవర్థకమైన నేలలో ఉండే అలాంటి వేళ్ళలాగే, మన మనస్సులు హృదయాలు దేవుని వాక్యాన్ని విస్తృతంగా పరిశోధించేందుకు కృషిచేయాలి, దానిలోని జీవ జలాలనుండి మనం నీటిని తీసుకోవాలి. తద్వారా మన విశ్వాసం స్థిరంగా నాటుకుపోయి బలంగా తయారవుతుంది, మన నిరీక్షణ నిశ్చలంగా దృఢంగా అవుతుంది. (హెబ్రీయులు 6:19) మనం, “కల్పించబడిన ప్రతి [తప్పుడు] ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపో[ము].” (ఎఫెసీయులు 4:14) నిజమే మనం తుఫాను వంటి పరీక్షల ప్రభావాలను అనుభవించవచ్చు, కష్టకాలాల్లో భయపడవచ్చు కూడా. అయినప్పటికీ మన “వేరు కదలదు.”

“యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము”

“విజేయుడైన ప్రతి పురుషుని వెనుక ఒక మంచి స్త్రీ ఉంటుంది” అనే సామెత చాలామందికి తెలుసు. మద్దతునిచ్చే స్త్రీ ప్రాముఖ్యతను సూచిస్తూ సొలొమోను ఇలా అంటున్నాడు: “యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.” (సామెతలు 12:4) “యోగ్యురాలు” అనే పదంలో మంచితనానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. సామెతలు 31వ అధ్యాయంలో సవివరంగా వర్ణించబడినట్లు మంచి భార్యకుండే సద్గుణాలలో కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకత్వం, వివేచన ఉన్నాయి. ఈ లక్షణాలుగల స్త్రీ తన భర్తకు కిరీటము, ఎందుకంటే ఆమె మంచి ప్రవర్తన ఆయనకు గౌరవాన్ని తెస్తుంది, ఇతరుల దృష్టిలో ఆయన స్థానాన్ని ఉన్నతపరుస్తుంది. ఆమె ఆయనకంటే ముందుండాలని అత్యాశతో ప్రయత్నించదు, గుర్తింపు కోసం ఆయనతో పోటీపడదు. బదులుగా ఆమె తన భర్తకు పూరకమయ్యే సహాయకురాలిగా ఉంటుంది.

ఒక స్త్రీ సిగ్గుకరంగా ఎలా ప్రవర్తించవచ్చు, దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏమిటి? సిగ్గుకరమైన ప్రవర్తనంటే వివాదాలు పెట్టుకోవడం నుండి వ్యభిచారము చేయడం వరకూ ఏదైనా కావచ్చు. (సామెతలు 7:10-23; 19:13) భార్య అలా చేస్తే అది ఆమె భర్త పతనానికి మాత్రమే దారితీస్తుంది. “శరీరాన్ని బలహీనపర్చే వ్యాధిలా ఆమె ఆయనను సర్వనాశనం చేస్తుంది” అనే భావంలో ఆమె ఆయన “యెముకలకు కుళ్ళు” వంటిది అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. “ఆధునిక కాలంలో సమానార్థాన్నిచ్చే పదం ‘క్యాన్సర్‌’ కావచ్చు​—అది ఒక వ్యక్తి జీవశక్తిని క్రమంగా బలహీనపరిచే ఒక వ్యాధి” అని మరో రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. యోగ్యురాలైన భార్యకుండే మంచి లక్షణాలను ప్రతిబింబించడం ద్వారా క్రైస్తవ భార్యలు దేవుని కటాక్షమును సంపాదించుకునేందుకు కృషి చేస్తారని నిరీక్షించబడుతోంది.

ఆలోచనల నుండి కార్యాలకు, కార్యాల నుండి పర్యవసానాలకు

ఆలోచనలు కార్యాలకు నడిపిస్తాయి, కార్యాలు పర్యవసానాలకు నడిపిస్తాయి. తర్వాత నీతిమంతులను దుష్టులతో పోలుస్తూ, ఆలోచనలు కార్యాలకు నడిపించే క్రమం గురించి సొలొమోను చెబుతున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును.”​—సామెతలు 12:5, 6.

