చంపబడిన యెహోవాసాక్షులు జ్ఞాపకం చేసుకోబడ్డారు
పశ్చిమ హంగేరీలోని కార్మెండ్ పట్టణంలో 2002, మార్చి 7వ తేదీన ఒక స్మారక శిలాఫలకం ఆవిష్కరించబడింది. 1945లో నాజీలచేత తుపాకీతో కాల్చి చంపబడిన ముగ్గురు యెహోవాసాక్షుల మరణాన్ని అది స్మరణకు తెస్తోంది.
హున్యడీ రోడ్డులో ఉన్న అగ్నిమాపక విభాగపు ప్రస్తుత ప్రధాన కార్యాలయం గోడ మీద ఈ శిలాఫలకం అమర్చబడింది, ఆ ప్రాంతంలోనే వారు చంపబడ్డారు. ఆ ఫలకం వీరి జ్ఞాపకార్థం సమర్పించబడింది: ‘1945వ సంవత్సరం మార్చిలో, మనస్సాక్షి ఒప్పుకోని కారణంగా సైన్యంలో చేరని వ్యక్తులుగా చంపబడిన క్రైస్తవులు. అంటాల్ హొయినిక్ (1911-1945), బెర్టాలాన్ సాబో (1921-1945), యానోష్ జాన్డార్ (1923-1945). 2002, యెహోవాసాక్షులు.’
రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి కేవలం రెండు నెలల ముందు వారు చంపబడ్డారు. ఈ క్రైస్తవులు ఎందుకు చంపబడ్డారు? హంగేరియన్ వార్తాపత్రిక వాష్ నాపే ఇలా వివరిస్తోంది: “జర్మనీలో హిట్లర్ అధికారానికి వచ్చిన తర్వాత, తమ మతవిశ్వాసాన్ని త్యజించడానికి నిరాకరించినందుకు కేవలం యూదులు మాత్రమే కాక యెహోవాసాక్షులు కూడా హింసించబడ్డారు, నిర్బంధ శిబిరాలకు తరలించబడ్డారు లేదా మరణానికి గురయ్యారు. . . . 1945వ సంవత్సరం మార్చిలో పశ్చిమ హంగేరీలో భయం రాజ్యమేలింది. . . . యెహోవాసాక్షులను దేశం నుండి బహిష్కరించడం, చంపడం ఈ భయంలో ఒక భాగం.”
స్మారక ఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం రెండు భాగాలుగా నిర్వహించబడింది. మొదటి భాగం బెథియాన్యి కాసల్ థియేటర్ వద్ద నిర్వహించబడింది. అక్కడ ప్రసంగించినవారిలో, బుడాపేస్ట్లో ఉన్న హోలోకాస్ట్ డాక్యుమెంటేషన్ సెంటర్ అధ్యక్షుడైన ప్రొఫెసర్ సాబోచ్ జెటా; మానవ హక్కులు, మైనారిటీలు, మతసంబంధ విషయాలకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ సభ్యుడు లాస్లో డొనాక్; వారి మరణానికి ప్రత్యక్షసాక్షి, ప్రస్తుతం పట్టణ చరిత్రకారుడు అయిన కాల్మాన్ కొమ్యేచీ ఉన్నారు. ఈ కార్యక్రమానికి 500 కంటే ఎక్కువమంది హాజరయ్యారు, వీరందరూ కార్యక్రమంలోని రెండవ భాగం కోసం, కార్మెండ్కు చెందిన మేయర్ యోజెఫ్ హాన్ఫీ ఆవిష్కరించే ఫలకాన్ని చూడడానికి పట్టణం ఆ చివరి నుండి ఈ చివరి వరకు నడిచి వెళ్ళారు.
యానోష్ జాన్డార్ తాను చనిపోయే ముందు వ్రాసిన ఉత్తరంలో, తన క్రైస్తవ సహోదర సహోదరీలను బాధపడవద్దని కోరాడు. ఆయన ఇలా వ్రాశాడు: “ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలోని యోహాను మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి: ‘మరణమువరకు నమ్మకముగా ఉండుము.’ . . . ఇంటి వద్ద ఉన్నవారిని బాధపడవద్దని చెప్పండి ఎందుకంటే నేను ఒక నేరస్థుడిగా కాక సత్యం కోసం మరణిస్తున్నాను.”
[32వ పేజీలోని చిత్రం]
బెర్టాలాన్ సాబో
[32వ పేజీలోని చిత్రం]
అంటాల్ హొయినిక్
[32వ పేజీలోని చిత్రం]
యానోష్ జాన్డార్