ఇన్కాలు తమ స్వర్ణ సామ్రాజ్యాన్ని ఎలా కోల్పోయారు
పెరులోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
సూర్యోదయం. మంచుతో కప్పబడిన ఆండీస్ పర్వతాలు, ఉదయాకాశంలోకి దూసుకు వెళుతున్న వెలుగు రేఖలతో లేత అరుణ వర్ణం పులిమినట్లున్నాయి. పెందరాళే లేచే ఆదిమవాసులు, సముద్ర మట్టానికి 4,300 మీటర్ల ఎత్తున రాత్రి చల్లదనాన్ని పోగొడుతున్న సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదించారు. మెల్లిగా సూర్య కిరణాలు సూర్య దేవాలయం చుట్టూపర్చుకున్నాయి. అది ఇన్కా సామ్రాజ్య రాజధానియైన కూస్కోకు (“ప్రపంచ కేంద్రస్థానం” అని భావం) కేంద్రమై ఉంది. స్వర్ణమయమైన గోడలు సూర్య కిరణాలను ప్రతిఫలింపజేశాయి. ఆలయానికి ఎదురుగావున్న ఇన్కాa తోటలోని పటిష్టమైన బంగారు లామాలు, వికునాలు, కాండర్లు మెరిసిపోతున్నాయి. అటుగా వెళుతున్నవారు తమ దేవుడైన సూర్యుని ఆరాధనలో గాలిలోకి ముద్దులు విసురుతారు. వాళ్లు నమ్ముతున్నట్లుగా, సజీవంగా ఉండి జీవనోపాధి కల్గివుండేలా సూర్యుడు తమను ఆశీర్వదిస్తున్నందుకు వాళ్లెంత కృతజ్ఞత కల్గివున్నారో!
దక్షిణమెరికా యొక్క పశ్చిమ కోస్తా ప్రాంతాన్ని గొప్ప స్వర్ణ సామ్రాజ్యం 14వ మరియు 16వ శతాబ్దాల మధ్యకాలంలో పరిపాలించింది. ప్రజ్ఞావంతులైన వాస్తు శిల్పులచే, సాంకేతిక నిపుణులచే పరిపాలించబడిన ఇన్కాలు తమను తాము సామాజికంగా మెరుగుపర్చుకునేందుకు సంస్థీకరించబడిన ప్రజలై ఉన్నారు. వైభవోపేతమైన ఇన్కా సామ్రాజ్యం తన సరిహద్దులను దాదాపు 5,000 కిలోమీటర్ల వరకు అంటే, ప్రస్తుత దిన కొలంబియా యొక్క దక్షిణ భాగం నుండి పూర్తిదిగువన అర్జెంటీనా వరకు విస్తరింపజేసుకుంది. వాస్తవానికి, “తాము దాదాపు ప్రపంచాన్నంతటినీ అదుపు చేస్తున్నామని ఇన్కాలు తలంచేవారు.” (నేషనల్ జియోగ్రాఫిక్) తమ సామ్రాజ్య సరిహద్దులకు అవతల జయించదగినదేదీ లేదని వారు నమ్మేవారు. అయినప్పటికీ, ఈ సామ్రాజ్యం ఉనికిలో ఉందని మిగతా ప్రపంచానికి తెలియనే తెలియదు.
ఇన్కాలు ఎవరు? వారి మూలమేమిటి?
ఇన్కాలకు ముందు ఎవరు ఉన్నారు?
ఇన్కాలు ఆ ఖండం యొక్క మొదటి వాస్తవ్యులు కాదని పురావస్తుశాస్త్ర రుజువులు చూపిస్తున్నాయి. వారికంటే అనేక వందల వేల సంవత్సరాల మునుపే, ఎంతో అభివృద్ధి చెందిన ఇతర సంస్కృతులు ఉండేవి. పురావస్తు శాస్త్రజ్ఞులు వాటిని లాంబ్యాకే, చావీన్, మోచీకా, చీమూ, టీయావనకో సంస్కృతులుగా వర్గీకరించారు.