మంచి ప్రజల ఆలోచనలు కూడా నైతికంగా సరైనవిగా, నిష్పక్షపాతంగా, న్యాయమైనవిగా ఉంటాయి. నీతిమంతులు దేవునిపట్ల, తోటి మానవులపట్ల తమకున్న ప్రేమను బట్టి కదిలించబడతారు కాబట్టి వారి ఉద్దేశాలు మంచివి. మరోవైపు చెడ్డ ప్రజలు స్వార్థం ద్వారా ప్రేరేపించబడతారు. తద్వారా వారి ప్రణాళికలు​—తమ లక్ష్యాలను చేరుకోవడానికి వారు ఉపయోగించే పద్ధతులు​—మోసకరమైనవి. వారి కార్యాలు విశ్వాసఘాతుకమైనవి. బహుశా న్యాయస్థానంలో తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా అమాయక ప్రజలను మోసం చేయడానికి వారు వెనకాడరు. వారి మాటలు “నరహత్య చేయ పొంచువారి వంటివి” ఎందుకంటే వారు అమాయకులకు హాని చేయాలనుకుంటారు. నీతిమంతులకు ఆ దుష్ట పన్నాగాల గురించి తెలుసు కాబట్టి, జాగ్రత్తగా ఉండేందుకు అవసరమయ్యే వివేచన వారికి ఉంటుంది కాబట్టి వారు ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతున్నారు. వీరు తెలియని వారిని హెచ్చరించి, వారిని దుష్టుల మోసకరమైన ప్రణాళికల నుండి రక్షించే అవకాశం కూడా ఉంది.

నీతిమంతులకు, భక్తిహీనులకు ఏమి జరుగుతుంది? “భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుల యిల్లు నిలుచును” అని సొలొమోను సమాధానమిస్తున్నాడు. (సామెతలు 12:7) ఇల్లు, “ఆ వ్యక్తి నిజంగా జీవించడాన్ని సాధ్యంచేసే గృహపరివారాన్నీ ఆయనకు విలువైన ప్రతీదాన్నీ సూచిస్తోంది” అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. అది ఒక నీతిమంతుడి కుటుంబాన్ని లేదా ఆయన వారసులను కూడా సూచించవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ సామెత చెప్పాలనుకుంటున్న విషయం స్పష్టం: నీతిమంతులు కష్టకాలాల్లో స్థిరంగా నిలబడతారు.

వినయంగల వ్యక్తికి మంచి జరుగుతుంది

వివేచనకున్న విలువను నొక్కి చెబుతూ ఇశ్రాయేలు రాజు ఇలా అంటున్నాడు: “ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడబడును, కుటిలచిత్తుడు తృణీకరింపబడును.” (సామెతలు 12:8) వివేకంగల వ్యక్తి తొందరపడి మాట్లాడడు. ఆయన మాట్లాడేముందు ఆలోచిస్తాడు, ఇతరులతో శాంతియుతమైన సంబంధాలను కలిగివుంటాడు, ఎందుకంటే ఆయనకున్న “వివేకము” ఆయన తన మాటలను జాగ్రత్తగా ఎంపిక చేసుకొనేలా ఆయనను నడిపిస్తుంది. మూర్ఖపు ప్రశ్నలు వేయబడినప్పుడు, వివేకంగల వ్యక్తి ‘మితముగా మాటలాడగలుగుతాడు.’ (సామెతలు 17:27) అలాంటి వ్యక్తి ప్రశంసించబడతాడు, యెహోవా ఆయనను ఇష్టపడతాడు. ‘కుటిల హృదయము’ నుండి ఉత్పన్నమయ్యే వక్రీకరించబడిన అభిప్రాయాలుగల వ్యక్తినుండి ఆయన ఎంత భిన్నమైనవాడో కదా!

అవును వివేకంగల వ్యక్తి ప్రశంసించబడతాడు, అయితే తర్వాతి సామెత వినయానికున్న విలువను నేర్పిస్తుంది. అదిలా చెబుతోంది: “ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటె దాసుడుగల అల్పుడు గొప్పవాడు.” (సామెతలు 12:9) ఉన్నతమైన సామాజిక హోదాను కలిగివుండేందుకు కృషి చేస్తూ జీవితావసరాలకు అవసరమైన డబ్బును ఖర్చు పెట్టే వ్యక్తి కంటే తక్కువ సంపదలున్న, కేవలం ఒక దాసుడు మాత్రమే ఉన్న వినయస్థుడిగా ఉండడం మంచిదని సొలొమోను చెబుతున్నట్లు అనిపిస్తోంది. మనకు ఉన్నదానితో సర్దుకుపోయి జీవించమని చెప్పేందుకు మనకు ఇది ఎంత మంచి సలహానో కదా!

