మనము విశ్వాసము గలవారము
పెరూలోని ఆల్టిప్లానోలో రాజ్యాన్ని ప్రకటించడం
తూర్పు పశ్చిమ ఆండీస్ పర్వత పంక్తుల మధ్య ఆల్టిప్లానోలు ఉన్నాయి, ఆ ప్రాంతంలోనే బొలీవియా పెరూ దేశాలు కలుస్తాయి. ఆల్టిప్లానో అనే పదానికి “ఎత్తైన పర్వతాలు,” లేక “పీఠభూములు” అని అర్థం. దానిలో చాలాభాగం బొలీవియాలో ఉంది.
ఆల్టిప్లానో 100 కిలోమీటర్ల వెడల్పు, 1,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, దాని సగటు ఎత్తు సముద్రమట్టానికి 3,700 మీటర్లు ఉంటుంది. పెరూలోని సముద్రతీరాన ఉన్న దాని రాజధానియైన లీమా నుండి విమానంలో అటువైపు వెళ్తుంటే మంచుతో కప్పబడివున్న ఎల్ మిస్టి అనే ఒక అగ్నిపర్వతాన్ని దాటాల్సివుంటుంది. ఈ అగ్నిపర్వతం 5,822 మీటర్ల ఎత్తులో మేఘాల్ని తాకుతూ వుంటుంది. దీనికి దూరంగా 6,000 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఉన్న నెవాడో అంపాటో, నెవాడో కోరోపునా అనే పర్వతాల శిఖరాలు కన్పిస్తాయి. విమానంలోని పర్యాటకులకు దక్షిణ పెరూలోని ఆల్టిప్లానో అనే విశాలమైన పీఠభూములు కనిపిస్తాయి.
పెరూలోని ఆల్టిప్లానోకి రాజధాని పూనో, ఇది టిటికాకా సరస్సుకి వాయవ్య దిశలో ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉండి ఓడ ప్రయాణానికి వీలుగా ఉన్న సరస్సు ఇదే. ఈ ప్రాంతం మూడు కిలోమీటర్ల ఎత్తున ఉండడంతో పర్యాటకులు ఇక్కడి తేమగల వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. టిటికాకా సరస్సుకు ఆనుకుని ఉండే క్వెచూవా, అయిమారా ఆదివాసులు నివసిస్తారు. ఎరుపు, ఆకుపచ్చ, లేదా నీలిరంగు వస్త్రాల్లో వారు చాక్రాస్, అంటే చిన్న చిన్న పొలాల్లో పనిచేస్తూ కనిపిస్తారు. పెరూలో స్పానిష్ ప్రధాన భాష అయినప్పటికీ ఆల్టిప్లానోలో క్వెచూవా, అయిమారా భాషలు కూడా మాట్లాడతారు.
ప్రకటనా పనిని వ్యాప్తిచేయడం
క్వెచూవా, అయిమారా అనే భాషలు మాట్లాడే నమ్రతగల కష్టించి పనిచేసే చాలామంది ప్రజలు ఇటీవలనే బైబిలు సత్యపు ఖచ్చితమైన జ్ఞానాన్ని తెలుసుకున్నారు. పూర్తికాల రాజ్య ప్రచారకులైన ప్రత్యేక పయినీర్ల పట్టుదలతో కూడిన కృషిని యెహోవా ఎంతో ఆశీర్వదించాడనేందుకు ఇది నిదర్శనంగా ఉంది.
ఉదాహరణకు, టిటికాకా సరస్సు నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యూటినా అనే పట్టణానికి హోసే, సిల్వియా అనే ఇద్దరు ప్రత్యేక పయినీర్లు నియమించబడ్డారు. రెండు నెలల్లో సిల్వియా 16, హోసే 14 బైబిలు పఠనాలను నిర్వహించగలిగారు. కేవలం ఆరు నెలల్లో సంఘంలోని ప్రచారకుల సంఖ్య 23 నుండి 41కి చేరుకుంది. ఈ మధ్యకాలంలో కూటాలకు హాజరయ్యేవారి సంఖ్య 48 నుండి శిఖరాగ్ర సంఖ్య అయిన 132కి చేరుకుంది.
“ఎంతెంతో దూరాల్లో ఉన్న ఈ సమాజాల్లో సంఘకూటాలను బహిరంగ ప్రసంగంతోనూ సంఘ పుస్తక పఠనంతోనూ ప్రారంభించడం ఆచరణాత్మకమైనదిగా ఉన్నట్లు మేము కనుగొన్నాము. ఇది ఆసక్తిగల క్రొత్త వారు కూటాలకు హాజరవడం ప్రారంభించేందుకు సులభంగా ఉంటుంది” అని హోసే చెప్తున్నాడు.
ప్యూటినా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మునాని అనే మరో సమాజానికి ఇద్దరు సహోదరీలు—వారిలో ఒకరు పయినీరు—మొదటగా సువార్తను తీసుకువచ్చారు. అక్కడ, వాళ్ళు లూసియో అనే ఒక అంధునితో బైబిలును పఠించడం ప్రారంభించారు.a ఆయన ఒక సాధారణ క్యాథలిక్ మిషనరీ అయిన తన తమ్ముడు మిగూయేలును ఆహ్వానించాడు. ఆయన దగ్గర్లోని ఒక సమాజంలో నాయకుడు కూడా. మిగూయేలును ఆయన స్నేహితుడు ప్రతి వారం మునేనికి ఎందుకు వెళ్తున్నావని అడిగినప్పుడు యెహోవా గురించి ఆయన వాక్యాన్ని గురించి నేర్చుకోవడానికి వెళ్తున్నానని మిగూయేలు చెప్పాడు. అప్పుడు “మనం ఇక్కడెందుకు బైబిలును పఠించకూడదు” అనే ప్రశ్న తలెత్తింది. మిగూయేలు సమాజంలోని వారు ఆసక్తిని చూపించడం వల్ల సాక్షులు త్వరలోనే అక్కడ కూటాలకు ఏర్పాట్లు చేశారు.