ఆ తొలి గుంపులు చిరుతపులులు, ప్యూమాల వంటి వివిధ జంతువులను, చివరికి చేపలను ఆరాధించేవారు. కొండ దేవతల ఎడల భక్తి వారి మధ్య విస్తృతంగా ఉండేది. కొన్ని తెగలు లైంగికారాధన చేసేవారని వారి మట్టిపాత్రలు చూపిస్తున్నాయి. టిటికాకా సరస్సు వద్ద, పెరూకు బొలీవియాకు మధ్య సరిహద్దుపైన ఎత్తైన ప్రాంతంలో లింగాలున్న ఆలయాన్ని ఒక తెగవారు నిర్మించారు. పాచా మామా నుండి అంటే “భూమాత” నుండి మంచి పంటలను పొందాలని ఫలదీకరణాచారాలతో ఆ లింగాలను ఆరాధించేవారు.
పురాణం మరియు వాస్తవం
దాదాపు 1200వ సంవత్సరంలో ఇన్కాలు ఉనికిలోకి వచ్చారు. ప్రజలందరినీ సూర్యారాధన క్రిందకు తీసుకు రావాలని, ఒక ఇన్కా రాకుమార్తె కుమారుడూ స్పెయిన్ యోధుడూ భూస్వామీ అయిన మొదటి ఇన్కా మాంగో కాపాక్ను, అతని చెల్లి/పెళ్లికూతురుతోపాటు అతనిని అతని తండ్రియైన సూర్య దేవుడు టిటికాకా సరస్సుకు పంపించాడని పురాణాలు చెబుతున్నాయని చరిత్రకారుడైన గార్థీలాసో దే లా బేగా తెలియజేస్తున్నాడు. ఇప్పటికీ ఈ పురాణగాథ కొన్ని పాఠశాలల్లో పిల్లలకు బోధించబడుతోంది.
అయితే, పురాణాన్ని ప్రక్కనబెడితే, ఇన్కాలు బహుశా టిటికాకా సరస్సు తెగలలో ఒకటైన టీయావనకో తెగ నుండి వచ్చివుంటారు. కొంతకాలానికి, విస్తరిస్తున్న సామ్రాజ్యం తాము స్వాధీనం చేసుకున్న తెగల అనేక సంస్థీకృత కార్యాలను హస్తగతం చేసుకుని, అప్పటికే నిర్మింపబడివున్న కాలువలను, కొండ చెరియలలో సాగుబడి చేసే నేలలను విస్తరింపజేసి, మెరుగుపరిచారు. ఇన్కాలు బ్రహ్మాండమైన కట్టడాలను నిర్మించడంలో పేరుగాంచారు. కూస్కో నగరంలో ఎత్తైన పీఠభూమిపైనున్న సాక్సావామాన్ ఆలయాన్నీ కోటనూ వాళ్ల వాస్తు శిల్పులు ఎలా కలిపి నిర్మించారన్నదాని గురించి అనేక తలంపులున్నాయి. 100 టన్నుల భారీ ఏకాండ శిలలను జతచేయడం జరిగింది. వాటిని కలిపి ఉంచడానికి మోర్టర్ ఉపయోగించబడలేదు. ప్రాచీన కూస్కో నగర గోడల్లో కనిపించే చక్కగా మలచి అందంగా జత చేయబడిన పటిష్టమైన రాళ్లపై భూకంపాలు ఏ ప్రభావాన్ని చూపలేకపోయాయి.
మెరిసే సూర్యాలయం
కూస్కో రాజధానిలో, నునుపు చేయబడిన రాతి ఆలయంలో సూర్యుని ఆరాధన కొరకు ఇన్కాలు యాజకత్వాన్ని సంస్థీకరించారు. అంతర్భాగంలోని గోడలు స్వచ్ఛమైన స్వర్ణంతోనూ, వెండితోనూ అలంకరించబడ్డాయి. యాజకత్వంతోపాటు, లీమా వెలుపల పాచాకామాక్ సూర్యాలయం వద్ద పునర్నిర్మించబడినటువంటి ప్రత్యేకమైన మఠాలు నెలకొల్పబడ్డాయి. అపూర్వ సౌందర్యరాశులైన కన్యలకు ఎనిమిదేళ్ల లేత ప్రాయం నుండే ‘సూర్యుని కన్యలుగా’ ఉండేందుకు తర్ఫీదివ్వబడేది. ఇన్కాలు మానవ బలులను కూడా అర్పించేవారని పురావస్తుశాస్త్ర రుజువులు సూచిస్తున్నాయి. వాళ్లు ఆపుస్కు లేక కొండ దేవతలకు పిల్లలను బలి ఇచ్చేవారు. ఆండీ శిఖరాలపై గడ్డకట్టుకుపోయిన పిల్లల శవాలు కొన్ని కనుగొనబడ్డాయి.