వ్యవసాయ జీవితంలో మంచితనానికి సంబంధించిన పాఠాలు

వ్యవసాయ సంబంధ జీవితాన్ని ఉపమానంగా ఉపయోగిస్తూ మంచితనానికి సంబంధించి రెండు పాఠాలను సొలొమోను నేర్పిస్తున్నాడు. “నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే” అని ఆయన అంటున్నాడు. (సామెతలు 12:10) నీతిమంతుడు తన పశువులను దయతో చూస్తాడు. ఆయనకు వాటి అవసరాలు తెలుసు, వాటి సంక్షేమం గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. దుష్టుడు తాను జంతువుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నానని చెప్పుకోవచ్చు, కానీ వాటి అవసరాల గురించి అతనికి నిజమైన ఆసక్తి ఉండదు. అతని ఉద్దేశాలు స్వార్థపూరితమైనవి, అతను జంతువులతో వ్యవహరించే విధానం తాను జంతువుల నుండి ఎంత లాభం సంపాదించుకోవచ్చన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వ్యక్తి జంతువులకు తగిన శ్రద్ధ చూపిస్తున్నాను అనుకుంటున్నప్పటికీ అతను నిజానికి వాటితో క్రూరంగా వ్యవహరిస్తుండవచ్చు.

జంతువులతో దయగా వ్యవహరించాలనే సూత్రం పెంపుడు జంతువుల సంరక్షణకు కూడా అన్వయిస్తుంది. పెంపుడు జంతువుల పేరుతో జంతువులకు ఆశ్రయం కల్పించి, ఆ తర్వాత వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా లేదా సరిగ్గా చూసుకోకపోవడం ద్వారా వాటికి అనవసరమైన బాధను కలిగించడం ఎంత క్రూరమైనదో కదా! తీవ్రమైన వ్యాధితో లేదా గాయాలతో విపరీతంగా బాధపడుతున్న జంతువుపై దయ చూపించడం అంటే దాన్ని చంపివేయడమే కావచ్చు.

వ్యవసాయానికి సంబంధించిన మరో అంశం​—భూమిని దున్నడం​—గురించి సొలొమోను ఇలా అంటున్నాడు: “తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును.” నిజమే కష్టించి పనిచేయడం ఫలితాలను తెస్తుంది. కానీ “వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.” (సామెతలు 12:11) మంచి వివేచనాశక్తి లేదా అవగాహన లేని “బుద్ధిలేనివాడు” వ్యర్థమైన, ఊహాజనితమైన, విలువలేని అపాయకరమైన వ్యాపార ప్రయత్నాలను వెంబడిస్తాడు. ఈ రెండు వచనాల్లోని పాఠం స్పష్టం: దయను, శ్రమించి పనిచేసే స్వభావాన్ని కలిగివుండండి.

నీతిమంతుడు వర్ధిల్లుతాడు

“భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపేక్షించుదురు” అని జ్ఞానియైన రాజు చెబుతున్నాడు. (సామెతలు 12:12 ఎ) దుష్టుడు దాన్ని ఎలా చేస్తాడు? చెడ్డ మార్గాల ద్వారా ఇతరులు సంపాదించిన సొమ్మును ఆశించడం ద్వారా అలా చేస్తాడు.

సత్పురుషుడి విషయం ఏమిటి? అలాంటి వ్యక్తి క్రమశిక్షణను ప్రేమిస్తాడు, ఆయన విశ్వాసం స్థిరంగా నాటుకొని ఉంటుంది. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, వివేచనగలవాడు, వినయస్థుడు, దయగలవాడు, కష్టించి పనిచేసేవాడు. “నీతిమంతుల వేరు చిగుర్చును” లేదా “వర్ధిల్లుతుంది” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 12:12బి; పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) “నీతిమంతుల వేరు చిరకాలం నిలుస్తుంది” అని యాన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు చెబుతోంది. అలాంటి వ్యక్తి స్థిరంగా, సురక్షితంగా ఉంటాడు. నిజమే, ‘సత్పురుషునికి దేవుని కటాక్షము లభిస్తుంది.’ కాబట్టి మనం “యెహోవాయందు నమ్మికయుంచి మేలుచే[ద్దాము].”​—కీర్తనలు 37:3.

[31వ పేజీలోని చిత్రాలు]

ఆరోగ్యవంతమైన వృక్షంలా నీతిమంతుల విశ్వాసం బలంగా నాటుకొని ఉంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి