బైజాంటియమ్‌లోని ప్రభుత్వము, చర్చి
క్రైస్తవత్వాన్ని స్థాపించిన వ్యక్తి, తన అనుచరులకూ దేవుని నుండి వేరైయున్న మానవ లోకానికీ మధ్య ఉండవలసిన సుస్పష్టమైన తేడా గురించి స్పష్టంగా తెలియజేశాడు. “మీరు లోకసంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” అని యేసు తన అనుచరులకు చెప్పాడు. (యోహాను 15:19) తన కాలంనాటి రాజకీయ అధికారానికి ప్రతినిధి అయిన పిలాతుకు, “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అని యేసు ప్రకటించాడు.—యోహాను 18:36.
క్రైస్తవులు, “భూదిగంతముల వరకు” ప్రకటించాల్సిన తమ బాధ్యతను నెరవేర్చేందుకు వీలుగా లోక వ్యవహారాలు తమ మనస్సును మళ్ళించకుండా జాగ్రత్తపడవలసి వచ్చింది. (అపొస్తలుల కార్యములు 1:8) యేసులాగే, తొలి క్రైస్తవులు రాజకీయాల్లో భాగం వహించేవారు కాదు. (యోహాను 6:15) నమ్మకమైన క్రైస్తవులు ప్రభుత్వాధికార స్థానాలను లేదా కార్యనిర్వాహక స్థానాలను స్వీకరించి వాటిలో భాగం వహించలేదన్నది గమనార్హంగా ఉండేది. కానీ ఇది కాలక్రమేణా మారింది.
“లోకసంబంధమైన”
అపొస్తలులలో చివరి వ్యక్తి మరణించిన కొద్దికాలం తర్వాత, మత నాయకులు లోకంతో తమకున్న సంబంధాన్ని గురించిన తమ దృక్పథాలను ఇష్టపూర్వకంగా మార్చుకోవడం మొదలుపెట్టారు. వారు, ఈ లోకములో ఉండటమే కాకుండా, ఈ లోకంలో ఒక భాగమైయున్న “రాజ్యము” గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. బైజాంటియమ్‌ను (ప్రస్తుతం ఇస్తాన్‌బుల్) రాజధానిగా కలిగివున్న, తూర్పు రోమా సామ్రాజ్యమైన బైజాంటైన్ సామ్రాజ్యములో మతము రాజకీయాలు ఒక దానితో ఒకటి ఎలా ముడిపడి వున్నాయో పరిశీలించడం ఉపదేశాత్మకంగా ఉంటుంది.
మతము సాంప్రదాయబద్ధంగా గొప్ప పాత్ర వహించిన సమాజంలో, బైజాంటియమ్‌లో కేంద్ర స్థానాన్ని కలిగివున్న బైజాంటైన్ చర్చి చెప్పుకోదగినంత అధికారాన్ని కలిగివుండేది. చర్చి చరిత్రకారుడైన పనాయోటీస్ క్రీస్టూ ఒకసారి ఇలా పేర్కొన్నాడు: “బైజాంటియమ్ ప్రజలు తమ భూసంబంధమైన సామ్రాజ్యము, దేవుని రాజ్యానికి ప్రతిబింబమని నమ్మేవారు.” కానీ సామ్రాజ్య అధికారం ఆ అభిప్రాయంతో ఎల్లప్పుడు ఏకీభవించేది కాదు. దాని ఫలితంగా ప్రభుత్వానికి, చర్చికి మధ్య సంబంధం కొన్నిసార్లు అల్లకల్లోలంగా ఉండేది. ది ఆక్సఫర్డ్ డిక్షనరీ ఆఫ్ బైజాంటియమ్ ఇలా నివేదిస్తుంది: “కాన్‌స్టాంటినోపుల్‌లోని [లేక బైజాంటియమ్‌లోని] బిషప్పులు, శక్తివంతమైన పరిపాలకునికి భయపడి అణిగిమణిగి ఉండడం . . . , చక్రవర్తితో లాభదాయకమైన సంబంధం కలిగి వుండడం . . . , చక్రవర్తి చిత్తాన్ని ధైర్యంగా వ్యతిరేకించడం వంటి ఎన్నో విభిన్న వైఖరులను ప్రదర్శించేవారు.”
ఈస్టర్న్ చర్చి అధినేత అయిన కాన్‌స్టాంటినోపుల్ బిషప్పు గొప్ప ప్రాబల్యంగల వ్యక్తిగా తయారయ్యాడు. సంప్రదాయాలను చక్రవర్తి నమ్మకంగా కాపాడతాడని ఆశిస్తూ ఆయనే చక్రవర్తికి కిరీటధారణ చేసేవాడు. చర్చి యొక్క విస్తారమైన సాధనసంపత్తి బిషప్పు అధికారం క్రింద వుండేది కాబట్టి ఆయన చాలా ధనవంతుడై ఉండేవాడు. అసంఖ్యాకులైన సన్యాసుల మీద ఆయనకున్న అధికారంవల్ల, సామాన్య ప్రజలను ఆయన ప్రభావితం చేయగలగడంవల్ల ఆయన అంత అధికారం గలవాడయ్యాడు.
బిషప్పు తరచూ చక్రవర్తిని ప్రతిఘటించగల స్థానంలో వుండేవాడు. ఆయన, తన అభీష్టాన్ని ప్రజలపై రుద్దడానికి దేవుని నామాన్ని ఉపయోగించుకుంటూ, చర్చి సభ్యత్వాన్ని రద్దు చేస్తానని బెదిరించగలిగేవాడు లేదా చక్రవర్తులను తమ స్థానాలనుండి తొలగించడానికి వేరే పద్ధతులను ఉపయోగించగలిగేవాడు.
రాజధాని వెలుపల పౌరవ్యవహార నిర్వహణ మెల్లగా తగ్గుముఖం పట్టడంతో, బిషప్పులు ప్రాంతీయ పరిపాలకులుగా ఎంపిక చేయబడేందుకు తాము ఎవరికైతే సహాయం చేశారో వారితో సమానమైన అధికారాన్ని పొంది, తమ నగరాలలో అత్యధిక అధికారం గలవారిగా తయారయ్యారు. చర్చి ఇమిడి ఉన్నప్పుడు బిషప్పులు, కోర్టు కేసులకు లౌకిక వ్యాపారాలకు అవధానమిచ్చేవారు. కొన్నిసార్లు అది చర్చికి సంబంధించినది కాకపోయినప్పటికీ తలదూర్చేవారు. తమ స్థానిక బిషప్పులకు లోబడివుండే ప్రీస్టులు మరియు సన్యాసులు వేలసంఖ్యలో వుండడం, బిషప్పులు అత్యధిక అధికారంగలవారిగా తయారయ్యేందుకు దోహదపడింది.
రాజకీయాలు మరియు సిమనీ
పై విషయాలు చూపిస్తున్నట్లుగా, బిషప్పుల కార్యాలయం రాజకీయాలతో విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. అంతేకాకుండా, మతనాయకులు అధిక సంఖ్యలో ఉన్నందునా, వారి మతసంబంధ కార్యకలాపాల కోసమూ అధిక మొత్తంలో డబ్బు అవసరం అయ్యేది. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న మతనాయకుల్లో చాలామంది విలాసవంతంగా జీవించేవారు. చర్చి అధికారాన్ని, ధనాన్ని సంపాదించుకుంటుండగా, అపొస్తలత్వ పేదరికం, పవిత్రతా కనుమరుగైపోయాయి. కొందరు ప్రీస్టులు, బిషప్పులు తాము నియమించబడటానికి డబ్బు చెల్లించేవారు. చర్చి అధికార వ్యవస్థలో, చిన్న చిన్న పదవులనుండి అతి ప్రాముఖ్యమైన స్థానం వరకు కూడా సిమనీ సర్వసాధారణమైపోయింది. లోపాయకారీ చర్చలు జరిపే ధనవంతుల మద్దతుగల మతనాయకులు, చక్రవర్తి ఎదుట మతసంబంధమైన కార్యాలయాల కొరకు పోటీ చేసేవారు.
సీనియర్ మతనాయకులను ప్రభావితం చేయడానికి లంచాలు ఇవ్వడం కూడా ఒక మార్గంగా ఉండేది. మహారాణి జోయీ (దాదాపు సా.శ. 978-1050) తన భర్త రోమేనస్ IIIను హత్య చేయించి, తన ప్రేమికుడు మరియు కాబోయే చక్రవర్తి అయిన మైఖెల్ IVని వివాహమాడాలని నిశ్చయించుకున్నప్పుడు, వెంటనే ఆమె అలెక్సీస్ అనే బిషప్పును రాజభవనానికి రమ్మని ఆజ్ఞాపించింది. బిషప్పు అక్కడికి వెళ్ళి రోమేనస్ మరణాన్ని గురించి, అక్కడ తాను జరిపించవలసిన వివాహ వేడుక గురించి తెలుసుకున్నాడు. ఆ సాయంకాలం చర్చి గుడ్ ఫ్రైడే జరుపుకుంటోందన్న వాస్తవాన్ని బట్టి, అలెక్సీస్‌కి ఇంకా కష్టమైన పరిస్థితే ఏర్పడింది. అయినప్పటికీ, మహారాణి ఇచ్చిన విలాసవంతమైన బహుమానాలను స్వీకరించి, ఆయన ఆమె కోరినట్లే చేశాడు.
చక్రవర్తికి భయపడి ప్రవర్తించడం
బైజాంటైన్ సామ్రాజ్యపు చరిత్రలో కొన్నిసార్లు, కాన్‌స్టాంటినోపుల్ బిషప్పును ఎన్నుకోడానికి చక్రవర్తి తనకున్న నియమించే అధికారాన్ని ఉపయోగించేవాడు. ఇలాంటి సందర్భాల్లో, చక్రవర్తి చిత్తానికి వ్యతిరేకంగా ఎవ్వరూ బిషప్పు కాగలిగేవారు కాదు, లేదా ఒకవేళ అయినా ఎంతో కాలం కొనసాగగలిగేవారు కాదు.
చక్రవర్తి అండ్రోనికస్ II (1260-1332) బిషప్పులను తొమ్మిదిసార్లు మార్చాడు. ఇలాంటి చాలా సందర్భాల్లో, అత్యంత వినమ్రుడైన అభ్యర్థికి బిషప్పు పదవిని అప్పగించాలన్నదే ముఖ్యోద్దేశం. ద బైజాంటైన్స్ అనే పుస్తకం ప్రకారం, ఒక బిషప్పు “మీరు ఏమి కోరినప్పటికీ, అదెంత చట్టవిరుద్ధమైనదైనప్పటికీ దాన్ని చేసి, మీకు అసంతృప్తికరమైనదేది చేయకుండా ఉంటాను” అని కూడా చక్రవర్తికి వ్రాతపూర్వకంగా వాగ్దానం చేశాడు. రాజకుటుంబానికి చెందిన రాకుమారుడినే బిషప్పుగా ప్రతిష్ఠించడం ద్వారా చక్రవర్తులు చర్చి మీద తమ చిత్తాన్ని రుద్దడానికి రెండుసార్లు ప్రయత్నించారు. రోమేనస్ I చక్రవర్తి 16 ఏళ్ళ తన కుమారుడైన థీయాఫిలాక్ట్‌ను బిషప్పు స్థానానికి చేరుకునేలా చేశాడు.
ఒకవేళ ఒక బిషప్పు తనను ప్రీతిపర్చడంలో తప్పిపోతే, చక్రవర్తి అతడు తన పదవిని పరిత్యజించేలా బలవంతపెట్టగలిగేవాడు, లేదా అతడ్ని పదవీచ్యుతుడ్ని చేయమని “క్రైస్తవ” మతగురువుల సభకు ఆజ్ఞాపించగలిగేవాడు. బైజాంటియమ్ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తుంది: “బైజాంటైన్ చరిత్రలో అంతకంతకూ, బిషప్పులను ఎన్నుకోవడంలో పైపదవుల్లో ఉన్న అధికారులు, చివరికి చక్రవర్తి యొక్క ప్రత్యక్ష ప్రభావం ముఖ్యమైన పాత్రను వహించడం మొదలైంది.”
చక్రవర్తి, బిషప్పును ప్రక్కన పెట్టుకుని “క్రైస్తవ” మతసంబంధమైన సభలకు కూడా అధ్యక్షత వహించేవాడు. ఆయన చర్చలను నడిపేవాడు, విశ్వాస సూత్రాలను సూత్రీకరించేవాడు, బిషప్పులతో అలాగే చర్చివిరోధులతో వాదించేవాడు, వారు ఆయనతో ఏకీభవించకపోతే వారికి మ్రానుపై మరణశిక్ష విధించబడేది. ఇలాంటి సభలలో ఆమోదించబడ్డ ప్రమాణాలను ధృవీకరించి, వాటిని అమలుచేసేవాడు. ఆయన తనను వ్యతిరేకించిన వారిపై, రాజద్రోహానికి పాల్పడ్డారనే నింద వేసేవాడు, అంతేగాక వారు దేవునికి, విశ్వాసానికి శత్రువులని ఆరోపించేవాడు. “చక్రవర్తి చిత్తానికి, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకమైనదేదీ చర్చిలో జరగకూడదు” అని ఆరవ శతాబ్దానికి చెందిన ఒక బిషప్పు అన్నాడు. రాజసభలో వుండే బిషప్పులు మృదుత్వము నమ్రత గలవారు, పొగడ్తలకు తెలివైన లావాదేవీలకు సులభంగా ప్రభావితులయ్యే వ్యక్తులు కాబట్టి తమ పైఅధికారుల్లానే ఏమాత్రం అసమ్మతిని తెలిపేవారు కాదు.
ఉదాహరణకు, ముఖ్యమంత్రి బార్‌డస్ ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనడానికి బిషప్పు ఇగ్నేషియస్ (దాదాపు సా.శ. 799-878) అనుమతించనప్పుడు, ఆ మంత్రి అందుకు పగ తీర్చుకున్నాడు. బార్‌డస్, ఇగ్నేషియస్‌ను కుట్ర, రాజద్రోహం వంటి నేరాలలో ఇరికించాడు. ఆ బిషప్పు అరెస్టు చేయబడి, దేశం నుండి బహిష్కరించబడ్డాడు. ఆయన స్థానంలో, మతనాయకుడు కాని వ్యక్తిని మంత్రి ఎన్నుకున్నాడు, ఫోటియస్ అనే ఆ వ్యక్తి కేవలం ఆరు రోజుల్లోనే క్రైస్తవమతసంబంధమైన స్థాయిలన్నింటినీ అధిగమించి చివరికి బిషప్పు స్థానాన్ని చేరుకున్నాడు. ఫోటియస్ ఆ బిషప్పు స్థానాన్ని పొందడానికి అర్హుడేనా? అతడు “ప్రసిద్ధి చెందాలని గాఢమైన కోరిక, అసాధారణమైన అహంకారం, అద్భుతమైన రాజకీయ చతురతగల వ్యక్తి” అని వర్ణించబడ్డాడు.
రాజకీయ సేవలో మతసిద్ధాంతం
సంప్రదాయాలు, చర్చివిరోధం వంటివాటికి సంబంధించిన వివాదాలు తరచూ రాజకీయ వ్యతిరేకతను మరుగు చేసేవి, రాజకీయాంశాల కంటే క్రొత్త సిద్ధాంతాలను ప్రవేశపెట్టాలనే కోరిక పలువురు చక్రవర్తులను ప్రభావితం చేసింది. సాధారణంగా, చక్రవర్తి మతసిద్ధాంతాన్ని ఆదేశించి, చర్చినుండి తన చిత్తానికి పూర్తి విధేయతను ఆపేక్షించే హక్కును కలిగి ఉండేవాడు.
ఉదాహరణకు, చక్రవర్తి హెరాక్లియస్ (సా.శ. 575-641) శక్తి ఉడిగిపోయిన, బలహీనమైన తన సామ్రాజ్యం విభజించబడటానికి కారణమయ్యే, క్రీస్తు నైజాన్ని గురించి ఏర్పడిన చీలికను సరిచేయడానికి చాలా ప్రయత్నించాడు. రాజీపరచటానికి ప్రయత్నిస్తూ, ఆయన మోనోతెలిటిసమ్ అనే క్రొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు.a తర్వాత హెరాక్లియస్, తన సామ్రాజ్యములోని దక్షిణ మండలాల సహకారాన్ని నిశ్చయపర్చుకునేందుకు, అలెగ్జాండ్రియాకు చెందిన సైరస్ ఆఫ్ ఫేసిస్ అనే క్రొత్త బిషప్పును ఎన్నుకున్నాడు. ఆ బిషప్పు చక్రవర్తి మద్దతువున్న క్రొత్త సిద్ధాంతాన్ని ఆమోదించాడు. చక్రవర్తి సైరస్‌ను కేవలం బిషప్పును కాకుండా, స్థానిక పాలకుల మీద అధికారం కలిగి ఉండే విధంగా ఈజిప్టుకు ప్రధాన పాలనాధికారిని చేశాడు. కొంత హింసతో కూడిన ఒత్తిడి చేసి, సైరస్, ఈజిప్టు చర్చిలో అధికభాగపు ఆమోదాన్ని పొందడంలో ఆయన సఫలుడయ్యాడు.
చేదైన పర్యవసానం
తన అనుచరులు ‘లోకసంబంధులై’ ఉండరని అంటూ యేసు చేసిన ప్రార్థనలోని మాటలను, స్ఫూర్తిని ఈ సంఘటనలన్నీ కూడా ఎలా ప్రతిబింబించగలవు?—యోహాను 17:14-16.
బైజాంటైన్ కాలానికి, ఆ తర్వాతి కాలాలకు చెందిన, క్రైస్తవులమని చెప్పుకున్న నాయకులు, ఈ లోక సంబంధమైన రాజకీయ మరియు సైనిక వ్యవహారాల్లో తాము నిమగ్నమవ్వడం యొక్క బాధాకరమైన పర్యవసానాలను అనుభవించారు. చరిత్రకు సంబంధించిన ఈ కొద్ది భాగాన్ని పరిశీలించడం మీకు ఏమి తెలియజేస్తుంది? బైజాంటైన్ చర్చి నాయకులు, దేవుని అనుగ్రహాన్ని యేసుక్రీస్తు అనుగ్రహాన్ని పొందారా?—యాకోబు 4:4.
ఇటువంటి అధికారదాహంగల మతనాయకులవల్ల, వాళ్ళ రాజకీయ వ్యవహారాలవల్ల నిజ క్రైస్తవత్వానికి ఏ ప్రయోజనం చేకూరలేదు. మతము రాజకీయాల ఈ అశుద్ధ కలయిక, యేసు బోధించిన స్వచ్ఛమైన మతానికి తప్పుగా ప్రాతినిధ్యం వహించింది. మనం చరిత్రనుండి గుణపాఠం నేర్చుకుని ‘లోకసంబంధులు కాకుండా’ ఉందుము గాక.
[అధస్సూచీలు]
a క్రీస్తుకు దేవునిగా, మానవునిగా రెండు నైజాలు ఉన్నప్పటికీ, ఆయన చిత్తము ఒక్కటేనన్నది మోనోతెలిటిసమ్ సిద్ధాంతం.
[10వ పేజీలోని బాక్సు/చిత్రం]
“పరలోకములో నడుస్తున్న దేవునివలే”
బిషప్పు మైఖెల్ సెర్యులారీయస్‌కి (దాదాపు 1000-1059) సంబంధించిన సంఘటనలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో, దానికి సంబంధించిన అధికారదాహాల్లో చర్చి అధినేత వహించగల పాత్రను చక్కగా అభివర్ణిస్తాయి. సెర్యులారీయస్ బిషప్పు స్థానాన్ని పొందిన తర్వాత, ఇంకా ఎత్తుకి ఎదగాలని గురి పెట్టుకున్నాడు. ఆయన గర్విష్ఠి, దుస్సాహసంగల వ్యక్తని, కఠినమయిన వ్యక్తని, “పరలోకములో నడుస్తున్న దేవునివలే ప్రవర్తించేవాడని” వర్ణించబడ్డాడు.
తనను తాను హెచ్చించుకోవాలన్న ఆశవలన సెర్యులారీయస్ 1054 లో రోములోవున్న పోపుతో చీలిక ఏర్పడేలా చేసి, ఈ విభజనను అంగీకరించేలా చక్రవర్తిని బలవంతపెట్టాడు. సెర్యులారీయస్, తాను సాధించిన ఈ విజయాన్ని బట్టి సంతోషించి, మైఖెల్ VI ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఏర్పాటుచేసి, అతడు తన అధికారాన్ని సంఘటితపర్చుకోడానికి సహాయపడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత, సెర్యులారీయస్ ఆ చక్రవర్తి తన సింహాసనాన్ని వదిలివెళ్ళేలా బలవంతపెట్టి, అతడి స్థానంలో ఐజక్ కామ్నీనస్‌ను (దాదాపు 1005-1061) సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
బిషప్పు కార్యాలయానికి, సామ్రాజ్యానికి మధ్యన పోరాటం అధికమైంది. ప్రజల సహాయం ఉందని ధృవపర్చుకుని సెర్యులారీయస్ బెదిరించాడు, అధికారంతో అడిగాడు, హింసకు పాల్పడ్డాడు. ఒక సమకాలీన చరిత్రకారుడు ఇలా వ్యాఖ్యానించాడు: “‘నేనే నిన్ను పైకి తీసుకువచ్చాను, బుద్ధిహీనుడా; నేనే నిన్ను నాశనం చేస్తాను’ అంటూ అతడు చక్రవర్తి పతనాన్ని సామాన్యమైన, అసభ్యకరమైన భాషలో ప్రవచించాడు.” అయినప్పటికీ, ఐజక్ కామ్నీనస్ అతన్ని అరెస్టు చేయించి, జైల్లో వేసి, ఇంబ్రాస్ ద్వీపానికి వెళ్ళగొట్టాడు.
ఇలాంటి ఉదాహరణలు, కాన్‌స్టాంటినోపుల్ బిషప్పు ఎంతటి శ్రమను కలిగించగలడో, ఎంత ధైర్యంగా చక్రవర్తిని ఎదిరించగలడో చూపిస్తాయి. చతురులైన రాజకీయవేత్తలు, అటు చక్రవర్తిని ఇటు సైన్యాన్ని ప్రతిఘటించగల సామర్థ్యమున్నవారు అయిన ఇలాంటి వ్యక్తులతో చక్రవర్తి తరచూ వ్యవహరించవలసి వచ్చేది.
[9వ పేజీలోని మ్యాపు/చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
బైజాంటైన్ సామ్రాజ్యం యొక్క అత్యధిక విస్తృతి
రావెన్నా
రోము
మాసిడోనియా
కాన్‌స్టాంటినోపుల్
నల్లసముద్రము
నైసియా
ఎఫెసస్
ఆంటియాక్
జెరుసలెం
అలెగ్జాండ్రియా
మధ్యధరాసముద్రము
[చిత్రసౌజన్యం]
పటం: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[10, 11వ పేజీలోని చిత్రాలు]
కామ్నీనస్
రోమేనస్ III (ఎడమ వైపు)
మైఖెల్ IV
మహారాణి జోయీ
రోమేనస్ I (ఎడమ వైపు)
[చిత్రసౌజన్యం]
కామ్నీనస్, రోమేనస్ III మరియు మైఖెల్ IV: Courtesy Classical Numismatic Group, Inc.; మహారాణి జోయీ: Hagia Sophia; రోమేనస్ I: Photo courtesy Harlan J. Berk, Ltd.
[12వ పేజీలోని చిత్రం]
ఫోటియస్
[12వ పేజీలోని చిత్రం]
హెరాక్లియస్ మరియు అతని కుమారుడు
[చిత్రసౌజన్యం]
హెరాక్లియస్ మరియు అతని కుమారుడు: Photo courtesy Harlan J. Berk, Ltd.; 8-12 పేజీల వరకు ఉన్న డిజైనులు: L’Art Byzantin III Ravenne Et Pompose అనే పుస్తకం నుండి