ఇన్కాలకు, తొలి తెగలకు లిపిలేకపోయినప్పటికీ, క్విపు అని పిలువబడే దాన్ని ఉపయోగించి రికార్డులను ఉంచుకునే ఒక విధానాన్ని వాళ్లు రూపొందించారు. ఇది, “పెద్ద త్రాడుకు వివిధ రంగుల చిన్న చిన్న తాళ్లు ముడేసి జత చేయబడిన ఒక పరికరం,” ఇన్వెంటరీలను, రికార్డులను చూసేందుకు నియమించబడిన వారు జ్ఞాపకముంచుకోవడానికి ఒక సహాయకంగా “ప్రాచీన పెరూ వాసులు దీన్ని ఉపయోగించేవారు.”
సామ్రాజ్యం ఎలా ఐక్యంగా ఉంచబడింది?
కచ్చితమైన చట్టాలు, పథకం వేయబడిన నాయకత్వం ఒకే కేంద్ర ప్రభుత్వాన్ని పటిష్టంగా స్థాపించాయి. ఇన్కాల భాషయైన క్వచ్వాను అందరూ నేర్చుకోవాలన్నది ప్రథమ ఆవశ్యకతగా ఉండేది. “క్వచ్వా చక్కగా అర్థమయ్యేదిగా, భిన్నత్వం గలదిగా, అలాగే దక్షిణ అమెరికాలోని ప్రాంతీయ భాషల్లో అత్యంత ఉన్నతమైనదిగా” పరిగణించబడుతుందని ఎల్ క్వచ్వా అల్ అల్కాన్సే డె టొడోస్ (క్వచ్వా ప్రతి ఒక్కరికీ అందుబాటులో) అనే పుస్తకం చెబుతుంది. పెరూ పర్వతాల్లోని దాదాపు 50 లక్షలమంది ప్రజలూ, ఆ సామ్రాజ్యంలో భాగమైవుండిన ఐదు దేశాల్లోని ఇతర లక్షలాదిమంది ప్రజలు ఇప్పటికీ ఆ భాషను ఉపయోగిస్తున్నారు. టిటికాకా సరస్సుకు ఆగ్నేయ ప్రాంతంలోవున్న ఒక గుంపు ఇప్పటికీ అయిమారా భాషను మాట్లాడుతుంది, అది ఇన్కాల పూర్వపు కాలానికి చెందిన క్వచ్వాలోనుండి వచ్చిన ఒక భిన్నమైన భాష.
స్వాధీనం చేసుకోబడిన దాదాపు 100 తెగలపై క్వచ్వా భాష ఉపయోగం ఐక్యపరిచే ప్రభావాన్ని చూపింది, ఒక్కో గుంపును పరిపాలించే గ్రామ కూరాకాకు (ప్రభువు) అది సహాయకరంగా ఉండేది. ప్రతి కుటుంబమూ వ్యవసాయం చేయడానికి కొంత భూమి కేటాయించబడేది. విజయం సాధించిన తర్వాత, ఇన్కాలు స్థానిక తెగల నృత్యాలు, ఉత్సవాలు కొనసాగేందుకు అనుమతించి, తమ అధికారం క్రింద ఉన్న ప్రజలందరినీ సంతృప్తి పరచేందుకు నాటకాలను, క్రీడలను ఏర్పాటు చేశారు.
మీటా పన్ను
సామ్రాజ్యమంతటిలో ఏ విధమైన డబ్బూ చలామణీలో లేదు, అంటే ప్రజల దృష్టిలో బంగారానికి ఏ విలువా ఉండేది కాదు. అది సూర్యుడ్ని ప్రతిఫలింపజేస్తుందన్నదే దానికున్న ఆకర్షణ. కేవలం మీటా (క్వచ్వా, “ఒక వంతు”) పన్ను మాత్రమే విధింపబడేది, అదేమిటంటే ఇన్కాల అనేక రోడ్ల కోసం, భవన పథకాల కోసం పని చేయడంలో పౌరులు తప్పనిసరిగా వంతులు తీసుకోవడం. వేలాదిమంది ఆదిమవాసులైన శ్రామికులు చట్టం ద్వారా ఆ పనికి నియమించబడేవారు.
మీటా పని వారిని ఉపయోగించుకుంటూ, ఇన్కా నిర్మాణ నిపుణులు 24,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన రోడ్ల నెట్వర్క్ను నిర్మించారు. కూస్కో నుండి మొదలుకొని సామ్రాజ్యంలోని సుదూర ప్రాంతాల్లోని రోడ్లను కలపడానికి రాళ్లు పరిచిన రోడ్ల నెట్వర్క్ను ఇన్కాలు నిర్మించారు. సమాచారాన్ని చేరవేయడానికి తర్ఫీదివ్వబడిన, ఛాస్కీలు అని పిలువబడే వార్తాహరులు ఆ రోడ్లను ఉపయోగించేవారు. ఒకటి లేక రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఉండే కుటీరాలలో వాళ్లు ఉండేవారు. ఒక సమాచారం తీసుకుని ఒక ఛాస్కీ వచ్చిన వెంటనే, తర్వాతి ఛాస్కీ అతనితోపాటు రిలే రన్నర్లా పరుగెత్తడం ప్రారంభించేవాడు. ఈ పద్ధతిని ఉపయోగిస్తూ, వాళ్లు ఒక రోజులో అంచెలంచెలుగా 240 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేవారు. పరిపాలన చేస్తున్న ఇన్కాకు తన సామ్రాజ్యమంతటి నుండీ నివేదికలు చాలా త్వరగా చేరేవి.
రోడ్ల ప్రక్కన, ఇన్కాలు పెద్ద పెద్ద దుకాణాలను స్థాపించేవారు. విజయ సాధనకై దండయాత్ర చేస్తున్న ఇన్కా సైన్యాల ఉపయోగార్థం అవి ఆహార పదార్థాలతో, వస్త్రాలతో నింపబడి ఉండేవి. ఇన్కాలు సాధ్యమైతే యుద్ధాన్ని నివారించేవారు. యుద్ధ తంత్రాన్ని ఉపయోగిస్తూ, సూర్యారాధనను అంగీకరిస్తే తన పరిపాలన క్రిందకు రానిస్తానని తెగలను ఆహ్వానించడానికి ఇన్కా తన రాయబారులను పంపేవాడు. వాళ్లు అంగీకరిస్తే, తర్ఫీదు పొందిన ఇన్కా గురువుల నిర్దేశం మేరకు వాళ్లు తమ స్వంత తెగలోనే కొనసాగడానికి అనుమతించబడేవారు. వాళ్లు నిరాకరిస్తే, క్రూరమైన పరాజయం పాలయ్యేవాళ్లు. మరణించిన శత్రువుల కపాలాలు, మొక్కజొన్న నుండి తయారు చేసిన మత్తు పానీయమైన చీచాను త్రాగడానికి పాత్రలుగా ఉపయోగించబడేవి.
పాచాకుటీ (1438 నుండి) అనే తొమ్మిదవ ఇన్కా క్రిందా, ఆయన కుమారుడు టోపా ఇన్కా యూపాంకీ క్రిందా, విజయ యోధుడూ రాజనీతివిశారదుడూ అయిన వైనా కాపాక్ క్రిందా సామ్రాజ్యం తన సరిహద్దులను విపరీతంగా విస్తరింపజేసుకుని, ఉత్తరంగానూ దక్షిణంగానూ వీలైనంత మేరకు విస్తరించింది. కాని అది అలాగే నిలిచి ఉండలేదు.
ఉత్తరం నుండి వచ్చిన ముట్టడిదార్లు
దాదాపు 1530వ సంవత్సరంలో, పౌర యుద్ధంతో చిన్నాభిన్నమైవున్న ఈ తెలియబడని దేశంలోని బంగారాన్ని గురించిన నివేదికలు విని మరులుగొల్పబడిన స్పెయిన్ విజయ యోధుడైన ఫ్రాన్సీస్కో పిజార్రో మరియు ఆయన సైనికులు పనామా నుండి వచ్చారు. రాకుమారుడూ, సింహాసనానికి న్యాయబద్ధమైన వారసుడూ అయిన హాస్కర్, రాజధాని దిశగా వెళుతున్న తన సహోదరుడైన అతహుల్పా చేతుల్లో పరాజయం పొంది, చెరసాలలో వేయబడ్డాడు.
పిజార్రో అతని మనుష్యులు ఖాజామార్కా నగర అంతర్భాగంలోకి కష్టపడి ప్రవేశించారు, ఆక్రమణదారుడైన అతహుల్పా వారిని సాదరంగా ఆహ్వానించాడు. అయినప్పటికీ, కుట్రతో అతహుల్పాను ఆయన పల్లకీలో నుండి బయటికి లాగి బంధీగా పట్టుకోవడంలో స్పెయినువారు విజయం సాధించారు, అదే సమయంలో, ఆశ్చర్యంలో మునిగిపోయి అనాయత్తంగావున్న అతని వేలాదిమంది సైనికులను వారు వధించారు.
అయినప్పటికీ, బంధీగా పట్టుబడి ఉండగా కూడా అతహుల్పా పౌర యుద్ధాన్ని కొనసాగించాడు. తన మారుటి సహోదరుడైన ఇన్కా హాస్కర్ను అలాగే రాజకుటుంబానికి చెందిన వందలాది మందిని హతమార్చడానికి ఆయన కూస్కోకు మనుష్యులను పంపాడు. అనుకోకుండానే, విజయం సాధించాలన్న పిజార్రో పథకాన్ని ఆయన సులభతరం చేశాడు.
వెండి బంగారాల ఎడల స్పెయిన్ వారికున్న అత్యాశను చూసి, తనను విడుదల చేస్తే ఒక పెద్ద గదిని వెండి బంగారు శిల్పాలతో నింపుతానని అతహుల్పా వాగ్దానం చేశాడు. కాని ప్రయోజనం లేకుండా పోయింది. మరొకసారి దగా జరిగింది. వాగ్దానం చేయబడిన విమోచన క్రయధనం పేర్చిపెట్టబడిన తర్వాత, విగ్రహారాధికుడని కాథోలిక్ సన్యాసులు పరిగణించిన 13వ ఇన్కా అయిన అతహుల్పాకు కాథలిక్గా బాప్తిస్మమిచ్చి, ఆ తర్వాత ఉరి తీశారు.
అంతం యొక్క ఆరంభం
అతహుల్పాను బంధించడమూ, హత్య చేయడమూ ఇన్కా సామ్రాజ్యానికి చావుదెబ్బ అయ్యింది. కాని ఆదిమవాసులు ముట్టడిదార్లను వ్యతిరేకించారు, సామ్రాజ్య మరణ వేదనలు మరో 40 ఏళ్లు కొనసాగాయి.
అదనపు బలగాలు వచ్చినప్పుడు, పిజార్రో మరియు ఆయన సైనికులందరూ మరింత ఇన్కా బంగారాన్ని హస్తగతం చేసుకునేందుకు కూస్కోకు వెళ్లడానికి ఆతురతతో ఉన్నారు. ఆ తాపత్రయంలో, ఆదిమవాసుల నుండి సంపదను గూర్చిన రహస్యాలను రాబట్టడానికి, వ్యతిరేకించేవారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి క్రూరమైన హింసాత్మకమైన చర్యలను చేపట్టడానికి కూడా స్పెయిన్వారు వెనుకాడ లేదు.
తర్వాతి ఇన్కా (మాంకో ఇన్కా యుపాన్కీ) కానైయున్నవాడూ హాస్కార్ సహోదరుడూ అయిన రాకుమారుడు రెండవ మాంకోతోపాటు పిజార్రో కూస్కోలోకి జొరబడి దానిలో ఉన్న అపారమైన బంగారు నిధుల కొరకు దాన్ని గాలించాడు. బంగారు విగ్రహాలలో అనేకం స్పెయిన్లోని వెండి బంగారాల మార్కెట్టు కొరకు కరగదీయడం జరిగింది. పెరూ సంపదలను మోసుకువెళుతున్న స్పెయిన్ నౌకలను స్వాధీనం చేసుకోవడానికి ఆంగ్లేయ ఓడ దొంగలు ఉత్సుకత కల్గివున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు! పిజార్రో సంపదలు నింపుకుని తీరం వైపుకు బయలుదేరాడు, అక్కడే ఆయన లీమా నగరాన్ని 1535లో తన ప్రభుత్వానికి కేంద్రంగా స్థాపించాడు.
ఆ విజయ యోధుల అత్యాశను, మోసాన్ని అప్పటికి పూర్తిగా గ్రహించిన మాంకో ఇన్కా యుపాన్కీ విప్లవాన్ని రేకెత్తించాడు. ఇతరులు కూడా స్పెయిన్వారిపై తిరుగుబాటు చేశారు, కాని ఆదిమవాసులు చివరికి వీలైనంతగా తప్పించుకోవడానికి సుదూర ప్రదేశాలకు పారిపోవలసి వచ్చింది. ఈ సురక్షితమైన స్థావరాల్లో, దూరాన పర్వతాల్లో దాగివున్న మచ్చు పిచ్చు పవిత్ర నగరం కూడా ఒకటై ఉండవచ్చు.
చివరి ఇన్కా
చివరి ఘట్టంలో, మాంకో ఇన్కా యుపాన్కీ కుమారుడైన టూపాక్ ఆమారూ ఇన్కా (1572) అయ్యాడు. అప్పుడు స్పెయిన్ వైస్రాయ్లు పెరూను పరిపాలించనారంభించారు. ఇన్కాలను నిర్మూలించాలన్నది వైస్రాయ్ టోలాతో లక్ష్యం. ఆయన పెద్ద సైన్యంతో విల్కాబాంబా ప్రాంతంలోకి ప్రవేశించాడు. టూపాక్ ఆమారూ అడవిలో పట్టుబడ్డాడు. ఆయననూ, గర్భవతియైన ఆయన భార్యనూ వధించడానికి కూస్కోకు తీసుకువెళ్లారు. ఒక కాన్వారీ ఆదిమవాసియైన టూపాక్ ఆమారూపైకి కత్తి దూశాడు. ఒక్క వేటుతో తమ ఇన్కా తల నరికివేయబడడంతో, నగర కూడలిలో సమకూడిన వేలాదిమంది ఆదిమవాసులు ఆయన కోసం బిగ్గరగా శోకాలు పెట్టారు. ఆయన సేనాధిపతులు మరణం వరకు హింసించబడ్డారు లేదా ఉరితీయబడ్డారు. ఇన్కాల పరిపాలన అలా దారుణమైన రీతిలో త్వరితంగా ముగింపుకు వచ్చింది.
నియమిత వైస్రాయ్లు వారితోపాటు అనేకమంది కాథోలిక్ సన్యాసులు, ప్రీస్టులు మెల్లిగా తమ మంచి ప్రభావాన్నీ చెడు ప్రభావాన్నీ ఆదిమవాసులపై చూపించారు, ఈ ఆదివాసులు చాలాకాలం పాటు కేవలం బానిసలుగా పరిగణించబడేవారు. చాలామంది వెండి లేక బంగారు గనుల్లో పనిచేయడానికి బలవంతపెట్టబడేవారు, బొలీవియా నందలి పొటొసీలోవున్న సుసంపన్నమైన వెండిగని గల పర్వతం వాటిలో ఒకటి. అమానుష పరిస్థితులను తప్పించుకోవడానికి, దుర్వ్యవహారానికి గురౌతున్న ఆదిమవాసులు మత్తు కోసం కోకా ఆకుల ఉపయోగాన్ని ఆశ్రయించారు. 19వ శతాబ్దం తొలికాలం వరకు పెరూకు, బొలీవియాకు స్పెయిను నుండి స్వాతంత్ర్యం లభించలేదు.
ఇన్కాల ఆధునిక-దిన వారసులు
ఈ ఆధునిక యుగంలో ఇన్కా వారసుల పరిస్థితి ఎలా ఉంది? ఇతర అనేక ఆధునిక నగరాల్లానే, పెరు రాజధానియైన లీమా నగరం కోట్లాదిమంది పౌరులతో నిండివుంది. కానీ మిగతా ప్రాంతాల్లో కొన్నిసార్లు, ఒక వందేళ్ల క్రితం కాలం స్థంభించిపోయిందా అన్నట్లు ఉంటుంది. అనేక మారుమూల గ్రామాలు ఇప్పటికీ కాథోలిక్ ప్రీస్టుల ఆధీనంలో ఉన్నాయి. ఆదిమవాసి రైతుకు గ్రామ కూడలిలోవున్న కాథోలిక్ చర్చియే ముఖ్య ఆకర్షణ. ఆడంబరంగా వస్త్రాలంకరణ చేయబడిన సెయింట్ల అనేక విగ్రహాలు, రంగురంగుల దీపాలు, స్వర్ణ బలిపీఠం, వెలుగుతున్న కొవ్వొత్తులు, ప్రీస్టులు ఉచ్చరించే మార్మిక లాంఛనాలు, ప్రాముఖ్యంగా నృత్యాలు, సంబరాలు—ఇవన్నీ వినోదం కొరకైన అతని అవసరాన్ని ఆకర్షిస్తాయి. కాని అలాంటి కంటికింపైన వినోదాలు ప్రాచీన నమ్మకాలను ఎన్నడూ నిర్మూలించలేదు. మర్మమైన శక్తులున్నాయని తలంచబడే కోకా ఆకుల ఉపయోగం, ఇప్పటికీ చాలామంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.
ఇన్కాల వారసులైన వీరు, తమ అజయ స్ఫూర్తితో—వారిలో ఇప్పుడు అనేకులు ఇతర జాతులతో మిళితమయ్యారు—తమ రంగురంగుల నృత్యాలను, ప్రత్యేకమైన వైనో సంగీతాన్ని కాపాడుకోగలిగారు. వాళ్లు కొత్తవారితో ముందు కాస్త ముభావంగానే ఉన్నా, వారు తమలో అంతర్గతంగా ఉన్న ఆతిథ్యమిచ్చే స్ఫూర్తిని కనబరుస్తారు. ఇన్కా సామ్రాజ్యం గురించి వ్యక్తిగతంగా తెలిసినవారికి—మనుగడ కోసం వారు ప్రతిరోజూ చేసే పోరాటాన్ని గమనించేవారికి, వారి ఎడల వ్యక్తిగత శ్రద్ధాసక్తులను కనబర్చడానికి కృషి చేసేవారికి—వారి గాథ నిజంగా హృదయవిదారకంగా ఉంటుంది!
విద్యాభ్యాసం మార్పులను తెస్తుంది
తేజరిల్లు! చేసిన ఇంటర్వ్యూలో, టిటికాకా సరస్సు వద్దనున్న సోకా గ్రామానికి చెందిన అయిమారా భాష మాట్లాడే ఆదిమవాసుల వారసుడైన వాలెంటీన్ అరీసాకా ఇలా చెప్పాడు: “నేను యెహోవా సాక్షిని కాకమునుపు, పేరుకు మాత్రం కాథోలిక్గా ఉండేవాడిని. నా స్నేహితులు కొంతమందితోపాటు నేను అనేక అన్య ఆచారాలను ఆచరించేవాడిని. నేను కోకా ఆకులు కూడా నమిలేవాడిని, కాని నేనిప్పుడు అవన్నీ మానేశాను.”
అపూస్ను అప్రీతిపరుస్తానేమోననే నిరంతర భయంలో తనను పట్టివుంచిన ఎన్నో ముఢాచారాలను బాగా జ్ఞాపకముంచుకున్న, 89 ఏళ్ల పెట్రోనీలా మమనీ ఇలా చెబుతుంది: “కొండ దేవతను శాంతింపజేయడానికి, నా జీవనోపాధిని కోల్పోకుండా ఉండడానికి నేను క్రమంగా అర్పణలు అర్పించేదాన్ని. వాళ్లను అప్రీతిపర్చి, తెగుళ్లు తెచ్చుకోవడం నాకు ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు నా వృద్ధాప్యంలో నేను విషయాలను మరోలా దృష్టించడం నేర్చుకున్నాను. బైబిలు మూలంగా, యెహోవాసాక్షుల మూలంగా నేను ఇప్పుడు అలాంటి ఆలోచనావిధానం నుండి స్వేచ్ఛను పొందాను.”
క్వచ్వా, అయిమారా భాషలు మాట్లాడే అనేకమంది ఆదిమవాసులకు యెహోవాసాక్షులు చదవడం నేర్పిస్తున్నారు. తద్వారా వాళ్లు ఇతరులకు బైబిలు నేర్పిస్తున్నారు. ఈ విధంగా వేలాదిమంది ఇన్కాలు, స్పెయిన్కు చెందిన ఆదిమవాసులు తమ జీవితాలను మెరుగుపర్చుకోవడానికి విద్యనభ్యసిస్తున్నారు. త్వరలోనే భూవ్యాప్తంగా స్థాపించబడనున్న, నీతి, న్యాయం, శాంతి నెలకొని ఉండే నూతన లోకం గురించి బైబిలులో ఉన్న దేవుని వాగ్దానం గురించి కూడా వాళ్లు తెలుసుకుంటున్నారు.—2 పేతురు 3:13; ప్రకటన 21:1-4.
[అధస్సూచి]
a “ఇన్కా” అనే పదం ఇన్కా సామ్రాజ్యం యొక్క సర్వోన్నత పరిపాలకుడ్ని, అలాగే ఆ దేశస్థులను కూడా సూచిస్తుంది.
[15వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఇన్కాల స్వర్ణ సామ్రాజ్యం
దక్షిణ అమెరికా
కూస్కో
పొటసీ
ఇన్కా సామ్రాజ్యం
కరీబియన్ సముద్రం
పసిఫిక్ మహాసముద్రం
కొలంబియా
ఈక్వెడార్
ఆండీస్
పెరు
కాజామార్కొ
లీమా
పాచాకామా
విల్కాబామ్బా
మచ్చు పిచ్చు
కూస్కో
టిటికాకా సరస్సు
బొలీవియా
చిలి
అర్జెంటీనా
[16వ పేజీలోని చిత్రం]
పైన: సూర్యుని తొలి ఆలయం కూస్కో నందలి ఈ కాథోలిక్ చర్చికి పునాదిగా పనిచేస్తుంది
[16వ పేజీలోని చిత్రం]
ఎడమ: చుక్వీటో వద్ద ఒక ఆలయంలో ఉన్న లింగం, ఇన్కాలకు మునుపటి కాలానికి చెందినది
[16వ పేజీలోని చిత్రం]
కుడి: ఇన్కాల బలి రక్తం ఈ రాతి చెక్కడాలలో నుండి ప్రవహించింది
[17వ పేజీలోని చిత్రం]
కుడి: కూస్కో వద్ద, మచ్చు పిచ్చు నందలి కొండ చెరియలపై సాగుబడి చేయబడిన నేలలు
[17వ పేజీలోని చిత్రం]
క్రింద: మచ్చు పిచ్చు వద్ద ఒక పురాతన ద్వారం గుండా కనిపిస్తున్న దృశ్యం
[17వ పేజీలోని చిత్రం]
క్రింది నుండి కుడివైపు: సాక్సావామాన్ కోట-ఆలయంలోని 100 టన్నుల ఏకాండ శిలలు