మిగూయేలు తను నేర్చుకుంటున్న వాటిని ఇతరులకు తెలియజేయడం ప్రారంభించాడు. కానీ ఒక సాధారణ క్యాథలిక్ మిషనరీగా, ఉపపరిపాలకునిగా ఆయనకున్న హోదాల విషయమేమిటి? ఒక కమ్యూనిటీ హాల్లో జరిగిన ఒక సమావేశంలో క్యాథలిక్ మిషనరీగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఎవరైనా వేరే వ్యక్తిని నియమించడం జరుగుతుందా? “మనం సత్యాన్ని నేర్చుకుంటుండగా మనకు మరో మిషనరీ ఎందుకు” అని ప్రేక్షకుల్లో నుండి ఒక స్త్రీ ప్రశ్నించింది. ఆ విషయం యెహోవాసాక్షులు నేర్పించే దానిని గూర్చే ఆమె అలా అన్నది. “నీ అంతట నువ్వే రాజీనామా చేయడానికి మేము సమ్మతించము. మేమందరమూ ఎందుకు రాజీనామా చేయకూడదు” అని మరో వ్యక్తి అడిగాడు. అక్కడ హాజరైన ప్రతి ఒక్కరూ ఒకేసారి “మేమందరమూ రాజీనామా చేస్తాము” అని అరిచారు!
విగ్రహాల గూర్చిన సిలువ మీద మేకులు దిగగొట్టిన క్రీస్తు ప్రతిమను గూర్చిన విషయాలు ఆ తర్వాత సమాజ సమావేశంలో చర్చించబడ్డాయి. “వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటిమీదనున్న వెండిబంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము” అని చెబుతున్న ద్వితీయోపదేశకాండము 7:25 ను అక్కడ హాజరైన ప్రతి ఒక్కరినీ చదవమని ఒక వ్యక్తి కోరాడు.
విగ్రహాలనన్నింటినీ కాల్చివేసేందుకు ఇష్టపడే వారందరూ చేతులెత్తమని తర్వాత ఆయన అడిగాడు. అందరి చేతులూ వెంటనే పైకి లేచాయి. (అపొస్తలుల కార్యములు 19:19, 20) ఇప్పుడు 25 కుటుంబాలు నివసించే ఆ ప్రాంతంలో 23 కుటుంబాలు దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాయి. ఇద్దరు బాప్తిస్మం పొందని ప్రచారకులుగా సేవ చేస్తున్నారు, ఐదుగురు భార్యలు వారి భర్తలు యెహోవా ఎదుట మంచి స్థానాన్ని కలిగివుండేందుకు తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.—తీతు 3:1; హెబ్రీయులు 13:4.
క్యాసెట్ రికార్డింగుల ద్వారా బోధించడం
ఆల్టిప్లానోలో అక్షరాస్యత తక్కువగా ఉండడం చేత స్థానిక భాషల్లో వాచ్ టవర్ ఉత్పత్తి చేసిన వీడియోలు, క్యాసెట్లు గృహ బైబిలు పఠనాలు నిర్వహించేందుకు కూడా గొప్ప సహాయకంగా ఉన్నాయి. ప్రత్యేక పయినీరైన డొరా ఆడియో క్యాసెట్ సహాయంతో దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్ నుండి పఠనాలు నిర్వహిస్తుంది. ఒక్కొక్క పేరాను వినిపించిన తర్వాత ఆ బైబిలు విద్యార్థిని ఆయా పేరాల నుండి ప్రశ్నల్ని అడుగుతుంది.
స్థానిక రేడియో స్టేషన్ దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్లోని భాగాలను క్రమంగా క్వెచువా భాషలో ప్రసారం చేస్తుంది. అలాగే తేజరిల్లు!లోని భాగాలను స్పానిష్ భాషలో ప్రసారం చేస్తుంది. అందుకే చాలామంది ప్రజలు యెహోవాసాక్షులు తమ గృహాలకు వచ్చి తమను సందర్శించినప్పుడు రాజ్య సందేశాన్ని గుర్తించి దాని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారు.
ఆల్టిప్లానో మిగతా ప్రపంచ దృష్టికి అందనంత దూరంలో ఉన్నట్లు కన్పిస్తుంది, కానీ దేవుని దృష్టికి మాత్రం కనబడనిదేమీ కాదు. మానవజాతి పట్ల యెహోవాకి గల ప్రేమ మూలంగా, ఆండీస్లోని ఈ ఆల్టిప్లానోలోని ఎత్తైన ప్రాంతంలోని అనేకమంది ప్రజలు దేవుని సత్యారాధనా గృహంలోకి వస్తున్నారు. అలా వస్తూ ఆ గృహానికి మహిమను తీసుకువస్తున్నారు.—హగ్గయి 2:7.
[అధస్సూచి]
a ఇందులో కొన్ని మారు పేర్లు ఉపయోగించబడ్డాయి.